‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాల వినాశనం కోసం రూపొందించిన విధ్వంసక ‘స్టక్స్ నెట్’ వైరస్ అదుపు తప్పి ఇంటర్నెట్ లోకి ప్రవేశించిందని తెలిసాక కూడా సైబర్ యుద్ధాన్ని కొనసాగించడానికే ఒబామా నిర్ణయించిన సంగతిని సదరు పత్రిక వెల్లడించింది.
వైరస్ లను సృష్టించి విదేశీ కంప్యూటర్లపై దాడి చేసే అక్రమానికి తాము ఎన్నడూ పాల్పడలేదని అమెరికా చాలా కాలంగా చెబుతూ వస్తోంది. చైనా తమ కంప్యూటర్ల పై దాడి చేయిస్తోందని అమెరికా అనేకసార్లు ఆరోపించింది. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్లలో సమాచారాన్ని దొంగిలించడానికి చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారనీ, చైనా ప్రభుత్వం ఆదేశాలతోనే హ్యాకర్లు పని చేస్తున్నారనీ అమెరికా ఆరోపిస్తూ వచ్చింది. చైనాను కంప్యూటర్ సమాచారం దొంగిలించే దేశంగా ముద్ర వేయడానికి అన్నీ రకాలుగా అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది. తాజా వెల్లడితో అసలు దొంగ అమెరికా యేనని తేట తెల్లమైంది. అమెరికా నేర్పిన విద్యనే ఇతర దేశాలు అనుసరిస్తున్నాయని నిరూపితమయింది. విదేశీ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని ‘పోటీ స్ఫూర్తి’తో ఎదుర్కోవడం తమకు చేతకాదనీ, ‘కుట్ర, పారిశ్రామిక విధ్వంసాల’తో పోటీని అణగదొక్కడమే తమకు తెలిసిన విద్య అనీ అమెరికా కంపెనీల తరపున అమెరికా ప్రభుత్వమే చెప్పినట్లయింది.
స్టక్స్ నెట్ వైరస్ వల్ల ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం నటాంజ్ లో యురేనియం శుద్ధికి నెలకొల్పిన 5000 సెంట్రీ ఫ్యూజ్ లలో 1000 వరకూ పని చేయకుండా పోయాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. నిజానికి ఈ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార వర్గాలు అప్పట్లోనే లీక్ చేశాయి. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాలలో యురేనియం శుద్ధి గణనీయంగా నెమ్మదించిందనీ, తమ విధ్వంసక కార్యక్రమాలు సఫలం అయ్యాయనీ అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు కులుక్కుని పండగ చేసుకున్న కధనాలను అనేక పత్రికలు గత రెండేళ్లుగా ప్రచురించాయి. ఈ కధనాలను ఇరు దేశాల అధికారులు బహిరంగంగా ఖండిస్తూ వచ్చారు. అయితే వారి ఖండన మండనలు నిజం కాదని బహిరంగ రహస్యమే. సదరు బహిరంగ రహస్యం, ఇప్పుడు బహిరంగ వాస్తవంగా ప్రపంచం ముందు రుజువయింది.
అధ్యక్ష పదవి చేపట్టిన ప్రారంభ కాలంలోనే బారక్ ఒబామా ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాలలోని కంప్యూటర్ లపై అత్యాధునిక సైబర్ దాడులకు రహస్య ఆదేశాలిచ్చాడని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. సైబర్ దాడుల కార్యక్రమంలో ఉన్న సభ్యులే ఈ సంగతి చెప్పినట్లు పత్రిక తెలిపింది. పత్రిక ప్రకారం ‘ఒలింపిక్ గేమ్స్’ కోడ్ నేమ్ తో బుష్ కాలంలోనే రహస్య సైబర్ దాడులు మొదలయ్యాయి. 2010 వేసవిలో ప్రమాద వశాత్తూ స్టక్స్ నెట్ వైరస్ అదుపు తప్పి ‘వరల్డ్ వైడ్ వెబ్’ లోకి ప్రవేశించినప్పటికీ దాడులు తీవ్రం చేయాలని ఒబామా అనుమతి ఇచ్చాడు. కంప్యూటర్ సెక్యూరిటీ నిపుణులు అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ కంప్యూటర్ల పై దాడుల కోసం సంయుక్తంగా రూపొందించిన వైరస్ కు ‘స్టక్స్ నెట్’ గా నామకరణం చేశారు.
వైరస్ అదుపు తప్పి ఇంటర్నెట్ లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే వైట్ హౌస్ ‘సిచూయేషన్ రూమ్’ లో ఈ అంశంపై సమావేశం జరిగింది. ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్, అప్పటి సి.ఐ.ఏ డైరెక్టర్ లియోన్ పెనెట్టా లు సమావేశానికి హాజరైనారు. “దీనిని మూసేయాల్సిందేనా?” అని ఒబామా వారిని ప్రశ్నించాడని అధ్యక్షుడి ‘నేషనల్ సెక్యూరిటీ టీం’ సభ్యులను ఉటంకిస్తూ టైమ్స్ తెలిపింది. వైరస్ గురించి ఇరానియన్లకు ఎంతవరకు తెలుసో తెలియదనీ, ఇరాన్ కంప్యూటర్లలో వైరస్ అప్పటికే పెద్ద మొత్తంలో విధ్వంసం సృష్టిస్తున్నదనీ చెప్పడంతో ఉత్సాహభరితుడైన ఒబామా అక్రమ ‘సైబర్ యుద్ధం’ కొనసాగించడానికే మొగ్గు చూపాడు. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే స్టక్స్ నెట్ వైరస్ కొత్త వర్షన్ ఇరాన్ కంప్యూటర్లపై విరుచుకుపడింది. ఆ తర్వాత మరో వైరస్ కూడా ఇరాన్ పై దాడికోసం వదిలారని టైమ్స్ తెలిపింది. స్టక్స్ నెట్ వైరస్ ను నిపుణులు కనిపెట్టేసరికి ఇరాన్ లోని నటాంజ్ అణు విద్యుత్ కేంద్రంలో యురేనియం శుద్ధి కార్యక్రమం బాగా నెమ్మదించింది.
ఇరానియన్ అణు కార్యక్రమాన్ని అక్రమంగా విధ్వంసం కావించడానికి ఉద్దేశించిన వైరస్ దాడుల కార్యక్రమం గురించి అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ లకు చెందిన అనేక మంది మాజీ, తాజా అధికారుల ద్వారా తెలుసుకున్నట్లు టైమ్స్ తెలిపింది. వీరు కాక అనేకమంది బైటి నిపుణులను కూడా ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపింది. అయితే ఈ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నందున ఎవరూ తమ పేర్లు బైట పెట్టడానికి ఇష్టపడలేదని పత్రిక తెలిపింది. అయితే ఈ ఆటంకాలను ఇరాన్ విజయవంతంగా అధిగమించడంతో స్టక్స్ నెట్ రూపకర్త దేశాలు డీలా పడ్డాయని తెలిపింది. 18 నెలల నుండి రెండు సంవత్సరాల వరకూ ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమం తాత్కాలికంగా వెనకబడినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకుందనీ అదనపు శుద్ధి సామర్ధ్యం కూడా సంతరించుకుందనీ అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లుగా టైమ్స్ తెలిపింది.
అమెరికా గూఢచారి వర్గాలు తాజాగా అందించిన నివేదిక ప్రకారం 2003 తర్వాత అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను ఇరాన్ ఆపేసింది. అయితే అసలు ఇరాన్ అణ్వాయుధ తయారీకి ప్రయత్నిన్నదని చెప్పేందుకు ఇప్పటివరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా దుష్ట కూటమి బయటపెట్టలేకపోయింది. అయినప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తోందని అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు చేసే కాకి గోల మానలేదు. రక్షణ కోసం అణ్వాయుధాలు నిర్మించుకునే సార్వభౌమాధికార హక్కు ఇరాన్ కి ఉందన్నది మరో సంగతి.
ప్రపంచాధిపత్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అమెరికా ఇన్నాళ్లూ అనేక దుర్మార్గాలకి పాల్పడింది. స్వతంత్ర దేశాల అధ్యక్షుల ఇళ్లపై నేరుగా బాంబు దాడులకు పాల్పడింది. సి.ఐ.ఏ గూఢచారులను చొప్పించి అనేక కుట్రలు నిర్వహించింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాలను కూల్చింది. నియంతృత్వ ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచింది. కిరాయి తిరుగుబాట్లను ప్రేరేపించింది. సాయుధ ముఠాలకు ధన, ఆయుధ సహాయం అందించింది. సరిహద్దు తగాదాలను రేపింది. తగవులు పెట్టి యుద్ధాలు ప్రోత్సహించి ఆయుధాలు అమ్ముకుంది. ప్రపంచ వ్యాపితంగా అనేక టెర్రరిస్టు సంస్ధలకు జన్మనిచ్చి అభివృద్ధి చేసింది. తాను పెంచిన టెర్రరిజం పై యుద్ధం అంటూ స్వంతంత్ర దేశాలను దురాక్రమించింది. ఇవన్నీ అమెరికా కంపెనీలకు దుర్బేధ్యమైన మార్కెట్లను, వనరులను సమకూర్చడానికే. వీటి కొనసాగింపే కొన్నేళ్లుగా అమెరికా సాగిస్తున్న సైబర్ యుద్ధం.
అమెరికా ప్రారంభించిన అక్రమ సైబర్ యుద్ధం అమెరికాకే పరిమితం అయిపోదు. అమెరికా సాకు చూపి ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఆ ఒరవడిని అంది పుచ్చుకుంటాయి. అదిప్పటికే ప్రారంభమై ఊపందుకుందని అమెరికా ప్రకటనలే చెబుతున్నాయి. అమెరికా ప్రారంభించే ప్రతి నూతన యుద్ధరంగం కూడా ఇతర దేశాలు సైతం, కనీసం రక్షణ కోసం అయినా, ప్రారంభిస్తాయన్న సంగతి అమెరికా అధ్యక్షుడికి ఒబామాకి తెలుసని ‘సిచూయేషన్ రూమ్’ లో ఒబామా తో ఉన్న అధికారులు అంగీకరించారని టైమ్స్ తెలిపింది. 1940ల్లో జపాన్ పై అమెరికా అణ్వాయుధాన్ని ప్రయోగించిన తర్వాత అన్నీ ప్రధాన దేశాలూ ఏదో ఒక పేరుతో అణ్వాయుధాలు నిర్మించుకున్నాయి. 1950ల్లో ఖండాంతర క్షిపణులు అమెరికా తయారు చేసుకున్నాక రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు దానిని అనుసరించాయి. ఇప్పుడు ఇండియా కూడా వాటి సరసన చేరింది.
సైబర్ ఆయుధాలు అమెరికా వినియోగిస్తున్నదని ప్రపంచానికి ఏ కొంచెం ఉప్పందినా ఇతర దేశాలు కూడా దాన్ని అనుసరిస్తాయనీ, టెర్రరిస్టులు, హ్యాకర్లు సైతం తమ చర్యలను అమెరికాని చూపి సమర్ధించుకుంటాయనీ ఒబామా పదే పదే ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారులు చెప్పడాన్ని బట్టి ఆధునిక మానవాళి అత్యంత ఇష్టంగా ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ ను అత్యంత దుర్మార్గమైన సైబర్ యుద్ధానికి వేదిక చేయడానికి ఒబామా తెగించాడని అర్ధం అవుతోంది. అయితే దీనికి ఒబామాని వ్యక్తిగతంగా తప్పు పట్టి ఉపయోగం లేదు. అమెరికా కంపెనీల ప్రయోజనాలను సమస్త మానవాళికి చెందిన సమస్త ప్రయోజనాల కంటే అగ్రస్ధానంలో నిలిపే అమెరికా రాజ్యవ్యవస్ధ మాత్రమే దానికి అంతిమ బాధ్యురాలు. ఒబామా స్ధానంలో ఎవరున్నా చేసేది అదే.
ఎప్పుడు మొదలు?
న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం స్టక్స్ నెట్ కు రూప కల్పనకు ప్రయత్నాలు 2006 లో బుష్ అధ్యక్షరికంలో మొదలయ్యాయి. అయితే ప్రారంభంలో ఈ ప్రాజెక్టు పై ఎవరికీ నమ్మకం లేదు. ప్రయోగాత్మకంగా మొదలయిన ప్రయత్నాలు ఇజ్రాయెల్ చేరికతో మాత్రమే ఊపందుకున్నాయి. ఇరాన్ ను అరికట్టడానికి దారులు అస్పష్టంగా కనిపిస్తున్న సందర్భంలో కంప్యూటర్ వైరస్ ఆలోచన పుట్టింది. అప్పట్లో ఇరాన్ పై ఆంక్షలు విధించడంలో యూరోపియన్ దేశాలు కూడా తమలో తాము విభజించబడి ఉన్నాయి. ఆంక్షలు తమకే తిప్పికొడతాయన్నది కొన్ని యూరోపియన్ దేశాల అభిప్రాయం. సద్ధామ్ హుస్సేన్ అణ్వాయుధాలు తయారు చేసుకున్నాడంటూ పచ్చి అబద్ధాలు చెప్పి పరువు పోగొట్టుకున్న జార్జి బుష్ అదే ప్రచారం ఇరాన్ పై చేస్తే నమ్మే పరిస్ధితి వారికి అమెరికాకి కనిపించలేదు. అమెరికా, యూరప్ దేశాల మోశాలకు విసుగు చెందిన ఇరాన్ నటాంజ్ అణు శుద్ధి కేంద్రంలో స్వంతంగా అణు శుద్ధికి దిగడంతో అమెరికాకి ‘ఇరాన్ ఆబ్సెషన్’ తలకెక్కింది. అంతర్జాతీయ విలేఖరులను వెంటబెట్టుకుని నటాంజ్ అణు శుద్ధి కేంద్రాన్ని చూపుతూ ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ‘50,000 సెంట్రీఫ్యూజ్ లను నెలకొల్పుతామ’ని చేసిన ప్రకటన వారి ఆబ్సెషన్ ను తీవ్రం చేసింది.
ఉపాధ్యక్షుడు డిక్ చేనీ లాంటి వాళ్ళు ఇరాన్ పై దాడికి ప్రతిపాదించినప్పటికీ ఆప్పటికే రెండు దురాక్రమణ యుద్ధాల్లో మునిగి ఉన్న బుష్ పాలనా వ్యవస్ధ కి అది గొప్ప ఆలోచనగా కనిపించలేదు. అనేక సార్లు యుద్ధావకాశాలను సమీక్షించిన బుష్ పాలనా యంత్రాంగం మరింత ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొనే సాహసం చేయలేకపోయింది. ఇరాన్ వ్యవస్ధల్లోకి అక్రమ విడి భాగాలు చొప్పించేలా చేయడం ద్వారా సి.ఐ.ఏ నటాంజ్ కేంద్రాన్ని పేల్చివేయడానికి విఫలయత్నం చేసింది. ఇతర దేశాల నుండి ఇరాన్ దిగుమతి చేసుకునే విద్యుత్ సరఫరా ద్వారా కూడా పేలుడుకు సి.ఐ.ఏ ప్రయత్నించిందని ఎన్.వై.టైమ్స్ తెలిపింది. అయితే అలాంటి సేబోటేజ్ కుట్రలేవీ పెద్దగా పని చేయలేదు. ఈ సమయంలో జనరల్ జేమ్స్ ఇ. కార్ట్ రైట్ కొత్త ఐడియాని అందించాడు. అత్యాధునిక సైబర్ ఆయుధాన్ని తయారు చేయడమే ఆ ఐడియా.
…ఇంకా ఉంది