రక్షిస్తానని వచ్చి లిబియా పౌరులను భక్షించిన రోగ్ ‘నాటో’


libya-bomberఆయుధ మదంతో అచ్చోసిన ఆంబోతులా ప్రపంచంలోని స్వతంత్ర దేశాలను కబళిస్తున్న నాటో, ‘మానవతా జోక్యం’ పేరుతో పశువులా తెగబడుతున్న వైనాన్ని ఐక్యరాజ్య సమితి నివేదికలు, మానవ హక్కుల సంస్ధలు ఈసడిస్తున్నాయి. గడ్డాఫీ బారినుండి లిబియా పౌరులను రక్షిస్తానంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న నాటో, వైమానిక బాంబు దాడులతో  వేలమంది పౌరుల్ని చంపేసి అంతర్జాతీయ సంస్ధల విచారణకు మోకాలడ్డుతోందని హార్ట్ ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ లో బోధిస్తున్న విజయ్ ప్రసాద్ ‘ది హిందూ’ పత్రికలో సోమవారం వెల్లడించాడు.

లిబియా మాజీ అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ, లిబియాలో రెండో పెద్ద పట్టణమైన బెంఘాజీ లో ‘సామూహిక హత్యాకాండ’ కు పాల్పడబోతున్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో కూడిన దుష్ట త్రయం పచ్చి అబద్ధాన్ని సృష్టించాయి. ట్యునీషియా, ఈజిప్టులలో ప్రజాస్వామిక సంస్కరణల కోసం చెలరేగిన ప్రజాందోళనలు ప్రపంచ వ్యాపితంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆశాకిరణంగా కనపడుతున్న ఆ రోజుల్లో దుష్ట త్రయం సృష్టించిన అబద్ధంతో ప్రపంచ వ్యాపితంగా నిజంగానే ఆందోళన వ్యక్తం అయింది. దశాబ్దాలుగా అనేక దేశాల్లో అత్యంత క్రూరంగా మానవ హననం సాగించిన దేశాలే లిబియా పౌరుల క్షేమం పట్ల ఆతృత వ్యక్తం చేయడం ఏమిటన్న అనుమానం చాలామందికి రాలేదు. అబద్ధ ప్రచారాలతో, ట్విస్టెడ్ వాస్తవాలతో ప్రజామోదాన్ని ‘మాన్యుఫాక్చర్’ చేసే కళలో ఆరితేరిన పశ్చిమ పత్రికల వార్తల ధాటికి అనేకమందిలో సహజ విచక్షణను మసకబార్చింది.

ఫలితంగా దుష్టత్రయ దేశాలు మరోసారి లిబియా ప్రజలపై తలపెట్టిన దుర్మార్గమైన హత్యాకాండకు న్యాయబద్ధత లభించింది. ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం (నెంబరు 1973), సమితికి చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అరబ్ లీగ్ ఇత్యాదిగా గల సంస్ధల ప్రత్యక్ష ఆమోదంతో దుష్ట త్రయ దేశాల యుద్ధ నేరాలు, పౌరుల హత్యాకాండ లకు చట్టబద్ధత కూడా లభించినట్లయింది. న్యాయ బద్ధత, చట్టబద్ధతల ముసుగు వేసుకున్నాక లిబియాలో మానవ హనానికి సంవత్సరం పాటు తెంపు లేకుండా పోయింది.

ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా మొదట లిబియా ప్రభుత్వ విమానాలు లిబియా గగనతలంలో ఎగరకుండా ‘నో ఫ్లై జోన్’ పేరుతో దుష్ట త్రయం అడ్డుకుంది. ‘నో ఫ్లై జోన్’ అమలు చేసే పేరుతో నాటో నీడన దుష్ట త్రయం పదివేలకు పైగా వైమానిక దాడులను ప్రారంభించింది. సమితి తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని రంగంలోకి దిగిన యుద్ధ విమానాలు కొద్ది రోజుల్లోనే ఆ తీర్మానం నిర్దేశించిన పరిధిని అడ్డంగా ఉల్లంఘించాయి. లిబియాలో గడ్డాఫీ పాలనను అంతం చేసే దిశగా ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రారంభించింది. అత్యంత క్రూరమైన హింసాకాండకు, హత్యాకాండకు, విధ్వంసానికి తెరతీసింది. దేశవ్యాపితంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ భవనాలపై బాంబులు కురిపించింది. రోడ్డు, రైలు మార్గాలనూ నాశనం చేసింది. బస్సు, రైలు స్టేషన్లను కూల్చి వేసింది. కమ్యూనికేషన్ సౌకర్యాలను విధ్వంసం కావించింది. శత్రువు గూఢచార స్ధావరం అని చెబుతూ లక్షల మంది పౌరుల ఆవాసాలపై విధ్వంసకర మారణాయుయుధాలు ప్రయోగించింది. గడ్డాఫీకి అనుకూలంగా భావించిన గ్రామాలపైనా, పట్టణాలపైనా బాంబు దాడులు చేసి వేలమంది పౌరులను చంపేసింది.

లిబియా దేశంపై ఏక పక్ష దురాక్రమణ యుద్ధం కొనసాగుతుండగా శాంతియుత చర్చలకు దారితీసే అన్నీ ప్రయత్నాలనూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లు అడ్డుకున్నాయి. ఆఫ్రికా దేశాల కూటమి ‘ఆఫ్రికన్ యూనియన్’ కి చెందిన ఉన్నత స్ధాయి కమిటీ లిబియాలో పర్యటించకుండా బాంబు దాడులతో బెంబేలెత్తించింది. లిబియాలో ‘నో ఫ్లై జోన్’ అమలు చేయడం అంటే ఈ విధ్వంసం కాదని అరబ్ లీగ్ నెత్తీ, నోరూ బాదుకుంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మాత్రం లిబియా పౌరులను కాపాడాలంటే ఆ పౌరులనే చంపక తప్పదని నిస్సిగ్గుగా ప్రకటించాడు. సమితి తీర్మానానికి మద్దతు ఇచ్చిన రష్యా, చైనా లాంటి వీటో దేశాలు నాటో వినాశకర విధ్వంసాన్ని చూసి ఆ తర్వాత తీరిగ్గా లెంపలు వేసుకున్నాయి.

గత సంవత్సరం చివరనుండీ ఐక్యరాజ్య సమితి తీర్మానం 1973 ను తిరిగి సమీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. నాటో కూటమి సమితి తీర్మానం పరిధిని అతిక్రమించిందో లేదో తేల్చాలని అవి కోరుతున్నాయి. జనవరి 2012 లో స్వతంత్ర అరబ్ మానవ హక్కుల సంస్ధలు లిబియాలో నాటో సాగించిన దుర్మార్గాలపై ఓ నివేదికను తయారు చేశాయి. మార్చి 2012 లో ఐక్యరాజ్య సమితి ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ మరొక నివేదికను తయారు చేసింది. కానీ ఈ రెండు నివేదికలనూ పట్టించుకున్నవారే లేరు. గడ్డాఫీ బలగాలు లిబియా పౌరులపై ‘హత్యాకాండ’ చేయబోతున్నాయంటూ వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదనీ, అతిశయోక్తిలతో కూడుకున్నదనీ ఆ రెండు నివేదికలూ తేల్చి చెప్పాయి. నాటో విమానాలు లిబియా గగనతలం నుండి సాగించిన వైమానిక దాడులపై పూర్తి స్ధాయి విచారణ సాగించాలని అవి సిఫారసు చేశాయి. సమితి నివేదికక అయితే, గడ్డాఫీ తో పాటు తిరుగుబాటుదారులు సైతం యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చెబుతూ నాటో కూడా యుద్ధ నేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకూ (crimes against humanity) పాల్పడిందని తేల్చి చెప్పింది. లిబియా పౌరులను రక్షిస్తానంటూ వెళ్ళిన నాటో వాస్తవంలో ఆ పౌరులపై యుద్ధ నేరాలు సాగించిందనీ, మానవతకు సమాధి చేసిందనీ ఆ విధంగా సమితి నివేదిక వెల్లడి చేసింది.

పౌరుల రక్షణ కోసం వెళ్ళి నాటో సాగించిన పౌర హత్యల రేటు తీవ్రం స్ధాయిలో ఉందని కూడా సమితి నివేదిక తేటతెల్లం చేసింది. ‘రక్షించే బాధ్యత’ (responsibility to protect – R2P) తో లిబియాలో చొరబడిన నాటో సాగించిన విధ్వంసం ఏ స్ధాయిలో ఉందంటే, అమెరికా దుర్మార్గాలకు వంత పాడే ‘న్యూయార్క్ టైమ్స్’ లాంటి పత్రికలు సైతం నాటో బాంబింగ్ వల్ల సంభవించిన పౌరుల మరణాలు చూసి ముక్కున వేలేసుకుంది. లిబియాలో సంభవించబోతున్నదంటూ అనుమానం వ్యక్తం చేసిన ‘హత్యాకాండ’ అయితే జరగలేదు గానీ ఆ వంక చూపి నాటో సాగించిన హత్యాకాండ సమస్త మానవతా పరిమితులనూ దాటిపోయిందని విజయ్ ప్రసాద్ తన OP-ED ఆర్టికల్ లో అభిప్రాయపడ్డాడు.

సమితి ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ (యు.ఎన్.హెచ్.ఆర్.సి) పరిశోధన ప్రారంభించినపుడే ఆ పరిశోధనను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. నాటో లీగల్ అడ్వైజర్ పీటర్ ఓల్సన్ హెచ్.ఆర్.సి కమిషన్ చైర్మన్ కి రాసిన లేఖలో ఎలా పేర్కొన్నాడు. “చట్టాన్ని ఉల్లంఘించారనీ, నేరాల కిందికి వస్తుందనీ కమిషన్ నివేదిక అంతిమంగా తేల్చగల నేరాలకు సమాన స్ధాయిలో ‘నాటో ఘటనల’ను కమిషన్ చూసినట్లయితే అది మాకు ఆందోళన కలిగిస్తుంది. చట్ట ఉల్లంఘనలు, నేరాలు జరిగిన పరిస్ధితులను, వాస్తవాలనూ చర్చించాలని మాత్రమే కమిషన్ నిర్దేశించిందని మేము ఈ సందర్భంగా చెప్పదలిచాము. మేము కోరేదేమిటంటే, లిబియాలో నాటో చర్యలపై చర్చను కూడా (నివేదికలో) చేర్చాలని కమిషన్ భావించినట్లయితే, ‘నాటో ఉద్దేశ్యపూర్వకంగా పౌరులను టార్గెట్ చెయ్యలేదనీ, యుద్ధ నేరాలకు పాల్పడలేదని’ నివేదిక స్పష్టంగా చెప్పాలి”

ఈ విధంగా హెచ్.ఆర్.సి విచారణను ముందే ప్రభావితం చెయ్యడానికి నాటో ‘న్యాయ’ సలహాదారు నిస్సిగ్గుగా ప్రయత్నించాడు. సమితి ఏమని నిర్దేశించిందో ఆయనే బోదిస్తాడు. దుష్ట త్రయం సాగించిన యుద్ధ నేరాల జోలికి, మానవ హక్కుల హరణ జోలికీ పోవద్దనీ పరోక్షంగా ఆదేశిస్తాడు. యుద్ధ నేరాలను చర్చించకుండా ఆ నేరాలకు దారి తీసిన పరిస్ధితులను మాత్రమే చర్చించాలని హుకుం ఇస్తాడు.  ఆ తర్వాత కూడా, నాటో యుద్ధ నేరాలు రుజువయ్యాక కూడా (ఎలాగూ రుజువు అవుతుంది కనుక) ఆ నేరాలు ఉద్దేశ్యపూర్వకంగా చెయ్యలేదనీ, లిబియా పౌరులను కాపాడే బృహత్తర కర్తవ్యంలో భాగంగా మాత్రమే అదే పౌరులను చంపవలసి వచ్చిందనీ అంతిమంగా తేల్చాలనీ నిర్దేశిస్తాడు. నాటో యుద్ధ నేరాలను విచారించే సాహసం ఎవరూ చెయ్యకూడదన్నమాట. ఇదే నాటో సంస్కృతి.

మార్చి 25 తేదీన న్యూయార్క్ టైమ్స్ విలేఖరి సి.జె.షివర్స్ కఠిన పదజాలంతో ఒక ఆర్టికల్ రాశాడు. “NATO’s Secrecy Stance” పేరుతో రాసిన ఆర్టికల్ లో ఆగస్టు 8, 2011 తేదీన మాజెర్ గ్రామంలో నాటో బలగాలు సాగించిన వైమానిక బాంబుదాడులను ప్రస్తావించాడు. మాజెర్, మిస్రాటా, ట్రిపోలి నగరాల మధ్య ఉన్న ఒక గ్రామం. గడ్డాఫీ వైపు చివరి వరకూ నిలిచి పోరాడిన ఆయన సొంత పట్టణం సిర్టే కు ముందు మాత్రమే మిస్రాటా నాటో  పశుబలం చేతికి చిక్కింది. మీస్రాటా కైవసం అయ్యాక సిర్టే కి వెళ్ళే దారిలో ఉన్న మాజెర్ లో నాటో విమానాలు కానీ వినీ ఎరుగని విధ్వంసానికీ, మానవ హననానికీ తెగబడింది. నాటో దాడిలో 34 మంది పౌరులు అన్యాయంగా చనిపోయారని ఇప్పటికీ అంతర్జాతీయంగా స్పష్టమయింది. ఈ హత్యలపై విచారణకు నాటో అడ్డంగా తిరస్కరిస్తోంది. లిబియాలో నాటో హత్యాకాండ పై విచారణకు అంగీకరిస్తుందా లేదా అన్నది మాజెర్ ఒక టెస్ట్ కేస్ గా భావిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పటికే సమీక్ష చేశామని నాటో చెప్పుకుంటోంది. నాటో ఇలా చెప్పుకోవడం (చెప్పుకుంటూ విచారణను అడ్డుకోవడం) అంటే ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఒక పరమ సూత్రాన్ని ఉల్లంఘించడమే నని టైమ్స్ విలేఖరి షీవర్స్ సరిగ్గా విశ్లేషించాడు. మిలట్రీ వ్యవస్ధలపై పౌర పాలన నియంత్రణ ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్ధలకు ప్రాధమిక సూత్రం. ఆ సూత్రాన్ని నాటో తనకు తాను ఇచ్చుకుంటున్న సమర్ధనలు పూర్వ పక్షం చేస్తున్నాయి. నాటో సాఘించిన చర్యలకు సాక్ష్యాలను సేకరించేందుకు ప్రజా, రాజకీయ వ్యవస్ధలను అనుమతించకుండా, నాటో కమాండ్ పైన ప్రపంచ పౌర వ్యస్ధల పర్యవేక్షణను అడ్డుకున్నట్లయితే ‘మిలట్రీ పై పౌర నియంత్రణ’ అన్న ప్రజాస్వామిక సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని షీవర్స్ ఎత్తి చూపాడు.

అయిదు రోజుల అనంతరం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక “NATO’s Duty” శీర్షికన ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది. “పౌరుల హత్యల గురించి వచ్చిన విశ్వసనీయమైన ఆరోపణలను పరిశోధించడానికి నాటో అసలు ఆసక్తి చూపడం లేదు” అని సదరు సంపాదకీయం ఆరోపించింది. నాటో తలపెట్టే ప్రతి ‘మానవాతా జోక్యం’ పట్లా సానుకూలత ప్రకటిస్తూ సంతోషాతిరేకాలు వ్యక్తం చేసే న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక ఈ మాత్రం పదజాలం ఉపయోగించిందంటే అది ‘పరుష పదజాలమే’ అని విజయ్ ప్రసాద్ అభిప్రాయ పడ్డాడు. ఆ తర్వాత రోజే (మార్చి 31) నాటో స్పదించింది. నాటో అప్పటికే తన పరిశోధన పూర్తి చేసిందని నాటో ప్రతినిధి ‘ఒనా లాంగెస్క్యూ’ తెలిపింది. లిబియా అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లయితే నాటో సహకరిస్తుందని కూడా ఆమె తెలిపింది. అయితే నాటో దయతో లిబియాని పాలిస్తున్న పాలకులు నాటో యుద్ధ నేరాలపై దర్యాప్తు చేస్తారన్నది ఒట్టిమాట. ఒట్టిమాట గనకనే నాటో అంత గట్టిగా ‘సహకరిస్తానని’ చెప్పుకుంది.

మే 2 తేదీన లిబియా ప్రభుత్వం తమ రక్షకుల పనుపున చట్టం కూడా చేసేసింది. ‘లా నెంబర్ 38’ గా చేసిన సదరు చట్టం తిరుగుబాటుదారులందరికీ ఒక్క కలం పోటుతో ‘క్షమాభిక్ష’ ప్రసాదించింది. ఆ రక్షణ నాటో కి కూడా పొడిగించేలా లోపాయకారీ ఏర్పాట్లు చేశారని విజయ్ ప్రసాద్ తెలిపాడు. లిబియా జైళ్ళలో 7000 గడ్డాఫీ అనుకూలురు నిర్బంధించబడ్డారు. వారి ఆచూకీ తెలియడానికి కనీసం ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ అవకాశం కూడా లిబియా ప్రభుత్వం ఇవ్వడం లేదు. వారిలో గడ్డాఫీ కుమారుడు ‘సైఫ్ ఆల్-ఇస్లాం’ కూడా ఉన్నాడు. ఆయనపైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐ.సి.సి) జారీ చేసిన వారంట్ ఆదరణకి నోచుకోవడం లేదు. ఐ.సి.సి వారంట్ ని అంగీకరించడానికి అమెరికా యుద్ధ నేరాల విచారణా అధిపతి స్టీవెన్ రాప్ కూడా నిరాకరిస్తున్నాడు. “జాతీయ స్ధాయిలోనే లిబియన్లు పారదర్శకమైన, సరయిన న్యాయాన్ని అందించడాన్నే ఇష్టపడతాం” అని జూన్ 6 అన్నట్లు పత్రికలు తెలిపాయి.

1998 లో ఐ.సి.సి ని స్ధాపించినప్పుడు లిబియాతో పాటు అమెరికా కూడా దానిని వ్యతిరేకించింది. లిబియాపై దురాక్రమణకు ఏర్పాట్లు జరుగుతున్నపుడు గడ్డాఫీ కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు దుష్ట త్రయానికి బాగా అక్కరకి వచ్చింది. నాటో యుద్ధ నేరాలను విచారించవలసి వచ్చేసరికి ఐ.సి.సి ని పక్కనబెట్టాలన్నమాట. స్వతంత్ర దేశాలను కబళించడానికి ‘మానవ హక్కులను’ సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా, సాకుగా ఎలా ఉపయోగించుకుంటున్నాయో లిబియా ప్రత్యక్ష ఉదాహరణ. దురాక్రమణ యుద్ధాన్ని ప్రారంభించడానికి సమితి, ఐ.సి.సి, అరబ్ లీగ్, ఆఫ్రికన్ యూనియన్ అన్నీ కావాలి. యుద్ధంలో పెత్తందారీ దేశాలు సాగించే హీనమైన మానవ హక్కుల ఉల్లంఘనలనూ, యుద్ధ నేరాలనూ, మానవతా వ్యతిరేక నేరాలనూ విచారించడానికి మాత్రం అవన్నీ దూరంగా ఉండాలి.

Unacknowledged Deaths: Civilian Casualties in NATO’s Air Campaign in Libya (గుర్తింపుకు నోచుకోని చావులు: లిబియాలో నాటో వైమానిక దాడుల్లో పౌరుల మరణాలు) పేరుతో ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్ధ మే 14 న ఒక నివేదికను వెలువరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధల విచారణకు అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఏ మాత్రం సహకరించని దుర్మార్గాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. విచారణ కొనసాగుతుండగా హెచ్.ఆర్.డబ్ల్యూ సంస్ధ అనేక సార్లు నాటో కు సమాధానాలు కోరుతూ కొన్ని ప్రశ్నలను పంపింది. మార్చి 1 తేదీన నాటో డెప్యూటీ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆ ప్రశ్నలకు స్పదించాడు. సమాధానాలతో మాత్రం కాదు. ఐక్యరాజ్య సమితి విచారణ కమిటీ కి నాటో అప్పటికే సమాధానాలు పంపిందనీ “కమిషన్ కి పంపిన వివరణాత్మక వ్యాఖ్యలను చూసి పూర్తిగా తన నివేదికలో ప్రచురించాలి. నివేదిక తయారు చేసేటప్పుడు ఈ వ్యాఖ్యలను పరిగణించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం” అనీ ఆయన కోరాడు. అయితే సమితి విచారణ కమిటీకి నాటో సమాధానాలు పంపిందన్నది పూర్తిగా అబద్ధం. అబద్ధాలు రాయడానికి కూడా సిగ్గులేనితనాన్ని నగ్నంగా ప్రదర్శించుకునే దుర్మార్గం ఇది. సమితి విచారణకు ఆ తర్వాత హెచ్.ఆర్.డబ్ల్యూ విచారణకు నాటో అసలు ఏమాత్రం సహకరించలేదన్నది జగమెరిగిన సత్యం.

ఫలితంగా పదివేల సార్లకు పైగా నాటో సాగించిన వైమానిక దాడుల్లో కేవలం ఎనిమిదింటిని మాత్రమే హెచ్.ఆర్.డబ్ల్యూ విచారించగలిగింది. ఈ పరిమిత శాంపిళ్లలోనే 72 మంది పౌరుల మరణాలని ఆ సంస్ధ గుర్తించింది. అందులో సగం మంది 18 సంవత్సరాల వయసు లోపువారే. “ఈ మరణాలను గుర్తించడంలో నాటో విఫలమయింది. ఆ మరణాలు ఎలా, ఎందుకు సంభవించాయో పరిశీలించడానికి కూడా నాటో నిరాకరించింది” అని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తేల్చి చెప్పింది.

విజయ్ ప్రసాద్ ప్రకారం, ఇక్కడ గుర్తించ వలసిన విషయం ఏమిటంటే, నాటో ఒక మిలట్రీ సంస్ధ. ఒక మిలట్రీ సంస్ధ పౌర వ్యవస్ధల పర్యవేక్షణకు అంగీకరించకపోవడమే స్కాండల్ తో సమానమైన విషయం. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ పౌర సంస్ధ ఆదేశాల మేరకేనని చెబుతూ నాటో లిబియాలో చర్యలకు పూనుకుంది. కానీ ఆ చర్యలపై విచారణ జరపడానికి మాత్రం సమితి జోక్యాన్ని నాటో నిరాకరిస్తోంది. “అంటే నాటో అన్నది ప్రజాస్వామిక వ్యవస్ధల ప్రామాణిక సూత్రాలకు ఆవల సంచరించే ఒక రోగ్ మిలట్రీ సంస్ధ” అని విజయ్ ప్రసాద్ ముక్తాయించాడు. లిబియాలో నాటో సాగించిన యుద్ధ నేరాలపైనా, మానవ హక్కుల ఉల్లంఘనలపైనా వివిధ మానవ హక్కుల సంస్ధలు వెలువరించిన నివేదికలు ఆ సంగతినే నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాయి.

గత జనవరిలో లిబియా పట్టణం ‘బాని వాలిద్’ నివాసి ‘ఫైజ్ ఫాతి’ ఒక సాధారణ ప్రశ్న వేశాడు. “నాటో నుండి నాకు సమాధానం కావాలి. నా ఇంటిని నాశనం చేసి, నా కుటుంబాన్ని మీరేందుకు చంపేశారు?” నాటో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నిరాకరిస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే, లిబియాలోని ఒక సాధారణ పౌరుడు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము నాటో కి లేదు. ఇరాక్ లాంటి దేశాలలో సంవత్సరాల తరబడి తనిఖీలు చేసి ఆయుధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని, లిబియా లాంటి దేశాలకు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించి, సమితి సాయంతో ‘నో ఫ్లై జోన్’ అమలు చేసి ప్రతిఘటన కొద్దిగా కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాక మాత్రమే అత్యాధునిక ఆయుధాలతో నిరాయుధ పౌరులపై విరుచుకుపడి ఆనక గొప్పలు పోతూ, ఒక  సాధారణ పౌరుడి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వణికి చస్తున్న నాటో సామ్రాజ్యవాద గుంపుని ‘మట్టి కాళ్ళ మహా రాక్షసి’ అని లెనిన్ మాహాశయుడు అభివర్ణించడం ఎంత సత్యమో కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s