బీహార్ అభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించాడు. బీహార్ గురించి వ్యాఖ్యానించే ముందు గుజరాత్ సంగతి చూసుకోవాలని హెచ్చరించాడు. నేరుగా మోడీని సంబోధించకుండానే సొంత రాష్ట్ర వ్యవహారం సరిచేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించినంత పని చేశాడు.
బీహార్ లో కుళ్ళిపోయిన కుల రాజకీయాల వల్ల ఆ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ఆదివారం రాజ్ కోట్ లో బి.జె.పి సమావేశంలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడి వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు బీహార్ దేశానికి రాజకీయంగా, ఆధ్యాత్మికంగా నాయకుడుగా ఉండేదనీ కుల నాయకత్వం రాష్ట్రంలో కేంద్ర స్ధానం ఆక్రమించడంతో సామాజికంగా, ఆర్ధికంగా వెనకబడిపోయిందని మోడీ అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై అభిప్రాయం కోరిన విలేఖరుల వద్ద నితీష్ స్పందించాడు. “ఎవరైనా ముందు సొంత పరిస్ధితిని గురించి ఆలోచించాలి” అని విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా నితిన్ చెప్పాడు. “ముందు గుజరాత్ లో ఆయన చేసిందేమిటో చూసుకోవాలి” అని వ్యాఖ్యానించాడని ఎన్.డి.టి.వి తెలిపింది. స్ధానిక భాషలో రెండు సామెతలను నితీష్ ఉదహరించాడని ‘ది హిందూ’ తెలిపింది. పార్టీలోనూ, ప్రజా జీవితంలోనూ స్వయంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఇతరులపై వ్యాఖ్యలు చేయడం ఏమిటని నితిన్ ప్రశ్నించాడని తెలిపింది.
తన వ్యాఖ్యలను వివరించాలని కోరగా అందుకు నితిన్ తిరస్కరించాడు. తన వ్యాఖ్యలను మీడియానే అర్ధం చేసుకోవాలని చెప్పాడు. అనేక ప్రతికూల పరిస్ధితుల మధ్య బీహార్ అభివృద్ధి పధంలో పయనిస్తోందని నితిన్ చెప్పుకున్నాడు. ప్రాచీన కాలం నుండీ బీహార్ నేర్చుకుంటూనే ఉన్నదని చెబుతూ ఆయన మోడీ అభిప్రాయాలను తిరస్కరించాడు.
నితీష్ కుమార్, మోడీ ల మధ్య వైరం ఈనాటిది కాదు. మోడి నుండి తనను తాను వేరు చేసుకోవడానికి నితీశ్ కుమార్ అనేకసార్లు ప్రయత్నించాడు. తన పార్టీ జనతాదళ్ (యు) ని కూడా మోడీ నుండి వేరుగా చూడాలని అనేక వ్యాఖ్యల ద్వారా నితీశ్ తెలియజేశాడు. బీహార్ లో బి.జె.పి తో మిత్రత్వం ఉన్నప్పటికీ 2009 లోక్ సభ ఎన్నికల్లో గానీ, 2010 రాష్ట్ర ఎన్నికల్లో గానీ మోడీ బీహార్ లో ప్రచారం చేయడానికి నితీశ్ అంగీకరించలేదు. బీహార్ లో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్ల మద్దతు నితీశ్ కి ఉన్నది. వారి మద్దతు కాపాడుకోవడమే మోడీ పట్ల నితీశ్ కి ఉన్న వ్యక్తిరేకతకు కారణమని పత్రికలు వ్యాఖ్యానించడం కద్దు.
మోడీ తో మిత్రత్వం ద్వారా తనపై ఉన్న సెక్యులర్ ముద్రను చెడగొట్టుకోవడం నితీశ్ కి ఇష్టం లేదు. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చినట్లయితే ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్నవారిలో నితీశ్ కూడా ఉన్నాడని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. గుజరాత్ బి.జె.పి నాయకుడు సంజయ్ జోషి ని పార్టీ నుండి బహిష్కరించాలన్న మోడీ డిమాండ్ ను బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడి కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు.
ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జోషి హాజరయితే తాను హాజరు కాబోనని మోడీ భీష్మించుకుని విజయవంతం అయ్యాడు కూడా. ఆ తర్వాత జోషి రెండు రోజుల క్రితమే తనంతట తానే బి.జె.పి కి రాజీనామా ప్రకటించాడు. రాజీనామా అయితే చేశాడు కానీ మోడీ పైన పోస్టర్ల యుద్ధాన్ని జోషి కొనసాగిస్తున్నాడని పత్రికలు చానెళ్ళు చెబుతున్నాయి. బీహార్ లో అధికారంలో ఉన్న ఇరు పార్టీల నాయకులూ మోడీ పై వ్యతిరేకతతో ఉండడం మోడీ ప్రధానమంత్రి పదవి ఆశలపై నీళ్ళు జల్లుతుందనడంలో సందేహం లేదు. మరో వైపు మోడీ-గడ్కారీ స్నేహ సంబంధాలపై బి.జె.పి అగ్రనాయకుడు అద్వానీ సైతం అసంతృప్తితో ఉండడం గమనార్హం.
బి.జె.పి, జనతా దళ్ (యు) పార్టీల అధికార పదవీ కుమ్ములాటల్లో ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం లేకపోవడమే అసలు విషయం. నితీశ్, మోడీ లు వల్లిస్తున్న అభివృద్ధి ప్రవేటు కంపెనీలకు, పెట్టుబడిదారులకూ, భూస్వాములకూ సంబంధించినదే తప్ప ప్రజా సామాన్యానికి సంబంధించినది కాదు.
కొంత మంది గ్లోబలైజేషన్వాదులు మన దేశం వెనుకబాటుతనానికి కారణం గ్లోబలైజేషన్ కాదనీ, కుల రాజకీయాలు & అవినీతే కారణమనీ ప్రచారం చేస్తుంటారు. వీళ్ళు “గుజరాత్ అంటే అభివృద్ధి అనీ, బీహార్ అంటే వెనుకబాటుతనం అనీ” ప్రచారం చేశారు. మోడీ కూడా అలాగే మాట్లాడాడు, అంతే. బీహార్ జనాభాలో 14% మంది ముస్లింలు. ముస్లింలకి కుటుంబ నియంత్రణ చెయ్యించుకోమని చెప్పే ధైర్యం బిజెపికైనా ఉండదు. అలాంటప్పుడు బిజెపిని పొగిడేవాళ్ళు బీహార్లోని స్థానిక నాయకులని మాత్రం తిట్టడం ఎందుకు?