ప్లే స్టేషన్ కొనుక్కోవడం కోసం 14 సంవత్సరాల బాలుడు వృద్ధ మహిళను హత్య చేసి నగలు దొంగిలించాడు. పిన్నితో కలిసి పొరుగింటి మహిళను హత్య చేసిన బాలుడు తర్వాత శవాన్ని పాక్షికంగా తగలబెట్టి దూరంగా వదిలిపెట్టాడు. బాలుడు, అతని పిన్ని, శవాన్ని దూరంగా పారేయడానికి సహరించిన బాబాయి లు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడు లోని కాంచీపురం జిల్లా ఎస్.పి ఎస్.మనోహరన్ ప్రకారం తిరువుల్లూరు జిల్లా సరిహద్దులోని సెంగాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గుర్తు తెలియని మహిళ మృత దేహం సోమవారం లభ్యమయింది. శవం ముఖం పూర్తిగా కాలిపోయి ఉంది. ప్రాధమిక విచారణ అనంతరం చెన్నై లోని పురసవక్కం కి చెందిన రోగర్ డేనియల్ అనే వ్యక్తి తన తల్లి జె.రాజం ఆదివారం సాయంత్రం నుండి కనపడడం లేదని తిరువళ్ళూరు పోలీసు స్టేషనల్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంటనే వారు డేనియల్ కి కబురు పంపారు.
సెంగాడు లో దొరికిన మహిళా మృతదేహం తాలూకు వీడియో, ఫోటో చూసిన డేనియల్ పోలికలు గమనించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని చూసి తన తల్లిని గుర్తించాడు. నర్సుగా పని చేసి రిటైర్ అయిన రాజం ఏకాడు లో స్ధిరపడింది. ఆమె పిల్లలు మాత్రం చెన్నైలో ఉంటున్నారు. రాజం చివరి సారిగా తన పొరుగునే ఉన్న ఇంటికి వెళ్ళినట్లు చివరిసారిగా చూసినవారు ఉన్నారని డేనియల్ పోలీసులకు తెలిపాడు. పోలీసు కుక్కల సాయంతో హత్య తిరువళ్ళూరు వైపు జరిగి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు.
రాజం చివరిసారిగా వెళ్లిందని భావిస్తున్న ఇంటికి వెళ్ళి పోలీసులు విచారించారు. సరిత (28), ఆమె భర్త భాస్కర్ (31), వారి ఇంటిలో ఉన్న బాలుడుని విచారించారు. సరితతో కలిసి రాజంను తానే హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మామిడికాయలు ఇస్తామని చెప్పి బాలుడు ఆదివారం మధ్యాహ్నం రాజం ను తమ పిన్ని ఇంటికి ఆహ్వానించాడు. రాజం ఇంటికి వచ్చాక గుడ్డను ఆమె మెడ చుట్టూ బిగించడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇంటిలో ఉన్న గ్రైండర్ రాయిని తెచ్చి సరిత, రాజం తలపై జారవిడిచింది. రాజం అక్కడే చనిపోయింది. అనంతరం ఆమె మెడలో ఉన్న గొలుసు, చెవి రింగులను నిందితులు దొంగిలించారని ది హిందూ తెలిపింది.
హత్య గురించి సరిత, బాలుడు ఇద్దరూ భాస్కర్ కి తెలిపారు. తమ ఇంటి వెనకే శవాన్ని పూడ్చి పెట్టవచ్చని భాస్కర్ సలహా ఇవ్వగా కుక్కలు పైకి లాగుతాయని బాలుడే అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రాత్రి భాస్కర్, బాలుడు కలిసి శవాన్ని గోనె సంచిలో కుక్కి సెంగాడు గ్రామ రోడ్డు పక్క పడేశారు. శవానికి నిప్పు అంటించి అక్కడి నుండి తప్పుకున్నారు.
బాలుడు చెన్నైలోని ఆయపక్కం లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. వేసవి సెలవులు గడపడానికి అతను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాడు. రాజం వద్ద ఉన్న నగలు దొంగిలించి అమ్ముకుని ఆ డబ్బుతో 8,000 రూపాయలు ఖరీదు చేసే ప్లే స్టేషన్ కొనుక్కుందామన్నది బాలుడి పధకం కాగా, మిగిలిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకి ఉపయోగించుకోవాలన్నది సరిత ఆలోచన. ఇద్దరూ కలిసి కొద్ది పాటి డబ్బు కోసం ప్రాణం తీయడానికి సైతం సిద్ధపడ్డారు.
ప్లే స్టేషన్ అన్నది పిల్లలకు ఎందుకూ పనికిరాని ఎలక్ట్రానిక్ వినియోగ సరుకు. పిల్లల సమయాన్ని నాశనం చేసే ఆధునిక వస్తువు. కాస్త డబ్బు గలవారు పిల్లల సంతోషానికి కొనిస్తే, వారి పిల్లల స్నేహితులకు అసూయ కారకంగా నిలిచే సాధనం. పిల్లల సామాజిక చైతన్యానికి గానీ, చదువుకు గానీ, బుద్ధి అభివృద్ధి చెందడానికి కానీ అసలేమీ ఉపయోగపడని ఆకర్షణీయమైన సరుకు. ఒక పిల్లవాడు ఆడుతుంటే, అలాంటిది తామూ సొంతం చేసుకోవాలని అతని చుట్టూ ఉన్న పిల్లలంతా తపన పడడానికి దారి తీస్తుంది. కోరుకున్నది ఎలాగైనా సాధించాలన్న పద్నాలుగేళ్ల పిల్లవాడి తపనకు ఒంటిమీదికి వయసొచ్చినా విచక్షణ నశించిన మరో మహిళ స్వార్ధ బుద్ధి తోడయింది. ఫలితంగా ఓ నిండు ప్రాణం హరించుకుపోగా, ముగ్గురు వ్యక్తుల భవిష్యత్తు శూన్యమై కటకటాల వెనక్కి చేరవలసి వచ్చింది.
లాభా పేక్ష ప్రధాన మయ్యాక వస్తూత్పత్తిలో కూడా విచక్షణ కోల్పోవడం ఉత్పత్తిదారులైన పెట్టుబడిదారీ కంపెనీలకు నైజంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా దారిద్ర్యంలో మగ్గుతుంటే మిగిలిన వినియోగదారుల జేబుల నుండి సొమ్ములు కాజేయడానికి సవాలక్ష పనికి మాలిన వస్తువులతో కంపెనీలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఒక ఆకర్షణీయమయిన ఆధునిక వస్తువును ఒక కంపెనీ తయారు చేస్తే దాని కంటే ఆకర్షణీయమైన సరుకును ఉత్పత్తి చేసి వైరి కంపెనీలపై పై చేయి సాధించడానికి ఇతర కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రత్యర్ధి కంపెనీల కంటే మరింత మంది వినియోగదారులను ఆకర్షించే పోటీలో తాము తయారు చేసే వస్తువులు మానవ సమాజానికియా అవశ్రమా లేదా అన్న విచక్షణను కంపెనీలు వదిలేస్తున్నాయి. కంపెనీల పోటీ ద్వారా వస్తువుల నాణ్యత పెరిగి ప్రజలకు మరింత చౌకగా సుఖాలు అందుబాటులోకి వస్తాయని చెప్పే పెట్టుబడిదారీ సూత్రం ఇక్కడ పని చేయకపోగా సరిగ్గా అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. పిల్లల నుండి పెద్దల వరకూ వస్తువుల సొంత దారుల మధ్య పోటీ, అసాంఘిక బుద్ధులను ప్రేరేపిస్తున్నాయి.
పెట్టుబడిదారీ వ్యవస్ధ అంటే పెట్టుబడిగా మారిన డబ్బు సమస్త ప్రజావ్యవస్ధలనూ శాసించే స్ధాయికి చేరడం. మనిషి వినియోగించే సమస్త వస్తువులనూ మామూలు మనుషులు కాకుండా పెట్టుబడులు నడిపించే మనుషులు ఉత్పత్తి చేయడం. ‘డబ్బుకు లోకం దాసోహం’ అన్న స్ధాయికి సమాజం చేరడం. పెట్టుబడిదారీ వ్యవస్ధకు వస్తువుల వినియోగం ఆత్మ లాంటిది. అలాంటి వ్యవస్ధలో ప్రజా జీవనం యావత్తూ అనేకానేక వస్తువులతో నిండిపోయి రోజువారీ జీవనానికి అవసరమైన వస్తువుల కంటే అనేక రేట్ల మేరకు పనికిరాని వస్తువులు కూడా ప్రజల మధ్య సంబంధాలలో చేరిపోతున్నాయి.
దరిద్రులు, పేదలు, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనికులు, కోటీశ్వరులు, శత కోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు, శత సహస్ర కోటీశ్వరులు ఇలా అనేక స్ధాయిల్లో ఏర్పడిన ఆర్ధిక అంతరాల వల్ల వస్తు వినియోగం లో సైతం అంతరాలు సహజంగానే ఏర్పడుతున్నాయి. అయితే వస్తు వినియోగం లో తలెత్తుతున్న అంతరాలు అక్కడితో సరిపెట్టుకోవు. అవి మానవుడి సామాజిక సంబంధాలలోకీ, ఆలోచనలలోకీ, సుఖ భోగాల ప్రమాణాల లోకి భావనలలోకీ, యుక్తాయుక్త విచక్షణలోకీ చొరబడి తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి. మానవ సంబంధాలను సైతం నాశనం చేస్తున్నాయి. తోటి వ్యక్తికి హాని తలపెట్టలేని మానవ సహజ లక్షణాన్ని పాతాళానికి తోక్కేయడానికి ప్రేరేపిస్తున్నాయి.
పెట్టుబడిదారీ కంపెనీలు సృష్టిస్తున్న వస్తువులకూ మానవ జీవనంలో తలెత్తుతున్న చిన్నా, పెద్దా అలజడులకు ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించవలసి ఉంది. ఆర్ధిక వస్తువుల వినియోగం అంటే అది సామాజిక వినియోగమేనని గుర్తించాలి. సామాజిక వినియోగం అంటే సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయడమేనని గుర్తించాలి. అది గుర్తించలేకపోతే మెదడు లోగానీ, బుద్ధిలో గానీ నిరంతరం యంత్రసమానంగా పని చేసే సహజ ప్రక్రియలు పని చేయడం ఆగిపోయాయని అర్ధం. అటువంటి పరిస్ధితుల్లో అలాంటి సహజ ప్రక్రియలను రిపేర్ చేసుకుని గాడిలో పెట్టుకుంటే వ్యవస్ధల్లో ఆర్ధిక ప్రక్రియలకూ, సామాజిక ప్రక్రియలకూ ఉండే అవినావాభావ సంబంధం అర్ధం అయ్యే అవకాశం ఉండవచ్చు.
–
వీడియో గేమ్‌లలో కూడా హింసాత్మక వీడియో గేమ్‌లు ఉన్నాయి. దారిలో వచ్చిన ఎంత మందిని చంపేస్తే అన్ని పాయింట్‌లు వస్తున్నట్టు గేమ్ డిజైన్ చేస్తారు. అది ఎక్కువ మందిని చంపడమే వీరత్వం అనే వ్యక్తివాద లక్షణం నుంచి పుట్టినది కదా.
“When Fascism comes to America, it will not be in brown & black shirts, it will not be in Jack boots, but it will be in Nike shoes, smiley shirts and meaningless gizmos. ” – George Carlin.
ఇప్పుడు మన దేశం లో కుడా అంతే.
వెల్ సెడ్, గౌతమ్. హిట్లర్, ముస్సోలిని లను ఈసడించుకునే ప్రజాస్వామ్య ప్రేమికుల్లో చాలామంది పెట్టుబడిదారీ విధానమే పోటీని అణగదొక్కడానికి, ప్రజల ప్రతిఘటను లేకుండా చేయడానికీ, ఫాసిస్టు అవతారం ఎత్తుతుందన్న సంగతిని విస్మరిస్తారు.
విశేఖర్ గారూ,
మీరన్నది నిజమే. నేను దానికి మరికొన్ని అభిప్రాయాలు చేర్చుతున్నాను (అక్కడక్కడా George Carlin గారి సిద్ధాంతాలతో).
ప్రస్తుత కాలం capitalism కి, గతం లోని capitalism సిద్ధాంతాలకీ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు కంపెనీలు మరియు ప్రభుత్వాలు పాటించేది corporatism. భహుళ దేశ వ్యాపార సంస్ధలు (Multi National Corporations) ఇదివరకు పెద్దగా ఉండేవి కాదు. కాని ఇప్పుడు అవి ప్రపంచాన్నంతా తమ గుప్పెట్లో పెట్టుకుంటూ, వాటిలో అయ్యే కలిసిపోయి (mergers) they give an illusion of choice. నా ఉద్ధేశ్యం లో Fascism మరియు Corporatism కి మధ్య ఉన్న తేడా consumerism. Fascism లో పాలించే వారు జనాలని అదుపు లో పెట్టేందుకు fear మరియు force ని ఉపయోగించేవారు, కాని corporatism లో జనాలను అదుపు లో పెట్టేందుకు consumption ని ఉపయోగిస్తున్నారు. ఈ కాలం లో ప్రజలు consumption కి బానిసలుగా మారిపోతున్నారు. మానవ సంభంధాల కన్నా, మానవ హక్కుల కన్నా, వారికి తమ iPhones చాలా ముఖ్యం. ప్రభుత్వ దళాలు వారి ఇళ్ళనూ ఎప్పుడైనా సోధా చేయోచ్చు, ఎవరినేనైనా వారెంట్ లేకుండా detain చేయోచ్చు, track చేయోచ్చు, కోర్టులో fair trial లేకుండా బంధీలు గా ఉండొచ్చు, national security పేరు తో చట్టానికి అతీతం గా ఏదైనా చేయోచ్చు. Fascism కీ ప్రస్తుతం ఉన్న “ప్రజా స్వామ్యానికి” పెద్దగా తేడా లేదు. కాని జనం ఇవేమీ పెద్దగా పట్టించుకోరు. వారికి తమ electronics ఇచ్చేస్తే చాలు.
కార్లిన్ గారు చెప్పిన విషయాలలో ఈ కింది వాక్యం భేషైనది:
“Germany lost the second world war, but Fascism won”.
ఆయన గతం లో అమెరికన్ culture ను ఉద్దేశించి చెప్పిన మాటలవి. కాని ఇప్పుడు అవి భారత దేశనికి కూడా వర్తిస్తాయి. మన దేశం లోని సాంస్క్రతిక యుద్ధాన్ని western countries ఎప్పుడో నెగ్గేశాయి.
గౌతం గారూ, ఇప్పటి కేపిటలిజం కీ, గత కేపిటలిజం కీ తేడా ఉందన్న మీ అభిప్రాయంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయని నాకనిపిస్తోంది.
ఎందుకంటే కేపిటలిజం తన సహజ పరిణామ క్రమంలోనే ఇప్పటి స్ధితికి చేరుకుందన్నది నిజం కాదా?
పశ్చిమ దేశాల్లో భూస్వామ్య వ్యవస్ధను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. అశేష శ్రామిక జనాన్ని భూముల్లో అర్ధ బానిసలుగా కట్టిపడేసిన భూస్వామ్య వ్యవస్ధను కూల్చడం ద్వారా శ్రామిక జనానికి శ్రమను తన ఇష్టం వచ్చినవారికి అమ్ముకునే స్వేచ్ఛను అది ప్రసాదించింది (శ్రమ ఫలితం మొత్తాన్ని శ్రామికుడే సొంతం చేసుకోగల స్వేచ్ఛను శ్రామికుడిని నిరాకరించిందన్నది వెరే సంగతి). అంతే కాక, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ప్రపంచ మానవుడు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ-పురుష సమానత్వం మొదలయిన ప్రజాస్వామిక భావనలను పెట్టుబదిదారీ సమాజం ప్రోది చేసి పరిమిత స్ధాయిలోనైనా అభివృద్ధి కావడానికి అవకాశం కల్పించింది. అంతవరకూ కేపిటలిజం ప్రగతిశీల పాత్రను పోషించింది.
శ్రామిక ప్రజలు తమ శ్రమలో మరింత భాగం తమకు చెందాలన్న చైతన్యం పెరిగేకొద్దీ, ప్రత్యర్ధి కంపెనీల నుండి మార్కెట్లను లాక్కునే బుద్ధులు పెరిగిన కొద్దీ పెట్టుబడిదారీ కంపెనీలు తమ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ యుద్ధాలతో, దురాక్రమణలతో. సేబొటేజ్ లతో, మానవ జీవితాన్ని దుర్భరంగా మార్చివేశాయి.
ఆయా దేశాలకు నేషనల్ స్ధాయిలో పరిమితమైన పెట్టుబదిదారీ కంపెనీలే ‘మల్టి నేషనల్ కార్పొరేషన్లు’గా అభివృద్ధి సాధించిన సంగతి వాస్తవమే కదా. మల్టి నేషనల్ కార్పొరేషన్ పూర్వపు రూపమే గత పెట్టుబడిదారీ విధానం అయితే, అది అభివృద్ధి చెందిన రూపాన్ని దాని పూర్వ రూపం నుండి వేరు పరచడం ఎంతవరకు సబబు? మీరు చేసిన విభజన వల్ల పెట్టుబడిదారీ కంపెనీలు స్వతహాగా మంచివేననీ, పోటీవల్ల చెడ్డవిగా మారాయనీ అర్ధం వస్తోంది. ఆ అర్ధం మీరు ఇవ్వదలిచారన్నది నా అభిప్రాయం కాదు గానీ విభజకు అర్ధం ఏమిటన్న అనుమానం తలెత్తుతోంది. ముఖ్యంగా అప్పటికీ, ఇప్పటికీ సిద్ధాంతాలలోనే వ్యత్యాసం ఉందని చెప్పారు గనక ఈ అనుమానం.
పరిమితంగా ఉన్న మార్కెట్లు పూర్తిగా తమ సొంతమే కావాలన్న పేరాశతోనే కదా పెట్టుబడిదారీ కంపెనీలు పోటీని నివారించే పనిలో యుద్ధాలకు దిగుతోంది! పెట్టుబడిదారీ కంపెనీలకు లాభమే ఆక్సిజన్. గతంలోనైనా, ఇప్పుడైనా అదే నిజం. ఇంకా చెప్పాలంటె ప్రారంభ కాలంలో అది ఇంక క్రూరంగా వ్యవహరించింది. పది, పన్నెండు, పదహారు గంటల పనిదినాలతో కార్మికవర్గాన్ని నంజుకు తింది. ప్రజల్లో ప్రజాస్వామిక చైతన్యం పెరిగేకొద్దీ, ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాల్లో సోషలిస్తు వ్యవస్ధలు ఏర్పడడం వల్ల ప్రజానీకానికి రాయితీలు, సదుపాయాలు ఇవ్వక తప్పలేదు గానీ లేదంటే పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రారంభ చరిత్ర దుర్మార్గ చరిత్ర.
“ప్రస్తుత కాలం capitalism కి, గతం లోని capitalism సిద్ధాంతాలకీ చాలా వ్యత్యాసం ఉంది.”
ఇది తప్ప మీ వ్యాఖ్యలో ఇతర భాగానికి నాకు ఏకీభావం ఉంది. ఈ వాక్యాన్ని వీలయితే వివరించగలరా?
విశేఖర్ గారూ,
నా ఉద్దేశ్యం పెట్టుబడిదారీ కంపెనీలు స్వతహాగా మంచివని, పోటీవల్ల చెడ్డవిగా మారాయని అస్సలు కాదు. corporatism అనేది capitalism కి పరాకాష్ఠ. బహుశా, పరాకాష్ఠ కన్నా మీరన్నట్లు natural evolution సరైన పదం ఏమో! నా ఉద్ధేశ్యం లో capitalism లో కంపెనీలు చిన్నవిగా ఉండి, వాటి మధ్య పోటీ ఎక్కువ ఉన్నప్పుడు జనానికి చాలా ఉపయోగం, పైగా వాటికి అంత power మరియు influence పెద్దగా ఉండవు. కానీ వాటిని ఆ state లో వుంచటం చాలా కష్టం. చరిత్ర లో మీరు ఏ రంగం లో చుసినా మోదట కంపెనీలన్నీ ఆధిక్యం కోసం తీవ్రంగా పోటీ పడతాయి, ఆ కాలం లో వినియోగదారులు బాగా లబ్ది పొందుతారు. కొద్ది కాలం పోయాక, ఆ రంగం monopoly కానీ duopoly కింద కాని మారిపోతుంది. అందులోని కంపెనీలు చాలా పెత్తనం సంపాదించి, ప్రభుత్వాలను కూడా శాసిస్తాయి. ఉదాహరణ కు ఇంతకు ముందర 8 ప్రపంచ పెటో్రలియం కంపెనీలు ఉండేవి, ఇప్పుడు కేవలం మూడే ఉన్నాయి. భారత దేశం లో మెదట్లో (2000s లో) 5 పెద్ద airlines ఉండేవి, కాని ఇప్పుడు మూడే ఉన్నాయి, ఇకముందు ఇంకా తక్కువ వుంటాయి. US లో airline industry చరిత్ర కూడా అంతే. ఆ ఒక్క రంగమే కాదు, ఏ రంగం అయినా అంతే. భారత దేశం లో బాగా success అయిన రంగం టెలికాం రంగం ( spectrum scandals మినహా ఇస్తే). కాని కంపెనీలు టెలికాం ఇండస్టీ్ట్ర నీ deregulate చేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సరైన పోటీ, రెగ్యులేషన్ లేక పోవటం వల్ల capitalism పరాకాష్ఠ స్థాయి కి చేరుకుంటుంది. దాన్నే నేను corporatism అని వర్ణించాను. మీరన్నట్లే ఇది కొత్తది కాదు, capitalism పుట్టుక నుండీ ఈ సమస్య ఉండేది, కాని globalization పుణ్యమా అని అప్పట్లో కన్నా ఈ రోజు వాటి impact చాలా తీవ్రం గా చాలా పెద్ద scale లో ఉంటుంది. అమెరికా లో గతం లో జరిగిన పరాకాష్ఠలన్నీ ఇప్పుడు మనం మిగతా దేశాలలో చుస్తున్నాము. పుర్వం అమెరికా తన వ్వవస్థలన్నిటినీ de-regulate చేసినట్లు మనం కుడా అదే బాట లో వెళ్ళుతున్నాము. మన దేశం లో కుడా అటువంటి సమస్యలే వస్తాయి.
గౌతం గారూ, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు అర్ధ శాస్త్ర పితామహుడిగా భావించే ఆడమ్ స్మిత్, పోటీ గురించి మీరు చెప్పినదే మొదట ఊహించాడు. కాని కంపెనీలు ఆదర్శవంతంగా పోటీ పడి ప్రజలకు మేలు చేకూరుస్తాయని భావించాడు. కాని వాస్తవం అందుకు విరుద్ధం. మీరన్నట్లు, they give an illusion of choice.
గ్లోబలైజేషన్ కి ముందు భారత దేశంలో ప్రవేటీకరణ తక్కువ. అందువల్ల కార్పొరేట్ కంపెనీల నిజ స్వరూపం ఏమిటో భారత ప్రజలకు పెద్దగా అనుభవం లేదు. ప్రభుత్వ కంపెనీలను అమ్మేస్తూ ప్రవేటీకరణ పెరిగే కొద్దీ కంపెనీల లీలలు ఒక్కొక్కటిగా అనుభవంలోకి వస్తున్నాయి. ఇండియాలో భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలు కొనసాగుతున్నందున బహుశా అమెరికా స్ధాయిలో కార్పొరేటీకరణలోకి ప్రజలను ఇముడ్చుకునే ప్రయత్నాలు జరగకపోవచ్చు. యాంత్రీకరణ ఎక్కువై, మానవ వనరుల అవసరం తగ్గుతున్న నేపధ్యంలో కూడా భారత దేశంలో పూర్తిస్ధాయి కార్పొరేట్ సంస్కృతి చొరబడడానికి తగిన భౌతిక పునాది కరువవుతోంది. అయినప్పటికీ ఉత్పత్తులు, ఫైనాన్స్ తదితరాలు చలామణి అయ్యే ప్రధాన రంగంలో కార్పొరేటీకరణ వెర్రితలలు వేయక తప్పదు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన ఇండియాలోని ఏవియేషన్ కంపెనీలకి టూరిజం వల్ల లాభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చి, సబ్సీక్వెంట్‌గా టూరిజం పరిశ్రమ నష్టపోవడం వల్ల ఏవియేషన్ కంపెనీలు కూడా నష్టపోయాయి. అయితే, పోటీ వల్ల కంపెనీలకి గానీ ప్రజలకి గానీ లాభం కలగదు అనేది కూడా నిజమే అని గ్రహించాలి.