అలో బి.బి.సి… నీ కిది తగునా?


BBC wrong photoసిరియా ‘కిరాయి తిరుగుబాటు’ కు సంబంధించి పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు సిరియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి మరోసారి లోకానికి వెల్లడయింది. 2003 సంవత్సరంలో ఇరాక్ యుద్ధంలో తీసిన ఫోటోను ఆదివారం సిరియాలో జరిగిన హత్యాకాండగా చెప్పడానికి బి.బి.సి చేసిన ప్రయత్నం ‘ది టెలిగ్రాఫ్’ వెల్లడి చేసింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల ఆయుధ, ఫైనాన్స్ సాయంతో, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి మత ఛాందస ప్రభుత్వాల ప్రత్యక్ష మద్దతుతో సిరియా ప్రజలు ఎదుర్కొంటున్న కిరాయి తిరుగుబాటుకు పశ్చిమ పత్రికలు ఇస్తున్న దుర్మార్గ ప్రచారం ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది.

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలను కవర్ చేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ‘మార్కో డి లౌరో’ తాను తొమ్మిదేళ్ల క్రితం ఇరాక్ లో తీసిన ఫోటో తాజా ఫోటో గా Not_houla_but_Iraqబి.బి.సి వెబ్ సైట్ లో ప్రత్యక్షం కావడంతో దాదాపు కుర్చీ నుండి కింద పడిపోయానని ‘టెలిగ్రాఫ్’ కి తెలియజేశాడు. “నేను తీసిన పిక్చర్ లలో ఒక దానిని బి.బి.సి వెబ్ సైట్ ఫ్రంట్ పేజీలో ముద్రించింది. అవి సిరియాలో నిన్న జరిగిన హత్యాకాండకు సంబంధించిన పిల్లల శవాలని అందులో రాసింది. ఫోటోను ఒక ఏక్టివిస్టు పంపాడని రాసి ఉంది. తీరా చూస్తే అది నేను తీసిన పిక్చర్. అది నా వెబ్ సైట్ లో ఉంది. సద్దాం తర్వాత ఇరాక్ యుద్ధంలో ఒక స్టోరీకి సంబంధించి నేను తీసినది. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఏమంటే బి.బి.సి లాంటి వార్తా మాగజైన్, ఫోటో ఎక్కడి నుండి వచ్చిందో చెక్ చేసుకోకపోవడం. ఏక్టివిస్టు అనో, సిటిజన్ జర్నలిస్టుననో ఎవరైనా ఫోటో పంపితే దాన్ని ప్రచురించడానికి బి.బి.సి సిద్ధంగా ఉందన్నమాట” అని మార్కో టెలిగ్రాఫ్ తో మాట్లాడుతూ అన్నాడు.

(బి.బి.సి వెబ్ సైట్ లో ప్రచురించిన ఫోటోను టెలిగ్రాఫ్ పత్రిక స్క్రీన్ షాట్ తీసి తన వెబ్ సైట్ లో ప్రచురించింది. దానిని పైన చూడవచ్చు. మొదటి ఫోటో మార్కోస్ వెబ్ సైట్ నుండి సంగ్రహించినది.)

సిరియా ప్రభుత్వ దాడులని చెబుతూ బి.బి.సి, రాయిటర్స్, సి.ఎన్.ఎన్, ఎ.పి లాంటి వార్తా సంస్ధలు అనేక వార్తలు, ఫోటోలు ప్రచురిస్తున్నాయి. అనేక వందల మంది ప్రజలను సిరియా ప్రభుత్వ బలగాలు చంపుతున్నట్లు లెక్కలు ప్రకటిస్తున్నాయి. కానీ వాటికి ఆధారాలేవీ చెప్పవు. మరణాల లెక్కలు, ఫోటోలు, వీడియోలు తమకు సిరియా ఏక్టివిస్టులు పంపుతున్నట్లుగా అవి చెబుతున్నాయి. వార్తలకు, మరణాల లెక్కలకూ తమ వద్ద ఆధారాలు లేవని నామ మాత్రంగా చెబుతూ వార్తల నిండా సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్ణనలు నింపేస్తున్నాయి.

అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని సిరియా ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఎక్కడో జరిగిన ఆందోళనల ఫోటోలను సిరియా ఆందోళనలుగా పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెబుతూ వచ్చింది. సిరియా ప్రభుత్వ బలగాలు టెర్రరిస్టు చర్యలలో పెద్ద ఎత్తున మరణిస్తున్నప్పటికీ వాటిని సైతం ప్రభుత్వ దాడుల్లో చనిపోయినవారిగా ప్రచారం చేస్తున్నారని చెబుతూ వచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ సైతం సిరియా ప్రభుత్వం చెబుతున్న వివరాలను పట్టించుకోకుండా ఊరూ పేరూ లేని ఏక్టివిస్టుల అబద్ధాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారని సిరియా ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. సిరియా ప్రభుత్వ ఆరోపణలు నిజాలని గతంలో అనేక సందర్భాల్లో వెల్లడయింది. ఇప్పటి టెలిగ్రాఫ్ వెల్లడి మరొకటి మాత్రమే.

“ఒకరు తీసిన పిక్చర్ ను ప్రాపగాండా కోసం, ఒక లక్ష్యం కోసం మరొకరు వాడుతున్నారు” అంటూ మార్కొస్ చేసిన వ్యాఖ్యానం ఈ పరిస్ధితిని చక్కగా తెలియజేస్తోంది. తన ఫోటోను తన అనుమతి లేకుండా బి.బి.సి సంస్ధ వాడుకున్నందుకు తనకు ‘ఆపాలజీ’ చెప్పడం, చెప్పకపోవడం పెద్ద విషయం కాదని మార్కొస్ అన్నాడు. “ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఒక న్యూస్ మేగజైన్, నిన్ననే సిరియాలో జరిగిన ఒక హత్యాకాండకు రుజువుగా అన్నట్లు ఒక పిక్చర్ కలిగి ఉంది. కానీ అది చెబుతున్న దానికి బదులుగా ఆ పిక్చర్ 2003 లో తీసింది. అది కూడా పూర్తిగా భిన్నమైన హత్యాకాండకి సంబంధించినది” అని మార్కోస్ వ్యాఖ్యానించాడు.

టెలిగ్రాఫ్ వెల్లడి తర్వాత బి.బి.సి సదరు ఫోటోను వెబ్ సైట్ నుండి తొలగించింది. ఫోటో సాధికారత ను తెలుసుకోలేకపోయామని వార్తలోనే రాశామని బి.బి.సి తన చర్యను సమర్ధించుకుంది. ఇలాంటి సిగ్గులేని సమర్ధనలు పశ్చిమ దేశాల వార్తా సంస్ధలకు కొత్తేమీ కాదు. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం తమ వార్తల ద్వారా, విశ్లేషణల ద్వారా రాజకీయ మద్దతు అందించడం వాటికి కొత్తేమీ కాదు. ముఖ్యంగా లిబియా కిరాయి తిరుగుబాటు విషయంలోనూ, ఇరాన్ అణు విధానం విషయంలోనూ, సిరియా ప్రభుత్వం ఎదుర్కొంటున టెర్రరిస్టు చర్యల విషయంలోనూ ‘అరబ్ తిరుగుబాటు’ బేనర్ కింద అవి అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశాయి.

ఇప్పుడు చర్చలో ఉన్న హౌలా టెర్రరిస్టు హత్యాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన ప్రకటనను కూడా సిరియా ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టిన విషయం ఈ సందర్భంగా పరిగణించవచ్చు. హౌలా హత్యాకాండ కు బాధ్యులు ఎవరన్నదీ ఇంకా తెలియలేదని సిరియాలో ఉన్న ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం నాయకుడు మేజర్ జనరల్ రాబర్ట్ మూడ్ సమితికి పంపిన నివేదికలో చెప్పినప్పటికీ కౌన్సిల్ ప్రకటన మాత్రం హత్యాకాండకు సిరియా ప్రభుత్వ బలగాలు కారణం అన్నట్లుగా ప్రకటన జారీ చేశాయి. ఈ తప్పుడు ప్రకటనను సిరియా కు చెందిన సమితి రాయబారి బషర్ జాఫ్రీ తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన జారీ చేశాడు. సిరియా ప్రభుత్వం ఆర్టిలరీ మరియు ట్యాంకులతో దాడి జరపడం వల్ల హత్యాకాండ చోటు చేసుకుందన్నట్లు సమితి ప్రకటన జారీ చేయడాన్ని ఆయన తన ప్రకటనలో ఖండించాడు.

హౌలా హత్యాకాండకు ‘సాయుధ గ్రూపులు’ బాధ్యులని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. సిరియా ప్రభుత్వం కంటే సాయుధ టెర్రరిస్టు గ్రూపుల ప్రచారాలనే సమితి విశ్వసించడాన్ని బట్టి సిరియా లో శాంతికి ఎవరు సుముఖంగా ఉన్నారో స్పష్టం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s