సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా


Anhar Kochnevaసిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై దాడి చేసి బషర్ ప్రభుత్వాన్ని కూల్చాలని ఐక్యరాజ్య సమితికి పిలుపు ఇస్తున్నాయి.

అయితే సిరియా బైట పశ్చిమ దేశాల పత్రికలు రాస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని సిరియాలోనే నివాసం ఉంటున్న రష్యన్ విలేఖరి అన్హర్ కొచ్నేవా జిబిటైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేసింది. ఆమె సిరియాలో గత పది సంవత్సరాలుగా పని చేస్తోంది. మాస్ మీడియా లో వస్తున్న వార్తల కంటే పూర్తి భిన్నమైన పరిస్ధితి సిరియాలో ఉన్నదని ఆమె నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. కొచ్నెవా ఇంటర్వ్యూ ప్రచురించిన జిబిటైమ్స్ వార్తా కధనాన్ని యధా తధంగా అనువాదం చేసి ఇక్కడ ఇస్తున్నా.

***             ***               ***              ***

ఆమె రష్యన్. అరబిక్ చక్కగా మాట్లాడుతుంది. ఆమె స్నేహితులు, పొరుగువారు సామాన్య సిరియన్లు. డమాస్కస్ లో ఏ యితర పౌరులు నడిచే వీధుల్లోనే ఆమె నడుస్తుంది. వారు షాపింగ్ చేసే స్టోర్ల లోనే షాపింగ్ చేస్తుంది. ఇటీవల మేము ఆమెతో సిరియాలో జరుగుతున్న ఘర్షణలకు గల కొన్ని కారణాల గురించి మాట్లాడాము.

సో-కాల్డ్ ప్రదర్శనలు

సిరియన్ సంక్షోభానికి ఏమన్నా ముందరి కారణాలున్నాయా?

మొదట, సంవత్సరం క్రితం సంక్షోభానికి సంబంధించిన సూచనలేవీ లేవు. మార్చి 2011 లో ఆధారణమైనది ఏమీ జరగనేలేదు. మొత్తం మొదలయింది ఒక నేరస్ధ కార్యకలాపం ద్వారానే. “ఇటీవలి నెలల్లో సిరియాలో మూకుమ్మడి అల్లర్లు, ప్రదర్శనలు జరుగుతున్నాయి’ అని జర్నలిస్టులు రాసినప్పుడల్లా నాకెప్పుడూ కోపం వస్తుంది. అది నిజం కాదు.

గత ఏడు నెలలుగా నేను సిరియాలో శాశ్వతంగా నివసిస్తున్నాను. నేను మూడు ‘సో-కాల్డ్’ ప్రదర్శనలు మాత్రమే చూశాను. ‘సో-కాల్డ్’ ఎందుకంటే, అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా కేవలం జర్నలిస్టుల కోసమే తేబడ్డారు. ‘నిరసనలు’ అంటున్న వాటిని ఐదో, పదో నిమిషాలు మాత్రమే వీడియో తీశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అందరూ వెళ్ళిపోయారు. కొన్ని నగరాల్లో, బందిపోట్లు తాత్కాలికంగా నియంత్రణ చేజిక్కించుకున్న చోట, వారు బలవంతంగా జనాన్ని ప్రదర్శనలకి తరలించారు.

1990 ల చివర నేను సిరియా వచ్చాను. నిజం చెప్పాలంటే ఈ దేశాన్ని మొదట నేను ఇష్టపడలేదు. ఇప్పుడు నేనిక్కడే నివసిస్తున్నాను. దేశం ఇప్పుడు మారిపోయింది. జీవనం మారిపోయింది. ప్రజలూ మారారు. ప్రజలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించారు. వారికి సొంత ఆస్తులు ఉన్నాయి.

కనుక, పది సంవత్సరాల క్రితం ప్రజలు ప్రదర్శనలకు మద్దతు ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాదు. ప్రజలకి ఇప్పుడు స్ధిరత్వం కావాలి. అనవసరంగా అశాంతి, గందరగోళం చోటు చేసుకుంది. వారు శాంతియుత దేశంలో బతుకుతుండేవారు. ఈ ప్రాంతంలో అత్యంత భద్రత కలిగిన దేశాల్లో సిరియా ఒకటి. ఇక్కడ వీధిలో డబ్బు సంచిని వదిలి వెళితే రెండు రోజుల తర్వాత వచ్చినా అక్కడే దాన్ని దొరకబుచ్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ, ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. ప్రజలు భయంలో ఉన్నారు. వారు గర్వపడుతున్నదేదో వారి నుండి దొంగిలించబడింది.

బందిపోట్ల చేతుల్లో

పేలుళ్లు, ప్రజలపై కాల్పులు, భవనాల విధ్వంసం వీటికి ఎవరు పధకం వేస్తున్నారు?

కొన్ని వారాల క్రితం నేను హోమ్స్ లో ఉన్నాను. హోమ్స్ లో ‘బాబా అమీర్’ జిల్లాలో ఉన్నాను. అక్కడి నివాసుల్లో అత్యధికులు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. నా స్నేహితులు బాబా అమీర్ కి 800 మీటర్ల దూరంలో నివసిస్తారు. బందిపోట్లు తమ ఇళ్లపై కాల్పులు జరిపారని వారు నాతో చెప్పారు. సైన్యం కాదు. సిరియా సైన్యం ప్రజల్ని చంపదు. పరిస్ధితి తీవ్రంగా మారినపుడు మాత్రమే వారు సమాధానం ఇస్తారు.

గత నెల మరణాల్లో ఎక్కువ మంది సిరియా ఆర్మీకి చెందిన సైనికులే. ఈ సో-కాల్డ్ తిరుగుబాటుదారులు వీధుల్లో ఫైటింగ్ చేస్తారు. టైర్లు కాల్చి వీడియోలు తీస్తారు. ఏదన్నా మొబైల్ తో తీసిన వీడియో లో మీరు నల్లటి పొగను చూసినట్లయితే అది సైన్యం చేసే ఫిరంగి కాల్పుల వల్ల కాదు. అది కాలుతున్న టైర్లనుండి వచ్చే పొగ మాత్రమే.

ఒక నెల క్రితం నేను వాయవ్య సిరియాలోని జబదానీ లో ఉన్నాను. బందిపోట్లు నగరం మొత్తాన్ని భయంతో నింపేశారు. సిరియాలో మానవతా విపత్తు ఏర్పడిందంటూ మీడియాలో ఈ మధ్య తరచుగా వింటున్నాము, చదువుతున్నాము. ఒక నగరం బందిపోట్ల చేతుల్లోకి వెళ్ళినపుడే ఈ ‘మానవతా విపత్తు’ మొదలవుతుంది.

జబదాని లో నన్నూ నా కొలీగ్స్ నీ బందిపోట్లు పట్టుకున్నారు. వారు మాకోక తుప్పు పట్టిన ట్యాంకు ఒకదాన్ని చూపి పట్నం పైనా ఆ ట్యాంకే కాల్పులు జరిపిందని చెప్పారు. కానీ పూర్తిగా నాశనమైన రెండు ఇళ్ళు జిల్లా నడిబొడ్డునే ఉన్నాయి. ట్యాంకు గాలిలో నుండో, ఏదో మూలనుండో కాల్పులు జరుపుతుందని నేననుకోను. వారు డజను మందిని కూడగట్టి మాకోసమే ఒక నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సమయంలో నేను వారి మొఖాల్లోకి చూశాను. వారి మొఖాల్లో భయం, ద్వేషం మాత్రమే నేను చూశాను. వారు బందిపోట్లకి భయపడుతూ వారిని ద్వేషిస్తున్నారు.

కిరాయి సైనికులు (Soldiers of fortune)

మీరెప్పుడూ ‘బందిపోట్లు’ పదం వాడుతున్నారు. వాళ్ళు తిరుగుబాటుదారులో, ప్రతిపక్షాలో కాదు కదా?

బందిపోట్లలో కిరాయి సైనికులు చాలామంది ఉన్నారు. వారు చెచెన్లు, రొమేనియన్లు, ఫ్రెంచి వాళ్ళు, లిబియన్లు, ఆఫ్ఘన్లు. ఆఫ్ఘన్ సోల్జర్లతో హాస్యాస్పదమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. కొద్ది మంది ఆఫ్ఘన్లు పట్టుబడ్డారు. ‘మీరిక్కడేం చేస్తున్నారు?’ అని వారిని అడిగితే “మేము ఇజ్రాయెల్ కి వచ్చామని మాకు చెప్పారు. రాత్రి పూట మేము ఇజ్రాయేలీయుల బస్సుల పైకి కాల్పులు జరుపుతున్నాము. పాలస్తీనా ని విముక్తి చేయడానికి మేము శత్రువుతో పోరాడుతున్నాము” అని వారు సమాధానం ఇచ్చారు. వినడానికి నవ్వు తెప్పించేదిగా ఉన్నా ఇది నిజం. వారు చాలా ఆశ్చర్యపోయారు. “మేము సిరియాలో ఉన్నామా? మేమింకా ఇజ్రాయెల్ లో ఉన్నామని అనుకుంటున్నాం!” అంటూ వారు ఆశ్చర్యపడ్డారు.

సాయుధ గ్యాంగుల్లో సిరియా క్రిమినల్స్ కూడా ఉన్నారు. వీరంతా జైళ్ళలో ఉండవలసిన నిజమైన నేరస్ధులు. అలాంటివారిని ఏ దేశంలోనైనా చూడొచ్చు. ఇక్కడొక విశిష్టత ఏమిటంటే, ఏదైనా నగరాన్ని వారు చేజిక్కించుకుంటే వెంటనే అక్కడ ఉన్న క్రిమినల్ రికార్డులన్నింటినీ తగలబెడతారు

ఏ సమాజంలోనైనా ఇలాంటి వ్యక్తులు తారసపడతారు… వాళ్లెలాంటివారంటే, అధికారం అనుభవించడం వారికి ఇష్టం. పని చేయడానికి ఇష్టపడరు గానీ డబ్బు కావాలి. దొంగతనాలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వారి సంఖ్య పెద్ద ఎక్కువేమీ కాదు. మరో వైపు ఒక నగరాన్ని భాయోత్పాతంలో ముంచెత్తడానికి పెద్ద సంఖ్యలో జనమేమీ అవసరం లేదు. ఇద్దరు సాయుధులు వీధుల్లో జీవితాన్ని స్తంభింపజేయగలరు.

సంస్కరణ కాదు, అశాంతి కావాలి

మే 7, 2012 తేదీన పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొన్నాయా?

పాల్గొన్నాయి. ప్రచారం చాలా చురుకుగా జరిగింది. డమాస్కస్ లో ప్రధాన వీధుల్లో గోడలన్నీ అభ్యర్ధుల పోస్టర్లతో నిండిపోయాయి. 250 సీట్ల కోసం 7200 మంది పోటీ చేశారని వారు చెప్పారు. వోటింగ్ ప్రజాస్వామికం కాదని మీరేందుకు అనుకున్నారు? అలా అని ఎవరన్నారు? సిరియా ప్రతిపక్ష నాయకులా? వారు విదేశాల్లో నివసిస్తున్నారు. దశాబ్ధాలుగా యూరప్ లో నివసిస్తున్నారు. అసలైన సిరియా గురించి వారికేమి తెలుసు? మా అవసరాల గురించి వారికేమి తెలుసు? తమ భవిష్యత్తు ఏమిటో సిరియన్లనే తేల్చుకోనివ్వండి.

సిరియాలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొన్నాయి. పరిస్ధితి గురించి మరొక వివరం ఏమిటంటే, సిరియా నేషనల్ పార్టీ నాయకుడు కుమారుడు మూడు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో పాల్గొనవద్దని ఆ పార్టీకి బెదిరింపులు వచ్చాయి. కానీ పార్టీ ఒప్పుకోలేదు. ఫలితంగా అతన్ని చంపేశారు. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వామా లేక సిరియాలో సానుకూల మార్పులేమీ జరగకూడదని కోరుకునేవారా? బందిపోట్లకి సంస్కరణలేవీ అవసరం లేదు. దేశంలో అస్ధిరత, అశాంతి లే వారికి కావాలి.

సిరియా లో తగాదా ఎవరి మధ్య?

బాధాకరం ఏమిటంటే, మధ్య ప్రాచ్యం (Middle  East) లో రాజకీయ సమతూకం మార్చడానికి అమెరికాకి సిరియా ఒక అడ్డంకి. స్టీఫెన్ ఎల్లియట్ ఎడిట్ చేసిన ‘Where to Invade Next’ పుస్తకం చదవండి. అరబ్ స్ప్రింగ్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి.

గ్లోబల్ మీడియాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రత్యామ్నాయ మీడియా వాస్తవంలో మనమంతా నివసిస్తున్నాం. వాస్తవంలో ఉనికిలో లేనిదానిపై ఒక సినిమాని ప్రపంచం మొత్తం వీక్షిస్తోంది. అది వాస్తవ ఘటనల ముసుగులో ఉన్న ఊహ (ఫిక్షన్) మాత్రమే. ప్రజాభిప్రాయాన్ని మానిపులేట్ చేయడమే ఇది.

ఐక్యరాజ్య సమితి పరిశీలకుల్లారా, మీ కళ్ళతో చూడండి!

సిరియాలో అన్నన్ పధకం పట్ల వైఖరి ఏమిటి?

ఒక అభిప్రాయం ఏమిటంటే బందిపోట్లను పునఃసమీకరించడానికి ఇదొక ప్రయత్నం. హోమ్స్ లో మేము చూసిన ప్రతి ఒక్కరూ మరో వారంలో బందిపోట్ల సమస్యని సిరియా సైన్యం పరిష్కరిస్తుందని మాతో చెప్పారు. మరో వైపు రెండో అభిప్రాయం ఉంది: పరువు పోగొట్టుకోకముందే ఈ పరిస్ధితి నుండి బయటపడాలని అమెరికా భావిస్తోందని.

ఐక్యరాజ్య సమితి తీర్పు ద్వారా చూస్తే, సిరియా ప్రభుత్వం చెబుతున్నది నిజమేననీ గుర్తించి వారు పరిస్ధితిని పొడిగించడం ఆపుతారు. రెండో అభిప్రాయానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. అదే నిజమని ఎందుకంటున్నానంటే, ఇక్కడి వాస్తవాలు చూడకుండా ఉండడం అసాధ్యం. ఒకసారి మోసం చెయ్యొచ్చు, రెండోసారి కూడా మోసం చెయ్యొచ్చు, కానీ అన్నిసార్లూ మోసం చెయ్యడం చాలా కష్టం. 300 మంది ఐక్యరాజ్య సమితి పరిశీలకులు వాస్తవాలు గ్రహిస్తారని నాకు నమ్మకం ఉంది. వారిని అబద్ధం చెప్పమని బలవంతం చేస్తారా – అది కష్టం.

డమాస్కస్ లో జరిగిన సంఘటనలపైన ‘లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్’ (ఎల్.ఎ.ఎస్) కి చెందిన దౌత్య బృందం జనవరిలో సవివరమైన నివేదిక ఇచ్చింది. హోమ్స్ లో సాయుధ గ్యాంగుల కార్యకలాపాలకు ప్రతిగానే పోలీసుల స్పందన అని వారు నివేదిక ఇచ్చారు. ఇప్పటిదాకా ఆ నివేదికను ప్రచురించనే లేదు. ఐక్యరాజ్య సమితి మనుషులు మర్యాదస్తులనీ, పరిస్ధితిని వాస్తవంగా నివేదిస్తారనీ ఆశిస్తున్నాను.

చివరిగా, మీరు సిరియా ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారా?

నేనా? ప్రభుత్వంలో ఎవరూ నాకు తెలియదు. సిరియా ప్రజలకే నా మద్దతు. ఇంకెవరికీ మద్దతు ఇవ్వను.

***              ***                ***                ***

పై ఇంటర్వ్యూ అంతా యధా తధ అనువాదం. ఇందులో విషయాల్ని బట్టి సిరియాలో తిరుగుబాటు అంటూ పశ్చిమ దేశాల పత్ర్తికలు రాస్తున్నదంతా పచ్చి అబద్ధాలేనని నిర్ద్వంద్వంగా రుజువవుతోంది. హిట్లర్ అనుయాయి గోబెల్ ని ఆదర్శంగా స్వీకరించిన ఈ పత్రికలు అమెరికా, యూరప్ దేశాల కుటిల ఎత్తుగడలకు, దుర్మార్గాలకూ ‘మానవతా’ ముసుగు వేసే బృహత్తర కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకోసం అత్యంత నీచంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లాంటి పశ్చిమ దేశాలకూ, సౌదీ అరేబియా, ఖతార్, యు.ఎ.ఇ లాంటి పచ్చి అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలకూ చెందిన కిరాయి మూకలు, మిలట్రీ గూఢచారులు ‘తిరుగుబాటు’ ముసుగులో సిరియా ప్రజలపై సాగిస్తున్న రక్తపాతాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. పసి పిల్లలపైనా, స్త్రీల పైనా కిరాయి మూకలు సాగిస్తున్న హంతక దుర్మార్గాలను ‘సంస్కరణల కోసం తిరుగుబాటు’గా కీర్తిస్తున్నాయి.

ఈ దుర్మార్గాలన్నీ పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ కంపెనీల కోసమే. ప్రపంచ వ్యాపితంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుండడం వల్ల ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే లక్షోప లక్షల పనికిమాలిన సరుకులు అమ్ముడుబోవడం లేదు. ఫలితంగా కంపెనీలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. పోగుబడిన పెట్టుబడి తిరిగి ఉత్పత్తి ప్రక్రియల్లోకి పెట్టుబడిగా వినియోగ పడుతూ మరిన్ని లాభాలు సంపాదించాలంటే వాటిని కొనేవాడు ఉండాలి. అలాంటి కొనేవాడి ఆదాయాన్ని ‘పొదుపు విధానాల’ పేరుతో ఆ కంపెనీలే తమ జేబులకు తరలించుకుంటున్నాయి. అది మళ్ళీ ఆ కంపెనీలను మరింత సంక్షోభానికి గురి చేస్తోంది. ఇదొక విష వలయం. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉండే అత్యంత ప్రాధమిక వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవాలంటే పెట్టుబడిదారీ కంపెనీలు తమ లాభాలని కార్మిక వర్గంతో పంచుకోవడానికి సిద్ధపడాలి. అది మాత్రం జరగని పని.

కారల్ మార్క్స్ చెప్పినట్లు ఈ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్ధ తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటుంది. అలాంటి వినాశనంలో ఒక భాగమే స్వతంత్ర దేశాలపై అవి చేసే దుర్మార్గ దాడులు. తమ వనరులను తమ దేశ ప్రజలకే వినియోగపెట్టుకోవాలని భావించే స్వంతంత్ర ప్రభుత్వాలన్నా, వ్యక్తులన్నా వాటికి గిట్టవు. అలాంటి ప్రభుత్వాలపైనా, వ్యక్తుల పైనా అనేక విధాలుగా దుష్ప్రచారం చేసి వారిని చంపడానీకీ, ఆ దేశాలను కబళించడానికీ నిత్యం ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నాలకు సిరియా ఇప్పుడు బలవుతోంది. సిరియా పై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు చేస్తున్న దుర్మార్గాలు సఫలం అయితే మధ్య ప్రాచ్యంలో పరిస్ధితి పూర్తిగా మారిపోతుంది. ప్రపంచాధిపత్యం కోసం తెగబడుతున్న అమెరికా, యూరప్ సామ్రాజ్యవాదులకు కొద్దో గొప్పో ప్రతిఘటన అందిస్తున్న సిరియా, ఇరాన్ లే టార్గెట్ గా సాగుతున్న కిరాయి మూకల దురాగతాలను ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే పతి ఒక్కరూ వ్యతిరేకించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s