గాలికి బెయిలు కేసు: సి.బి.ఐ రాష్ట్ర వ్యాపిత దాడులు


Reddy bailరు. 10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని ‘గాలి జనార్ధన రెడ్డి’ కి సి.బి.ఐ కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేసిన కేసులో సి.బి.ఐ రాష్ట్ర వ్యాపితంగా దాడులు నిర్వహించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చినందుకు సి.బి.ఐ కేసుల కోసం నియమించబడిన ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి టి.పట్టాభి రామారావు గురువారం సస్పెన్షన్ కు గురయ్యాడు. హైద్రాబాద్, నాచారంలోని ఒక రౌడీ షీటర్, మరొక రిటైర్డ్ జడ్జిలు గాలి, జడ్జి ల మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి కూడా కుట్రలో భాగం ఉందని పత్రికల్లో వచ్చినప్పటికీ సి.బి.ఐ దానిని నిరాకరించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

పట్టాభిరామా రావు కుమారుడికి హైద్రాబాద్, అశోక్ నగర్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఉన్న లాకర్లలో రు. 2.87 కోట్లు జమ అయినట్లు సి.బి.ఐ కనుగొనడంతో జడ్జి సస్పెన్షన్ కి గురయ్యాడు. మే 11 తేదీన గాలికి బెయిల్ మంజూరు చేయడానికి ముందు లంచం ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గాలికి బెయిలిచ్చిన జడ్జి అదే కేసులో నిందితురాలిగా ఉన్న ఎ.పి అధికారి వై.శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ ను కొట్టివేశాడు. తాము హై కోర్టుకి వెళ్తామనీ, అప్పటివరకూ బెయిల్ ఆపాలనీ సి.బి.ఐ కోరినప్పటికీ జడ్జి పట్టాభి రామారావు అంగీకరించలేదు.

నాచారం, హెచ్.ఏం.టి నరగర్ లో ఉన్న రౌడీ షీటర్ యాదగిరి రావు నివాసం పైన సి.బి.ఐ బృందం దాడి చేసింది. గుడివాడలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ పైనా, చిలకరూరి పేట లోని రిటైర్డ్ జడ్జి చలపతి రావు నివాసం పైనా కూడా సి.బి.ఐ దాడులు నిర్వహించింది. యాదగిరి నివాసంలో మొత్తం రు. 6 కోట్లు పట్టుబడినట్లుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలియజేసింది.  గాలి, జడ్జి పట్టాబి రామారావు ల మధ్య ఒప్పందం కుదర్చడంలో చలపతి రావు కీలక పాత్ర పోషించాడని సి.బి.ఐ భావిస్తోంది. గాలి తమ్ముడు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు సి.బి.ఐ కనుగొన్నట్లు కొన్ని పత్రికలు రాశాయి.

‘ఓబులాపురం మైనింగ్ కంపెనీ’ అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్ధన రెడ్డి బెయిలు కోసం మొత్తం ఐదు సార్లు ప్రయత్నించి అయిదో సారి సఫలం అయ్యాడు. బెయిల్ ను ఆ తర్వాత హై కోర్టు రద్దు చేసింది. బెయిల్ విచారణ సమయంలో ఆయా వ్యక్తులు గ్రూపుగా జరిపిన కదలికలను సీసీటీవీ రికార్డు చేసిందని తెలుస్తోంది.  విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.బి.ఐ ఆశోక్ నగర్ బ్యాంకు పై దాడి చేసి లంచ సొమ్మును సీజ్ చేసినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఫిర్యాదు అందుకున్న హై కోర్టు వెంటనే జడ్జి పట్టాభి రామారావు ను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రే ఆదేశాలిచ్చిందని పి.టి.ఐ తెలిపింది. విచారణ పూర్తయ్యేవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందనీ చెబుతూ హై కోర్టు తమ అనుమతి లేనిదే హైద్రాబాద్ వదిలి వెళ్లరాదని ఆయనను కోరింది. పట్టాభి రామారావు నియామకం గత ఏప్రిల్ లోనే జరిగింది.

గురువారం రాత్రి హై కోర్టు ఛీఫ్ జస్టిస్ మదన్ బి. లోకూర్ అధ్యక్షతన జరిగిన హై కోర్టు కొలీజియం జడ్జిల సమావేశం పట్టాభి రామారావు సస్పెన్షన్ కు నిర్ణయం తీసుకున్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. పత్రిక కధనం ప్రకారం రామారావు రు. 15 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. జనార్ధన రెడ్డి తరపున బేరం ఆడినవారు ఐదు కోట్లకు బేరం మొదలు పెట్టి పది కోట్ల కుదుర్చుకున్నట్లు తెలుస్తొంది. అడ్వాన్సుగా జడ్జిమెంటుకు ముందే మూడు కోట్లు ముట్టజెప్పగా అది రెండు లాకర్లలో దొరికినట్లు తెలుస్తొంది. మిగిలిన మొత్తం జడ్జిమెంట్  తర్వాత చెల్లించేటట్లు ఒప్పందం కుదిరిందని పత్రిక తెలిపింది. మంత్రి ప్రతాప రెడ్డి, మాజి జడ్జి చలపతి రావు లు మధ్యవర్తిత్వం నెరిపినట్లు కూడా ‘ది హిందూ’ తెలిపింది. నాలుగు రోజుల క్రితమే నిందితులను సి.బి.ఐ విచారించినట్లు సదరు పత్రిక తెలిపింది. గాలి తమ్ముడు సోమశేఖర రెడ్డి మే 11 తేదీన పెద్ద మొత్తంలో డబ్బు కోర్టుకి తేవడమే సి.బి.ఐ అధికారులకు అనుమానం కలగజేసిందని పత్రిక వెల్లడించింది.

ఇదిలా ఉండగా న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి విఫల యత్నం చేశాడని ‘ది హిందూ’ తెలిపింది. తనకే పాపమూ తెలియదని ప్రతాప రెడ్డి ప్రకటనలు ఇచ్చాడు. తన తప్పుందని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించాడు. బొగ్గు కుంభ కోణానికి సంబంధించి ప్రధాని మన్మోహన్ కూడా ఇదే ప్రకటన చేశాడు. తప్పుందని తేలాక ప్రజలే రాజకీయాల నుండి సాగనంపుతారు. ఈ లోపు చేయవలసింది దర్యాప్తు కి వీలుగా పదవి నుండి తప్పుకుని సత్సంప్రదాయాలు నెలకొల్పడం. సంపాదన కోసం, అక్రమ సంపాదనను కాపాడుకోవడం కోసం రాజకీయాలను ఆశ్రయించే పెద్ద మనుషులు అలాంటి సత్సంప్రదాయాలను పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో న్యాయం, అమ్మకం కోసం సిద్ధంగా ఉంటుందన్న వాస్తవం జడ్జి పట్టాభి రామారావు ఉదంతం మరోసారి నిరూపించింది. ఒకరిద్దరు జడ్జిలు చేసే అవినీతి చర్యలు న్యాయ వ్యవస్ధ మొత్తాన్ని దోషిని చేయవన్న హై కోర్టు వ్యాఖ్యలు ఆచరణలో నిజం కాదని విదేశాలకు తరలి వెళ్ళిన కోటి కోట్ల ప్రజా ధనమే ప్రత్యక్షంగా రుజువు చేస్తోంది.

One thought on “గాలికి బెయిలు కేసు: సి.బి.ఐ రాష్ట్ర వ్యాపిత దాడులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s