అమెరికా లో నిర్వహించే ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ షిప్ ను ఈసారి తెలుగమ్మాయి ‘స్నిగ్ధ నందిపాటి’ గెలుచుకుంది. ప్రవాస భారతీయులు ఈ ట్రోఫీ గెలుచుకోవడం ఇది వరుసగా అయిదవసారి కావడం గమనార్హం. గత 14 సంవత్సరాలలో పది సార్లు ప్రవాస భారతీయులే ఈ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని ‘ది హిందూ’ తెలిపింది. తొమ్మిది మంది ఫైనలిస్టులలో అగ్రస్ధానం పొందిన స్నిగ్ధ 30,000 డాలర్ల (దాదాపు 16.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీతో పాటు ఒక ట్రోఫీ, $2500 సేవింగ్స్ బాండ్, $5000 స్కాలర్ షిప్, $2600 ఖరీదుగల బ్రిటానికా ఎన్ సైక్లోపీడియా పుస్తకాలు గెలుచుకుంది.
ఫ్రెంచి బాష నుండి వచ్చిన ‘guetapens’ (meaning: ambush, snare, trap) పదానికి స్పెల్లింగ్ సరిగ్గా చెప్పడం ద్వారా స్నిగ్ధ ఛాంపియన్ షిప్ ను ఖాయం చేసుకుంది. 14 ఏళ్ల స్నిగ్ధ శాన్ డీగో నివాసి అయిన ఇండియన్ అమెరికన్. బుధవారం రాత్రి ముగిసిన స్పెల్లింగ్ పోటీ నరాలు తెగే ఉత్కంఠతో, మెదడు చిట్లిపోయేంత స్ధాయిలో జరిగిందని ‘ది హిందూ’ అభివర్ణించింది.
“నాకది తెలుసు. ఇంతకు ముందు చూశాను. స్పెల్లింగ్ చెప్పే ముందు తెలుసుకోదగిన ప్రతిదాన్నీ అడుగుదామని భావించాను” అని స్పెల్లింగ్ సరైనదేనని తెలిసిన అనంతరం ఆనందభరితురాలయిన నందిపాటి స్నిగ్ధ వ్యాఖ్యానించింది. స్నిగ్ధ స్పెల్లింగ్ చెప్పిన వెంటనే ఆమెయే విజేత అని చెప్పలేదట. చిన్నగా చప్పట్లు కొడుతూ ఉండగా కొద్ది కొద్దిగా రంగుల కాగితాలు జల్లుగా కురుస్తూ, క్రమేపీ వర్షంగా మారాయనీ ఆ తర్వాతే ఆమె విజేత అని అర్ధం అయిందనీ పత్రిక తెలిపింది. వెనువెంటనే స్నిగ్ధ తమ్ముడు తుఫానులా వేదిక మీదికి దూసుకొచ్చి అక్కను చుట్టుముట్టేడని పత్రిక తెలిపింది.
నాణేల సేకరణ స్నిగ్ధ అలవాటు. ఫిజిషియన్ గానీ లేదా న్యూరో సర్జన్ గానీ కావాలని ఆమె అభిలషిస్తోంది. వయొలిన్ కూడా బాగా వాయిస్తుందనీ తెలుగు చక్కగా మాట్లాడుతుందనీ తెలుస్తోంది. మాతృ భాష తెలుగు మరవనందుకు స్నిగ్ధకూ, ఆమె తల్లిదండ్రులకూ అభినందనలు చెప్పవలసిందే. స్నిగ్ధ గత సంవత్సరం ఈ పోటీల్లో సెమీ ఫైనల్ వరకూ చేరింది.
రెండవ స్ధానంలో వచ్చింది కూడా భారత అమ్మాయే. ఫ్లోరిడా కి చెందిన స్తుతి మిశ్రా “schwarmerei” (means: excessive, unbridled enthusiasm) పదం స్పెల్లింగ్ చెప్పలేక వెనకబడింది. ఇతర పోటీదారులంతా స్పెల్లింగ్ ను మదిలో తలుచుకుంటూ గాలిలో వేళ్ళతో ఆ అక్షరాలను రాసే అలవాటు కలిగి ఉంటారు. అయితే 14 యేళ్ళ స్తుతి వేళ్ళు మాత్రం రాయడానికి బదులు కీ బోర్డు మీద టైప్ చేస్తున్నట్లు కదులుతాయని ‘ది హిందూ’ తెలిపింది. స్నిగ్ధ, స్తుతి స్వేహితురాళ్ళే.
మూడవ స్ధానంలో నిలిచింది 12 యేళ్ళ భారత్ అబ్బాయి అరవింద్ మహంకాళి. న్యూయార్క్ నివాసి. తొమ్మిది మంది ఫైనలిస్టులలో ఏడవ తరగతి చదువుతున్న అరవింద్ చిన్నవాడు. “schvonoma” (a form of nerve tumour) పదానికి స్పెల్లింగ్ చెప్పలేక మూడో స్ధానంలో ఆగిపోయాడుని ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది. మరో సంవత్సరం స్పెల్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి అతను అర్హుడు. 1999 లో మొదటిసారి ఇండియన్ అమెరికన్ నూపుర్ లాలా స్పెల్లింగ్ బీ చాణ్పియన్ షిప్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత మధ్యలో నాలుగుసార్లు తప్ప ప్రతిసారీ భారతీయులే ఈ పోటీలో అగ్రజులుగా నిలిచారు. నూపుర్ లాలా ఆ తర్వాత ‘spellbound’ డాక్యుమెంటరీలో చోటు సంపాదించినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
పోటీలో పాల్గొన్నవారిలో అత్యంత పిన్న వయస్కురాలు ‘లోరి అన్నే మాడిసన్’ వయసు ఆరేళ్లు మాత్రమే. వర్జీనియా నివాసి. “ingluvies” పదానికి స్పెల్లింగ్ చెప్పలేక బుధవారం పోటీ నుండి తప్పుకుంది. ఆ పదానికి స్పెల్లింగ్ వాస్తవంగా తనకు తెలుసుననీ అయినా తప్పు చెప్పాననీ లోరి ఆ తర్వాత చెప్పిందని ఎన్.డి.టి.వి తెలిపింది. పోటీల్లో బహామాస్, కెనడా, ఘనా, జపాన్ సౌత్ కొరియా, న్యూజీలాండ్ దేశాల నుండి కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. జమైకాకి చెందిన గిఫ్టన్ శామ్యూల్ రైట్ ఫైనలిస్టులలో ఒకరు. అతనికి 30 సెకండ్ల పాటు ‘స్టాండింగ్ ఒవేషన్’ లభించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
నందిపాటి స్నిగ్ధ తండ్రి కృష్టారావు మొబైల్ కంపెనీ క్వాల్ కామ్ లో సాఫ్టవేర్ కన్సల్టెంటు. స్నిగ్ధ కోసం ఆయన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ నే రూపొందించాడట. ఆంధ్ర ప్రదేశ్ నుండి 1995 లో వారు కృష్టారావు, మాధవి దంపతులు అమెరికాకి వలసవేళ్లారని తెలుస్తోంది.
పొటీలనేటివి ఏవైనా కానివ్వండి క్రీడలు, గాని పాటలు గాని, లేక డ్యన్స్ గాని ఏవైనా సరె ఈ పొటీతత్వం గురించి మీ అభిప్రాయం చెప్పండి శెఖర్ గారు.
రామ్మోహన్ గారూ, పోటీతత్వం సమానుల మధ్య, ఆరోగ్యకరంగా ఉన్నంతవరకూ ఆహ్వానించదగినదే. సామాజికంగా చూస్తే రోటిన్ జీవనానికి పోటీలు కిక్ ఇస్తాయి. అందులోకి వివిధ వివక్షలు ప్రవేశించడంతోనే రూపు మార్చుకుని ఎక్కువ తక్కువ స్ధాయిలను నిర్దేశించేవిగా మారుతున్నాయి. వివక్షా పూరితమైన వర్గ సమాజంలో పోటీలకు సహజంగానే అనేక అవలక్షణాలు అంటుతున్నాయి. పోటీల చుట్టూ ఉండే సమాజం ఆరోగ్యకరంగా ఉంటే పోటీలు కూడా ఆరోగ్యకరంగా, ఊపయోగకరంగా ఉండగలవు.