కేంద్ర ప్రభుత్వం జనాన్ని మరో సారి చావు దెబ్బ కొట్టింది. పెట్రోల్ ధరలు లీటర్ కి ఒకేసారి రు. 7.54 పైసలు పెంచింది. ఈ స్ధాయిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇదే మొదటి సారి. గతంలో రెండు సందర్భాల్లో లీటర్ కి రు. 5 రూపాయలు పెంచినా ఆ గీత ఎన్నడూ దాటలేదు. ఆరు నెలలు ఓపిక పట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ దెబ్బ ఒకేసారి వేసింది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్ కి రు. 73.18 కి చేరుకుంది.
రూపాయి పతనం వల్ల తక్షణం ఆయిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయిల్ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు. రూపాయి విలువ పతనం నేరుగా ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుందో ఈ విధంగా అనుభవంలోకి వచ్చినట్లయిది. అయితే, ఇది ప్రారంభం మాత్రమే. వినియోగదారులు వాడుకునే సరుకులన్నింటినీ వాహనాలే మోయాలి కనుక సరుకుల ధరలు కూడా పెరగుతాయి. డీజెల్ ధరలు పెరగలేదు గనక అది చెప్పుకుని తృప్తీ పడడమే. రానున్న రోజుల్లో అదీ పెరగక తప్పదు.
పెంచిన ధరలు బుధవారం అర్ధ రాత్రి నుండి అమలులోకి రానున్నాయి. కానీ పెట్రోల్ బంకుల యజమానులు అంతవరకూ ఓపిక వహించరని అనుభవం చెబుతోంది. గతంలో మే 24, 2008 న రు. 45.56 నుండి రు. 50.56 కీ ఆ తర్వాత మే 15, 2011 తేదీన రు. 58.37 నుండి రు. 63.37 కీ అత్యధిక మొత్తంలో ధరలు పెరిగాయి. ఆ తర్వాత తీవ్ర స్ధాయిలో పెట్రోల్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి.
కేంద్ర ప్రభుత్వం జూన్ 2010 నుండి పెట్రోల్ ధరలను డీ కంట్రోల్ చేసింది. అయితే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వల్ల గత ఆరు నెలలుగా పెట్రోల్ ధరలు పెంచే సాహసం చేయలేకపోయింది. పెట్రోల్ కంపెనీలు నష్టం వస్తున్నాయంటూ యాగీ చేసినా ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఆ వార ఒకే సారి జనంపై భారం మోపింది. చిన్న దెబ్బల్ని ఆపినా అన్నింటినీ కలిపి పెద్ద దెబ్బ ఎప్పుడోకప్పుడు తప్పదని ప్రజలకి మరోసారి పాఠం నేర్పింది.
డీజిల్ తో పాటు వంట గ్యాస్, కిరోసిన్ ధరల్ని ప్రభుత్వం ప్రస్తుతం ముట్టుకోలేదు. బహుశా ఉప ఎన్నికలు అడ్డుపడి ఉండవచ్చు. వీటి ధరలు పెంచాలంటే ఉన్నత స్ధాయి మంత్రివర్గ కమిటీ సమావేశం సమావేశం జరగాలని తెలుస్తోంది. ఈ కమిటీకి ఆర్ధిక మంత్రి ప్రణబ్ నాయకత్వం వహిస్తున్నాడు. కమిటీలో యు.పి.ఏ కి చెందిన ఇతర పార్టీల సభ్యులూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇది సమావేశం కాలేదు. గత సంవత్సరం జూన్ తర్వాత వీటి ధరలు పెంచలేదు. కనుక త్వరలో సమావేశం అయి ఆ లోటు కూడా పూడ్చుకునే ప్రమాదం పొంచి ఉంది.
మెట్రో నగరాల్లో పెంపుదల ఈ విధంగా ఉంటుందని ‘ది హిందూ’ తెలిపింది.
పెంపుకి ముందు | తర్వాత |
|
ఢిల్లీ |
65.64 |
73.18 |
కోల్ కతా |
70.03 |
77.88 |
ముంబై |
70.66 |
78.57 |
చెన్నై |
69.55 |
77.53 |
ఆరు నెలలు పెట్రోల్ ధరలు పెంచకుండా ప్రజలపై ప్రేమ నటించిన కేంద్ర ప్రభుత్వ నాటకాన్ని ఇక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు స్వీకరిస్తాయి. కొన్ని రోజుల పాటు ప్రజలపై పడిన ఆర్ధిక భారం గురించి కన్నీళ్లు పెట్టుకుంటాయి. తగ్గించేదాక నిద్రపోమని శపపధాలు చేస్తాయి. సామాన్య మానవుడి గతేంటని ఆక్రోశిస్తాయి. తాము అధికారంలో ఉన్నప్పుడూ చేసింది అదేనన్న సంగతిని మర్చిపొమ్మంటాయి. కొందరు ఆందోళనలకూ దిగుతారు. ఎడ్లబండ్లపై ప్రయాణం, సైకిల్ పైన అసెంబ్లీ, పార్లమెంటులకి రావడం, ఆటో కార్లు లాంటి వాటిని తాళ్ళతో లాగడం వంటి వినూత్న ఆందోళనలు పట్టణ వీధుల్లో నాటకాన్ని రక్తి కట్టిస్తాయి. టి.వి చానెళ్లు ప్రతిపక్ష రాజకీయ నాయకుల అరుపులతో, శాపనార్ధాలతో, సవాళ్ళతో, శపధాలతో హోరెత్తిస్తాయి. ఒకటో, రెండో వారాలయ్యాక పరిస్ధితి సద్దుమణుగుతుంది. ప్రజలపై భారం మాత్రం కొనసాగుతుంది.
ఓరి నాయనో
?!
650 ml బీర్ బాటిల్ ధర 85 రూపాయలు. రేపు పెట్రోల్ ధర ఆ స్థాయికి పెరిగి పెట్రోల్ కూడా మద్యంలాగే విలాస వస్తువు అవుతుంది.
తక్కువ ధరకు పెట్రోలు సరఫరా చేసే ఇరాన్ నుంచి కాకుండా..అమెరికా ప్రయోజనాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే
ఈ భారం. తమ దేశ ప్రజల కష్టసుఖాల కన్నా దోపిడీ దారుల ప్రయోజనాలే ముఖ్యం అనుకునే ప్రభుత్వాలు ఉండడం దురద్రుష్టం.