జైలుకు జగన్: ట్రయల్ ఖైదీ 6093


Jailed Jaganజగన్ బెయిల్ పిటిషన్ ను సి.బి.ఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎ.పుల్లయ్య తిరస్కరించాడు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించాడు. జగన్ అరెస్టు చట్ట విరుద్ధం అన్న జగన్ న్యాయవాదుల వాదనలను జడ్జి తిరస్కరించాడు. సాక్షులను భయపెట్టి, సాక్ష్యాలను తారుమారు చేయగల స్ధాయిలో జగన్ ఉన్నాడని భావిస్తూ ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండడమే సరైందని తీర్పు ప్రకటించాడు. జగన్ ను తమ కస్టడికీ ఇవ్వాలన్న సి.బి.ఐ కోరికను కూడా జడ్జి తిరస్కరించాడు. జూన్ 12 న ఉప ఎన్నికలు జరగనుండగా, జూన్ 11 వరకు చంచల్ గూడ జైలులో జగన్ గడపనున్నాడు.

అండర్ ట్రయల్ ఖైదీ నెం. 6093 ను జగన్ కు కేటాయించినట్లు వార్తా చానెళ్లు చెబుతున్నాయి. ఆయనను వి.ఐ.పి ఖైదీగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న ప్రత్యేక ఖైదీలలో జగన్ పదవ వాడని టి.వి 9 చెబుతోంది. జైలులో ఏ రోజు ఏ కూర పెడతారో, స్వీట్లు ఎప్పుడు ఇస్తారో, చికెన్ ఎప్పుడు పెడతారో టి.వి 9 సవిరంగా చెబుతోంది. జగన్ జైలుకి చేరిన పుణ్యమాని రాష్ట్ర ప్రజలకు చంచల్ గూడ జైలు ఖైదీలు ఏం తింటున్నారో తెలుసుకునే అవకాశం దొరికింది.

“సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేయగల స్ధాయి, స్ధానం నిందితుడికి ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది. సెక్షన్ 309 ప్రకారం ఆయనను జ్యుడీషియల్ రిమాండ్ కి పంపవలసిన అవసరం ఉంది” అని జడ్జి పుల్లయ్య తీర్పు ఇచ్చినట్లు ‘ది హిందూ’ తెలిపింది. సాయంత్రం 6 గంటల కల్లా జగన్ ను చంచల్ గూడ జైలుకి పోలీసులు తెచ్చిన దృశ్యాలను చానెళ్లు ప్రసారం చేశాయి.

ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జగన్ ను సి.బి.ఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి ఆయన దిల్ కుశా అతిధి గృహంలోనే ఉంచారు. అతిధి గృహం ముందు బైఠాయించిన ఆయన తల్లి, భార్య, చెల్లిలు, బావ, ఇంకా ఇతర వై.కా.పా నాయకులను పోలీసులు అక్కడినుండి తొలగించి వారి ఇల్లు లోటస్ పాండ్ కి తరలించారు. అనంతరం వారు తమ ఇంటి ముందు నిరవధిక దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.

సోమవారం జగన్ కోర్టుకి హాజరు కావలసి ఉండగా ముందే ఆయనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అని జగన్ తరపున వాదించిన ప్రముఖ లాయర్లు ముగ్గురు వాదించారు. వారి వాదనలను జడ్జి తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల సొమ్ముని జగన్ అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు తరలించుకున్నాడని సి.బి.ఐ లాయర్లు వాదించారు. ఆయన అక్రమ సంపాదన విషయంలో మూడు రోజులపాటు తాము వేసిన ప్రశ్నలకు జగన్ సరిగ్గా సమాధానం ఇవ్వలేదని జడ్జికి తెలిపారు. సరైన సమాధానాలు ఇవ్వకుండా తనను అక్రమంగా అరెస్టు చేశాడని వాదించే హక్కు జగన్ కి లేదని తెలియజేశారు.

ప్రజల సొమ్ముని అక్రమంగా నోక్కెసి నల్ల డబ్బుగా విదేశాలకు తరలించాడనీ, అక్కడి నుండి హవాలా మార్గంలో నల్ల డబ్బుని దేశంలోకి తెచ్చి తెల్ల డబ్బుగా మార్చుకున్నాడనీ సి.బి.ఐ న్యాయవాది వాదించాడు. అలాంటి వ్యక్తిని వదిలితే సాక్షులను తేలికగా ప్రభావం చేయగలడనీ, సాక్ష్యాలను తారుమారు చేస్తాడనీ వాదించాడు. ఆయన వాదనతో జడ్జి ఏకీభవించాడు. అయితే జగన్ ను కస్టడీకి ఇవ్వడానికి తిరస్కరించాడు. మరో కస్టడీ పిటిషన్ వేయడానికి సి.బి.ఐ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.

కోర్టులో జడ్జి ని ఉద్దేశించి జగన్ మాట్లాడినట్లు ‘ది హిందూ’ తెలిపింది. “ఈ కేసులన్నీ నాపైన ఎందుకు మోపారో, నన్ను ఎందుకు అరెస్టు చేశారో నాకు తెలియదు. 18 అసెంబ్లీ స్ధానలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాను. దేశం మొత్తం ఈ ఉప ఎన్నికలవైపు చూస్తున్నది” అని జగన్ జడ్జికి తెలిపాడు. “వారు నన్ను అరెస్టు చేసినంతవరకూ నా ప్రచారం మానుకుని మరీ వారితో సహకరించాను. మీరు కేస్ డైరీ చూసుకోవచ్చు. మీరు కేస్ డైరీ చూసుకోవచ్చు. బహుశా వారు కోరిన పద్ధతుల్లో నేను సమాధానాలు ఇచ్చి ఉండకపోవచ్చు” అని జగన్ వాదించాడు. రు. 10  ముఖ విలువ గల సాక్షీ షేర్లు రు. 350 లకు అమ్ముడయ్యాయని చెబుతూ జగన్ “సాక్షికి అసలు విలువే లేదా” అని వాపోయాడని పత్రిక తెలిపింది. దేశంలోనే సాక్షి ఎనిమిదవ అతి పెద్ద సర్క్యులేషన్ గల దిన పత్రిక అని జగన్ చెప్పినట్లుగా తెలిపింది.

అవినీతి, ఫోర్జరీ, పబ్లిక్ సర్వెంట్ గా నమ్మకాన్ని వమ్ము చేయడం, మోసం లకు సంబంధించిన సెక్షన్లను జగన్ పై మోపినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. 14 రోజుల సి.బి.ఐ కష్టడికి కోరినప్పటికీ జ్యుడీషియల్ రిమాండు కే జడ్జి మొగ్గు చూపాడు.

జగన్ పాపులారిటీని అడ్డుకోవడానికే జగన్ ని అరెస్టు చేశారన్న ఆరోపణలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించాడు. జగన్ పాపులారిటీ కోల్పోతున్నందున ఆయన అక్రమ ఆస్తులపై జరిగిన అరెస్టుకు రాజకీయ కారణాలున్నట్లు మభ్య పెడుతున్నాడనీ, తన ఆర్ధిక అక్రమాలనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడనీ తెలిపాడు. రాజశేఖర రెడ్డి చావును రాజకీయం చేయడానికి ఆయన భార్య ప్రయత్నించడాన్ని ఆయన ఖండించాడు.

ఇదిలా ఉండగా జగన్ కు రిమాండ్ విధించిన వార్తను బి.బి.సి కవర్ చేసింది. పి.టి.ఐ వార్తా సంస్ధ అందించిన వార్తా ఫోటోను బి.బి.సి ప్రచురించింది. తండ్రి మరణించాక ముఖ్య మంత్రిత్వాన్ని జగన్ ఆశించాడనీ, అది దక్కకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్నాడని వివరించింది. 

4 thoughts on “జైలుకు జగన్: ట్రయల్ ఖైదీ 6093

  1. >> జగన్ జైలుకి చేరిన పుణ్యమాని రాష్ట్ర ప్రజలకు చంచల్ గూడ జైలు ఖైదీలు ఏం తింటున్నారో తెలుసుకునే అవకాశం దొరికింది. >>

    భలే రాశారు! ఇరవై నాలుగ్గంటల చానల్స్ వల్ల అనవసరమైన విషయాలన్నీ ప్రాముఖ్యం గల వార్తలైపోతున్నాయి. త్రీడీ ఇమేజ్ ల గారడీతో, పేరడీ పాటల హంగామాతో టీవీలన్నీ ప్రేక్షకులకు కాలక్షేపం కల్పించటానికి యథాశక్తి తంటాలు పడుతున్నాయి.

  2. అదే కదా! ప్రజలకు లేనివన్నీ ఇప్పుడు వై.కా.పా నేతలకు బాగా గుర్తొస్తున్నాయి. ఇదేమి ప్రజాస్వామ్యం? లాంటి ప్రశ్నలు వారే వేస్తున్నారు. ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కుని కంపెనీలకి అప్పజెప్పి అప్పనంగా నల్లడబ్బు సంపాదించి, ప్రజల ఆస్తి హక్కుని కూడా కాజేసిన వై.ఎస్.ఆర్ పుత్రుడికి, భార్యకు, కూతురు కోడళ్లకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తోంది. ప్రజాకంటకుడు ప్రజల కనీస ప్రజాస్వామిక హక్కుల్ని హరించిన రోజున ఈ మహాతల్లులకు, నాయకులకు ప్రజాస్వామ్యం తెలియలేదు. అప్పట్లో వారికి అదొక లగ్జరీ మరి.

  3. జగన్ కు జనం ఆదరణ ఉందన్న కారణంతో అతని అక్రమాలు ఒప్పుకావు. దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి.. జనం ఆదరణ… ఏ జనం ఆదరిస్తున్నారు. జనం ఆదరించేది నిజమే ఐతే…మరి జగన్ అక్రమాల గురించి మట్లాడే వాళ్ళు జనం కారా.? జనం ఆదరిస్తున్నారు అని ఎలా నిర్ణయిస్తున్నారు.? దీని మీద ఎవరైనా సర్వే చేసారా.? మీటింగ్ లకు,సభలకు జనం భారీగా వస్తే అదే ఆదరణా? మరి కాంగ్రెస్, తె. దే.పా మీటింగ్ లకు కూడా జనం వస్తున్నారు కదా?

    మన దేశం లో సభలకు జనం ఎలా వస్తారో అందరికీ తెలిసిందే కదా? విద్య, (సరైన) రాజకీయ అవగాహన చాలా తక్కువగా ఉన్న మన దేశంలో కేవలం జనం అదికంగా సభలకు వచ్చారనో, ఓట్లు అధికంగా వచ్చినంత మాత్రాన రాజకీయ నేతల తప్పులు ఒప్పులు కాబోవు. ఐతే ఇందులో జనాన్ని తప్పు పట్టాల్సింది కూడా ఏమి లేదు. ఎందుకంతే వాళ్ళకు తక్షణం ఏది అవసరమో దాన్ని సమర్దిస్తారు. 500 నోటు, కోసం ఓటూ అమ్ముకుంటారు. ఇందుకు కారణం వాళ్ళకు చదువు లేకనే అనుకోవదానికి లేదు. చదువుకున్న వాళ్ళూ, నాగరికులు అనబడే వాళ్ళు చాలామంది సిటీల్లో ఓట్లు వేయరు. ఏ ఐ.పీ.యల్. మ్యాచ్ చూసుకుంటూ…మరో వైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో విశ్లేషణ కూడా చేస్తారు.

    మొత్తంగా చెప్పేదేమంటే జనం ఆదరణ బట్టి రాజకీయ నాయకుడి మంచి చెడు చెప్పలేం. అంతో ఇంతో స్ప్రుహ ఉన్నవాళ్ళు, ప్రజల్లో విద్యను, సమగ్ర రాజకీయ అవగాహనను పెంచడం ద్వారా పరిస్థితి మార్చగలం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s