వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చెప్పగా, ఐదు రోజుల కస్టడీకి అనుమతించినట్లు ఈ టి.వి తెలిపింది. మరో వైపు కీడు శంకించిన జగన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. శుక్రవారం (మే 25) తేదీన ఆయన సి.బి.ఐ ముందు హాజరు కావలసి ఉంది. సి.బి.ఐ విచారణని జూన్ 15 కి వాయిదా వేయాలన్న జగన్ కోరికను కోర్టు తిరస్కరించింది.
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను సి.బి.ఐ అరెస్టు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో బుధవారం ఏడు గంటల పాటు ఆయనను విచారించిన సి.బి.ఐ గురువారం మరో రెండు గంటల పాటు విచారించి అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జగన్ విచారణ జరగనుండడంతో ఇప్పటికే ఉద్విగ్నతతో నిండిన రాష్ట్ర రాజకీయాలు మోపిదేవి అరెస్టుతో ఒక్కసారిగా వేడెక్కాయి. మోపి దేవి అరెస్టును ఇంతకుముందే కొన్ని పత్రికలు ఊహించాయి. బుధవారం ఆ ఊహలు నిజం కాకపోయినా గురువారం నిజం కావడంతో విలేఖరులకు, విశ్లేషకులకు పని పెరిగింది.
ప్రస్తుతం జగన్ గుంటూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆయనను ప్రశ్నించడానికి సి.బి.ఐ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఈ విచారణను జూన్ 15 కి వాయిదా వేసేలా ఆదేశించాలని జగన్ కోర్టును కోరాడు. ఆయన కోరికను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్ధులను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నదనీ, దానిలో భాగంగానే తనను అరెస్టు చేయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారనీ జగన్ ప్రచారంలో ఆరోపించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
శుక్రవారం విచారణకు పిలిచిన సి.బి.ఐ జగన్ ను అరెస్టు చేయవచ్చని కొంతమంది ఊహిస్తున్నారు. ఈ అనుమానంతోనే జగన్ ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) కోరినట్లు తెలుస్తోంది. జగన్ అరెస్టుతో ఆయన పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలు దెబ్బతింటాయని కొందరు ఊహిస్తున్నప్పటికీ గత అనుభవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. జగన్ పై అవినీతి ఆరోపణలు కొనసాగుతుండగానే, ఆరోపణలపై సి.బి.ఐ విచారణ కొనసాగుతుండగానే వివిధ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్ధులు కొందరు విజయం సాధించారు. జగనే స్వయంగా పార్లమెంటు ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించాడు.అటువంటి పరిస్ధితుల్లో జగన్ అరెస్టు వల్ల ఆయనపై సానుభూతి పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి అనుచరుడు శ్రీరాములు రాజీనామా చేసి మరీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన పరిస్ధితి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.
ప్రజా ధనాన్ని నేరుగా బొక్కిన ఆరోపణల కంటే సానుభూతికే ప్రజలు ఎక్కువ విలువ ఇవ్వడం ఒక విచిత్ర పరిస్ధితి. వ్యక్తుల అవినీతి చరిత్రకూ, వారి పాలన వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టాలకూ సంబంధాన్ని ప్రజలు చూడలేని బలహీనత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నేతల అవినీతి ప్రజా పాలనలోని విధానాలకు సంబంధించినదేననీ, ప్రజలను కొల్లగొట్టే విధానాలే అవినీతికి అవకాశం కల్పిస్తున్నాయనీ ప్రజలకు తెలిసే అవకాశం తక్కువగా ఉంటోంది. నేతల అవినీతి పైన పుంఖాను పుంఖాలుగా వార్తలు, విశ్లేషణలు ప్రచురించే పత్రికలు, చానెళ్లు అవినీతికీ, పాలకుల విధానాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని వెల్లడి చేయడంలో ఆసక్తి చూపకపోవడం విచారకరం.
జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన అవినీతికి సహకరించిన ఆరుగురు రాష్ట్ర మంత్రుల చర్యలను కూడా విచారించాలని గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు సి.బి.ఐ ని కోరింది. ఆరుగురు మంత్రులు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తో కుమ్మక్కయ్యి జగన్ వ్యాపార సామ్రాజ్యానికి పెట్టుబడులు ప్రవహించేలా విధాన నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నూతన ఆర్ధిక విధానాల ఫలితంగా నిర్మించ తలపెట్టిన ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’ (సెజ్) లను విచ్చలవిడిగా అనుమతించి భూములను అన్యాక్రాంతం చేయడానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మంజూరయిన ‘వాన్ పిక్’ (VANPIC – Vodarevu and Nizampatnam Ports & Industrial Corridor) అనే సెజ్ కోసం అప్పనంగా అదనంగా భూములు అప్పగించేలా మోపిదేవి సహకరించారని సి.బి.ఐ ఆరోపించింది. వాడ రేవు లోనూ, నిజాం పట్నంలోనూ సెజ్ పరిధిలోకి రాని భూములను కూడా వాన్ పిక్ ప్రమోటర్ కి అప్పజెప్పారని సి.బి.ఐ ఆరోపించింది. నిబంధనలు ఉల్లంఘించి వాన్ పిక్ ప్రాజెక్టుకు అనేక అక్రమ అనుమతులను మంత్రులు సమకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. మోపిదేవి అరెస్టుతో ఇతర ఐదుగురు మంత్రుల్లో గుబులు బయలుదేరిందని చానెళ్లు వ్యాఖ్యానిస్తున్నాయి.
మంత్రి మోపిదేవిని దిల్ కుశా అతిధి గృహం వద్ద మధ్యాహ్నం 1:30 కి అరెస్టు చేశారు. సెక్షన్ 120-B, 420, 409, 427-A ల కింద ఆయనపై అభియోగాలు సి.బి.ఐ మోపిందని ‘ది హిందూ’ తెలిపింది. మోపిదేవి అరెస్టు తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. రాజీనామాను ముఖ్యమంత్రి గవర్నర్ కి పంపినట్లు చానెళ్లు చెబుతున్నాయి.
అప్ డేట్:
యాంటిసిపేటరీ బెయిల్ కోసం జగన్ పెట్టుకున్న దరఖాస్తును జడ్జి తిరస్కరించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. శుక్రవారం ఆయన సి.బి.ఐ ముందు హాజరు కానున్నాడు. మాచెర్లలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ప్రచారాన్ని మధ్యలోనే ఆపి హైద్రాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మోపిదేవి అరెస్టు కి నిరసనగా ఆయన నియోజకవర్గం రేపల్లే లోనూ, స్వంత పట్టణం నిజాం పట్నం లోనూ హింస చెలరేగింది. రేపల్లేలో బస్సు అద్దాలు పగలగొట్టి మున్సిపల్ ఆఫీసులో ఫైళ్లను తగలబెట్టారు. ఈ దాడులకి మోపిదేవి తమ్ముడు నాయకత్వంలోని 300 మంది నిర్వహించారు. నిజాం పట్నంలో 500-600 వరకూ గుంపుగా వచ్చి విధ్వంసం సృష్టించారు. రెండు ఆర్టీసి బస్సులను తగలబెట్టడమే కాక ఎం.డి.ఒ ఆఫీసులో ఫైళ్లు కూడా తగలబెట్టారు. అనంతరం పోలీసు స్టేషన్ ను చుట్టుముట్టి ధర్నాకి దిగినట్లు తెలుస్తోంది.