కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు


భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే మారుస్తారట. ప్రజల అవసరాల పట్ల ఇంతకంటే ఛీత్కార భావన మరకటి ఉండబోదు.

సుభాష్ అగర్వాల్ అనే ఆర్.టి.ఐ (సమాచార హక్కు చట్టం) కార్యకర్త కోరిన సమాచారం మేరకు ప్లానింగ్ కమిషన్ ఈ విషయాన్ని వెల్లడి చేయక తప్పలేదు. ‘ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ ని ఆదర్శంగా తీసుకుని ఈ ఆధునికీకరణ తలపెట్టారని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది. టాయిలెట్ ఆధునీకరణకి మొత్తం రు. 30 లక్షలు ఖర్చు కాగా, ఒక్క తలుపు కోసమే 5.19 లక్షలు ఖర్చు చేశారు. అంత ఖర్చు పెట్టి టాయిలేట్ లు నిర్మిస్తే గుమాస్తాలు వాడడానికి వీల్లేదు గనక అందరూ వెళ్లకుండా కంట్రోల్ సిస్టంని తలుపుకి ఏర్పాటు చేశారు. కేవలం స్మార్ట్ కార్డ్ ఉన్నవాళ్లే టాయిలేట్ ని ఉపయోగించేలా ఆ ఏర్పాటు చేశారు.

“డోర్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి రు. 5,19,426 ఖర్చయింది. రెండు టాయిలెట్లను ఆధునీకరించడానికి రు. 30,00,305 ఖర్చయింది” అని సుభాష్ కి వచ్చిన ఆర్.టి.ఐ రిప్లై పేర్కొంది. ప్లానింగ్ కమిషన్ లో మొత్తం 60 మంది అధికారులకి స్మార్ట్ కార్డ్ లు ఇచ్చామని కూడా రిప్లై తెలిపింది. టాయిలెట్ల వరకు వెళ్ళే కారిడార్ లో సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామనీ, టాయిలెట్లలో ఖరీదయిన చిన్న చిన్న పరికరాలు చోరికి గురి కాకుండా ఉండడానికి కెమెరాల అవసరం వచ్చిందనీ కమిషన్ తెలియజేసింది. తాము బడ్జెట్ పరిధిలోనే ఖర్చు పెట్టాము కనక ఇందులో తప్పేమీ లేదని అహ్లూవాలియా బుధవారం పత్రికల వద్ద సమర్ధించుకున్నాడు.

ప్రజల సొమ్ముతో షోకులు చేసుకునే మాంటెక్ సింగ్ ప్రభుత్వ ధనం ఖర్చు చేయడంలో చేతికి ఎముకలేనట్లే వ్యవహరిస్తాడని గతంలో పత్రికలు అనేక దృష్టాంతాలు చూపాయి. ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడికి విదేశీ ప్రయాణాలతో పెద్దగా పని ఉండదు. కానీ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా మాత్రం విదేశీ ప్రయాణాలకి కోట్లే తగలేశాడు. ఆయన 2011 లో మే నుండి అక్టోబర్  వరకూ జరిపిన విదేశీ ప్రయాణాల్లో రోజుకి రు.2.02 లక్షలు ఖర్చు పెట్టాడని ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగించి తెలుసుకున్న సమాచారాన్ని బట్టి వెల్లడయింది. మరో ఆరి.టి.ఐ ఎంక్వైరీ ద్వారా ఆయన జూన్ 2004 నుండి జనవరి 2011 మధ్య కాలంలో 274 రోజుల పాటు 42 సార్లు అధికారిక పర్యటనలు చేసి 2.34 కోట్లు తగలేశాడు. ప్లానింగ్ కమిషన్ అధిపతిగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందని పత్రికలు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా తనకు ప్రధాని మన్మోహన్ సింగ్ అనుమతి ఉందని దాటవేసిన గొప్ప పొదుపరి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఒక వ్యక్తి బతకడానికి రోజుకి 28 రూపాయలు చాలు. భారత దేశంలో సగటు జీవిత కాలం 65 సంవత్సరాలు ఈ లెక్కన ఒక పేదవాడు బతకడానికి జీవితాంతం రు. 6.64 లక్షలు చాలు. 5.3 మంది పేదలు (దరిద్రులు కాదు) బతకడానికి జీవితాంతం అయ్యే ఖర్చుని ప్లానింగ్ కమిషన్ రెండు టాయిలెట్లకోసం ఖర్చు పెట్టేసిందన్నమాట.

సంవత్సర కాలంగా భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు బాగా పడిపోయింది. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు పొదుపు పాటించాలని ఆర్ధిక మంత్రి ప్రణబ్ చెబుతున్నాడు. బడ్జేట్ ఆమోదం పొందాక లోక్ సభలో ప్రసంగించినపుడు కూడా ఆయన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పాడు. త్వరలో ‘పొదుపు చర్యలు’ అనుసరిస్తామని కూడా చెప్పాడు. ఆ మేరకు మంత్రులు, అధికారులు ప్రయాణాలు తగ్గించుకోవాలనీ, ప్రతి దానికీ సమావేశం అంటూ డబ్బు తగలేయ్యద్దనీ ఆదేశాలు జారీ అయ్యాయని పత్రికలు తెలిపాయి. విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలనీ, ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాలనీ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపధ్యంలో యోజనా భవన్ లో కేవలం ఒకే అంతస్ధులో, అదీ రెండు టాయిలేట్ గదుల్లో 35 లక్షలు ఖర్చు పెట్టి ఆధునీకరించడం తగునా? 

పేదవాడు బతకడానికి ఒక్కడికి రోజుకు రు.28 చాలని చెప్పిన మాంటెక్ దేశవ్యాపితంగా విమర్శలు వచ్చినప్పటికీ దారిద్ర రేఖ ప్రమాణాలను సవరించవలసిన ఆవశ్యకతను అంగీకరించలేదు. ఎలాగైతేనేం, దరిద్రం తగ్గింది కదా? అని ఆయన ప్రశ్నించినట్లు ఫస్ట్ పోస్ట్ పత్రిక కొద్ది వారాల క్రితం తెలిపింది. అలాంటి మాంటెక్ టాయిలెట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టడం, అక్కడికి ఆఫీసర్లు తప్ప వేరే ఎవ్వరూ వెళ్ళ కుండా కంట్రోల్ వ్యవస్ధ ఏర్పాటు చెయ్యడం చూస్తే ప్రజల సమస్యల పట్లా, వారి అవసరాల పట్లా ఆయనకి ఉన్న ‘ఇన్సెన్సిబిలిటీ’ ని మాత్రమే సూచిస్తోంది.

15 thoughts on “కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు

 1. పేదవాడికి రోజుకు 28 రూపాయిలు సరిపోతాయని అంత గట్టిగా సిఫార్సు చేసే ఇలాంటి ఉన్నతాధికారులను ఓ పది రోజులపాటైనా అంత తక్కువ మొత్తంతో బతికి బట్టకట్టమనాలి. అప్పడు తెలిసొస్తుంది. పోనీ వీళ్ళేమన్నా పొదుపుగా, నిరాడంబరంగా ఉంటారా అంటే అదీ లేదు. కాలు కదిపితే వేలూ లక్షలూ ఖర్చవ్వాల్సిందే.

  టాయిలెట్లలో ఖరీదైన పరికరాలేమిటీ… అవి చోరీ కాకుండా సీసీ కెమెరాలేమిటీ.. ! ఆ విలాసవంతమైన టాయిలెట్లలో స్మార్ట్ కార్డ్ హొల్డర్లకే – ఆఫీసర్లకే ప్రవేశం కదా.. మళ్ళీ వాళ్ళ మీద కూడా అనుమానం అన్నమాట!

  ప్రజాధనాన్ని విచక్షణ లేకుండా పనికిమాలిన, అహాన్ని మాత్రమే సంతృప్తి కలిగించే వాటికి వెచ్చిస్తూ ‘బడ్జెట్ పరిధిలో ఖర్చు పెట్టామ’ంటూ మళ్ళీ నిస్సిగ్గు సమర్థింపులొకటీ…

  నిరుపేదల పట్ల కనీస మానవత్వం చూపని ఇలాంటివాళ్ళు మహా మేధావులూ, ఆర్థిక వేత్తలూ, విధాన నిర్ణయాల్లో ప్రముఖ పాత్రధారులూ!

 2. అదే మరి. ఆఫీసర్లే దొంగలన్నమాట. కనకనే అనుమానం. కోటి కోట్లు విదేశాలకి తరలించిందీ ఈ ప్రభుద్ధులే కదా.

  ఫిస్కల్ డెఫిసిట్ గురించి కూడా మాంటేక్ తరచూ ఆందోళన చెందుతూ పెట్రోల్, గ్యాస్, పనికి ఆహార పధకం లాంటి సబ్సిడీలని తగ్గించాలని చెబుతుంటాడు. అలాంటి వ్యక్తి ఇలా…?!

 3. ఈ వివరాలు తెలుసుకుని గుండెలు బాదుకోవడమేనా లేక ఏదైనా చర్య తీసుకోగలమా. కేవలము గుండెలు బాదుకోవడానికి అయితే సమాచార హక్కు చట్టం ఎందుకు ?

 4. మా అమ్మమ్మ గారి ఊరు అయిన వండువ గ్రామంలో యాభై టివిలు ఉన్నాయి కానీ ఆ గ్రామంలో ఐదు లెట్రిన్‌లు మాత్రమే ఉన్నాయి. అది మైదాన ప్రాంత గ్రామమే. గిరిజన గ్రామాలలో అయితే అసలు లెట్రిన్‌లే ఉండవు. మన దేశంలో బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌ల కోసం లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారంటే చాలా మంది పల్లెటూరివాళ్ళు నమ్మలేకపోవచ్చు.

 5. ఆఫీసర్లు దొంగలే కానీ, వాళ్ళమీద వాళ్ళే నిఘా పెట్టుకోరు కదా? టాయిలెట్లను ఎంత విలాసవంతంగా కట్టినా వాటిని రోజూ శుభ్రపరచాల్సింది శ్రామికులే కదా! ఆ కష్టజీవుల మీదే ఆ అనుమానం అనుకుంటాను!

  అసలు టాయిలెట్లలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టాల్సినంత విలువైన పరికరాలేం ఉంటాయో మాత్రం బోధపడటం లేదు!

 6. వేణు గారు ఇక్కడ ఆఫీసర్లంటె బ్యూరోక్రట్ ఆఫీసర్లని నా ఉద్దేశ్యం. శుభ్రం చెయ్యాల్సింది శ్రామికులే అయినా అక్కడి వస్తువులు తీసుకెళ్లేంత సౌకర్యం వారికి ఉండదు. వారిని తనిఖీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. తనిఖీ చేయలేనిది పెద్దవారినే. కనుక వారికే ఆ వీలూ, సౌకర్యం ఉంటాయి.

  బహుశా, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలేమన్నా ఉంటాయేమో. అలాంటి పరికరాలను చూసే అవకాశం మన బోటివారికి దక్కుతుందా? దక్కకపోవడమే మేలు.

 7. రాజశేఖర్ గారు, గుండెలు మనవే కనుక కనీసం బాదుకునే అవకాశమైనా దక్కింది. చర్యలంటారా, ఇప్పటికైతె (ఆర్.టి.ఐ చట్టం ద్వారా) తెలుసుకోవడమే పెద్ద చర్య. ఆర్.టి.ఐ కార్యకర్తలని రాజకీయ నాయకులు, మాఫియాలు చంపేస్తున్న వార్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అందువల్ల ఆ చట్టాన్ని ఉపయోగించడమే పెద్ద సాహసం అన్నట్లే. ఆ చట్టం వల్ల ఎదురవుతున్న అసౌకర్యానికే బెంగపడిన ప్రభుత్వం దానికి చాలా సవరణలు కూడా తెచ్చేసింది. ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన చట్టాలను ఉపయోగించుకోవాలన్నా బోలెడు అడ్డంకులు.

 8. ప్రవీణ్ గారూ, లెట్రిన్ లకి లక్షలు ఖర్చు పెడతారని తెలిస్తె పల్లె ప్రజలు నమ్మకపోవడం అటుంచి గుండె ఆగి పోయినా పోతారు. చెంబు నీళ్లతో అయ్యే పనికి లక్షల ఖర్చంటే వారి గుండె భరిస్తుందా?

 9. ఇంకో దారుణం ఏంటంటే.. ఈ ప్రబుద్ధుడు(మాంటేక్ సింగ్) చేసే దిక్కుమాలిన పనులకి వీడికి ‘పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు.

 10. గాలి జనార్ధన రెడ్డి ఉపయోగించే టాయ్‌లెట్ సీట్ టివిలో చూశాను. అది బంగారాంతో తయారు చేసిన టాయ్‌లెట్ సీట్. మాంటెక్ సింగ్ గాలి జనార్ధనరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నాడు కదా.

 11. okka toilest ke intha ante, migatha infrastructure ki entha karchu chesi untaro mana prabuddhulu. bayata prapanchaniki tappuga cheppaliga, india veligipotundani?..andukenemo ee gola anthanu

 12. టాయ్‌లెట్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే మహిళా ఉద్యోగులు స్నానం చేస్తుండగా రికార్డ్ చేసి, సిసి కెమెరా ఆపరేటర్ ఆమెని బ్లాక్‌మెయిల్ చెయ్యడని గ్యారంటీ లేదు. సిసి కెమెరాలు పెడితే దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న బస్ స్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లలో, బ్యాంక్‌లలో పెట్టాలి.

 13. మన్మోహన్ సింగ్ ఇచ్చిన డిన్నర్ పార్టీలో ఒక ప్లేట్ ఖర్చు అక్షరాలా ఎనిమిది వేల రూపాయలట! రాయగడ లాంటి చిన్న పట్టణాలలో ఒక లాయర్‌కి ఎనిమిది వేల రూపాయలు ఇస్తే అతను మన కోసం ఒక సివిల్ కేస్ గెలిపించేస్తాడు. అవి కూడా లేకే కదా చాలా మంది పేదవాళ్ళు న్యాయం కోసం కోర్ట్ చుట్టూ తిరగలేక న్యాయం వదులుకుంటున్నారు. రాయగడ లాంటి పట్టణాలలో ఎనిమిది వేల రూపాయలు జేబులో పెట్టుకుని తిరగగలిగితే రాజాలాగ బతికెయ్యొచ్చు. కానీ మన్మోహన్ సింగ్ లాంటి ఢిల్లీ రాజాలకి ఎనిమిది వేల రూపాయలు ప్లేట్‌లు, చెప్పులూ, టాయ్‌లెట్ సోప్‌లూ కొనుక్కోవడానికి కూడా సరిపోవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s