పాక్ లో ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన అమెరికా రాయబారులు


US deplomats' arrestపాకిస్తాన్ పట్టణం పెషావర్ లో ఆయుధాలు అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు అమెరికా రాయబారులు సోమవారం పట్టుబడినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. పెషావర్ మోటార్ వే టోల్ ప్లాజా వద్ద రొటీన్ చెకింగ్ లో వీరు పట్టుబడ్డారు. ముగ్గురు అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీలో నాలుగు అస్సాల్ట్ రైఫిళ్ళు + 36 మ్యాగజైన్లు, మరో నాలుగు పిస్టళ్లు + 30 మ్యాగజైన్లు దొరికాయని పోలీసులను ఉటంకిస్తూ డాన్ తెలిపింది.

టోల్ ప్లాజా వద్ద అనుమానంగా కనపడిన కార్లను తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా అందులో ఉన్న అమెరికా రాయబారులు ఒప్పుకోలేదని, అయినప్పటికీ పోలీసులు తనిఖీ చేశారనీ ప్రెస్ టి.వి తెలిపింది.

అమెరికా కాన్సల్ జనరల్ మేరీ రిచర్డ్ పోలీసు స్టేషన్ కు వచ్చి అమెరికా రాయబారులను విడుదల చేయాలని కోరగా పోలీసులు నిరాకరించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఉంచుకుని అమెరికన్లను విడుదల చేయాలని రిచర్డ్ అతి తెలివి ప్రదర్శించినా ఫలవంతం కాలేదని తెలుస్తోంది. సంఘటనపై అభిప్రాయం కోరగా రిచర్డ్ చెప్పడానికి తిరస్కరించిందని డాన్ పత్రిక తెలిపింది.

అయితే బ్రిటన్ పత్రిక రాయిటర్స్ తో మాత్రం సంబంధం లేని వివరణ ఇచ్చింది. మలకండ్ యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి వస్తుండగా రాయబారులు అరెస్టయ్యారని రిచర్డ్ రాయిటర్స్ కి తెలిపింది. పేద పిల్లలకు ఇంగ్లీషు భాషా నేర్పే అంశాన్ని చర్చించడానికి వారు వెళ్ళి వస్తున్నారని అన్నీ అనుమతులు ఉన్నా అరెస్టు చేశారనీ తెలిపింది.

అయితే సంఘటన జరిగిన ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విదేశీ రాయబారులు ఆయుధాలతో సంచరించడం నిషేధం అని డాన్ తెలిపింది. రాష్ట్రంలో నిషేధించబడిన ప్రాంతాలకు విదేశీ రాయబారులు వెళ్ళడం కూడా నిషేధమే. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని ఆయుధాలు కలిగి ఉండవచ్చు. అమెరికన్ల వద్ద ఏ అనుమతీ లేకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. రాయబారులతో పాటు ముగ్గురు పాక్ డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జనవరి 2011 లో రేమండ్ డేవిస్ అనే సి.ఐ.ఏ గూఢచారి లాహోర్ లో ఇద్దరు పాక్ పౌరులను ఒట్టి పుణ్యానికి కాల్చి చంపాక పాకిస్ధాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా రాయబారులు, గూఢచారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ఘటన జరిగాక పాకిస్ధాన్ లో అమెరికన్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. పాకిస్ధాన్ లో వివిధ పట్టణాలలో నివాస గృహాల మధ్య ఉంటున్న అనేక మంది సి.ఐ.ఏ గూఢచారుల వ్యవహారం ఈ సందర్భంగా బైటికి వచ్చింది. ప్రజల ఆగ్రహంతో పాక్ ప్రభుత్వం 150 మందికి పైగా సి.ఐ.ఏ గూఢచారులను దేశం నుండి బహిష్కరించింది. అయినప్పటికీ ఇంకా అనేక మంది పాక్ లో కొనసాగుతున్నారని ప్రెస్ టి.వి తెలిపింది.

పాక్ పౌరులను చంపిన డేవిస్ ను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ బాధిత కుటుంబాలకు 2.4 మిలియన్ డాలర్లు చెల్లించి అమెరికా, డేవిస్ ని తప్పించింది. పాక్ కోర్టు చేత గుట్టు చప్పుడు కాకుండా ‘క్షమాపణ’ పేరుతో ప్రభుత్వం విడుదల చేయించింది. ఈ నేపధ్యంలో పాకిస్ధాన్ లో అమెరికన్ల ఉనికి ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సమస్యగా పరిణమించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s