దేశ రాజధాని సమీపంలో పరువు హత్య, హత్యా ప్రయత్నం


Reenaప్రేమించిన పాపానికి తండ్రీ, సోదరులే హత్యలకు సిద్ధపడ్డారు. భారత దేశ రాజధాని న్యూఢిల్లీ కి సమీపంలోనే శనివారం రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ ఊరిలోనే వేరొక వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని తండ్రే ఉరి బిగించి చంపగా, అక్కడికి సమీపంలోని మరో ఊరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి సోదరుడు కాల్పులు జరిపాడు. భార్యా, భర్తలు ఇరువురూ ఆసుపత్రిలో తేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ శివార్లలోని సోనిపట్ లో నివసిస్తున్న బ్రజేష్ సింగ్ కి 12 వ తరగతి చదువుతున్న తన కూతురు రీనా ప్రేమలో పడడం నచ్చలేదు. అదే గ్రామంలో ఒక యువకుడితో ప్రేమలో పడిన రీనా ప్రేమించినతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లి దండ్రులతో చెప్పింది. ఆమెకి నచ్చ జెప్పడానికి విఫల యత్నం చేసిన బ్రజేష్ దుపట్టాతో కూతురి మెడ చుట్టూ బిగించి చంపేశాడు. అనంతరం పోలీసుల వద్ద లొంగిపోయాడు.

సెక్యూరిటీ గార్డు గా పని చేసే బ్రజేష్ తాను ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూతురు వినలేదనీ, విధి లేక చంపేశాననీ పోలీసులకు చెప్పాడు. రీనా ప్రేమించిన వ్యక్తి ఆమెకు ‘అంకుల్’ వరస అవుతాడనీ, అందువల్ల పెళ్ళికి ఒప్పుకోలేదనీ బ్రజేష్ భార్య తెలిపినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.

సోనే పట్ కి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న పటౌడీ గ్రామంలో యువ భార్యా భర్తలు మోనికా, వీర్ ప్రకాష్ లపై మోనికా అన్నతుపాకీతో కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నించాడు. సంవత్సరన్నర క్రితం వారు ఇంటి నుండి వెళ్ళిపోయి తమ కుటుంబం ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండీ భయంతో తప్పించుకు తిరుగుతున్నారు.

ఇంటికి తిరిగి రావాలనీ, వస్తే సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేస్తామనీ మోనికా కుటుంబం చెప్పడంతో వారు మారి ఉంటారన్న ఆశతో మోనికా ప్రకాష్ లు తిరిగి వచ్చారు. రాత్రి పది గంటల వరకీ మోనిక తల్లిదండ్రుల ఇంటిలో గడిపారనీ, అనంతరం మోనిక అన్న వారిని మావో రోడ్ లోకి తీసుకెళ్లి కాల్పులు జరిపాడనీ గుర్ గావ్ పోలీసులు తెలిపారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఇరువురిని చేర్చారు. వారి శరీరాల నుండి గుపాకి గుళ్లను ఇంకా తొలగించనందున వారి పరిస్ధితి ఏమిటో తెలియలేదు.

మెట్రో నగరాలకు అత్యంత సమీపంలో నివసిస్తున్నప్పటికీ ప్రజల సాంస్కృతిక విలువలలో మార్పులు రావడానికి అవకాశం తక్కువని ఈ రెండు ఘటనలు ఎత్తి చూపుతున్నాయి. సామాజిక, సాంస్కృతిక విలువలలో వ్యవస్ధాగతమైన మార్పు రావడానికి పునాదిలో ఉండే ఆర్ధిక సంబంధాలలో మార్పు రావడం తప్ప మరో దారి లేదు. ఆధిపత్య వర్గాల పతన సంస్కృతీ విలువలను గొప్ప విలువలుగా భావించి అనుకరించడం జరుగుతుందే తప్ప అవి నిజానికి కింది నుండి వచ్చిన మార్పులు కాజాలవు. అలాంటి అనుకరణ ద్వారా వచ్చే మార్పుల వల్ల సమాజంలో రీనా, మోనిక ల వలే బలహీన స్ధితిలో ఉన్న వర్గాల ప్రజలు మరిన్ని ఒత్తిడిలకు గురికావడం జరుగుతోంది. కార్పొరేట్ నగరాల్లో ఒక పక్క స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం, మరో పక్క ప్రేమలను సైతం సహించలేని దుర్మార్గం పక్క పక్కనే కొనసాగుతుండడం అందులో భాగమే.

15 thoughts on “దేశ రాజధాని సమీపంలో పరువు హత్య, హత్యా ప్రయత్నం

 1. ఆడవాళ్ళు ప్రేమిస్తే వాళ్ళకు తల్లిదండ్రుల నుంచి రక్షణ ఇవ్వాలి.
  వాళ్లు ప్రేమించి ఆ ప్రియుణ్ణి మోసం చేసిన తరువాత ఆ ప్రియుణ్ణుంచి వాళ్ళకు రక్షణ ఇవ్వాలి.
  ఒజవేళ ఆ ప్రియుడితో ఆమెకి పెళ్ళయితే ఆ తరువాత అతన్నుంచి ఆమెకు రక్షణ ఇవ్వాలి.

  మొత్తమ్మీద ఆధునిక మహిళకు హక్కులే తప్ప ఏ బాధ్యతా లేదు. ఎవరి పట్లా లేదు. తన స్వార్థం, తన ఇష్టం తాను చూసుకోవడమే ఆమెకున్న ఏకైక బాధ్యత. అందుకు ఎఱ్ఱజెండాల యొక్క, ఇంకా వర్తులం కింది ప్లస్సుల యొక్కా బేషరతు మద్దతు. శభాష్ !

 2. మహిళలు నిర్వర్తిస్తున్న బాధ్యతల్నీ, శ్రమనీ చూడలేని మీ హ్రస్వ దృష్టిని సరిచేసుకోండి.

  ఆడవాళ్లంటే వేరే గ్రహవాసులు కాదనీ మానవ సమాజంలో అత్యవసర భాగమనీ గుర్తించండి.

  వారూ మనుషులేననీ, వారికీ హృదయం, మనసూ, మెదడూ ఉంటాయనీ, అవి కూడా బాధపడతాయనీ, స్పందిస్తాయనీ, ఆలోచిస్తాయనీ తెలుసుకోండి. అది తెలుసుకోని నాడు అసలు మానవ జన్మే వృధా అని గుర్తించండి.

  కళ్లెదుట జరిగిన దుర్మార్గాన్ని కూడా నిండు మనసుతో ఖండించలేని పాషాణ హృదయలు మనుషులు కాబోరని తెలుసుకోండి.

 3. ఒకపక్క ఆధునిక మద్యతరగతి మహిళ ఆర్దికంగా తనకాళ్ళపైన తనునిలబడి తనపైన మగవాడి అధికారాన్ని ప్రశ్నిస్తుంది. ఆర్దిక స్తితిగతులు మారినంత వేగంగా సాంసౄతికంగా మారలేదు. మగవాడు అధికారం ఇంకా తనచేతులొ వుందనుకుంటున్నాడు.ఫలితంగా ఇద్దరి మద్య ఘర్షణలు తారాస్తాయికి చేరుకుంటున్నాయి. ఇది కొంతకాలం మాత్రమే వుంటుంది క్రమంగా వాస్తవాలను గ్రహించి సాంసౄతికంగా అనివార్యంగా మారతాడు.

 4. రామ్మోహన్ గారూ, వేగవంతమైన ఆర్ధిక మార్పులు అంటూ మీరు వేటిని ఉద్దేశిస్తున్నారు?

  ఆర్ధిక మార్పులు గానీ మరే మార్పులు గానీ వర్గదృష్టితో చూడనట్లయితే పొరబాటు అభిప్రాయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ధిక పరమైన వర్గ కేంద్రీకరణ మరింత చిక్కబడుతోందే తప్ప మారడం లేదు. ఆర్ధిక పునాది మారకుండానే పరాయి సంస్కృతులను అనుకరించడం వల్ల ఉపరితలంలో జరిగే మార్పులు సాంస్కృతిక విధ్వంసానికి దోహదపడుతున్నాయే తప్ప మార్పులకు దారి తీయడం లేదు.

  పురుషులు వాస్తవాలను గ్రహించడం ఆర్ధిక మార్పులకు అతీతంగా జరగడం సాధ్యమేననా మీ ఉద్దేశ్యం?

 5. విశెఖర్ గారూ. వేగవంతమైన ఆర్దిక మార్పులంటే నా ఉద్దేశంలొ ఈ మద్యకాలంలొ కొంతమంది మహిళలకు మంచి ఉద్యొగాలు దొరకడంవల్ల ఆర్దికంగా ఇకొకరిపైన ఆదారపడకుందా వాళ్ళకాళ్ళపైన వాళ్ళు నిలబడ్డారు. అలాంటి మహిళలు అంతొ ఇంతొ పురుషుల అధికారాన్ని ఆపగలుగుతున్నారు. దాన్ని మగవాళ్ళు సహించలేక పొతున్నారు. ఈమద్యన కడపలొ ఇలాంటి హత్యే జరిగింది అమ్మాయి అగ్రకులము అబ్బాయి చిన్నకులము తను గవర్నమెంటు ఉద్యొగం చేస్తుంది ఇంట్లొవాళ్ళు వప్పుకొకపొయినా తను పెళ్ళి చేసుకుంటుందని తెలుసు దాన్ని గ్రహించి వాళ్ళ అన్న ఆమెను చంపివేసినాడు. ఉద్యొగం తన చేతిలొలేకుంటె ఆమెకు అంత దైర్యం వచ్చేది కాదు.

  మీరన్నాట్టు నేను కార్మిక వర్గాన్ని మొత్తాన్ని దౄస్టిలొ పెట్టుకొలేదు. మొత్తాన్ని దౄస్టిలొ పెట్టుకున్నట్టు అయితె పెట్టుబడి కొద్దిమంది చేతులలొ మాత్రమే కేద్రీకరింపబడి కార్మిక వర్గం నానాటికీ బికారైపొతుంది. తన జీవితబ్రద్రత నానాటికీ దిగజారిపొతుంది.

  పురుషులు మారడం ఆర్దిక అంశాలకు అతీతంగా జరగదు కాని ఆచిన్న చిన్న మార్పులే జురుగుతున్నాయి గత 10యెళ్ళకు ఇప్పటికి బేరీజు వేసుకొండి తీవ్రమైన మార్పులు జరగపొయినా కొన్నిటిల్లొ మార్పు జరిగిందనేది వాస్తవం.

 6. కాసేపు పురుషాధిక్యం, పురుషాహంకారం లాంటి రొటీన్ క్లీష్ లకి దూరంగా చట్టపరంగా మాట్లాడుకుందామా ? ఆడవాళ్ళకి తమ సర్కిల్ లో ఎవఱి పట్ల బాధ్యత ఉండాలని చట్టాలు చెబుతున్నాయో కాస్త వివరించండి. అదే, మగవాడి విషయానికొచ్చేసరికి అతని నెత్తిమీద ఎంతమంది తాలూకు బాధ్యతల్ని పెట్టారో చూడండి.

  He is statutorily punishable if he does not discharge those responsibilities. Woman has all rights but no responsibilities towards anyone. There is no law to punish a woman if she is indifferent to the plight of the people in her family. So, man has all responsibilities, but no rights whatsoever in any matter. ఇదీ అసలు ఉన్న వాస్తవ పరిస్థితి.

 7. మీ చట్టాల చర్చ పక్కన ఉంచండి. కూతురు ప్రేమని సహజ పరిణామంగా స్వీకరించలేని తండ్రి దుర్మార్గాన్నీ, చెల్లి పెళ్ళిని సంవత్సరన్నర అయినా ఒప్పుకోలేని అన్న క్రూరత్వాన్నీ ఖండించగలిగితే, ముందా పని చెయ్యండి.

 8. రామ్మోహన్ గారూ మీరు చెప్పిన పరిమిత అర్ధంలో అయితే మీరన్నది నిజమే. అయితే సాంస్కృతికంగా పూర్తి పరివర్తన రావడానికి మాత్రం ఆర్ధిక పునాదిలో మార్పులు రావడం ముందస్తు షరతుగా ఉంటుంది.

 9. I don’t support what the father and brother did. At the same time, I don’t viewe the incident as something weird. Because no love is unconditional. So, she has a responsibility not to offend their sensibility. It is very natural that people get offended when someone takes advantage of their parental love and shows scant regard for their likes and dislikes, especially after bringing up the girl for so many years. In that case, love turns into hatred. It is just human. In India, people are viewed to be integral to families, not as individuals separate from it. So every member of a family has a stake and say in the matrimonial matter of the other.

 10. కన్న కూతుర్ని చంపినా, సొంత చెల్లి, బావలని చంపబోయినా weird కాదని చెప్పగలుగుతున్నారంటే, వారి దుర్మార్గానికి మీ మద్దతు లేకపోయినా దానికేమీ విలువ లేదు. నిజానికి మీరు పరువు హత్యల దుర్మార్గాలకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. కాకపోతే ఆ మద్దతుకి కుటుంబం, బాధ్యత అంటూ ముసుగులు తొడుగుతున్నారు.

  సెన్సిబుల్ ప్రేమని భరించలేని సెన్సిబిలిటీస్ ఎందుకట? కూతుర్నీ, చెల్లిల్నీ చంపాలని చూసే అలాంటి సెన్సిబిలిటీస్ ఉన్నవారంతా వేరే గ్రహాలకి తరలివెళ్లడం మేలు. ఎందుకంటే ప్రేమానుభూతులు సహజసిద్ధంగా జనించే మానవ సమాజంలో ఉండడానికి వారు తగరు.

  తండ్రి ప్రేమ కూతురిని కాపాడుకుంటుందే కాని ప్రాణం తీయదు. ప్రాణం తీసే ప్రేమ ఉన్నవాడు ఇంకేమన్నా అవుతాడేమో కాని తండ్రో, అన్నో మాత్రం కాడు.

  ప్రేమ ప్రేమ గా ఉండడమే మానవత్వం. ప్రేమ ద్వేషంగా మారడం పశుత్వం. అలాంటి పశుత్వాన్ని సమర్ధిస్తున్నారంటే మీరు…. ?

  వ్యక్తులు కుటుంబ సభ్యులే కాదు. వారు వ్యక్తులు కూడా. కుటుంబం పేరుతోనో, మరో పేరుతోనో ప్రేమించడానికి వ్యక్తులకు సహజ సిద్ధంగా ఉండే హక్కులను అడ్డుకోజూడడం ‘కుటుంబతనం’ కాదు. కుటుంబాలైనా, సమాజమైనా వ్యక్తిగత స్వేచ్ఛకి కాంప్లిమెంటరీగా ప్రవర్తించాలి తప్ప శతృవులుగా కాదు.

  ఈ సంగతిని శతాబ్దాలుగా అనేక దేశాల ప్రేమ చరిత్రలు రుజువు చేశాయి. మీలాంటి వారు మాత్రం ఈ విధంగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్న విలువల్లోనే తారట్లాడుతూ సామాజిక పురోగమనానికి ప్రతిబంధకంగా తయారవుతున్నారు. పాత నీరు పోయి కొత్త నీరు రావడం అత్యంత సహజం అని తెలుసుకోలేని మూఢత్వంలో మగ్గుతున్నారు.

 11. శేఖర్,

  సెక్యూరిటీ గార్డు గా పని చేసే బ్రజేష్ తాను ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూతురు వినలేదనీ,చంపేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 12గం|| సెక్యూరిటీ గార్డు గా పనిచేసేవాడి దగ్గర మీరు సెన్సిబిలిటీ ఎలా ఆశిస్తున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ 12గంటలు వాడిని ఒక్క క్షణం కూడా వదలరు. సెక్యూరిటీ గార్డు పని అంత బోర్ జాబ్ ఇంకొకటి ఉండదు. బయటి రాష్ట్రాలనుంచి వచ్చి, పట్టేడన్నం కోసం పగలు రాత్రి అడ్డమైన వేళలలో పని చేస్తూ ,చిన్న ఇళ్లలో బతుకు ఈడుస్తూంటాడు. వాడు అంత కష్టపడేది, వాడిదైన సామజిక ప్రపంచంలో కొంచెం పరువుగా బతకాలను కొంటాడు. ఇక వాడి జీవితంలో మీలాగా ఎర్ర పుస్తకాలు చదివి సామాజిక జ్ణానం పెంచుకొనే టైం అసలికే ఉండదు.వాడి పశుత్వాన్ని సమర్ధిస్తున్నారంటే మీరు…. ? అని బ్లాగులో ప్రశ్నించే కన్నా, మీరే అటువంటి వారి జీవితాలను బాగు చేయటానికి ప్రయత్నించండి. వారి అవగాహన శక్తిని పెంచటానికి కృషి చేస్తే బాగుంట్టుంది. ఇటువంటి పనులు చేసేవారు ఇంటర్నేట్ చూడారు,బ్లాగులు చదవరు, అని మీరు తెలుసుకోవాలి.
  _____________
  మీ సైకాలజి 1970సం|| కాలం నాటిది. ఎవరైనా మీకు భిన్నంగా అభిప్రాయం చెపితే, ఎప్పుడు మీరు మంచి వారు ఇతరులు చెడ్డవారు అనే విధంగా రాస్తారు.అప్పుడప్పుడు ఇతర బ్లాగులు చదివి ప్రపంచం లో ఎమి జరుగుతున్నదో తెలుసుకోండి. ఈ క్రింది టపాలో రసజ్ణ ,kvsv లో రాసిన వ్యాఖ్యలు చదవండి. ప్రపంచం గురించి అవగాహన పెరుగుతుంది.

  http://maditalapulu.blogspot.in/2012/06/i-love-india.html?showComment=1339330119815

 12. Sri గారూ,
  మీరు ఇచ్చిన లింక్ వెంట వెళ్లి అక్కడి టపా చదివాను. టపా లో గాని, ఆ తర్వాత వ్యాఖ్యలకి ఇచ్చిన సమాధానాల్లో గానీ జలతారు వెన్నెల గారు వ్యక్తం చేసిన ప్రధాన అభిప్రాయాలు ఆదర్శనీయంగా, ఆచరణీయంగా ఉన్నాయి. (ఎనోనిమస్ పేరుతో వచ్చి అడ్డదిడ్డంగా రాసిన వ్యక్తికి ఆమె ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ నాకు బాగా నచ్చింది.) ముఖ్యంగా ‘ఆ నలుగురు’ సినిమా ప్రస్తావన సందర్భంగా ఆమె ఇచ్చిన సమర్ధన చాలా బాగుంది. సాయం కోరి వచ్చినవారిని అనుమానించడం మాని సాయం చెయ్యగలిగితే చెయ్యమని చెప్పడానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నా.

  రసజ్ఞ గారు చేసిన సేవ చదివాక నేను చాలా ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాను. ఆమెకు నా అభినందనలు. ఇక కె.వి.ఎస్.వి గారు రాసిన విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం సరికాదు. తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి గనక ఆయన ప్రస్తావన పై తీర్పిచ్చెయ్యడం సరి కాదు.

  అయితే ఇక్కడ నాకు అర్ధం కానిది ఒక్కటే. ఇక్కడ నేను చెప్పిన విషయాలకీ మీరిచ్చిన లింక్ లో విషయాలకీ సంబంధమే అర్ధం కాలేదు. వెన్నెల గారి టపా ద్వారా, లేదా రసజ్ఞ గారు, కె.వి గార్ల వ్యాఖ్యల ద్వారా నాకు మీరు నేర్పదలచిన అవగాహన ఏముటి? ఇతరులకు సాయం చెయ్యడం, విద్యాదానం చెయ్యడం, మానవత్వంతో స్పందించడం చెడ్డ లక్షణాలని నేను చెప్పలేదు గదా. లేదా అలాంటివి భూమ్మీద జరగడం లేదని నేను ఎక్కడయినా అన్నానా?

  నా బ్లాగ్ చూసి సెక్యూరిటీ గార్డులు చైతన్యం పెంచుకోవాలని నేనెక్కడయినా అన్నట్లు నాకు గుర్తు లేదు. వ్యాఖ్యాత వ్యాఖ్యకి స్పందిస్తూ వేసిన ప్రశ్నని బైటికి తెచ్చి జనరలైజ్ ఎందుకు చేసారు? సందర్భం నుండి వాక్యాలను బైటికి లాగితే ఉన్న అర్ధం పోయి లేని అర్ధం వస్తుంది. బహుశా మీరు అందుకే భిన్నాభిప్రాయం చెప్పినవారు చెడ్డవారని నేను భావిస్తున్నట్లు పొరబడి ఉంటారు.

 13. *అలాంటి పశుత్వాన్ని సమర్ధిస్తున్నారంటే మీరు…. ? *

  సరిఫిజన్ గాని, మీరు, నేను గాని ఎవరు ఆ తండ్రి చేసినదానిని సమర్ధించరు. ఆ లింక్ ఇవ్వటానికి కారణం ఇప్పటి వరకు ఏ బ్లాగులోను మీ వ్యాఖ్యలు చుడలేదు. మీరు రోజుకి రెండు టపాలు రాయటమే కాని, మీరేమైనా ఇతర బ్లాగులు చదువుతున్నారా అని అనుమానం వచ్చి, (ఎందుకంటే దానికే సగం సమయం అయిపోతుంది, మిగతాది వ్యాఖ్యలకు బదులిస్తూ ) మనుషులో వస్తున్న మార్పులను గమనించాలని ఇచ్చాను. ఇంత క్ర్తితం మీరు అమేరికా వారి మీద చెప్పిన అభిప్రాయం నాకు గుర్తుంది. ఈ టపా ద్వారా మీరు కొత్త విషయం తెలుసుకొంటారని ఆశించి రాశాను.

 14. Sri గారూ, మీరు మరోసారి సర్ఫిజెన్ గారి వ్యాఖ్య (ఆంగ్లంలో ఉన్నది) చూడండి. తండ్రి, సోదరుల దుర్మార్గాన్ని వ్యతిరేకించడానికి ఆయన కొన్ని కండిషన్లు పెట్టారు. తండ్రిగా, అన్నగా వారికి ఉన్న సెన్సిబిలిటీస్ దృష్ట్యా, వారి దుర్మార్గం weird కాదని అంటున్నారు.

  యువతీ యువకుల ప్రేమలు వారి వారి కుటుంబ పెద్దల సెన్సిబిలిటీస్ కి లోబడి ఉండాలని ఆయన తీర్మానించారు. పోనీ ఆ పెద్దల సెన్సిబిలిటీస్ కి ప్రేమకి సంబంధించిన సెన్సిబిలిటీస్ ని గౌరవించే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అంటే అదేమీ లేదు. వారి దృష్టిలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమిస్తె వారు కూతురయినా, చెల్లెలు అయినా చంపేసేయాల్సిందే. ప్రేమించినవారికి ప్రేమించే హక్కులు ఉండకూడదు. ఉంటే అవి పెద్దరికం పేరుతో లేదా అన్న, తండ్రి పేరుతో పెత్తనం చేసే వారి అనుమతులకు లోబడి ఉండాలి. అలాంటి గుణగణాల్ని సర్ఫి జెన్ గారు గొప్ప సెన్సిబిలిటీస్ గా చెబుతూ వాటిని గౌరవించాలని చెబుతున్నారు. అలాంటి పెత్తందారీ సెన్సిబిలిటీస్ ని గౌరవించడం అంటే సహజ సిద్ధమైన ప్రేమానుభూతుల్ని వదిలిపెట్టడమే కదా. కండిషన్స్ కి లొంగని ప్రేమల్ని, ప్రేమికుల్నీ చంపెయ్యాలనే ఆయన చెప్పదలిచారు. ‘హత్యలకు నా మద్దతు లేదు’ అని చెప్పినా దాన్ని రుజువు చేసే ఎక్స్ ప్రెషన్ ఏదీ ఆయన అభిప్రాయంలో లేదు. ప్రేమలకి తండ్రుల, అన్నల వ్యతిరేకత సహజం అంటున్నారు గానీ, ప్రేమల్ని సహజంగా గుర్తించే పరిస్ధితిలో ఆయన లేరు.

  పైగా నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడితే ఆ ప్రేమని అన్న పైనా, తండ్రిపైనా ఇతర కుటుంబ సభ్యులపైనా ఉన్న ప్రేమతో పోటీకి తెస్తున్నారు. సినిమాల్లో “నీకు నీ ప్రియుడి ప్రేమ కావాలో లేక ఈ అన్న ప్రేమ (లేదా తండ్రి ప్రేమ) కావాలో తేల్చుకో” అంటూ బరువైనదిగా భావిస్తూ పనికిమాలిన డైలాగ్ వల్లిస్తారే, అలాంటిదే ఇదీనూ. అనేక సంవత్సరాలు కూతురిని పెంచుతారు గనక ఆ అమ్మాయి భావోద్వేగాలని తండ్రులు, సోదరులు కంట్రోల్ చేస్తారా? చేస్తే అది కూతురుపై ప్రేమో, సోదరిపై ప్రేమో అవుతుందా? ఆ పేరుతో చేసే పెత్తనం అవుతుందే తప్ప ప్రేమ కాదది. ప్రేమ పేరుతో తమ అర్ధం పర్ధం లేని పరువు భావనలని ‘హ్యతల రూపంలో’ రియలైజ్ చేసుకునే దుర్మార్గం అది.

  ఇట్లాంటి పనికిమాలిన, కుళ్లిపోయిన భావనల్ని ముందుకు తెచ్చి హంతక దుర్మార్గాల్ని సమర్ధించడాన్నే మూఢత్వంగా, పశుత్వంగా, అభివృద్ధి నిరోధకత్వంగా, కొత్త నీరు ఆహ్వానించలేని మూర్ఖత్వంగా పైన చెప్పాను. ఇది ఆ వ్యక్తిని నిందించడం కాదు. అలాంటి విమర్శలు చేయకపోతే ఇక మీరూ అనేక సార్లు చెప్పే నాగరికతకూ, అభివృద్ధికీ, మార్పుకీ ఇక అర్ధం లేదు. జలతారు వెన్నెల గారి అభిప్రాయాలకి మీరు ఇచ్చిన విలువకు కూడా అర్ధం ఉండదు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులు, భూస్వామ్య భావజాలాన్ని (ఇందులో కుల అణచివేత, లింగ అణచివేత, శ్రామికుల అణచివేత అన్నీ విడదీయరాని భాగాలు) గొప్ప భావజాలంగా చెబుతూ పునరుద్ధరింపజేయడానికి (వాదనల్లోనైనా) చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరించకపోతే నా రాతలకు కూడా అర్ధం ఉండదు.

  మనుషుల్లో వస్తున్న మార్పులను గమనించడానికి ఇతర బ్లాగులు చదవడమే ఒక్కటే మార్గమా? బ్లాగు రాతలు ఆయా వ్యక్తులకి సంబందించిన ఒకానొక పార్శ్వాన్ని మాత్రమే మన ముందుంచుతాయి. నేను రాసే రాతలను నిజ జీవితంలో ఆచరిస్తున్నానో లేదో, నా ఆచరణ చూడకుండా, మీకెలా తెలుస్తుంది? అందువల్ల బ్లాగు రాతల ద్వారా మనం చూడగల మార్పులు చాలా తక్కువ. మీరు గమనించేదే, మీ చుట్టూ ఉన్నదే సమాజమా? నా చుట్టూ కూడా సమాజం ఉంది. కధలు, పత్రికలు, మ్యాగజైన్లు, సర్వేలు నిత్యం అనేకం చదువుతుంటాను. సినిమాలు, వీడియోలు చూస్తాను. పాటలు వింటాను. రోజూ నిత్యం అనేకమందితో నాకూ సంబంధాలు ఉంటాయి. ఆఫీసులో అనేక మంది కస్టమర్లతో నిత్యం మాట్లాడతాను, పోట్లాడతాను. స్టడీ సర్కిల్స్ లో అనేక చర్చల్లో పాల్గొంటాను. అనేకమందికి సాయం చేస్తాను, సాయం పొందుతాను. అనేకానేక సంబంధాలలో నేను పయనిస్తున్నపుడు సవాలక్షా అనుభూతులు నేను స్వయంగా పొందుతాను, ఇతరుల అనుభూతుల్నీ నావిగా చేసుకుంటాను. నా అనుభూతుల్నీ భరించగలవారికి ఆపాదిస్తాను. అనేకానేక వ్యక్తులతో, సంబంధాలతో, భావాలతో, అధ్యయనాలతో సంఘర్షిస్తుంటాను. ఇవన్నీ మీకెలా తెలుస్తుంది?

  కనుక ఆర్బిట్రరీగా మీరు నా పైన అనుమానాలు వ్యక్తం చెయ్యడం సరైనది కాదని నా అభిప్రాయం. అలాగని సంపూర్ణుడినని చెప్పను. నాకు తెలియనవి మీకు తెలిసినవి మీకేమన్నా తోస్తే, వాటిని నాకు పంచితే, వాటితో నేను ఏకీభవిస్తే, తప్పనిసరిగా స్వీకరిస్తాను. కానీ మీతో ఏకీభవించనివి నాకు తెలియనివిగా భావిస్తూ నాకు చెప్పబోతే గనక నేను స్వీకరిస్తానని అనుకోవద్దు. నేను మార్చుకోదలచినది ఏమన్నా ఉంటే అది నా అనుభూతులకూ, అవగానకూ లోబడే ఉంటుంది. ఎవరి విషయంలోనైనా అదే నిజం.

  అమెరికావారి మీద నేను చెప్పిన అభిప్రాయంపై మీకేమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి. అలా కాకుండా గుర్తుంది అంటే నాకేం అర్ధం అవుతుంది?

 15. సర్పిజెన్ గారిని యవరైనా స్త్రీ దారుణంగా వంచించినట్టు వుంది లేపొతె ఆయన స్త్రీ ల పైన కనీసమైన కనికరంకుడా చుపలేదు. అధిక శాతం యువతీ యువకులు ఇస్టంతొ {ప్రెమతొ} కూడిన పెళ్ళిని ఆమొధించడంలేదు. వాళ్ళ మనస్సులొ అది స్వార్దంతొనూ, పెద్దలను ఎధిరించడంగా తొస్తుంది. ప్రస్తుత సమాజంలొ పెళ్ళీనేది వ్యెక్తి గత విషయం కాదు. సామాజిక విషయమైంది. ఇది సొంత ఆస్తి విధానంద్వారా సంక్రమించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s