ఇండియా, చైనా: తమలపాకుతో నువ్వొకటి, తలుపు చెక్కతో నేనొకటి


Yiwu 1దౌత్య రంగంలో ఇండియా, చైనాలు తలపడిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ‘తమలపాకుతో నేనొకటి’ అన్నట్లుగా ఇండియా ఒకటి చేస్తే, ‘తలుపు చెక్కతో నేనూ ఒకటి’ అని చైనా మరొకటి చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద కమోడిటీ వ్యాపార కేంద్రం అయిన ‘యివు’ కి ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఇండియా తన వ్యాపారులకు ‘ట్రావెల్ అడ్వైజరీ’ జారీ చేయగా, ఇండియా వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నందున అక్కడికి ప్రయాణం పెట్టుకునే ముందు పదిసార్లు ఆలోచించాలని చైనా ఏకంగా పౌరులకే ‘ట్రావెల్ అడ్వైజరీ’ జారీ చేసింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో చైనా ఎవరూ ఊహించని రీతిలో ‘ట్రావెల్ అడ్వైజరీ’ పోస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వెబ్ సైట్ కూడా దానిని అనుసరించింది. భారత ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని  పెంచినందుకు నిరసనగా దేశ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయనీ, రైల్వేలు, హై వే ప్రయాణాలు దీనివల్ల ఆగిపోయినట్లు భారత మీడియా ద్వారా తెలుస్తోందనీ కనుక ప్రయాణాల్లో ఆలస్యాలు జరగవచ్చనీ, వ్యక్తిగత భద్రత పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలనీ చైనా తన అడ్వైజరీలో కోరింది.

“భారత మీడియా రిపోర్టుల ప్రకారం ఇటీవల ఆయిల్ రేట్లు పెంచడం వల్ల ఇండియాలో అనేక చోట్ల నిరసనలు, సమ్మెలు జరుగుతున్నాయి. రైల్వే, హైవే ట్రాస్ పోర్ట్ లు ఆగిపోవడమో లేదా వివిధ స్ధాయిల్లో ప్రభావితం కావడమో జరిగింది. కొన్ని షాపులు మూసేశారు. ప్రస్తుతం ప్రభావితమైన ప్రాంతాలు: ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, బీహార్ లో పాట్నా, యు.పిలో అలహాబాద్ వారణాసి, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా మొ.వి. ఈ విషయమై ఇండియాలోని చైనా పౌరులను అప్రమత్తంగా ఉండాలని చైనా పౌరులను కోరుతున్నాం. ఆలస్యం జరగకుండా ఉండడానికి ఏజన్సీలతో ఏర్పాట్ల గురించి నిర్ధారించుకోండి. అదే సమయంలో, వ్యక్తిగత భద్రత గురించి, వ్యక్తిగత వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండండి” అని చైనా అడ్వైజరీ హెచ్చరించింది.

ఎన్.డి.టి.వి ప్రకారం చైనా అడ్వైజరీ భారత అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇండియాకి వ్యతిరేకంగా ఇలాంటి అడ్వైజరీలను చైనా విదేశాంగ శాఖ జారీ చేయడం చాలా అరుదుగా జరుగుతుందట. అదీ కాక జూన్ 6, 7 తేదీలలో చైనాలో జరగనున్న ‘షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్’ (ఎస్.సి.ఒ) సమావేశాలకు హాజరు కావడానికి ఇండియా విదేశీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ మంగళవారం బయలుదేరి వెళ్లనున్నాడు. యివు లో వ్యాపారం నిమిత్తం వెళ్ళే భారత వ్యాపారులను హెచ్చరిస్తూ ఇండియా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీ కి స్పందనగానే చైనా ఈ పని చేసి ఉండొచ్చని భారత అధికారుల అభిప్రాయం.

చైనాలోని ‘యివు’ పట్టణం ప్రపంచంలోనే అతి పెద్ద కమోడిటీ వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. కొద్ది నెలల క్రితం ముగ్గురు భారత వ్యాపారులు ఇక్కడ కిడ్నాప్ కి గురయ్యారు. సరుకులు తీసుకొని డబ్బు చెల్లించకపోవడంతో కిడ్నాప్ జరిగినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు వారాల క్రితమే ఒక వ్యాపారిని (డేనిష్ ఖురేషీ) విడుదల చేయించి ఇండియాకి వెళ్లడానికి చైనా అధికారులు సాయపడ్డారు. మరో ఇద్దరు వ్యాపారులు, శ్యామ్ సుందర్ అగ్రవాల్, దీపక్ రహేజా, లు చైనా వ్యాపారుల అక్రమ నిర్బంధం నుండి జనవరిలో విడుదల అయ్యారు. అయితే చైనా కోర్టుల్లో విచారణ వల్ల వారు షాంఘైలోనే ఉండిపోయారు. వీరి సంగతి ఎస్.ఎం.కృష్ణ చైనా వెళ్ళినపుడు చర్చిస్తాడని భావిస్తుండగా అడ్వైజరీ జారీ అయింది.

యివులో వందకు పైగా భారతీయ వ్యాపారులు ఉన్నారనీ, వీరు గత సంవత్సరం 2 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం చేశారని తెలుస్తోంది. భారత మార్కెట్ల కోసం వీరు పెద్ద ఎత్తున సరుకులను అక్కడ కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారం కనుక, అది డబ్బుతో ముడి పడి ఉంటుంది కనుక ఇలాంటివి సహజమే కావచ్చు. అయితే అది రాయబార ఘర్షణ స్ధాయికి చేరుకోవడమే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.

2 thoughts on “ఇండియా, చైనా: తమలపాకుతో నువ్వొకటి, తలుపు చెక్కతో నేనొకటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s