‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2


System failure

‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి ‘ఎయిర్ గేప్’ ద్వారా వేరు చేశారు. దీన్ని దాటి సెంట్రీఫ్యూజ్ లను నియంత్రించే స్పెషలైజ్డ్ కంప్యూటర్లలోకి వైరస్ కోడ్ ను చొప్పించాలి.

ఇందులో మొదటి అడుగు జర్మనీ కంపెనీ ‘సీమన్స్’ తయారు చేసిన ‘బేకాన్’ అనే కంప్యూటర్ కోడ్ ను అభివృద్ధి చేసి దాని ద్వారా నటాంజ్ లో జరిగే ఆపరేషన్లపై సమాచారం సేకరించడం. టైమ్స్ ప్రకారం సీమన్స్ కంపెనీతో పాటు ఒక ఇరానియన్ మాన్యుఫాక్చరర్ ఈ బేకాన్ అభివృద్ధిలో భాగం పంచుకున్నది. సేకరించిన సమాచారం ద్వారా నటాంజ్ ప్లాంటు యొక్క ఎలక్ట్రికల్ బ్లూ ప్రింట్ ను రూపొందించదలిచారు. అత్యంత వేగంగా తమ చుట్టూ తాము తిరిగే సెంట్రీఫ్యూజ్ లను కంప్యూటర్లు ఎలా నియంత్రిస్తున్నదీ తద్వారా అర్ధం చేసుకోగలిగితే సెంట్రిఫ్యూజ్ లు పని చేయకుండా చేయవచ్చు. బేకాన్ లు చొప్పించాక అక్కడి సమాచారంతో అవి అమెరికా ‘నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ’ లోని ఫెసిలిటీకి సందేశాలు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఈ పధకం పైన మొదట్లో పెద్దగా ఆశలు లేవని అమెరికా సిబ్బందిని ఉటంకిస్తూ టైమ్స్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ కూడా వీరితో జత కలిశాక పధకం మరింత పకడ్బందీగా అమలు చేశారు.

బేకాన్ ద్వారా నటాంజ్ సమాచారాన్ని సేకరించిన అమెరికా, ఇజ్రాయెల్ నిపుణులతో కలిసి సంక్లిష్టమైన భారీ కంప్యూటర్ వైరస్ రూపకల్పనకు నడుం బిగించారు. ఇజ్రాయెల్ తో జత కలవడం వెనుక అమెరికా రెండు ప్రయోజనాలను ఆశించింది. ఒకటి: ఇజ్రాయెల్ సైబర్ నిపుణత్వంపై అమెరికాకి నమ్మకం ఉండి. అమెరికా ఎన్.ఎస్.ఏ తో పోటీ పడగల సైబర్ నిపుణత ఇజ్రాయెల్ అప్పటికే అభివృద్ధి చేసుకుంది. అదీ కాక నటాంజ్ కర్మాగారంపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున గూఢచర్య సమాచారాన్ని సేకరించింది. సైబర్ దాడులు విజయవంతం కావాలంటే ఈ సమాచారం కీలకమని అమెరికా భావించింది. రెండోది: ఇజ్రాయెల్ స్వయంగా ఇరాన్ అణు కర్మాగారాల పైన బాంబు దాడులు చేయకుండా నిరోధించడం కూడా అమెరికాకి అవసరం.

అమెరికా అప్పటికే మధ్య ప్రాచ్యంలో రెండు దురాక్రమణ యుద్ధాల్లో మునిగి ఉన్న దశలో ఇరాన్ అణు కర్మాగారాలపై దాడులు చేస్తే అది అంతటితో ఆగదు. మధ్య ప్రాచ్యం మొత్తం ఆ ఉద్రిక్తతలు విస్తరిస్తాయి. ఇరాన్, సిరియా, లెబనాన్, పాలస్తీనా తదితర దేశాలన్నిటా అమెరికా-ఇజ్రాయెల్-యూరోప్ దుష్ట కూటమి పై పోరాటానికి వివిధ సంస్ధలు ముందుకు ఉరుకుతాయి. ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో ఉంటే అరబ్ దేశాల ప్రభుత్వాలు ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ వ్యతిరేక పక్షం వహించాల్సి ఉంటుంది. అది చివరికి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అమెరికాకి నరకాన్ని చవిచూపే పరిస్ధితులకు దారి తీయవచ్చు. మొత్తంగా అమెరికా సామ్రాజ్యవాదానికి చావు దెబ్బ ఎదురు కావచ్చు. ఈ కారణం వల్ల ఇరాన్ అణు కర్మాగారాలపై ఇజ్రాయెల్ ఏక పక్షంగా బాంబు దాడులు చేయడం అమెరికాకి సమ్మతం కాదు. ఈ సంవత్సరం ప్రారంభం నుండీ ఇరాన్ పై బాంబు దాడులు చేయకుండా ఇజ్రాయెల్ కి నచ్చజెప్పడానికి అమెరికా అనేక విధాలుగా చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కనుక ఇజ్రాయెల్ నిపుణులను వైరస్ రూపకల్పనలో ఇరికిస్తే బాంబు దాడులనుండి వారిని ఆపినట్లవుతుందని అమెరికా భావించింది.

త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ నిపుణులు ‘ది బగ్’ పేరుతో సంక్లిష్టమైన కంప్యూటర్ క్రిమి ని సృష్టించారు. దానిని పరీక్షించడానికి ఇరాన్ ఉపయోగించే సెంట్రీఫ్యూజ్ లతో పోలిన వాటిని అత్యంత రహస్యంగా నిర్మించారు. ఇరాన్ పి-1 సెంట్రిఫ్యూజ్ లని వినియోగిస్తుందనీ, వీటి డిజైన్ ను పాకిస్ధాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ నుండి ఇరాన్ కొనుగోలు చేసిందనీ తెలుస్తోంది. అప్పటికే పి-1 సెంట్రిఫ్యూజ్ లు కొన్ని అమెరికా వద్ద ఉన్నాయనీ లిబియా మాజీ పాలకుడు కల్నల్ గడ్దాఫీ నుండి 2003లో అమెరికా వాటిని సంపాదించిందనీ టైమ్స్ తెలిపింది. గడ్డాఫీ కి పి-1 లను అమ్మింది కూడా అబ్దుల్ ఖాదిరే. అణ్వస్త్రాలు నిర్మించే ఆలోచనను పరిత్యజించిన గడ్డాఫీ 2003 లో సెంట్రీఫ్యూజ్ లను అమెరికాకి అప్పగించాడు. తద్వారా అమెరికా, యూరప్ లతో శతృత్వం లేకుండా చేసుకోవాలని గడ్డాఫీ భావించినట్లు వివిధ పరిణామాల ద్వారా అర్ధమవుతోంది. అయితే గడ్డాఫీ స్నేహ హస్తాన్ని స్వీకరించినట్లే నటించిన అమెరికా-యూరప్ ల దుష్ట కూటమి అవకాశం దొరికాక అత్యంత హీన బుద్ధితో అతన్ని చెంపేయడానికి కూడా వెనకాడలేదు. లిబియా ఆయిల్ వనరుల్ని పూర్తిగా అమెరికా, యూరప్ కంపెనీలకు అప్పజెప్పకపోవడమే గడ్డాఫీ చేసిన తప్పు.

సెంట్రీఫ్యూజ్ లపై జరిపిన చిన్న తరహా పరీక్షలు విజయవంతం అయ్యాయి. కంప్యూటర్ క్రిమి పరీక్ష కోసం నిర్దేశించిన కంప్యూటర్లలోకి జొరబడి రోజులు లేదా వారాల తరబడి తిష్ట వేసి సెంట్రిఫ్యూజ్ లు నిర్దేశించిన వేగం కంటే మరింత వేగంగానో లేదా అత్యంత నెమ్మదిగానో తిరిగేలా ఆదేశాలు ఇచ్చింది. అకస్మాత్తుగా వచ్చే అలాంటి ఆదేశాలకు వచ్చే ప్రతిస్పందనలను తట్టుకోలేని సిమ్ట్రీఫ్యూజ్ ల సున్నిత భాగాలు ధ్వంసం అయిపోయాయి. బుష్ పదవీకాలం ముగిసే రోజుల్లో వైట్ హౌస్ సిచుయేషన్ రూమ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో ధ్వంసం అయిన సెంట్రీఫ్యూజ్ ల విడిభాగాలు సాక్ష్యం కోసం ప్రవేశ పెట్టారు. కేవలం కంప్యూటర్ సూచనలతో నిండి ఉండే ‘సైబర్ ఆయుధం’ వల్ల జరిగే భౌతిక నష్టాన్ని ఆరోజు అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర అత్యున్నత అధికారులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించి పులకితులయ్యారు. ప్రపంచంలో తమకు నచ్చని, తమ కంపెనీలు మెచ్చని దేశాలలో ప్రత్యక్ష యుద్ధం అవసరం లేకుండానే ‘సైబర్ ఆయుధం’ సాయంతో తాము సృష్టించగల పెను విధ్వంసాన్ని తలుచుకుని రాక్షానందం అనుభవించారు. ఇరానియన్ అండర్ గ్రౌండ్ అణు శుద్ధి కర్మాగారాన్ని విధ్వంసం చేయగల ‘సైబర్ ఆయుధం’ సిద్ధమని ప్రకటించబడింది.

“గతంలో సైబర్ దాడుల ప్రభావం ఇతర కంప్యూటర్ల వరకే పరిమితం అయింది. భౌతిక విధ్వంసాన్ని సృష్టించడానికి భారీ స్వభావం గలిగిన ఒక సైబర్ దాడి చేయడం ఇదే మొదటిసారి” అని సి.ఐ.ఏ మాజీ అధిపతి మైఖేల్ వి.హేడెన్ అన్నాడని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. “ఎవరో సరిహద్దు దాటారు” అని ఆయన అన్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఆపరేషన్ ‘ఒలింపిక్ గేమ్స్’ లో భాగంగా రూపొందించిన వైరస్ అదుపు తప్పి ఇంటర్నెట్ లోకి ప్రవేశించడాన్ని ఉద్దేశించి హేడెన్ అలా అన్నాడు. నటాంజ్ లో వైరస్ ను చొప్పించడానికి ఇరానియన్ల మీదనే అమెరికా ఆధారపడింది. ఇంజనీర్లు, మెయింటెనెన్స్ కార్మికులు తదితరులను అందుకు వినియోగించుకుంది. కొందరు తెలిసి, మరికొందరు తామేమి చేస్తున్నామో తెలియకుండానే ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేశారు.

సెంట్రీఫ్యూజ్ లో అదుపు తప్పి వేగంగా తిరగడాన్ని 2008 లో మొదటిసారి ఇరానియన్లు గమనించారు. వారు ఆశ్చర్యపోయినట్లు గూఢచార చర్యల ద్వారా రికార్డు చేసిన వారి సంభాషణల ద్వారా తెలిసిందని అమెరికా అధికారులు టైమ్స్ కి తెలిపారు. ఇరానియన్లు విడిభాగాలనూ, ఇంజనీరింగ్ నూ తప్పు పడతారని అమెరికన్లు భావించారనీ, ఏ రెండు దాడులూ ఒకటిగా లేకుండా అమెరికన్లు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇరానియన్లు అయోమయానికి గురయ్యారని టైమ్స్ గొప్పలు రాసుకుంది. వైరస్ కోడ్ ఓ వైపు సెంట్రీఫ్యూజ్ లకు తప్పుడు ఆదేశాలిస్తూనే మరో వైపు సిబ్బందికి అంతా మామూలుగానే ఉందన్నట్లు సందేశాలు పంపిందని కోడ్ లో అత్యంత తెలివిగల భాగం అదేననీ అమెరికా అధికారులు చెప్పినట్లు టైమ్స్ తెలిపింది. అనంతరం తమ పరికరాలను ఇరానియన్లు అనుమానిస్తున్నట్లు ఐ.ఏ.ఇ.ఏ (ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజన్సీ) కి సమాచారం వచ్చింది. పేరుకి ఇది అంతర్జాతీయ సంస్ధే అయినా అమెరికాకి అనుకూలంగా వ్యవహరించే అత్యంత నీచమైన సంస్ధ ఇది. ఏ సాక్ష్యాలూ లేకపోయినా, కేవలం ఇజ్రాయెల్, అమెరికాల గూఢచార సంస్ధలు సృష్టించే పచ్చి అబద్ధాలను గొప్ప సాక్ష్యాలుగా చెబుతూ శుద్ధి చేసిన యురేనియం ను ఇరాన్ అణ్వస్త్రాల తయారీకి తరలించిందంటూ నివేదికలు తయారు చేసిన కొద్ది బుద్ధుల నీచులు ఈ సంస్ధకు నాయకులు.

కొన్ని సెంట్రీఫ్యూజ్ లు సక్రమంగా పని చేయడం లేదని అర్ధమయ్యాక ఇరాన్ ప్లాంటులో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ప్లాంటులో ‘సేబోటేజ్’ జరిగిందని ఇరాన్ పసి గట్టింది. ప్లాంటులో ఆపరేషన్లను ఆపేశారు. సెంట్రీఫ్యూజ్ లను కూడా అక్కడి నుండి తొలగించారు. తమ ఐ.ఏ.ఇ.ఏ ఆధ్వర్యంలో నటాంజ్ లో నెలకొల్పిన కెమెరాలు ప్లాంటులో కొంత భౌతిక విధ్వంసం జరిగినట్లు చూపాయని అమెరికా అధికారులు తెలిపారు. అయితే బుష్ పదవీకాలం ముగిసే నాటికి అమెరికా ఊహించినట్లుగా భారీ స్ధాయి విధ్వంసం ఏదీ చోటు చేసుకోలేదు. వియత్నాం లాంటి చిన్న దేశంపై దాడి చేసి దెబ్బతిన్నట్లే, ఇరాక్ పై దాడి చేసి కనీసం తమ అనుకూల ప్రభుత్వాన్ని కూడా నిలపలేనట్లే, ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో చావు దెబ్బలు ఎదుర్కొంటున్నట్లే ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాన్ని పూర్తి విధ్వంసం కావించడానికి వారు వేసిన చావు తెలివితేటలు పూర్తిగా సఫలం కాలేదు.

ఒబామా పదవీ స్వీకారానికి కొద్ది రోజుల ముందు తన హయాంలో రూపు దిద్దుకున్న మానవ రహిత ‘హంతక డ్రోన్ విమాన’ దాడులనూ, సైబర్ దాడుల కార్యక్రమం ‘ఒలింపిక్ గేమ్స్’ నూ పరిరక్షించి కొనసాగించాలని ఒబామాను జార్జి బుష్ కోరాడు. బుష్ అంతిమ కోరికను బారక్ ఒబామా ప్రాణప్రదంగా కొనసాగిస్తున్నాడని ఆసియా, ఆఫ్రికా ల దేశాలలో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు చెబుతున్నాయి. పాకిస్ధాన్ లో డ్రోన్ దాడులను కొనసాగించాలని బుష్ కోరగా వాటిని ఒబామా సోమాలియా, యెమెన్ లకు కూడా విస్తరింపజేశాడు. ప్రపంచ ప్రజల ప్రయోజనాలను అమెరికా కంపెనీలకు దాసోహం చేయడంలో రిపబ్లికన్ బుష్ కి, డెమోక్రాట్ ఒబామాకి గానీ తేడా అసలే లేదని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే అమెరికా ప్రజల ప్రయోజనాల విషయంలో కూడా వారికి విభేధాలేవీ లేవు. విభేదాలేమన్నా ఉంటే వారు వల్లించే కబుర్లలోనే తప్ప విధానాలలో కాదు.

‘సైబర్ ఆయుధాల’ అభివృద్ధికి ఒబామా ఆమోదించడమే కాక వాటిని ఇరాన్ పై మరింత తీవ్ర స్ధాయిలో ఉపయోగించడానికి ఒబామా ఆదేశాలిచ్చాడు. సైబర్ దాడుల ప్రతి అడుగులోనూ ఒబామా జోక్యం, ఆమోదం కొనసాగుతూ వచ్చాయి. ప్రతి అడుగులోనూ సమీక్ష చేయడం కొత్త దాడికి ఆదేశాలివ్వడం ఒబామా కొనసాగించాడు. కొన్ని సార్లు ఆ దాడులు ప్రమాదకరంగానూ, మరింత విధ్వంసకరంగానూ ఉండేదని టైమ్స్ కధనాన్ని బట్టి తెలుస్తోంది.

2010 వేసవిలో హేడెన్ ప్రస్తావించిన ‘సరిహద్దు దాటడం’ జరిగింది. సరికొత్త వర్షన్ లో నటాంజ్ లో ప్రవేశపెట్టబడిన వైరస్ ‘వరల్డ్ వైడ్ వెబ్’ లోకి ప్రవేశించింది. అమెరికా, ఇజ్రాయెల్ ల డిజైన్/ప్రోగ్రాం ప్రకారం వైరస్ ఇంటర్నెట్ లోకి ప్రవేశించకూడదు. టైమ్స్ మాటల్లో చెప్పాలంటే జూ లో బోనులో ఉన్న జంతువు చేతికే బోను తాళం చెవి చిక్కినట్లయింది. ‘ఒలింపిక్ గేమ్స్’ లో కీలక పాత్ర పోషిస్తున్న జనరల్ కార్ రైట్ (జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వైస్ ఛైర్మన్), మైఖేల్ జె. మోరేల్ (సి.ఐ.ఏ డిప్యూటీ డైరెక్టర్), లియోన్ పెనెట్టా (సి.ఐ.ఏ డైరెక్టర్) లు విషయాన్ని అధ్యక్షుడు బారక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ లకు చేరవేశారు. కోడ్ లో ఉన్న ఒక ఎర్రర్ వల్ల అది ఒక ఇంజనీర్ కంప్యూటర్ లోకి ప్రవేశించిందనీ, ఆ కంప్యూటర్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయినపుడు ఇంటర్నెట్ లోకి కూడా ప్రవేశించిందని వారికి వివరించారు. అమెరికన్లు, ఇజ్రాయేలీయులు తయారు చేసిన క్రిమి తాను కొత్త చోటులో ఉన్నానని గ్రహించలేకపోయింది. అదిక తనను తాను పునః సృష్టించుకుంటూ ఇంటర్నెట్ లో వీర విహారం మొదలు పెట్టింది. దానితో అమెరికా, ఇజ్రాయెల్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇరాన్ లో పారిశ్రామిక విధ్వంసం కోసం సృష్టించిన వైరస్ కోడ్ సామాన్య కంప్యూటర్ యూజర్ కి, అదేంటో తెలియకపోయినా, అందుబాటులోకి వచ్చింది.

“ఇజ్రాయేలీయులు కోడ్ ని మార్చినట్లు భావిస్తున్నాము” అని సిచుయేషన్ రూంలో సిబ్బంది ఒకరు అధ్యక్షుడికి చెప్పారు. “ఆ కార్యకలాపంలో మనం కూడా భాగస్వాములమేమో ఇంకా తెలియదు” అని ఆయన చెప్పాడు. ఉపాధ్యక్షుడు జో బిడేన్ అయితే “ఇది ఇజ్రాయేలీయుల పనే. వాళ్ళు చాలా దూరం వెళ్లారు” అని నిర్ధారించాడు. అనేక సందర్భాలలో ఇజ్రాయెల్ కుటిల ఎత్తుగడలకు అగ్ర రాజ్యం ఏ విధంగా బందీ అవుతున్నదో ఈ సంభాషణ తెలియజేస్తోంది. సద్దాం హుస్సేన్ నిర్మించాడని బుష్ చెప్పిన ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు’ గానీ, లిబియాలోని బెంఘాజీ లో అసలే జరగని ‘సామూహిక హత్యాకాండ’ గానీ, ఇరాన్ లో ఎవరూ కనిపెట్టలేని ‘అణ్వాయుధం’ గానీ ఇజ్రాయెల్ జిత్తుల మారి సలహా పుణ్యమేనని కొన్ని పత్రికలు రాశాయి. అమెరికా ప్రయోజనం కోసమేనని చెబుతూ అమెరికా చేత విధ్వంసక కార్యక్రమాలు నిర్వహింప జేయడంలో ఇజ్రాయెల్ ప్రతిభ సాటిలేనిదని సదరు పత్రికల అభిభాషణ. అయితే ఇందులో అమెరికా దుర్బుద్ధిని తేలిక చేస్తూ దానికి అమాయక ముసుగు జతచేసే ఎత్తుగడ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఎత్తుల సామర్ధ్యాన్ని మాత్రం తక్కువ చేయలేము. మొత్తం మీద వైరస్ కోడ్ లోకి ఎర్రర్ ని ఎవరు చొప్పించారో ఇంకా తేలలేదని తెలుస్తోంది.

ఇంత జరిగినప్పటికీ సైబర్ దాడులను ఆపాలని ఒబామా చెప్పలేదు. పైగా కొనసాగించమనే ఆదేశాలిచ్చాడు. ఆయన ఆందోళనల్లా ‘ఒలింపిక్ గేమ్స్’ లో మిగిలిన భాగం కొనసాగుతుందా లేదా అన్నదే తప్ప వైరస్ వల్ల వినియోగదారుల కంప్యూటర్లు ప్రభావితం అవుతాయనిగానీ, అమెరికా కుటిలత్వం వెల్లడయితే ఇతర దేశాలు కూడా సైబర్ యుద్ధ రంగంలోకి ప్రవేశిసిస్తాయని గానీ, అందువల్ల ఇరాన్ కి పరిమితం అవాలనుకున్న పారిశ్రామిక విధ్వంసం ప్రపంచ వ్యాపితంగా ఇతర దేశాలకూ, సంస్ధలకూ, హ్యాకర్లకూ ఆదర్శంగా, సాకుగా మారుతుందనిగానీ కాదు. అమెరికా కి ఉపయోగపడితే అది ఎంతటి విధ్వంసం అయినా ఫర్వాలేదు. ఎంత నష్టం జరిగినా ఫర్వాలేదు. మానవీయ విలువల మంటగలిసినా ఫర్వాలేదు. శతాబ్దాల మానవ నాగరికత మట్టిలో కలిసినా ఫర్వాలేదు. ఒబామా ఆదేశాల ఫలితంగా కొద్ది వారాల్లోనే వైరస్ కి సరికొత్త వర్షన్ విడుదలై దాదాపు వెయ్యి వరకు సెంట్రిఫ్యూజ్ లను దెబ్బతీసింది. టైమ్స్ కధనం బట్టి ‘ఒలింపిక్ గేమ్స్’ ఇంకా కొనసాగుతోంది.

అమెరికా ప్రారంభించిన సైబర్ దాడులు త్వరలోనే అమెరికాని చుట్టుముట్టవన్న గ్యారంటీ లేదు. నిజానికి ప్రపంచంలో మరే దేశమూ ఆధారపడనంతగా అమెరికాయే కంప్యూటర్ వ్యవస్ధలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. అమెరికా పవర్ గ్రిడ్, గానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్ధ గానీ, ఇంకా అలాంటి అనేక దేశ వ్యాపిత వ్యవస్ధలు కంప్యూటర్ ప్రోగ్రాం లపై ఆధారపడి పని చేస్తున్నాయి. వైరస్ వల్ల ఇవి కేవలం కొన్ని గంటలు నెమ్మదించినా, ఆగినా, దెబ్బతిన్నా జరిగే నష్టం ఊహాతీతం. అమెరికా తీసుకునే రక్షణ చర్యలు అలాంటి ప్రమాదం జరగకుండా నిరోధించవచ్చు. కానీ ఎంతకాలం? బహుశా అమెరికా ప్రజలపై ప్రభావం కలగజేసే సైబర్ దాడులు చోటు చేసుకుంటాయా లేదా అన్నది సరైన ప్రశ్న కాకపోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందన్నదే అసలు ప్రశ్న కావచ్చు. ఈ అనుమానం అమెరికన్లకే కలుగుతోందని న్యూయార్క్ టైమ్స్ కధనానికి అమెరికన్లు ఇస్తున్న స్పందనే చెపుతోంది.

…(చివరి భాగంలో ‘ఫ్లేమ్’ గురించి)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s