గత కొద్ది నెలలుగా పతన దిశలో ఉన్న రూపాయి విలువ బుధవారం మరో రికార్డు స్ధాయికి పతనం అయింది. ఉదయం డాలరుకి రు. 55.52 పై లతో ప్రారంభమై సాయంత్రం 3 గంటల సమయానికి 74 పైసలు పతనమై రు. 56.13 పై లకు పతనం అయిందని ‘ది హిందూ’ తెలిపింది. మరో పక్క యూరో, యెన్ లతో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. అయితే స్వంత కారణాలవల్ల యూరో, యెన్ లు పతనం అవడమే దీనికి కారణం. దిగుమతిదారులనుండి డాలర్ కి విపరీతంగా డిమాండ్ పెరగడం, విదేశీ ఫండ్ ల నుండి నిధులు బైటికి వెళ్లిపోవడం, ఈక్విటీలు బలహీనంగా ఉండడం రూపాయి పతనానికి కారణాలుగా తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే కీలక విలువల రు. 55, రు. 56 విలువ కంటే పతనం కావడం అభిలషణీయం కాదని ఫారెక్స్ డీలర్లు (విదేశీమారక ద్రవ్య వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత మార్చి నుండి రూపాయి 12 శాతం పైనే పతనం అయింది. పతనం అరికట్టడానికి రిజర్వ్ బ్యాంకు ప్రయత్నాలు చేసినా పని చేయలేదని తెలుస్తోంది. మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడులు వరదలా తరలివెళ్ళడమే రూపాయి పతనానికి ముఖ్య కారణమని ఫారెక్స్ డీలర్లను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. అమెరికా కరెన్సీ భద్రమైనదిగా భావిస్తున్నందునే ఇది జరుగుతోందని వారు తెలిపారు. గ్రీసు దేశం యూరో జోన్ నుండి బైటికి వెళ్లిపోతుందన్న భయాలతో డాలర్ కి డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఒక్క మంగళవారమే ఎఫ్.ఐ.ఐ లు (ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) రు. 283 కోట్ల షేర్లు అమ్మేశారని పత్రిక తెలిపింది. ఎఫ్.ఐ.ఐ ల పెట్టుబడులు పూర్తిగా అస్ధీరమైనవి. తక్షణ లాభాల కోసం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లలోకి వేగంగా పరుగులు పెడుతుంటాయి. చైనా లాంటి దేశాలు వీటి ప్రవేశంపైన నిబంధనలు విధిస్తే భారత దేశం వాటికోసం ప్రోత్సాహకాలు ప్రకటించే దశలోనే ఉంది. ఎఫ్.ఐ.ఐ ల వల్లనే 1990 ల్లో ‘ఆసియా టైగర్లు’ గా పేరు పొందిన ఆగ్నేయాసియా దేశాలు పేకమేడల్లా కూలిపోయాయి.
కరెన్సీ విలువ తగ్గితే least denominated coins చెల్లకుండా పోతాయి. మా చిన్నప్పుడు ఐదు పైసలు నాణేలు చెల్లేవి. ఇప్పుడు అర్థ రూపాయి నాణేలు కూడా మార్కెట్లో ఎవరూ తీసుకోవడం లేదు.