కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫిన్ తునా’ చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ సముద్ర జలాల్లో ఈదుతుండగా ఫుకుషిమా రేడియేషన్ కాలుష్యాన్ని గ్రహించిన తునా చేపలు అనంతరం కాలిఫోర్నియా తీరానికి వచ్చి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చేపల్లోని కాలుష్యం ప్రమాదకరం కాదనీ, అయితే వలస వెళ్ళే సముద్ర జీవుల ద్వారా కాలుష్యం ఎంతటి దూరానికైనా చేరవచ్చన్నదీ తమ పరిశోధన చెబుతోందని వారు తెలిపారు.
మార్చి 11, 2011 తేదీన జపాన్ లో పెద్ద ఎత్తున భూకంపం, అనంతరం సునామీ సంభవించడంతో ఈశాన్య తీరాన ఉన్న ‘ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం’ ప్రమాదానికి గురయిన సంగతి విదితమే. ప్రమాదం వలన అణు కర్మాగారంలో మూడు రియాక్టార్లలో ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా (complete melt down) మరొక రియాక్టర్ లో పాక్షికంగా కరిగిపోయాయి. తద్వారా వెలువడిన రేడియేషన్ పర్యావరణంలోకి ప్రవేశించింది. రియాక్టార్లలో రేడియేషన్ తో కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర జలం కూడా కలుషితం అయింది.
“వేల మైళ్ళ దూరాలతో వేరుగా ఉన్నప్పటికీ, పర్యావరణ ప్రాంతాలు (eco-regions) ఎంతగా పరస్పరం సంబంధం కలిగి ఉంటాయో మనకిది పాఠం చెబుతోంది” అని న్యూయార్క్ లోని ‘స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ’ లో మెరైన్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న నికోలస్ ఫిషర్ అన్నాడని బి.బి.సి తెలిపింది. “ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్” అనే జర్నల్ లో ఫిషర్, ఆయన సహాధ్యాయులు తమ పరిశోధన ఫలితాన్ని నివేదించారని బి.బి.సి తెలిపింది.
ఆగస్టు 2011 లో సాన్ డిగో సముద్ర జలాల్లో సేకరించిన 15 చేపల్లోనూ ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నామని ఫిషర్ బృందం తెలిపింది. జపాన్ జలాల్లో తునా చేపలు గుడ్లు పెడతాయనీ, ఒకటి నుండి రెండు సంవత్సరాలు అక్కడే పోషణ పొంది అనంతరం పసిఫిక్ సముద్రం తూర్పు తీరానికి ఆహారం కోసం బయలుదేరి వెళ్తాయని బి.బి.సి తెలిపింది.
తునా చేపల్లో కనుగొన్న రేడియేషన్ స్ధాయి చాలా తక్కువనీ, ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. సీసియం 134, సీసియం 137 ఐసోటోపులను తాము చేపలలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి సహజ అణు ధారమిక పదార్ధాలు కాదనీ, అణు పరీక్షల సమయంలోనూ, అణు ప్రమాదాల లోనూ మాత్రమే వాతావరణంలోకి ప్రవేశించే రేడియేషన్ పదార్ధాలని తెలిపారు.
అణ్వాయుధ పరీక్షల కారణంగా ‘సీసియం 137’ ఐసోటోపులు అప్పటికే సముద్రజలాల్లో ఉండే అవకాశం ఉందనీ అయితే ‘సీసియం 134’ కు చాలా తక్కువ ‘హాఫ్ లైఫ్’ ఉండడం వల్ల వేగంగా అదృశ్యం అవుతుందనీ కనుక తునా చేపల్లో కనుగొన్నది ఖచ్చితంగా ఫుకుషిమా రేడియేషనే అని నిర్ధారించవచ్చనీ ఫిషర్ బృందం నివేదిక తెలిపింది. ఇది తప్ప తునా చేపల్లో రేడియేషన్ కు మరో వివరణే లేదని నివేదిక తీర్మానించింది.
ఎంత రేడియేషన్ కనుగొన్నారు? ఫుకుషిమా ప్రమాదం జరగక ముందు తునా చేపల్లో ఉండే రేడియేషన్ కంటే 10 రెట్లు రేడియేషన్ ను ప్రమాదం తర్వాత చేపల్లో కనుగొన్నారు. అయినప్పటికీ అది కూడా ప్రమాదకరం కాదు. క్రాస్ చెకింగ్ లో భాగంగా పరిశోధకులు తూర్పు పసిఫిక్ లో మాత్రమే నివసించే ‘యెల్లో తునా’ చేపలను కూడా పరీక్షించారు. వాటిలో ప్రమాదానికి ముందూ, తర్వాతా కూడా రేడియేషన్ జాడలేవీ కనుగొనలేదు.
జాలర్లకు ‘బ్లూ ఫిన్ తునా’ చేపలు చాలా విలువైనవని బి.బి.సి తెలిపింది. అందువల్ల పరిశోధనా ఫలితం విస్తృతమైన ఆసక్తిని ఆకర్షించే అవకాశం ఉందని బి.బి.సి వ్యాఖ్యానించింది.
రానున్న నెలల్లో (బహుశా ఆగస్టు 2011 తర్వాతా?) పట్టిన చేపలపైన కొత్తగా పరీక్షలు నిర్వహిస్తారనీ, ఈ చేపలు మరింత కాలం సముద్ర జలాల్లో గడిపినందున అవి ఎంత రేడియేషన్ మోస్టున్నాయో తెలుసుకోవడం మరింత ఆసక్తికరం గా ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. జపాన్ జలాలకు వలస వెళ్ళే ఇతర జాతుల చేపలను కూడా పరీశించాలని పరిశోధకులు కోరనున్నట్లు బి.బి.సి తెలిపింది.