అమెరికా అభ్యంతరాలు పక్కకు నెట్టి ‘నార్త్-సౌత్ కారిడార్’ ముందడుగు


North south corridorఅమెరికా అభ్యంతరాలను పక్కకు నెడుతూ ‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్’ శరవేగంతో ముందుకు సాగుతోంది. ఉత్తర, దక్షిణార్ధ గోళాలను కలుపుతూ సాగే ఈ వాణిజ్య మార్గం చారిత్రాత్మక ‘సిల్క్ రోడ్’ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఇండియా, రష్యా, మధ్య ఆసియా ల మధ్య నెలపాటు ప్రయాణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్న కారిడార్ లో ఇరాన్ ది కీలక పాత్ర కావడంతో అమెరికాకి అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. కారిడార్ రూపకల్పనలో ఇండియా, ఇరాన్, రష్యాలు కీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు ‘ది హిందూ’ కధనం బట్టి తెలుస్తోంది.

నార్త్ సౌత్ కారిడార్ ఆచరణ రూపం దాల్చడానికి ఎదురవుతున్న సాంకేతిక, నిర్మాణ అడ్డంకులు పరిష్కరించుకోవడానికి ఢిల్లీలో 16 దేశాలకు చెందిన నిపుణులు సమావేశం అయ్యారు. కారిడార్ తో పాటు మరో ఆరు అనుబంధ రహదారుల ప్రగతిని కూడా సమావేశంలో చర్చించారని ‘ది హిందూ’ తెలిపింది. వాస్తవానికి సిల్క్ రోడ్ లో కూడా ఇరాన్ ది ప్రముఖ స్ధానమే. అయితే ఇరాన్ ను మినహాయిస్తూ చారిత్రాత్మక ‘సిల్క్ రోడ్’ కు కొత్త మార్పులు చేసి ఉపయోగంలోకి తేవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అభ్యంతరాలకు త్రోసిరాజంటూ నార్త్ సౌత్ కారిడార్ లో ఇరాన్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్’ లో ఇరాన్ రేవు పట్టణం ‘బందర్ అబ్బాస్’ కీలక స్ధానంలో ఉన్నది. కారిడార్ గుండా జరిగే వాణిజ్య సరఫరాలన్నీ బందర్ అబ్బాస్ పట్టణం గుండా వెళ్లవలసిందే.  వచ్చే సంవత్సరానికల్లా కారిడార్ ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని పత్రిక తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇరాన్ పై అక్రమంగా ఆంక్షలు విధిస్తూ ఆ దేశాన్ని ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న అమెరికా, యూరప్ లకు కారిడార్ వినియోగం తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. కారిడార్ వల్ల అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు ఒక కేంద్రంగా ‘బందర్ అబ్బాస్’ అభివృద్ధి చెందుతుంది. అది ఇరాన్ వాణిజ్య ఆదాయాన్ని మరింతగా పెంచుతుంది. ఇన్నాళ్లూ నిద్రాణంగా ఉన్న కారిడార్ నిర్మాణ ప్రతిపాదన ముందుకు సాగడానికి ఇండియా చొరవ ప్రధానంగా పని చేసినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది.

ఢిల్లీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. సమావేశాల్లో పాల్గొన్న నిపుణులు నాలుగు దేశాలతో కూడిన రెండు గ్రూపులను ఏర్పాటు చేసి వివిధ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. ఈ రెండు గ్రూపులలోనూ ఇండియా, ఇరాన్, రష్యాలు ఉంటాయి. అజర్ బైజాన్, టర్కీ లు నాల్గవ స్ధానాన్ని ఆక్రమిస్తాయి. మౌలిక నిర్మాణాలు, నిధుల సమీకరణ మున్నగు అంశాల కోసం అజర్ బైజాన్ తో కూడిన నాలుగు దేశాల ఉమ్మడి సంస్ధను ఏర్పాటు చేయాలనీ, కస్టమ్స్ అంశాల పరిష్కారానికి టర్కీతో ఉమ్మడి సంస్ధను ఏర్పాటు చేసి రెండింటికీ ఢిల్లీ కేంద్రంగా ఉండాలనీ నిపుణులు ప్రతిపాదించారు.

ఇరాన్ లో 500 కి.మీ దూరం రహదారి లేని సంగతిని భారత ప్రతినిధులు ఎత్తిచూపగా 372 కి.మీ కువాజ్విన్-రాష్ట్-అస్త్రా రహదారి పూర్తయిన శుభవార్త ఇరాన్ తెలియజేసిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో 163 కి.మీ రహాదారిని గుర్తించామని కూడా ఇరాన్ తెలియజేసింది. ఈ రూట్లను ఇరాన్ సాధ్యమయినంత త్వరగా పూర్తి చేయడానికి తగిన నిధులు సమకూర్చాలని నిర్ణయించారు.

ప్రధాన కారిడార్ కి సంబంధించి నిర్మాణాలు గుర్తించి పూర్తి చేయడానికి కాల పరిమితి రూపొందించడం, ఆటంకాలను గుర్తించి పరిష్కారణకు యాక్షన్ ప్లాన్ రూపొందించడం, కస్టమ్స్-ఇన్సూరెన్స్ మొదలయిన డాక్యుమెంట్లు పూర్తి చేయడం, అనుబంధ రూట్లను గుర్తించి సభ్య దేశాలు తీసుకోవలసిన చర్యలను నిర్దేశించడం అన్న నాలుగు అంశాలు లక్ష్యాలుగా తాజా సమావేశాలు జరిగాయని పత్రిక తెలిపింది. వీటి కోసం 4,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని నిపుణులు నిర్ధారించారు. పర్షియన్ గల్ఫ్, మధ్య ఆసియా, చైనా లను కలిపే ‘తూర్పు-పశ్చిమ కారిడార్’ కు నిధులు అవసరమని వారు నిర్ధారించారు. దీనిని నార్త్-సౌత్ కారిడార్ తో కలుపుతారని తెలుస్తోంది.

మధ్య ఆసియా దేశాలను ఇరాన్ ద్వారా ఇండియాకు కలిపే వాణిజ్య మార్గం లో కొన్ని పాయింట్ల మధ్య గతంతో పోలిస్తే  నెల రోజుల ప్రయాణాన్ని తగ్గిస్తుందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న నార్త్-సౌత్ వాణిజ్య మార్గంలో సముద్ర మార్గం ఎక్కువగా ఉందనీ దానివల్ల 45-60 రోజుల ప్రయాణ సమయం పడుతోందనీ నార్త్-సౌత్ కారిడార్ పూర్తయితే ప్రయాణ కాలం 25-30 రోజులకు తగ్గిపోతుందని తెలుస్తోంది.

Presentation  North-South Corridor

బుధవారంతో ముగిసిన సమావేశాలలో చేకూరిన ప్రగతితో భారత ప్రభుత్వం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అనుకున్న ప్రకారం పని నడుస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత కారిడార్ వినియోగాన్ని పరీక్షించడానికీ, దానిపై పూర్తి అవగాహన పొందడానికీ బందర్ అబ్బాస్ మీదుగా ముంబై, రష్యాల మధ్య ‘డ్రై రన్’ నడపాలని భారత వర్గాలు భావిస్తున్నాయి. పరీక్షాత్మకంగా కొన్ని సరుకులను రవాణా చేయాలని వారు భావిస్తున్నారు. నిపుణుల ప్రతిపాదనలను తదుపరి అజర్ బైజాన్ లో జరిగే ‘కోఆర్డినేషన్ కౌన్సిల్’ సమావేశాల్లో చర్చిస్తారని తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s