ఫాలక్, అఫ్రీన్… నేడు షిరీన్


Baby Shireenమనుషుల్లో మృగత్వానికి అంతే లేకుండా పోతోంది. భర్త చేత విస్మరించబడి, మరో తోడు కోసం ఆశపడి వ్యభిచార కూపంలో చిక్కిన తల్లికి తనయగా పుట్టిన ఫాలక్, పురుషాధిక్య సమాజం క్రూరత్వానికి బలై రెండేళ్ల వయసులోనే కాటికి చేరి రెండు నెలలయింది. తండ్రికి అవసరం లేని ఆడపిల్లగా పుట్టి తండ్రి చేతుల్లో చిత్ర హింస అనుభవించిన మూడు నెలల అఫ్రీన్ మరణం ఇంకా మరుపులో జారిపోనేలేదు. మరో ఫాలక్, షిరీన్ పేరుతో ఇండోర్ ఆసుపత్రిలో చేరింది.

షిరీన్ వయసు పద్దెనిమిది నెలలు. ఆ పాప శరీరంపై, దాదాపు అన్ని భాగాలపైనా, సిగరెట్ తో కాల్చిన గాయాలు 11 ఉన్నాయని ఆసుపత్రి అధికారులు చెప్పారు. పాప రెండు చేతులూ ఫ్రాక్చర్ కి గురై ఉన్నాయి. ఒక చోట కాదు, అనేక చోట్ల. కొన్ని వారాల నుండి పాప హింసకు గురవుతోందని పాప తల్లి జరినా ద్వారా తెలుస్తోంది.

ఎన్.డి.టి.వి సమాచారం అనుసరించి జరీనాను ఆమె భర్త పట్టించుకోవడం మానేశాడు. పచ్చిగా చెప్పాలంటే ‘వదిలేశాడు’. ఫలితంగా ఆమె మరో తోడు కోసం వెతుక్కుంది. వహీద్ అనే వ్యక్తి ఆమెను ఆకర్షించాడు. బాగా చూసుకుంటానని మాటిచ్చాడు. అతనితో ఆజ్మీర్ వచ్చేశాక నిజ స్వరూపం చూపాడు. బలవంతంగా వ్యభిచార కూపంలో దింపాడు. ఆమె భర్త వల్ల పుట్టిన ముగ్గురు పిల్లలు అడ్డుగా భావించాడేమో వారినీ హింసించడం మొదలు పెట్టాడు.  అతన్నుండి ఎలాగో తప్పించుకున్న జరీనా ఇండోర్ తిరిగి వచ్చి తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చింది.

వహీద్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.

రెండేళ్ల ఫాలక్ ఉదంతం భారత దేశ సామాజిక వ్యవస్ధ ఓటితనాన్ని విప్పి చూపింది. పురుషాధిక్య సమాజం స్త్రీల పట్లా, ఆడ పిల్లల పట్లా ఎంత పశుత్వంతో వ్యవహరించగలదో వెల్లడి చేసింది. ఫాలక్ తల్లి మున్నీ (బీహార్) జరీనా లాగే భర్త నిరాదరణకి గురయిందని మొదట పత్రికలు తెలిపాయి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడిని పోషించే దారి దొరక్క సతమమతమవుతుండగా ఆమెను అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠా ఆకర్షించిందనీ, వ్యభిచారం చేసి బతకొచ్చని ఆశ చూపిందనీ మున్నీ లొంగలేదనీ తెలిపాయి. పెళ్లి చేస్తామని చెప్పి రెండు లక్షలు పుచ్చుకుని రాజస్ధాన్ పెళ్లికొడుక్కి అమ్మేశారని తెలిపాయి. పెళ్లి కొడుక్కి ఆమె అవివాహిత అని అబద్ధం చెప్పిన ముఠా పెళ్లయ్యాక మెల్లగా చెప్పవచ్చని చెప్పి మున్నీ నుండి ఆమె బిడ్డలను వేరు చేశారనీ, ఆ తర్వాత మున్నీ రాజస్ధాన్ లోనే మరో వ్యభిచార కొంపకు చేరుకుందనీ పత్రికలు రాశాయి.

ఫాలక్ తో పాటు, ఆమె 5 సంవత్సరాల అక్క ఢిల్లీ వ్యభిచార ముఠా విష వలయంలో చిక్కుకున్నారు. ఫాలక్, వ్యభిచార ముఠాలో ముగ్గురు స్త్రీల చేతులు మారి 14 ఏళ్ల బాలిక మహి చేతికి చేరింది. మహి అప్పటికే తండ్రి నిరాదరణకి గురై వ్యభిచార ముఠా సభ్యుడైన ముంబై యువకుడు రాజ్ కుమార్ ద్వారా వ్యభిచారంలో చిక్కుకుని ఉంది. తోడు ఉంటాడని భావించిన రాజ్ కుమార్ ముంబైకి చెక్కేయడంతో మహి నిస్పృహతో ఫాలక్ ను బాధ పెట్టింది. రాజ్ కుమార్ చేతిలోనూ ఫాలక్ హింసకు గురయింది. మెదడులో రక్తస్రావంతో, అనేక చోట్ల విరిగిపోయిన చేతులతో, చిట్లి పోయిన కపాలంతో, ఒంటి నిండా కొరికిన గాయాలతో ఢిల్లీ ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో చేరిన ఫాలక్ 58 రోజులు మృత్యువుతో పోరాడి మార్చి 16 న గుండే నొప్పితో చనిపోయింది.

Sha Hussain, F of Falakఅయితే ఫాలక్ మరణించే లోపే ఫిబ్రవరి రెండో వారంలో రాజ్ కుమార్ ని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం వెల్లడయింది. మున్ని అసలు పేరు, ‘ఫిజాన్ ఖాటూన్.’ ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కూతురు. ఆమెనూ, ఆమె ముగ్గురు పిల్లలనూ ఆమె భర్త ‘షా హుస్సేన్’ (పక్క ఫోటో) స్వయంగా వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. మున్నీని నమ్మించి వ్యభిచార ముఠాకి అప్పగించే లోపుగా వారు ముఠా చెప్పిన కబుర్లనే నిజంగా నమ్మి మున్నీ పోలీసులకు చెప్పింది. రాజ్ కుమార్ అరెస్టు అయ్యాక మాత్రమే మున్నీ భర్త అసలు దోషి అనీ, అతనే స్వయంగా భార్యా పిల్లను ఢిల్లీ మానవారణ్యం పాలు చేశాడనీ తెలిసొచ్చింది. బీహార్ ముజఫర్ పూర్ జిల్లా, మరిపూర్ నివాసులయిన మున్నీ తల్లి దండ్రులు ఈ సంగతి ధృవీకరించారు కూడా. ఢిల్లీ పోలీసుల అద్భుత కృషి వల్ల ఫాలక్ ఆచూకిని ఆమె తల్లి కనుక్కోగలిగింది. కానీ సోదరి సోదరులనూ, తల్లినీ తిరిగి చేరక ముందే ఫాలక్ నూరేళ్లూ చాలించుకుంది.

నూరేళ్లూ తోడుంటానని సమాజం ముందు ఒట్టు వేసిన ఓ వ్యక్తి  భార్యను, పిల్లలను పసి ఫాలక్ తో సహా వ్యభిచార కొంపకి చేర్చాడు. ఇలాంటి నీతిమాలిన పురుష పుంగవులను వందల యేళ్ళపాటు సహిస్తూ వచ్చిన సమాజం ఏ నీతితో బతుకుతున్నట్లు? ఘనత వహించిన గణతంత్ర దేశపు రక్షణ వ్యవస్ధలు ఎక్కడ కునుకు తీస్తున్నట్లు?

అఫ్రీన్. కేవలం మూడు నెలల వయసు. కానీ ఆడ పిల్ల. తండ్రే కాలయముడై గొంతు నలుముతుండగా తల్లికి ఎందుకో మెలకువ వచ్చింది. పాప ముఖంపై దిండు ఉంటే కంగారు పడి చూస్తే కదలకుండా పడి ఉంది. భర్తను అడిగితే సమాధానం లేదు. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో, కొరికిన గాయాలతో ఉన్న అఫ్రీన్ ను ఆమె తల్లి రేష్మ బెంగుళూరు ఆసుపత్రిలో చేర్చింది. కోమాలోకి వెళ్ళిన అఫ్రీన్ అలా ఉండగానే గుండెపోటుతో చనిపోయింది. తానే అఫ్రీన్ కి ఆ గతి పట్టించానని పాప తండ్రి పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. అతను అప్పటికే ఒక భార్యను హింసించడంతో ఆమె తన దారి తాను చూసుకుంది. అతని చరిత్రను విచారించలేదో ఏమో రేష్మ తండ్రి కూతురి బతుకునూ, మానవరాలి బతుకునూ ఒక దుర్మార్గుడి చేతికి అప్పగించాడు. ఒక సినిమాలో సుహాసిని పాత్ర ఆవేదన ఇక్కడ జ్ఞప్తికి వస్తోంది. వయసు వచ్చిన ఆడపిల్లను బైటికి పంపేటప్పుడు పదేళ్ళ తమ్ముడినయినా తోడిచ్చి పంపే తల్లి దండ్రులు జీవితాంతం కూతురితో బతకవలసిన అల్లుడిని వెతికేతప్పుడు ఎందుకో త్వరగానే అలిసిపోతారని ఆ పాత్ర ఆక్రోశిస్తుంది. ఆమె ఆక్రోశం ఎంత నిజమో గ్యారంటీ లేని రేష్మ భవితవ్యమే సాక్షి. 

పద్దెనిమి నెలల షిరీన్ కి కూడా ఫాలక్, అఫ్రీన్ లు ఎదుర్కొన్న కష్టాలే ఎదుర్కొంది. అయితే షిరీన్ ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడం కొంతలో నయం. పాప రెండు చేతులో ఒక చోట కాకుండా ఎక్కువ చోట్ల ఫ్రాక్చర్ అయి ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మొత్తం పదకొండు చోట్ల సిగరెట్ తో కాల్చిన గాయాలు పాప ఒంటిపై ఉన్నాయి. మృగాలైనా ఇలాంటి పని తలపెడతాయా అన్నది అనుమానమే. బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకునే జంతువులను ఇలాంటి వారితో పోల్చడం వాటిని అవమానించడమే కావచ్చు. వ్యక్తిగత ప్రవర్తనలను సామాజిక పరిస్ధితులే నిర్దేశిస్తాయన్న నిజాన్ని అర్ధం చేసుకోనట్లయితే ఇలాంటి ఘటనల వెనుక ఉన్న సామాజిక దుర్మార్గాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s