అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్


ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చు పెట్టిన సంగతిని వెలికి తీసి దేశాన్ని నివ్వెరపరిచిన 62 సంవత్సరాల సుభాష్ అగర్వాల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టీ చుక్క ముట్టని ఈ లేఖాయుధుడు పత్రికలకు లేఖలు రాసి ఆ లేఖలనే ఆయుధాలుగా ప్రభుత్వంలోని అనేక విభాగాలలో జరుగుతున్న అనేక తప్పులను సవరించుకునేలా ఒత్తిడి చేసిన ధీమంతుడు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్ అధికారులకు ప్రజల పట్లా, వారి అవసరాల పట్లా ఉన్న ఉదాసీనతనూ, ఛీత్కార ధోరణినీ, ఆశ్రిత పక్షపాతాన్నీ గత 45 సంవత్సరాల నుండి వెల్లడిస్తున్నాడని తెలిస్తే నమ్మగలమా? ‘ది హిందూ’ పత్రిక విలేఖరి అమన్ సేధి స్ఫూర్తి దాయకమైన సుభాష్ పోరాట చరిత్రను జూన్ 8 న లోకానికి తెలిపాడు.

సుభాష్ చంద్ర అగర్వాల్ ఉల్లిపాయలు తినడు. సినిమాలు చూడడు. సంగీతం వినడు. అవినీతితో పంకిలమైన పాడు ప్రపంచంలో పిల్లలను పెంచడం ఇష్టం లేక పిల్లల్ని కూడా కనలేదట. వృత్తి రీత్యా చాందినీ చౌక్ లో వస్త్ర వ్యాపారి అయినా, ఆర్.టి.ఐ చట్టం వచ్చినప్పటి నుండి వార్తలు వింటూ, చదువుతూ సమాచారం కోసం దరఖాస్తు చేయడం ఆయనకి ఇష్టమైన మరో వృత్తి. ఆయన సమాచారం కోరని రంగమే లేదనుకుంటా. జాతీయ అవార్డుల కోసం ఎన్నిక చేసేటప్పుడు అనుసరించే ప్రమాణాలు, జడ్జి ల ఆస్తులు, పార్లమెంటు సభ్యులలో విస్తృత వ్యాప్తిలో ఉన్న బహు భార్యాత్వం, ఇటీవలే ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్లు… ఇలా ఏదైనా.

“sab approach se hi hota hai” (Nothing happens without approaching the right people) “సరైన వ్యక్తిని కలవకపోతే ఏ పనీ కాదు” అన్నది ఈయన తరచూ వాడే పదబంధం. ప్రభుత్వ పాలనా అసమర్ధత తో విసిగి పోతూ, నిర్ణయ ప్రక్రియల నుండి దూరంగా నెట్టివేయబడుతున్నందుకు ఆగ్రహావేశాలతో సంచరించే మధ్యతరగతి జనానికి దాని అర్ధం వివరించనవసరం లేదు. “సమాచార హక్కు అనేది చర్య తీసుకోవడానికి హక్కుగా మారాలి” అని సుభాష్ చెబుతాడు. చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని ఎలా వెంటాడి వేధించేదీ ఆయన చెబుతాడు. “పబ్లిక్ గ్రీవెన్సెస్ వెబ్ సైట్ లో మొదట ఫిర్యాదు చేస్తాను. ఆ తర్వాత ఫిర్యాదు పరిష్కారం కోసం ఆర్.టి.ఐ దరఖాస్తు చేస్తాను” అని సుభాష్ అగర్వాల్ వివరించాడు. గ్రీవెన్సెస్, అగర్వాల్… ఈ రెండూ బంధువులన్నది సుభాష్ ఉవాచ.

1971 లో ఈయన బాబాయి తాను ఎం.బి.ఎ చదువుకునే అవకాశాలని అడ్డుకోవడంతో ‘ఫేకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్’ లో ‘డీన్ ఆఫ్ అడ్మిషన్స్’ వద్ద కాపు కాశాడు. తన బాబాయికి డీన్ తో మంచి పరిచయం ఉంది. అందువల్ల ఎం.బి.ఎ చదువుకి సాయం చేయమని బాబాయిని కోరాడు. సుభాష్ తెలివితేటల పట్ల అసూయ పెంచుకున్న బాబాయి సాయం చెయ్యడానికి బదులు సుభాష్ ని సెలెక్ట్ చెయ్యొద్దని డీన్ కి చెప్పాడు. అప్పటి నుండి తన చేదు జీవితం మొదలయిందని సుభాష్ చెప్పాడు. సుభాష్ దృష్టిలో తన జీవితం నాశనం కావడానికి బాబాయే కారణం. “ఆయన నియంత. కుటుంబ వ్యాపారంలో చేరక తప్పేలా నన్ను ఒత్తిడి చేశాడు. ఐ.ఎ.ఎస్ అధికారి కావాలన్న నా ఆశలని అణిచివేశాడు. పిల్లలని కనొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని సుభాష్ చెప్పాడు. సుభాష్ బాబాయిని కలవడానికి ‘ది హిందూ’ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

సుభాష్ అప్పటికి ఓడిపోయినా తలొగ్గలేదు. ఎడిటర్ కి ఉత్తరాలు రాయడం ద్వారా ‘ప్రజా సేవ’ లోకి అడుగు పెట్టాడు. ఆయన మొదటి ఉత్తరం 1967 లో ‘దైనిక్ హిందూస్తాన్’ లో అచ్చయింది. టికెట్ ఇవ్వకుండా డబ్బుల్ని జేబులో వేసుకున్న కండక్టర్ గురించినదే ఆ ఉత్తరం. ‘ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్’ అధికారులు దానికి క్షమాపణలు చెప్పుకున్నారు. దానితో ధైర్యం చిక్కిన సుభాష్ అగర్వాల్ మరో ఉత్తరం రాశాడు. ఆ తర్వాత మరో ఉత్తరం. అదయ్యాక ఇంకో ఉత్తరం. అలా అలుపెరగకుండా రాస్తూనే ఉన్నాడు. 3,699 ఉత్తరాలు ఆయనవి అచ్చయ్యాయి. ఈ ఫీట్ వల్ల ఆయనకి 2006 లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో స్ధానం దక్కింది. అయితే దాని కోసం ఆయనా పని చేయలేదు గనక అదేమీ పెద్ద విషయం కాదు. లేఖలను ఆయుధాలుగా మలుచుకుని ప్రభుత్వ విభాగాల బాధ్యతను గుర్తు చేయగలగడం, బాధ్యతా రాహిత్యాన్ని దులప గలగడమే అసలు విషయం.

“ఖాళీ సమయాల్లో నా షాపులోనే కూర్చుని ఉత్తరాలు రాసేవాడ్ని. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రచురించిన పుస్తకాన్ని కొని వార్తా పత్రికల పేర్లు, చిరునామాలతో స్టిక్కర్లు తయారు చేసుకున్నాను” అని సుభాష్ తెలిపాడు. ప్రతివారం ఉత్తరాలు టైప్ చెయ్యడం, అడ్రస్ లు అతికించడం పోస్ట్ డబ్బాలో వెయ్యడం సుభాష్ చేసేవాడు. తన ఉత్తరం అచ్చయినపుడు దానిని కత్తిరించడం, సంబంధిత అధికారులకి పంపడం చేసేవాడు. తద్వారా చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి కల్పించేవాడు.

తాజ్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ గురించి ఆయన రైల్వే మంత్రికి రాశాడు. ‘ట్రైన్స్ ఎట్ ఆ గ్లాన్స్’ మాన్యువల్ ని కొని జాగ్రత్తగా చదివానని ఆయన చెప్పాడు. నాణేల వ్యాసం అస్తవ్యస్తంగా ఉండడం గురించి సుభాష్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ కి రాశాడు. “ప్రతీ నాణేన్నీ నేను కొలిచాను. 25 పై, 50 పై నాణేల మధ్య బాగా తేడా ఉంది. కానీ 50 పై, రూపాయి నాణేల మధ్య పెద్దగా తేడా లేదు” అని సుభాష్ తెలిపాడు. 75 గ్రాముల సబ్బు ప్యాక్ చట్ట బద్ధత గురించి ‘హిందూస్ధాన్ లీవర్ లిమిటెడ్’ తో వాదించాడు; కాంపోస్ ధర గురించి రేన్ బేక్సీ తో తగవు పెట్టుకున్నాడు; ఒకప్పటి పాపులర్ సీరియల్ రజని (ప్రియా టెండూల్కర్) సీరియల్ ఫ్రీక్వెన్సీ పైన దూరదర్శన్ తో వాదులాటకి దిగాడు. వీటిలో కొన్ని చాలా చిన్నవిగా కనిపించినా దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా పెద్ద తేడాను, ప్రభావాన్నీ కలగజేసేవే.

“నేను ప్రతిదీ అధ్యయనం చేసేవాడ్ని. ప్రతిదీ అనుసరించేవాడ్ని. ఎయిర్ మెయిల్ టారిఫ్ లో న్యాయబద్ధత ఉండేది కాదు -ఒకే ఒక్క ఉమ్మడి ప్యాకేజీ పంపడం కంటే విడివిడిగా చిన్న ప్యాకేజీలు పంపడం చౌకగా ఉండేది” అని సుభాష్ వివరించాడు. ఈ విషయమై పోస్టల్ డిపార్ట్ మెంట్ సమాధానం చెప్పేదాకా లేఖల్ని సంధించాడు. కొన్నాళ్ళకి టారిఫ్ లను స్విట్జర్లాండ్ (బెర్న్) లోని ‘యూనివర్సల్ పోస్టల్ యూనియన్’ నిర్ణయిస్తుందని పోస్టల్ శాఖ సమాధానం చెప్పింది. సుభాష్ అక్కడికీ రాశాడు. ఇక్కడి పోస్టల్ డిపార్ట్ మెంట్ తనకు అబద్ధం చెప్పిందని అక్కడి నుండి సమాధానం వచ్చిందని సుభాష్ చెప్పాడు. ఆ ఉత్తరంతో మళ్ళీ పోస్టల్ డిపార్ట్ మెంట్ కి రాశాడు.

2005 లో ఆర్.టి.ఐ చట్టం వచ్చాక తన లేఖల ప్రతిభకు సుభాష్ మరింత పదును పెట్టాడు. ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేయదానికి దానిని శక్తివంతమైన ఆయుధంగా చేసుకున్నాడు. ఆయన మొదటి ఆర్.టి.ఐ దరఖాస్తు నియంత బాబాయి తో తనకు ఉన్న ఆస్తి వివాదానికి సంబంధించినది. వారసత్వంగా తనకు రావలసిన ఇంటిని తన స్వంతం చేసుకున్నాడనేది బాబాయి పైన సుభాష్ ఫిర్యాదు. “మా బాబాయి పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన అల్లుడు సుప్రీం కోర్టులో జడ్జి. మరో కోర్టులో మా కేసు వింటున్న జడ్జి మా బాబాయి మనవరాలి పెళ్లి వేడుకకు ఆతిధ్యం ఇచ్చాడు” అని సుభాష్ తెలిపాడు. ఈ విషయమై సమాచారం కోరుతూ అగర్వాల్ ఆర్.టి.ఐ దరఖాస్తు చేశాడు. సాక్ష్యంగా పెళ్లి కార్డు జత చేశాడు. సమాచారం అయితే అందలేదు గానీ సుభాష్ బాబాయి మాత్రం మొదటిసారిగా సుభాష్ తో రాజీకి వచ్చాడు. “మా యిల్లు ఆర్.టి.ఐ చట్టం పుణ్యమే” అంటాడు సుభాష్ అగర్వాల్.

అప్పటి నుండీ అగర్వాల్ పూర్తి కాలం ఆర్.టి.ఐ కార్యకర్తగా మారాడు. “నేను రోజూ ఆరు వార్తా పత్రికలు చదువుతాను. టెలివిజన్ నిత్యం వార్తలు చూపుతుంటుంది. లోపలి వ్యక్తులు కూడా కొందరు తమ డిపార్ట్ మెంట్స్ లో అవినీతి గురించి నాకు సమాచారం ఇస్తుంటారు. విలేఖరులు నాకు సలహా సూచనలు ఇస్తుంటారు. నాకిక ఏ ఇతర ఆసక్తీ లేదు. నేను క్రికెట్ చూడను. కానీ బి.సి.సి.ఐ ని ఆర్.టి.ఐ చట్టం పరిధిలోకి తేవాలన్నది నా కోరిక” అని సుభాష్ వివరించాడు.

ఆర్.టి.ఐ చట్టం ఈ రోజుల్లో సామాన్యుల చేతికి ఆయుధంగా మారింది. ప్రజల దరిదాపుల్లోకి కూడా రాని అనేక ప్రభుత్వ కార్యకలాపాల సమాచారం గురించి తెలుసుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతోంది. పై స్ధాయిలో జరిగే అనేక లోగుట్టు వ్యవహారాల సమాచారం బైటికి రాకుండా ఆర్.టి.ఐ చట్టంలో అనేక రక్షణాలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందనడంలో అనుమానం లేదు. కానీ, కనీస సమాచారం కూడా సామాన్య ప్రజలకి చెప్పడానికి నిరాకరిస్తున్న పరిస్ధితుల్లో కొంతమేరకైనా ఈ చట్టం ఉపయోగపడుతోంది. ఈ మాత్రానికే ఆర్.టి.ఐ కార్యకర్తలు ఆధిపత్య వర్గాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, మాఫియా లాంటి సంఘ వ్యతిరేక శక్తులు జమిలిగా పెనవేసుకుపోయినందున ప్రభుత్వం నుండి సమాచారం కోరుతుంటే మాఫియాలు ప్రతిస్పందిస్తున్న ఉదాహరణలకు కొదవ లేకుండా పోయింది. అనేక చోట్ల ఆర్.టి.ఐ కార్యకర్తలు హత్యలకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. అందువల్ల ఆర్.టి.ఐ కార్యకర్తగా మారడం అంటే ఆధిపత్య వ్యవస్ధలను ప్రశ్నించడంగా, ప్రతిఘటించడంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మార్గంలో నడుస్తున్న సుభాష్ అగర్వాల్ కి అభినందనలు చెబుదాం.

5 thoughts on “అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

  1. సామాజిక అంశాల విషయంలో సుభాష్ అగర్వాల్ పట్టుదల, పోరాట పటిమ అసాధారణం. చుట్టూ ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నా స్పందనలే కరువవుతూ, ‘నాకేం సంబంధం?,’ ‘నాదేం పోయింది!’ రకం వ్యక్తివాద ధోరణుల మధ్య ఇలాంటివారి కృషి ప్రత్యేకంగా ప్రశంసించదగ్గది!

  2. అన్నా హజారే అభిమానులైతే అలా చెయ్యరు. దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఉదయం పూట నిరాహార దీక్ష చేసి, సాయింత్రం పూట శిబిరం ఎత్తేస్తారు. మా పట్టణంలో లోక్‌సత్తా కార్యకర్తలు & ఇంకో స్వచ్ఛంద సంస్థవాళ్ళు అదే పని చేశారు.

  3. అవినీతిపరుని మీద కేస్ వేస్తే కోర్ట్ చుట్టూ తిరగాలి. అవినీతిపరునికి వ్యతిరేకంగా ధర్నా లేదా నిరాహార దీక్ష చేస్తే పేపర్‌లలో పబ్లిసిటీ వస్తుంది. అందుకే వ్యక్తిగత పాప్యులారిటీ కోసం పాకులాడేవాళ్ళు కోర్ట్‌కి వెళ్ళకుండా రెండో మార్గంలో వెళ్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s