రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా


Sukhoi Superjet aircraft 100రష్యాకు చెందిన ‘సుఖోయ్ సూపర్ జెట్ 100’ విమానం మే నెల మొదటి వారంలో ఇండోనేషియా కొండల్లో కూలి పోవడం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా మిలట్రీ గూఢచారి సంస్ధ జి.ఆర్.యు ఆరోపించిందని ప్రెస్ టి.వి తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడే చనిపోయారు. విమానానికి గ్రౌండ్ సిబ్బందికి ఉన్న సంబంధాన్ని అమెరికా గూఢచర్య సంస్ధలు తెంపేయడంతో విమానం ప్రమాదానికి గురయ్యిందని రష్యా తెలిపింది.

“ఒక ఎయిర్ క్రాఫ్ట్ కీ గ్రౌండ్ సిబ్బందికీ మధ్య జరిగే కమ్యూనికేషన్స్ ను తెంపేందుకు గానీ, లేదా విమానంలో ఉన్న పెరామీటర్స్ లో జోక్యం చేసుకునేందుకు గానీ వారి వద్ద ‘ప్రత్యేక పరికరాలు’ ఉన్నాయన్న సంగతి మాకు తెలుసు” అని జి.ఆర్.యు కి చెందిన జనరల్ ఒకరు అన్నట్లు ‘క్రిస్టియన్ సైన్స్ మాస్టర్’ పత్రిక తెలిపింది.

కూలిపోయిన ‘సూపర్ జెట్’ పై రష్యా గొప్ప ఆశలు పెట్టుకుంది. ఆధునిక ఏవియేషన్ మార్కెట్ లో మేజర్ పాత్ర పోషించాలని రష్యా కంటున్న కలలు నెరవేర్చుకోవడానికి తన ‘సూపర్ జెట్’ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ సూపర్ జెట్ కూలిపోవడం తో రష్యా కలలు ఒక విధంగా వమ్ము అయిన పరిస్ధితి ఏర్పడింది.

మే 9 తేదీన జకార్తా నుండి బయలుదేరిన రష్యా విమానం 50 నిమిషాల అనంతరం రేడియో సంబంధాలు కోల్పోయి రాడార్ తెరపై నుండి అదృశ్యం అయింది. విమానం వాస్తవానికి మొదటి ప్రయాణంలో ఉంది. విమానాన్ని ప్రమోట్ చేయడానికి విమానం మియాన్మార్, పాకిస్ధాన్, కజకిస్తాన్ ల మీదుగా ఇండోనేషియా వెళ్లింది. అక్కడి నుండి లావోస్, వియత్నాం లకు వెళ్లవలసి ఉంది. వ్యాపార సేవలు అందించడానికి విమానాన్ని సిద్ధం చేయడానికి వీలుగా పరీక్షిస్తుండగా కూలిపోయింది.

ఇండోనేషియా రాష్ట్రం పశ్చిమ జావా లో విమానం ఒక అగ్ని పర్వతం వాలును ఢీకొని కూలిపోవడానికి ‘కమ్యూనికేషన్స్’ సంబంధాలు తెగిపోవడం తప్ప మరొక వివరణ దొరకడం లేదని జి.ఆర్.యు తెలిపింది. జెట్ లో ఉన్న పరికరాలు ఎలక్ట్రానిక్ జాన్ అవడం వల్ల సంబంధాలు తెగిపోయాయని తెలిపింది.

జకార్తా ఎయిర్ పోర్టు లో తిష్ట వేసిన అమెరికా మిలట్రీ ఎలక్ట్రానిక్ నిపుణుల కార్యకలాపాలను తాము అనేక సంవత్సరాల నుండి పరిశీలిస్తున్నట్లు కూడా జి.ఆర్.యు తెలిపినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. “విమానం ‘బ్లాక్ బాక్స్ కాక్ పిట్ వాయిస్ రికార్డర్’ చూపిన దాని ప్రకారం ఢీకొట్టడానికి నిమిషాల ముందు విమానంలో వ్యవస్ధాగత సమస్య (systemic problem) గానీ, పనిలో వైఫల్యం (functional failure) గానీ ఏమీ జరగలేదు” అని జి.ఆర్.యు సీనియర్ అధికారి పేర్కొన్నట్లు ప్రెస్ టి.వి తెలిపింది.

విమానం కూలిపోవడానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను జి.ఆర్.యు లేవనెత్తింది. టెస్ట్ పైలట్ లలో అత్యధిక అనుభవం ఉన్న అలెక్జాండర్ యాబ్లోంత్సేవ్, అత్యంత ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో వాన తుఫాను వస్తుండగా విమానం ఎత్తు తగ్గించడానికి అనుమతి ఎందుకు కోరాడు? జకార్తాలోని గ్రౌండ్ కంట్రోలర్ దానికి అనుమతి ఎందుకు ఇచ్చాడు? అన్నవే ఆ ప్రశ్నలని ప్రెస్ టి.వి తెలిపింది.

“మరో వైపు మార్కెట్ నుండి మా విమానాన్ని తొలగించడానికి ఉద్దేశ్య పూర్వకంగా చేసిన పారిశ్రామిక విద్రోహం అయ్యే అవకాశాలను మేము కొట్టేయడం లేదు” అని సుఖోయ్ కంపెనీ అధికారిని ఉటంకిస్తూ క్రిస్టియన్ సైన్స్ మానిటర్ తెలిపింది.

రష్యా అనుమానాలు అర్ధ రహితం కాదని ప్రెస్ టి.వి తెలిపింది. రష్యా నుండి పశ్చిమ యూరప్ కి రష్యా గ్యాస్ సరఫరా కోసం తలపెట్టిన పైప్ లైన్ ప్రాజెక్టు ను కోల్డ్ వార్ లో భాగంగా నాశనం చేయడానికి సి.ఐ.ఏ చేసిన కుట్రను ప్రెస్ టి.వి గుర్తు చేసింది.

12 thoughts on “రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా

 1. మీరు ఈ వ్యాసం గురించి మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను
  http://www.csmonitor.com/World/Global-News/2012/0524/Report-Russian-intelligence-suspects-US-hand-in-SuperJet-crash

  దీన్లో ఒక ముఖ్యమైన విషయం మీరు వదిలేశారు

  ” While most Russian aviation experts contacted today dismissed the sabotage theory, they say there is a deepening mystery about how Russia’s most modern civil aircraft, with all its systems apparently functioning perfectly, came to slam into the side of a mile-high volcano during a routine demonstration flight.”

  ఇవి అర్ధరహితమైన ఆరోపణలు అని రష్యాకు చెందిన నిపుణులు సైతం ఒప్పుకుంటున్నారు. ప్రమాదానికి కారణాలు ఏమైనా, అవేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు.

 2. గౌతమ్ గారూ, మీరు ఉటంకించిన భాగంలోనే విమానం కూల్చివేతలో ‘అంతుబట్టని మిస్టరీ’ ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఇంటలిజెన్స్ ది కూడా అనుమానమే తప్ప నిర్ధారణ కాదని వారి మాటలు చెబుతున్నాయి. అనుమానాలకి కొన్ని కారణాలు కూడా చెప్పారు. ఆరోపణలు, ఆరోపణల రూపంలోనే ఉన్నాయి కనుక, అలాంటివి గతంలో జరిగాయి కనుక అవి అర్ధరహితం కాకపోవచ్చు. కంపెనీ నిపుణులు కూడా అనుమనాలని బలపరిచారు. కనుక ఎంక్వైరీ పూర్తయ్యేదాక ఆరోపణలు అర్ధరహితం అనలేము.

  “ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు.”

  ఎవరికి మీ హెచ్చరిక? మీరోసారి వార్త పూర్తిగా చదవండి. నేనేమన్నా వ్యాఖలు చేసానేమో.

 3. ఆ వ్యాసం గురించి ఒక కామంటేటర్ ఇలా రాశారు
  So this article argues with anonymous quotes reprinted from another newspaper and makes that into a title
  ‘Russian intelligence suspects US hand in SuperJet crash’,
  Gossip journalism is all this is.

  నా ఉద్దేశ్యం కూడా అంతే. CSM వంటి ప్రఖ్యాత పత్రిక అటువంటి sensationalistic వ్యాసం ప్రచురించిందంటే నేను నమ్మలేక పోతున్నాను.

  కేవలం వ్యాపార లబ్ది కొరకు 100 మంది అమాయక పా్రణాలని పొట్టన పెట్టుకోవడం అనేది చాలా పెద్ద ఆరోపణ. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, Boeing (పాశెంజరు విమానాలు చేశే అమేరికన్ కంపెనీ) కి mid-range విమానాలు ప్రస్తుతం ఏమీ లేవు. SuperJet 100 పోటీ పడేది Bombardier (Canadian) మరియు Embraer (Brazilian) కంపెనీలతో కాని Boeing తో కాదు. అంతే కాకుండా, Boeing, SuperJet 100 design, marketing వంటి అంశాలలో కూడా పాల్గొంది. (http://en.wikipedia.org/wiki/Superjet_100)

  ఇటువంటి sensationalistic వ్యాసాలు, ఆరోపణలు చేయటం చాలా తేలిక. మీరు ఇది ప్రచురించే ముందు కొద్దిగా research చేయవలసిందని నా అభిప్రాయం.

 4. గౌతమ్ గారూ, మీ ఉద్దేశ్యంలో తప్పు పట్టడానికేమీ లేదు. రష్యా విమానానికి అమెరికా విమానం పోటీ లేదని సి.ఎస్.ఎం వార్తలోనే ఒక సూచన ఉంది. మీరు గమనించినట్లు లేదు. అయితే రష్యా విమానం మిడ్ రెంజే అయినా దానిని అభివృద్ధి చేసే అవకాశాలు రష్యాకి ఉంటాయి. ఆ పోటీని మొదటే అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడం కొత్తేమీ కాదు. అమెరికా, యూరప్ దేశాల విమాన కంపెనీల మధ్య కూడా నిరంతరం పోటీ నడుస్తుంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి నడుపుతుంటాయి. కనుక పోటీ లేకుండా ఉండదు. పెట్టుబడిదారీ కంపెనీలు పోటీలు పడుతూ, పోటీ లేకుండా చేసుకోవడానికి అనేకమార్గాలు అవలంబిస్తాయి. అది కొత్త సంగతి కాదు.

  వ్యాపార లబ్ది కోసం కేవలం వంద మంది (రష్యా విమానంలో చనిపోయింది యాభై మంది) అమాయకులను పొట్టనబెట్టుకోవడం పెద్ద ఆరోపణ అని మీరంటున్నారు. కాని ఒకసారి చరిత్ర చూడండి వ్యాపార కంపెనీల మార్కెట్ల కోసమే మూడో ప్రపంచ దేశాలను వందల యేళ్లు వలసలుగా చేసుకుని ఆ దేశాల అభివృద్ధిని అడ్డుకున్న చరిత్రను గుర్తుకి తెచ్చుకోండి. వలస దేశాల స్వాతంత్ర్య పోరాటాల్లో కోట్లమంది జనం ప్రాణాలు కోల్పోలేదా? రెండు ప్రపంచ యుద్ధాలు మార్కెట్ల పునర్విభజన కోసమే. డెబ్భైలనాటి ఆరో తరగతి సాంఘిక శాస్త్రం టెక్స్ట్ పుస్తకాల ప్రకారమే ఆయుద్ధాల్లో రెండు లక్షలు పైగా జనం చచ్చిపోయారు. అణు బాంబు పరీక్ష కోసం అమెరికా రెండు నగరాలను స్మశానాలుగా మార్చింది. ‘కోల్డ్ వార్’ లో భాగంగా అమెరికా, రష్యాలు అనేక దేశాలను దురాక్రమించి లక్షల మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధం ఎందుకోసం? ఆయిల్ కోస, వనరుల కోసం, ప్రభావిత ప్రాంతాల విస్తరణ కోసం, పోటీ లేకుండా చేసుకోవడం కోసం. చరిత్రలో యుద్ధాలన్నీ కంపెనీల మార్కెట్ల కోసమే. వేలాది సంవత్సరాల యుద్ధాల్లో జరిగిన జన హననం వ్యాపార లబ్ది కోసమే.

  ఈ వార్త అసలు సెన్షేషన్ కాదని మీరు గుర్తించాలి. వివిధ దేశాల కంపెనీల మధ్య సేబొటేజ్ కార్యక్రమాలు సర్వ సామాన్యం. కాకపోతే వాటికి అనేక ముసుగులు అవి తొడుగుతాయి. మానవ హక్కులు, టెర్రరిజం, కమ్యూనిస్టు భూతం, బాల కార్మికుల హక్కులు, స్త్రీల హక్కులు మొదలయినవి అలాంటి ముసుగులే. ప్రభుత్వాల సహకారం వారికి ఉంటుంది. కంపెనీల ప్రయోజనాలే ప్రభుత్వాల, ప్రజల ప్రయోజనాలుగా చెలామణి అవుతున్నాయి.

  ఈ వార్తకు సంబంధించి మీరు ప్రస్తావించిన అంశాలు మీ విషయాసక్తిని ప్రతిబింబిస్తున్నాయి. ఆ ఆసక్తిని విస్తృతపరిస్తే మరిన్ని విషయాలు మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంది.

 5. విశేఖర్ గారూ,

  నేను Boeing వంటి కంపెనీలు Industrial Sabotage లో పాల్గొనవని చెప్పటంలేదు. మీరు అన్నట్లే అది సర్వ సాధారణం. అందులోనూ దాంట్లో Boeing ది చాలా పెద్ద చరిత్ర. (Eg: Forceful merger of Douglas Aircraft).

  “అమెరికా, యూరప్ దేశాల విమాన కంపెనీల మధ్య కూడా నిరంతరం పోటీ నడుస్తుంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి నడుపుతుంటాయి. కనుక పోటీ లేకుండా ఉండదు. పెట్టుబడిదారీ కంపెనీలు పోటీలు పడుతూ, పోటీ లేకుండా చేసుకోవడానికి అనేకమార్గాలు అవలంబిస్తాయి. అది కొత్త సంగతి కాదు.”

  మీరన్నట్లే, ఈ పోటీలో నెగ్గటానికి, ఆయా కంపెనీలు ఏమన్నా చేస్తాయి. కాని, ఇలాంటి కుట్రలు పన్నడం కన్నా, మీరన్నట్లు కేసులు పెట్టి, చట్టాన్ని మార్చి, ఆంక్షలు విధించి నెగ్గడం చాలా తేలిక. అమెరికా, మరియు ఆ దేశ కంపెనీలు గత దశాబ్దాలు గా చేశేది అదే!

  ఇటువంటి తెలివి తక్కువ కుట్రలు పన్నితే, ఒకవేళ అవి భయట పడితే, అది మాయని మచ్చ కింద అయిపోతుంది. ఈ రోజుల్లో వాటిని కప్పి పుచ్చటం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. దాని కన్నా రహస్యం గా, తెలివి గా వెనుక నుండి పెత్తనం చెలాయించడం వారికి చాలా శులభం, శ్రేయస్కరం. అందుకని వారు ఈ కుట్ర పన్నారంటే నాకు నమ్మశక్యంగా లేదు.

 6. గౌతమ్ గారు, పోటీని నివారించడానికి మీరు చెప్పిన తేలిక పద్ధతి ఒక మార్గం. ఆ ఒక్క మార్గాన్నే నమ్ముకుని కంపెనీలు ఊరుకోవు కదా. మీరు చెప్పినట్లు ఎ & ఎం ద్వారా పోటీని నివారించడం మరో శక్తివంతమైన మార్గం. ఈ మధ్యలోనే చిన్న చిన్న సేబొటేజ్ లు జరుగుతుంటాయి. అనేక పద్ధతుల్లో విమానం కూల్చివేత కూడా ఒకటి కావచ్చు. ఇక్కడ మీరు గుర్తించవలసింది జనాన్ని చంపడం కంపెనీలకు పెద్ద కష్టం కాదు. వాటికి ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఉంటే యుద్ధాలు జరుగుతాయా? పైగా సేబొటేజ్ చర్యలకి ఎన్నడూ సాక్ష్యాలు దొరకవు. దొరికినా నిరాకరించడం పెద్ద పని కాదు. అవునూ, మీ స్పందన పాక్షికంగా ఉందేమి? యుద్ధాల విషయమై మీ అభిప్రాయం చెప్పలేదు.

  బహుశా ప్రపంచ యుద్ధాలు, దురాక్రమణ యుద్ధాలు, కిరాయి తిరుగుబాట్లు… వీటికీ కంపెనీల మార్కెట్ల విస్తరణకీ సంబంధం మీరింకా చూడలేకపోతున్నారేమో!?

 7. విశేఖర్ గారూ,

  యుద్దాల గురించి:
  మీరన్నది సబబే. కాని యుద్దం వేరు, ఇలాంటి కుట్ర వేరు. మీరు చెప్పే దౌర్జన్యం గతం లో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, ఇక ముందు జరుగుతానే ఉంటుంది. దానికి ఉంకో ఉదాహరణ, జాతి వివక్ష vs ద్వేష నేరాలు. (Racism vs Hate Crime). జాతి వివక్ష అనేది వ్వవస్ధలో ఉన్నలోపము. కాని Hate Crime అనేది isolated incident. మోదటిది గుర్తంచడం, రుజువు చేయటం, భాధ్యులను శిక్షీంచడం కష్టం, కాని ఏదైనా నేరాన్ని రుజువు చేయటం అంత కష్టం కాకపోవచ్చు. యుద్ధం – కుట్ర కూడా అంతే. కంపెనీలు డైరెక్టగా యుద్దాలలో పాల్గోనకపోవచ్చు, కాని యుద్దాల వల్ల, వాటికి లాభం వస్తుంది. కాని ఇలా కుట్రలలో పాల్గుని దొరికితే, కంపెనీలు అంత శులభంగా తప్పించుకోవటం కష్టం.

  “పైగా సేబొటేజ్ చర్యలకి ఎన్నడూ సాక్ష్యాలు దొరకవు. దొరికినా నిరాకరించడం పెద్ద పని కాదు.”
  ఇది పూర్తిగా నిజం కాదు. చరిత్రలో చాలా సార్లు, sabotage చేసి దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. (Eg: Richard Nixon).

  పోని sabotage ఎవరు చేశారో తేలియకపోయినా, కనిసం అది Sabotage లేక accident అనే విషయం తెలుసు కోవటం పెద్ద కష్టము కాదు. ఆ విచారణ చేశే నిపుణుల మీద నాకు ఆ నమ్మకం ఉంది.

  Speculation మరియి conspiracy theories చేయడం చాలా శులభం. అన్నిటి మీదా అనుమానాస్పదం గా (skeptical) ఉండడం కూడా తేలిక, మరియు మంచిది కాదు. అలాగయితే మన రాష్ట్రం లో అనేక మంది, వై. యస్. రాజశేఖర రెడ్డిది హత్యే అని నమ్ముతారు. వారు కూడా చరిత్రలో జరిగిన, ఎన్నో రాజకీయ హత్యలను ఉదాహరణగా చెప్తారు.

 8. యుద్ధం, కుట్ర ల మధ్య మీరు చేసిన విభజన ఒక కోణంలో నిజం. విస్తృతార్ధంలో కుట్రలు కూడా యుద్ధంలో భాగమే. యుద్ధానికీ యుద్ధానికీ మధ్య విరామమే శాంతి అన్న నానుడి వినే వింటారు.

  మరో దగ్గర చెప్పినట్లు సేబొటేజ్, కుట్ర లాంటి అంశాల్లో స్పెక్యులేషన్, కుట్ర సిద్ధాంతాలు రంగంలో ఉన్న వివిధ పార్టీల అవసరాల రీత్యా తలెత్తేవి. ఇప్పటికే ఏర్పడి ఉన్న ఒక ప్రపంచ వ్యవస్ధలోని వ్యాపార, రాజకీయ అవసరాల కోసం అవి జరుగుతున్నాయి. కుట్ర సిద్ధాంతాలు నమ్మడం, నమ్మకపోవడం ఒక సంగతైతే అలా నమ్మడం నమ్మకపోవడం వల్ల అవేవీ ఆగబోవడం లేదన్నది మరో సంగతి. అయితే అలాంటి అంశాలు ప్రజా జీవనం పైన ఎలాంటి ప్రభావం పడుతోందన్నదే ముఖ్యం.

  ఇలాంటి ఘటనలు (కూల్చివేత లేదా ప్రమాదం, అనంతర సిద్ధాంతాలు) వివిధ దేశాల మధ్య సంబంధాలని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపైన కూడా పడుతుంది. అనుకూలంగానూ, ప్రతికూలంగానూ కూడా. ఇండియా-రష్యా-అమెరికా ల మధ్య త్రైపాక్షికంగానూ, ద్వైపాక్షికంగానూ ఈ ఘటన ప్రభావం పడవచ్చు. దానికోసమే ఈ కుట్ర సిద్ధాంతాలనీ, ఆరోపణలూ ప్రత్యారోపణలనూ ప్రస్తావించుకోవడం.

 9. నేనొక న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్నాను. అంతర్జాతీయ, జాతీయ వార్తలు రాయడంలో మీ బ్లాగ్ నాకు ఉపయోగపడుతోంది. థ్యాంక్యూ సర్….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s