అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్


అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. గ్వాంటనామో బే జైలు మూసేస్తానని హామీ ఇచ్చిన ఒబామా తన హామీ నిలబెట్టుకోలేకపోయాడనీ, ప్రపంచ వ్యాపితంగా అనేక మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన జార్జి బుష్ ని అరెస్టు చేయడంలో కెనడా విఫలం అయిందనీ విమర్శించింది.

“అమెరికా, ఆల్ ఖైదాల మధ్య ప్రపంచ వ్యాపితంగా సాయుధ ఘర్షణ జరుగుతోందన్న అమెరికా సొంత సిద్ధాంతం ప్రకారం (లాడెన్ హత్యకు సంబంధించిన) ఆపరేషన్ జరిగిందని అమెరికా పాలనా వ్యవస్ధ స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతంలో అమెరికా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల అమలుని గుర్తించదు” అని ఆమ్నెస్టీ తన బుధవారం నాటి నివేదికలో విమర్శించింది. “అమెరికా అధికారులు మరింత స్పష్టత ఇవ్వడానికి నిరాకరించిన నేపధ్యంలో ‘ఒసామా బిన్ లాడెన్’ హత్య చట్ట విరుద్ధం గా కనిపిస్తోంది” అని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొందని ‘ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్’ పత్రిక తెలిపింది.

యెమెన్ పై మానవ రహిత డ్రోన్ విమానాలతో బాంబు దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరుడు సమీర్ ఖాన్ ని మరో ఇద్దరినీ దారుణంగా హత్య చేసిన విషయంలో వివరణ కోరినప్పటికీ అమెరికా సమాధానం ఇవ్వలేకపోయిందని ఆమ్నెస్టీ నివేదిక తెలిపింది. “న్యాయబద్ధమైన అధికారం ఏమీ లేకుండానే ఈ హత్యలకు అమెరికా పాల్పడినట్లు స్పష్టమవుతోంది” అని నివేదిక ఆరోపించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ నేతృత్వంలో అమెరికా పాలనా వ్యవస్ధ సాగించిన మానవ హక్కుల ఉల్లంఘనలను ఆమ్నెస్టీ తీవ్రంగా విమర్శించింది. నేర విచారణా బాధ్యత లేకుండా అధికారులు వ్యవహరించిన పద్ధతిని ఖండించింది. గత అక్టోబరులో జార్జి బుష్ కెనడా సందర్శించినప్పటికీ ఆయనను అరెస్టు చేయడంలో విఫలం అయిందని విమర్శించింది. “టార్చర్ తో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరాలకు ఆయన పాల్పడినట్లు సాక్ష్యాలు ఉన్నప్పటికీ” అరెస్టు చేయలేదని విమర్శించింది.

“రహస్య డిటెన్షన్లు, రెండిషన్లతో సి.ఐ.ఏ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు జార్జి బుష్ పాలనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యత వహించినవారు లేరు” అని చట్ట బద్ధ విచారణకు అర్హత లేకుండా స్వతంత్ర పౌరులను ఒక దేశం నుండి మరో దేశానికి తరలించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలను ఉద్దేశిస్తూ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది.

సి.ఐ.ఏ కష్టడిలో ఇద్దరు డిటెయినీలు మరణించడంపై అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ జూన్ 2011 లో క్రిమినల్ విచారణ ప్రారంభించినప్పటికీ  అనేక ఇతర ఇంటరాగేషన్ హింసలపై విచారణ ఉపసంహరించుకున్నాడని అమ్నెస్టీ విమర్శించింది. గ్వాంటనామో బే జైలు మూసివేయడంలో బారక్ ఒబామా విఫలం కావడం పట్ల ఆమ్నెస్టీ విచారణ వ్యక్తం చేసింది. 2011 చివరి నాటికి, గ్వాంటనామో జైలు మూయడానికి తనకు తాను విధించుకున్న గడువు పూర్తయి రెండు సంవత్సరాలు దాటాక, 171 మంది ఇంకా అక్కడే బందీలుగా ఉన్నారనీ, మిలట్రీ కమిషన్ నేరస్ధులుగా నిర్ధారించిన నలుగురు కూడా అందులో ఉన్నారనీ మానవ హక్కుల సంస్ధ విమర్శించింది.

సెప్టెంబరు 11, 2001 దాడులకు పధకం వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు అనుమానితులను గ్వాంటనామోకి తరలించక ముందు అమెరికా నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి సమాచారం లేకుండా రహస్యంగా తన కస్టడీలో ఉంచుకుందని ఆమ్నెస్టీ ఆరోపించింది.

అమెరికా జైళ్ళలోని దుర్భర పరిస్ధితులపైనా ఆమ్నెస్టీ విమర్శలు గుప్పించింది. కొందరు ఖైదీలను ఒంటరి గదుల్లో రోజులో గంటల తరబడి కొనసాగించడాన్ని విమర్శించింది. గత ఒక్క సంవత్సరంలోనే 43 మందిని విష పూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. “1976 లో అమెరికా సుప్రీం కోర్టు మరణ శిక్షాలపై మారిటోరియమ్ ఎత్తివేసిన తర్వాత మరణ శిక్షల సంఖ్య వీటితో 1277 కి చేరుకుందని తెలిపింది.

***                                                ***                                                      ***                                                      ***

నోట్: బిన్ లాడెన్ ను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా హత్య చేయడంపై ఈ బ్లాగ్ లో గతంలో వార్తలు రాసాను. అలా రాయడం “లాడెన్ ను వెనకేసుకు రావడం గా” కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. లాడెన్ ను వెనకేసుకొస్తున్నందుకు విశేఖర్ టెర్రరిస్టా అంటూ బోడిగుండుకీ మోకాలుకీ ముడి పెడుతున్నారు. లాడేన్ హత్య అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన గా పేర్కొన్న ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ కూడా ఇప్పుడు లాడేన్ ను వెనకేసుకొస్తున్నట్లుగా వీరి ప్రకారం భావించాల్సి ఉంటుంది. ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు మాని నిర్మాణాత్మక విమర్శలు చేయగలిగితే పాఠకులకు ఉపయోగంగా ఉంటుంది.

బూతులు రాస్తున్నవారిని బ్లాగింగ్ లో కి అడుగు పెట్టకుండా చెయ్యడం బ్లాగర్లందరి కర్తవ్యం. (ఈ రోజు కూడా ‘లిధుయేనియాలో ఫుకుషిమా రేడియేషన్ కనుగొన్నట్లు రాసిన ఆర్టికల్ కింద ఒక వెధవ, లంపెన్ అసహ్యకరంగా బూతులు రాశాడు) బూతు భాగోతానికీ అంతర్జాతీయ రాజకీయాలపై చేస్తున్న విశ్లేషణలకీ ముడి పెట్టడం వల్ల బూతుగాళ్ళ ప్రశంసలతో పాటు వ్యక్తిగత అహం సంతృప్తి పడితే పడవచ్చు గానీ  ఏ ప్రయోజనమూ ఉండదు. అది గ్రహించి ఆ వైపు కృషి చేయడం ఉత్తమం.

5 thoughts on “అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

  1. నాకు తెలిసినంత వరకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక anti-communist సంస్థ. అమ్నెస్టీ ఇంటర్నేషన్ ఇండియా శాఖవారు CPI(మావోయిస్ట్) బాల సైనికులని ఉపయోగించుకుంటోంది అని ప్రచారం చెయ్యడంలో పోలీసులకి సహకరించారు. ఆ సంస్థ virulent anti-communists అయిన అమెరికా సామ్రాజ్యవాదుల గురించి నిజాలు బయట పెడితే దాన్ని మనం పక్షపాతం అనుకోలేము.

  2. బ్లాగుల్లో విషప్రచారాలు చేస్తున్నారు అన్న దానికి నేను రియాక్టయితే, మీరు .. బ్లాగులో రాసిన బూతులన్నీ నాకే అంటగట్టారు. నా సంస్కారాన్ని ప్రశ్నించారు. అందుకే దానికి కౌంటరుగా ఒసామాను సమర్ధిస్తున్నారు కదా మరి మీరు టెర్రరిస్టా అని ప్రశ్నించాను. నేను వేసింది కౌంటరు ప్రశ్న, మీరు నా మీద మోపింది అపవాదు. రెండింటికీ చాలా తేడా ఉంది.

  3. బూతుల్ని బ్లాగిజంలా అమలు చేస్తున్నారని రాజు గారు వ్యాఖ్యానిస్తే, బూతుగాళ్లు లంపెన్ లు, వెధవలు అవుతారు పట్టించుకోవద్దని ఆయనకి చెప్పాను. మధ్యలో ‘మీ భావజాలాన్ని అంగీకరించని కారణంగా వారిని అలా దూషించడం విచిత్రం’ అంటూ మీరొచ్చారు. బూతులకి ‘భావజాలం వ్యతిరేకత’ అంటూ సర్టిఫికేట్ ఇవ్వడం ఏమిటసలు? అమ్మల్నీ, అక్కల్నీ పచ్చిగా తిడుతుంటే దానికి భావజాలం స్ధాయిలో గౌరవం ఇచ్చినందున వారికి ఇచ్చిన గౌరవమే మీకూ ఇవ్వక తప్పని పరిస్ధితి మీరే కల్పించారు.

    అమెరికా ప్రపంచాధిపత్యాన్ని తిరస్కరించడంలో ఒసామా పాత్రని నేను విశ్లేషించాను. దాన్ని తీసుకెళ్ళి ఒసామాని నేను సమర్ధిస్తున్నట్లు తప్పుడు అర్ధం తీయడం సరికాదు. జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపైన వార్తా విశ్లేషణ రాస్తున్నపుడు అందులోకి రచయితల్ని వ్యక్తిగతంగా లాగడం కూడా పద్ధతి కాదు. విశ్లేషణలో అభ్యంతరం ఉంటే దాన్ని చర్చకి తేవాలి. ఇలా వార్తల్లో వ్యక్తులకి వార్తలు రాసే వారితో సంబంధం అంటగట్టడం కరెక్ట్ కాదు.

    నా బ్లాగ్ ప్రారంభం నుండి బూతుగాళ్లతో పడుతున్నాను. నిరంతరం నాకు అదొక సమస్యగా ఉంది. అలాంటివారికి గౌరవం ఇస్తూ వారిని వెనకేసుకుస్తే సహించే సమస్యే లేదు. వాళ్ళలో మీరొకరు కాకపోతే మంచిది. ఆ అంశం వరకూ గ్రహిస్తున్నా.

    మరొక సంగతి. ఇలా వ్యాఖ్యల ద్వారా మీతో చర్చించే ఆసక్తి నాకు లేదు. ఏనాడూ కార్మికవర్గం గురించి పట్టించుకోని స్ట్రాస్ కాన్ లాంటి బూతు వెధవలు సోషలిస్టనీ, కమ్యూనిస్టనీ వాదిస్తుంటారు. కమ్యూనిస్టు సూత్రాలు అసలేవీ తెలియకుండానే గుడ్డిగా ద్వేషిస్తుంటారు. అలాంటి వాటికి స్పందించడానికేవీ ఉండదు. అలా కాకుండా నిర్మాణాత్మకంగా విమర్శలు చేయగలిగితే మీ బ్లాగ్ లో రాస్తుండండి. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల పైనా, ప్రజలకి దానివల్ల వచ్చే మేలు పైనా ఆర్టికల్స్ రాస్తే తప్పనిసరిగా చర్చిస్తాను. మీ విమర్శల్లో చర్చాంశాలు ఉన్నపుడు నేనూ పోస్టుల ద్వారా స్పందిస్తాను. పశ్చిమ దేశాల్లో మహిళా చట్టాల వలన మగవారు ఎదుర్కొంటున్న సమస్యలకి సంబంధించి మీరు ఉపయోగకరమైన చర్చ చేశారు. అలాంటివి మీ బ్లాగ్ లో రాస్తే నేను తప్పకుండా స్పందిస్తాను. ఆల్ ది బెస్ట్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s