అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పసిఫిక్’ విధానంలో చైనాతో మిలట్రీ పోటీకి ఇండియాను నిలపడం పట్ల భారత రక్షణ మంత్రి అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆసియా పై అమెరికా కేంద్రీకరణ పెరగడం వల్ల పొరుగున ఉన్న సముద్రాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయుధ పోటీ పెరుగుతుందని ఇండియా భావిస్తున్నట్లు భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా తన విధానాన్ని పునరాలోచించాలనీ, పునర్మూల్యాంకనం చేసుకోవాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకు భారత్ సూచించిందని అధికారులు తెలిపారు.
‘ఆసియా-పసిఫిక్ కేంద్రంగా మిలట్రీ వ్యూహ పునఃతుల్యత’ (Rebalancing of Military Strategy with focus on Asia-Pacific) పేరుతో అమెరికా కొత్త విధానాన్ని ఇటీవల ప్రకటించింది. దీని ప్రకారం అమెరికా తన జల బలగంలో ప్రధాన భాగాన్ని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కేంద్రీకరించడానికి నిర్ణయించింది. తన నేవల్ ఫోర్స్ లో 60 శాతం ఇక్కడికి తరలించాలని నిర్ణయించింది.
పరిమాణంలో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ని అధిగమించి ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవించిన చైనా, భారీ విదేశీ మారక ద్రవ్య నిల్వలతో, వాణిజ్య మిగులుతో అమెరికా, యూరప్ లకు అసూయగా మారింది. షాంఘై కోపరేషన్ కౌన్సిల్ (ఎస్.సి.ఒ) ద్వారా, ప్రాధమిక స్ధాయిలోనే ఉన్నప్పటికీ, మిలట్రీ వ్యూహాన్ని కూడా సమకూర్చుకుంటున్న పరిస్ధితి చైనాకి ఉంది. ఈ నేపధ్యంలో చైనాని నిలువరించడం అమెరికాకి ఒక కర్తవ్యంగా ముందుకు వచ్చింది. సైనికంగా ఇప్పటికే చైనాని చుట్టు ముట్టిన అమెరికా, ఇండియాను కూడా తమ చైనా వ్యతిరేక వ్యాహంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా ఆసియా-పసిఫిక్ విధానాన్ని ప్రకటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత దేశ వెస్ట్రన్ సీ బోర్డ్, అరేబియా సముద్రం లలో అత్యధిక సంఖ్యలో యుద్ధ నౌకలు ఉన్నాయని ఎన్.డి.టి.వి తెలిపింది. ఇరాన్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, చైనా, ఇండియా లకు చెందిన యుద్ధ నౌకలు భారత పశ్చిమ తీరానికి ఆవల నియుక్తమై ఉన్నాయి. చైనా ఇప్పటికే తన ‘ఈస్ట్రన్ సీ బోర్డ్’ లో భాగంగా మియాన్మార్ లోని ‘హాంగ్యీ’ రేవు కేంద్రంగా యుద్ధ నౌకలను కేంద్రీకరించింది. చిట్టగాంగ్ పోర్ట్ లో అమెరికా హక్కులు సంపాదించింది. మరో పక్క అండమాన్ నికోబార్ దీవులలో ఇండియా పెద్ద ఎత్తున నౌకా బలగాలను కేంద్రీకరించి ఉంచింది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో అమెరికా కేంద్రీకరణ పెరిగితే మరిన్ని అమెరికా యుద్ధ నౌకలను ఇక్కడికి తరలిస్తుంది. దానివల్ల ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన సమతుల్యత దెబ్బ తిని అనివార్యంగా ఆయుధ పోటీకి దారి తీస్తుందన్నది ఇండియా అభిప్రాయం. అది నిజం కూడా.
‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతం పై అమెరికా ప్రకటించిన విధానం పట్ల ఇండియాకి ఏకీభావం లేనట్లు తెలుస్తోంది. అమెరికా జోక్యందారీ మిలట్రీ వ్యూహం వల్ల సార్వభౌమాధికార ఘర్షణలకు నిలయంగా మారిన దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాలతో సాంగత్యానికే ఇండియా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దక్షిణ చైనా సముద్రం లో ఏర్పడిన సమస్యలకు పరిష్కారం వెతికేటప్పుడు ఆ రెండు దేశాలతో పాటు ఇతర స్ధానిక దేశాలు మాత్రమే రంగంలో ఉండాలని ఇండియా కోరుతోంది. దేశాల మధ్య సంబంధాలను ‘కొనుగోలు-అమ్మకం’ లకు అతీతంగా చూడాలని లియోన్ పెనెట్టాతో గంట పాటు జరిపిన సమావేశంలో భారత రక్షణ మంత్రి ఆంటోని చెప్పినట్లు రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా కేవలం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడం వరకే పరిమితమై, తద్వారా స్ధానికంగా దేశీయ సామర్ధ్యాలను పెంచే వైపుగా దృఢమైన భాగస్వామ్యం అందించాలని ఇండియా కోరుతోంది. అమెరికా నుండి అత్యంత తేలిక పాటి హోవిట్జర్ లనూ, ‘అటాక్ హెలికాప్టర్’ లనూ ఇండియా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలాంటి పప్పులను అమెరికా ఎక్కడ ఉడకనివ్వదు. తనకు ప్రయోజనం లేకుండా, తన మాట వినకుండా తన టెక్నాలజీ ని మాత్రమే బదిలీ చేసి ఊరుకోవడం అమెరికాకి అసాధ్యమైన విషయం. ‘సాంకేతిక పరిజ్ఞానం బదిలీ’ అంటూ సొల్లు కబుర్లు చెప్పి ఫైనాన్స్ మాత్రమే ఎగుమతి చేసి వనరులనూ, సంపదలనూ కొల్లగొట్టుకుపోయే అమెరికా సామ్రాజ్యవాదులు ఇండియా పాలకుల నీటి నీతులకు లోంగే రకం కాదు. తన టెక్నాలజీ ని సరఫరా చేసి స్ధానికంగా దేశీయ పెట్టుబడిదారీ కంపెనీలు అభివృద్ధి అవుతుంటే చూసి తట్టుకునే ఔదార్యం, ప్రేమ, స్నేహ బుద్ధీ అమెరికాకి లేవని రెండు ప్రపంచ యుద్ధాలు, అనేకానేక దురాక్రమణ యుద్ధాలు రుజువు చేయలేదా? ఆ విధంగా అణు సాంకేతిక పరిజ్ఞానంలో దేశీయ సామర్ధ్యం పెరుగుతుందన్న దుగ్ధతోనే గదా ఇన్నాళ్లూ ఇండియాని అణు రంగంలో ఏకాకి ని చేసి వేధించింది! దేశీయ సామర్ధ్యం పెంచుకుంటుందేమో అన్న భయంతోనే కదా ఇరాన్ పై అనేక కట్టు కధలు, అబద్ధాలు ప్రచారం చేసి ఇరాన్ పై సాయుధ దురాక్రమణ దాడులకు అమెరికా, యూరప్ లు ఉద్యుక్తులవుతున్నది!
ఇండియాని తన మిలట్రీ అవసరాలకు వాడుకోవడానికి అమెరికా కొన్ని ఒప్పందాలను సిద్ధం చేసింది. వాటిని ఆమోదించాలని చాలా కాలంగా ఇండియాపై ఒత్తిడి తెస్తోంది. ఎల్.ఎస్.ఎ (Logistic Supply Agreement), సి.ఐ.ఎస్.ఎం.ఒ.ఎ (Communications Interoperability and Security Memorandum of Agreement), బి.ఇ.సి.ఎ (Basic Exchange and Cooperation Agreement) ఆ కోవలోనివే. ఎల్.ఎస్.ఎ ని ఆమోదిస్తే అమెరికా నౌకా బలగాలకూ, సైనిక బలగాలకూ ఇండియా అనేక రకాల వసతులు కల్పించవలసి ఉంటుంది. సిస్మోవా ఒప్పందం ఆమోదిస్తే భారత దేశ రక్షణకు అత్యంత కీలకమైన ‘కమ్యూనికేషన్ కోడ్’ ల రహస్యాలను అమెరికాతో తప్పనిసరిగా పంచుకోవలసి ఉంటుంది. ఈ ఒప్పందాలను ఆమోదించేది లేదని ఇంతవరకూ భారత్ చెప్పలేదు. ఒప్పంద పాఠాలను అధ్యయనం చేస్తున్నామని, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదనీ మాత్రమే చెబుతూ వస్తోంది. దానర్ధం ఈ ఒప్పందాలను ఖచ్చితంగా తిరస్కరించేదుకు భారత పాలకులు సిద్ధంగా లేరని కూడా. ‘ఆసియా-పసిఫిక్’ విధానాన్ని అమెరికా ప్రకటించిన నేపధ్యంలో ఈ ద్వైదీ భావాన్నీ, గోడ మీద పిల్లి ధోరణినీ భారత పాలకులు విడిచిపెట్టవలసిన అవసరం, అమెరికా జోక్యదారీ విధానాలను తిరస్కరించవలసిన అవసరం బాగా కనిపిస్తోంది.
ఇంకా నయం, మూత్రం పొయ్యడానికి అమెరికా అనుమతి అడగలేదు.