‘ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి’ అన్నదెవరు?


Ahmadi“ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచెయ్యాలి” అన్నాడని ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ పైన పశ్చిమ దేశాల పత్రికలు, ఇజ్రాయెల్ తరచూ విషం కక్కుతుంటాయి. ఆయన ఎన్నడూ అనని మాటల్ని ఆయన నోటిలో కుక్కి అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు లాంటి దేశాలు ఇరాన్ పైన చేసే ఆధిపత్య దుర్మార్గాలకు చట్ట బద్ధతని అంటగట్టడానికి అవి నిత్యం ప్రయత్నిస్తుంటాయి. కెనడాకు చెందిన ప్రఖ్యాత పోలిటికల్ ఎకనమిస్టు ‘మైఖేల్ చోసుడోవ్ స్కీ’ ఇటీవల రాసిన పుస్తకం (Towards A Global War III Scenario: The Dangers of Nuclear War) లో అహ్మది నెజాద్ ప్రకటనకు సంబంధించిన అసలు నిజాన్ని వెల్లడి చేశాడు.

అక్టోబర్ 27, 2005 తేదీన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మొట్ట మొదట ఈ అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రిక తన వార్తా కధనంలో ఇలా తెలిపింది. 

TEHRAN — Iran’s conservative new president, Mahmoud Ahmadinejad, said Wednesday that Israel must be ‘wiped off the map’ and that attacks by Palestinians would destroy it, the ISNA press agency reported.

‘పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచేయ్యాలి’ అని ఇరాన్ నూతన అధ్యక్షుడు అహ్మది నెజాద్ అన్నాడని పై ప్రకటన చెబుతోంది. పాలస్తీనీయులు చేసే దాడులు ఇజ్రాయెల్ ని నాశనం చేస్తాయని ఇస్నా ఏజన్సీ చెప్పినట్లు కూడా ఈ ప్రకటన చెబుతోంది.

అసలు వాస్తవం ఏమిటి?

‘యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా’ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మైఖేల్ చోసుడోవ్ స్కీ వాస్తవం ఏమిటో వెల్లడించాడు. ఆయన వెల్లడి చేసిన సమాచారం ప్రకారం అక్టోబరు 25, 2005 తేదీన అహ్మది నెజాద్ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ (లేదా ఇస్నా) తన అబద్ధాన్ని సృస్టించింది. నిజానికి అహ్మది నెజాద్ తన ప్రసంగంలో ఇరాన్ సుప్రీం లీడర్ ‘అయతుల్లా ఖోమైనీ’ మాటలని ఉటంకించాడు. ఖోమైనీ మాటల సారాంశం ‘పటం నుండి ఇజ్రాయెల్ ని తుడిచి పెట్టడం’ కాదు. ఇజ్రాయెల్ రెజిమ్ (పాలన లేదా హయాం) ని మార్చాలన్నదే ఆయన మాటల అంతరార్ధం.

“ఇరాన్ రాజ్యాధిపతిని అపఖ్యాతి పాలు చేసి ఇరాన్ పైన సంపూర్ణ యుద్ధం ప్రకటించేందుకు సక్రమతను సమకూర్చుకోవడానికి అమెరికన్ మీడియా ఈ పుకారును తయారు చేసింది” అని మైఖేల్ చోసుడోవ్ స్కీ తన పుస్తకంలో వ్యాఖ్యానించాడని ‘గ్లోబల్ రీసర్చ్’ వెబ్ సైట్ తెలిపింది. అసలు అహ్మది నెజాద్ వాస్తవంగా ఏమన్నాడు? ఆయన ఫార్సీ బాషలో అన్నది ఇది.

“Imam ghoft een rezhim-e ishghalgar-e qods bayad az safheh-ye ruzgar mahv shavad.”

ఇందులో rezhim-e అంటే ఆంగ్లంలో ‘రెజిం’ అని అర్ధం. ఈ వాక్యంలో అసలు ఇజ్రాయెల్ అన్న పదమే లేదు. ఆయన స్పష్టంగా వాడిన పదబంధం ‘rezhim-e ishghalgar-e qods’. దీని అర్ధం ఆంగ్లంలో “the regime occupying Jerusalem.” తెలుగులో “జెరూసలేం ను ఆక్రమించిన పాలనా వ్యవస్ధ” అని అర్ధం. తెలుగులో మాట్లాడుతున్నపుడు అనేక ఆంగ్ల పదాలు వాడుతున్నట్లే పార్శీ భాషా శబ్ధం ‘eh’ ని జత చేస్తూ ఆంగ్ల పదాన్ని అహ్మదినెజాద్ ఉచ్చరించాడు. ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని గానీ, ఇజ్రాయెల్ భూభాగాన్ని గానీ ఉద్దేశిస్తూ ఒక్క పదం కూడా అనలేదు.

అయితే అహ్మది నెజాద్ గానీ లేదా ఖోమైనీ గానీ తుడిచి పెట్టాలని దేనిని ఉద్దేశిస్తూ అన్నట్లు? “దేనినీ కాదు” అన్నదే సమాధానం ఎందుకంటే “map” అన్న పదాన్ని ఏ బాషలోనూ అహ్మది వాడలేదు గనక. ‘map’ అనే పధానికి పర్షియన్ పదం ‘nagsheh’. అహ్మది నెజాద్ ప్రకటనలో ఈ పదమే లేకపోవడాన్ని గమనించవచ్చు. ఆ మాటకొస్తే అహ్మది నెజాద్ ప్రసంగా పాఠం మొత్తం లోనూ ‘map’ అని అర్ధం వచ్చే పదం గానీ అర్ధం గానీ లేదని మైఖేల్ తెలిపాడు. కనుక ఇరాన్ పాలస్తీనీయుల ద్వారా తుడిచి పెట్టదలుచుకున్నదీ తుడిచిపెట్టదలుచుకున్నది నిజానికి ఏమీ లేదు. పాలన వ్యవస్ధను లేదా రెజిం ను map నుండి తుడిచి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇజ్రాయెల్ పేరు కూడా ఎత్తని అహ్మది నోట అమెరికన్ మీడియా కుట్ర బుద్ధితో తనకు అవసరమైన పదాల్ని కుక్కింది.

అసలు అర్ధం ఏమిటి?

అహ్మది నెజాద్ ప్రసంగ భాగాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే ఇలా ఉంటుందని మైఖేల్ చోసుడోవ్ స్కీ తన పుస్తకంలో తెలిపాడు.

“The Imam said this regime occupying Jerusalem must vanish from the page of time”.

  Word by word translation:

    Imam (Khomeini) ghoft (said) een (this) rezhim-e (regime) ishghalgar-e (occupying) qods (Jerusalem) bayad (must) az safheh-ye ruzgar (from page of time) mahv shavad (vanish from).

“టైమ్ అనే పేజీ నుండి ఈ ‘జెరూసలేం ను ఆక్రమించిన రెజిం’ అదృశ్యం కావాలి” అని దీనర్ధం.

అహ్మది నెజాద్ ప్రకటనకు ప్రధాన అర్ధం ఇజ్రాయెల్ లో పాలన వ్యవస్ధ మారిపోవాలన్నదే తప్ప ఇజ్రాయెల్ నే మొత్తంగా తుడిచిపెట్టడం కాదు. ఈ సందర్భంగా అమెరికా మాజీ డెప్యుటీ డిఫెన్స్ సెక్రటరీ పాల్ వోల్ఫ్ విడ్జ్ ప్రకటనని మైఖేల్ గుర్తు చేశాడు. “end states that sponsor terrorism” అని పాల్ పిలుపిచ్చాడు. దానర్ధం ఏకంగా states లేదా రాజ్యాలనే నాశనం చేయాలని చెప్పడమే. పాల్, అహ్మది నెజాద్ ప్రకటనలని పోల్చి చూస్తే రాజ్యాల వినాశనాన్ని ఎవరు కోరుకుంటున్నారో స్పష్టం అవుతోంది.

ఇరాన్ కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని, గుర్తుకొచ్చినప్పుడల్లా అమెరికా ప్రకటిస్తోంది. బాంబు దాడులు, యుద్ధం తో సహా అన్ని ఆప్షన్సూ టేబుల్ పై ఉన్నాయని ఒబామా స్పష్టంగా ప్రకటించాడు. ఇజ్రాయెల్ ప్రకటనలకు లెక్కే లేదు. వీటన్నిటికీ ఒకే ఒక్క సాకు ఇరాన్ వద్ద లేని ‘అణు బాంబు.’ లేని దాన్ని ఉందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇరాన్ పై దాడికి అమెరికా-యూరప్-ఇజ్రాయెల్ ల కూటమి అనేక సంవత్సరాలుగా వాదనను నిర్మించుకుంటూ వచ్చాయి.

ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని మరింతగా చిలవలు పలవలుగా వ్యాప్తి చేయడంలో పశ్చిమ దేశాల పత్రికలు గోబెల్ ను ఎన్నడో మించిపోయాయి. ఈ పత్రికల అబద్ధాల్ని పట్టుకుని పశ్చిమ దేశాల పాలకులు ఇరాన్ పై చేసిన బెదిరింపులకు లెక్కే లేదు. జార్జి బుష్ నుండి జూనియర్ అధికారుల వరకూ పదే పదే ఈ అబద్ధాన్ని చెబుతూ తమ వికృత స్వభావాల్ని బైట పెట్టుకున్నారు. మాప్ నుండి ఇజ్రాయెల్ ను తుడిచెయ్యాలని అహ్మది నెజాద్ అన్నాడని టైమ్స్ రాస్తే దానికి అనేక పదాల్ని జోడించి, స్వేచ్ఛగా కొత్త కొత్త అర్ధాల్ని తీసుకురావడం ఇనాళ్లూ సాగుతూ వచ్చింది. కొందరు map ని తీసేసి “wipe Israel off the face of the earth” అన్నాడని చెబుతున్నారు. వార్తా సంస్ధలు, మ్యాగజైన్లు అదేదో తమ డ్యూటీ అయినట్లే Ahmadinejad has “called for the destruction of Israel” అంటూ రాస్తున్నాయి. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. అమెరికా తదితర పశ్చిమ దేశాల కంపెనీలను దేశంలోకి రానీయని ఇరాన్ పైన ఏకపక్ష దాడి చేయడానికి తగిన legitimacy ని తయారు చేసుకోవడమే.

ఇరాన్ పై చేసే దాడి ఒక్క ఇరాన్ పైనే కాదు. అది స్వేచ్ఛనీ, ప్రజాస్వామ్యాన్నీ, గౌరవ ప్రదమైన జీవితాన్నీ కాంక్షించే ప్రతి ప్రపంచ పౌరుడి పైనా చేసే దాడి. ఎందుకంటే అమెరికా, యూరప్ ల ప్రపంచాధిపత్యాన్ని కొద్దో గొప్పో తిరస్కరిస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇతర దేశాలన్నీ పశ్చిమ దేశాల ముందు సాగిలపడగా ఇరాన్, సిరియా, గడ్డాఫీ నేతృత్వంలోని లిబియా, క్యూబా, బొలీవియా, వెనిజులా లాంటి కొన్ని దేశాలు మాత్రమే వాటిని ధిక్కరిస్తున్నాయి. వివిధ సాకులతో వీటిలో ఒక్కో దేశాన్ని కబళించడానికి అమెరికా, యూరప్ లు వేసుకున్న పధకంలో భాగమే ఇరాన్ పైనా, ఆ దేశ పాలకులపైనా చేస్తున్న దుష్ప్రచారం. సామ్రాజ్యవాద దేశాల ప్రపంచాధిపత్య ఎత్తుగడలను కొద్ది స్ధాయిలోనైనా ప్రతిఘటిస్తున్న ప్రాంతాలు, దేశాలు లేనట్లయితే ప్రపంచ పీడిత ప్రజలు మరింత దోపిడీ పీడనలకు గురి కావడమే మిగులుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s