ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా ఏమీ తేల్చని సి.బి.ఐ, కాంగ్రెస్ రాజకీయ శత్రువు జగన్ పైన వేగంగా విచారణ చేస్తున్నదనీ అలాంటి సి.బి.ఐ ప్రధాని పై నిస్పక్షపాతంగా ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నించింది.
“సి.బి.ఐ ప్రభుత్వం కింద పని చేస్తోంది. ఇందులో ప్రధాని నిందితుడు. సి.బి.ఐ ప్రధాన మంత్రి పై ఎలా విచారణ చేస్తుంది? ఇది హాస్యాస్పదం. సాకు మాత్రమే. ఈ విచారణ ఫలితమేమిటో మాకు తెలుసు. ప్రధాన మంత్రి తప్పేమీ లేదని అది చెబుతుంది. సింగ్ కి అది క్లీన్ చిట్ ఇస్తుంది” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. నిజాయితీపరులయిన రిటైర్డ్ జడ్జిలతో స్వంతంత్ర విచారణ చేయించాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. తప్పేమీ చేయకపోతే విచారణకి ప్రధాని ఎందుకు భయపడుతున్నాడని వారు ప్రశ్నించారు.
“విచారణకి సిద్ధమని మేము చెప్పాం. ప్రధాని ఎందుకు భయపడుతున్నాడు? అందువల్ల ఇందులో ఏదో తప్పుందని ప్రజలు భావిస్తే తప్పేమీ లేదు” అని అరవింద్ అన్నాడు. ములాయం, మాయావతి. లాలూ యాదవ్ లతో పాటు ఇతర రాజకీయ నాయకుల అక్రమాస్తులపై కూడా సి.బి.ఐ సంవత్సరాలుగా విచారణ చేస్తోందని అరవింద్ గుర్తు చేశాడు. “అయినప్పటికీ ఇంతవరకూ విలువైన విచారణేదీ జరగలేదు. కానీ పాలక యు.పి.ఏ రాజకీయ శత్రువు జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా తక్కువ కాలంలోనే అరెస్టయ్యాడు. అవినీతి వ్యతిరేక సంస్ధగా వ్యవహరించడానికి బదులు కేంద్రం రాజకీయ ఎజెండా కోసమే సి.బి.ఐ ని వాడుతున్నారని దీన్ని బట్టి అర్ధమవుతోంది” అని అరవింద్ అన్నాడు.
“ప్రధాని నిందితుడుగా ఉన్న బొగ్గు కుంభకోణంలో అలాంటి సి.బి.ఐ నిజాయితీగా విచారణ చేస్తుందా? ఇతర 14 మంత్రులపైనా నిజాయితీగా విచారణ చేస్తుందా?” అని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, అందువల్లనే తాము ‘స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం’ చేత విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపాడు. ప్రధాని మన్మోహన్ 2006-2009 మధ్య బొగ్గు శాఖ నిర్వహిస్తున్నపుడు బొగ్గు గనులను అక్రమంగా కేటాయించారని అన్నా బృందం ఆరోపిస్తోంది. తమ ఆరోపణలకు కాగ్ నివేదికను ఆధారంగా వారు చూపుతున్నారు.
తమ ఆరోపణలపై బొగ్గు మంత్రిత్వ శాఖ ఇచ్చిన స్పందనలో వాస్తవాలు లేవని అన్నా బృందం తెలిపింది. “2005 వరకూ మొత్తం 75 బొగ్గు బ్లాకులు కేటాయించారు. 2006-09 కాలంలో ఈ సంఖ్య ఒకేసారి 145 కి పెరిగింది. “2005 కి ముందు బొగ్గు గనులకు డిమాండ్ పరిమితమనీ, 2006-09 కాలానికి వచ్చేసరికి అమాంతం డిమాండ్ పెరిగిందనీ ఆ తర్వాత అసలు విస్మరించదగిన స్ధాయికి డిమాండ్ పడిపోయిందనీ ప్రధాని మంత్రి కార్యాలయం చెప్పదలిచిందా? ఆర్ధిక వ్యవస్ధలో అటువంటి ధోరణి ఉండడాన్ని వివరించే కారణాలేమిటి?” అని అన్నా బృందం ప్రశ్నించింది.
బొగ్గు గనులను వేలం వేయకుండా ఇచ్చేయడం వల్ల కేంద్ర ఖజానాకి 1.8 లక్షల కోట్లు నష్టం వచ్చిందని కాగ్ నివేదిక తెలియజేసింది. అయితే బొగ్గు గనులు దేశాభివృద్ధికీ, పారిశ్రామికాభివృద్ధికీ తప్ప ఖజానాకి ఆదాయం చేకూర్చేవి కావని ప్రభుత్వం వాదిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. దేశాభివృద్ధి కోసం సహజ వనరులను ప్రవేటు కంపెనీలకు అప్పజెపితే లోటు పూడ్చడానికి రెవిన్యూ కావాలంటూ ప్రజలపై పన్నులు బాదవచ్చన్నమాట. ప్రభుత్వం దృష్టిలో దేశాభివృద్ధి అంటే కంపెనీల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి కాదా? అభివృద్ధి పేరుతో వనరులను కంపెనీలకు రెవిన్యూ కూడా వాదులుకుని అప్పజెపుతూ అలా వదులుకున్న రెవిన్యూను పెట్రోల్ రేట్లు పెంచడం ద్వారానో, సబ్సిడీలు దిగ్గొట్టడం ద్వారానో పూడ్చుకోవాలని ప్రభుత్వాలు చూడడం తీవ్ర అభ్యంతరకరం.
ఇంటి అవసరాల కోసం మూసేసిన బొగ్గు గనుల నుండి బొగ్గు ముక్కల్ని తీసుకెళ్లే పేద ప్రజలపై సవా లక్షా కేసులు మోపి వేధించే ప్రభుత్వ చట్టాలు గనులనే అమ్ముకుంటున్న ఘనులనూ, ప్రభుత్వాధినేతలను వీసమెత్తయినా కదిలించలేకపోవడం దుర్మార్గం. విమానాల్లో ప్రయాణిస్తూ తప్పుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానంటున్న ‘అడ్డదారి ప్రధాని’ ముందు తప్పుకుని విచారణకు అంగీకరిస్తే దేశానికి మేలు.