మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?


Mamata one year 02శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ ముద్రవేసి ఇంటర్వ్యూ నుండి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. ముఖాముఖీలో హాజరై ఆమెకి నచ్చని ప్రశ్నలు అడిగినందుకు విద్యార్ధినీ, విద్యార్ధులకు మావోయిస్టులతోనూ, సి.పి.ఐ(ఎం) తోనూ సంబంధాలున్నాయేమో విచారించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది.

టౌన్ హాల్ లో ఏం జరిగిందో ఫస్ట్ పోస్ట్ పత్రిక సవివరంగా నివేదించింది. మమతాగ్రహం కి సంబంధించిన వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు.

ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మోడరేటర్ సాగరికా ఘోష్ టి.వి ముందు వేదికపైన ఆసీనులై ఉండగా ప్రశ్నలు అడగడం ప్రారంభం అయింది. కార్యక్రమం కొనసాగుతుండగా జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్ధి తమ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ అంబికా పాత్ర అరెస్టు విషయంపై ప్రశ్న సంధించారు. (మమత బెనర్జీ పై గీసిన ఒక కార్టూన్ ను తన మిత్రులకు ఈమెయిల్ ద్వారా పంపిణీ చేశాడన్న ఆరోపణతో ప్రొఫెసర్ పైన మమత కేసు నమోదు చేయించింది.) దానితో మమత మొఖంలో అసహనం ఛాయలు ప్రవేషించాయి. “అది కార్టూన్ కాదు” అని ఆమె స్పందించింది. “కార్టూన్ అనేది వేరే విషయం. ఆయన సి.పి.ఎం మనిషి. తన (హౌసింగ్) సౌసైటీ ఈమెయిల్ ను వారి ఆమోదం లేకుండా దుర్వినియోగం చేశాడు. 60 మందికి దాన్ని ఫార్ వర్డ్ చేసాడు.”

అనంతరం మమత సాగరికా ఘోష్ వైపు తిరిగి గత సంవత్సరం ఎన్నికలు పూర్తయ్యాక సి.పి.ఎం పార్టీ తన ఇమేజ్ దెబ్బతినేలా వేల కొద్దీ సి.డీలు పంపిణీ చేసిందని చెప్పింది. “మీరు మహిళ ఐతే, వాటిని చూసినట్లయితే, మీరు సిగ్గుపడతారు” అని తెలిపింది. సి.పి.ఎం, మావోయిస్టులు “కలిసి పని చేస్తునారు” అని ఆమె ఆరోపించింది. (ఎన్నికల ముందేమో మమత, మావోయిస్టులు కలిసి పని చేశారని సి.పి.ఎం పార్టీ ఆరోపించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. మమత తో కలిసి పని చేసినందుకు మావోయిస్టులు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని కూడా సి.పి.ఎం పార్టీతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.)

అనంతరం మమత తమ పార్టీ నాయకులు చేస్తున్న ఓ ఆరోపణలు ప్రస్తావించింది. అంబికేష్ మహాపాత్ర కార్టూన్ లో ‘వేనిష్!’ అన్న డైలాగ్, కోడ్ రూపంలో ఉన్న సందేశం అని ఆరోపించింది. తనను హత్య చేయడానికి సి.పి.ఎం మద్దతుతో కుట్ర జరుగుతున్నదని ఆమె ఆరోపించింది. “‘వేనిష్’ అనే పదంతో ఉన్న కార్టూన్ సందేశం హత్య కుట్రకు సంబంధించినది. సి.పి.ఎం మద్దతుటు ఉన్న కుట్రలో భాగం” అని మమత పేర్కొంది. ప్రొఫెసర్ సైబర్ క్రైమ్ లో దోషి అని ఆమె ఆరోపించింది. అదేమీ అమాయక కార్టూన్ కాదనీ “తన హత్య కోసం పన్నిన రాజకీయ కుట్ర” అనీ ఆమె వివరించింది. “మావోయిస్టులు, సి.పి.ఎం వాళ్ళూ ఈ ప్రశ్నలు వేస్తున్నారని నాకు తెలుసు” అని ప్రశ్నలు అడుగుతున్నవారిపై ఆగ్రహం తెచ్చుకుంది.

ఈ దశలో జాదవ్ పూర్ యూనివర్సిటీ కి చెందిన విద్యార్ధిని తన్యా భరద్వాజ్ మరో ప్రశ్న వేయడానికి లేచింది. ఇతర యూనివర్శిటీల నుండి taniya_mamataవిద్యార్ధులు లేరా అని మమత మోడరేటర్ ను ప్రశ్నించింది. “ఇంకా అనేక యూనివర్సిటీలు ఉన్నాయి కదా. మీరు చెప్పండి ఎందుకని… ఇతరుల సంగతేంటి?” అని ప్రశ్నించింది. ప్రశ్న అడిగిన విద్యార్ధినిని ఉద్దేశిస్తూ “నువ్వు మావోయిస్టువా?” అని తీక్షణంగా ప్రశ్నించింది. అప్పటికే స్టన్ అయిన విద్యార్ధిని “నేను మావోయిస్టుని కాను” అని బదులిచ్చింది.

మోడరేటర్ సాగరికా ఘోష్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలగురించి ప్రశ్నించగా మమత కొట్టేపారేసింది. “నేరాలు లేవు. మహిళలపై నేరాలే లేవు” అంటూ తిరస్కరించింది. మరో విద్యార్ధి లేచి మమత పాత ప్రకటనని ప్రస్తావించారు. మావోయిస్టు నాయకుడు చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ ను చంపడం తప్పని మమత ప్రకటించిందని గుర్తు చేస్తూ ఆ ప్రకటన ఉద్దేశ్యం ఆమె మావోయిస్టులకి మద్దతు ఇస్తున్నట్లా అని ఆమె అనుమానాన్ని ఆమెకే తిప్పికొట్టాడు. మమత తన ఆగ్రహాన్నీ, అసహనాన్నీ కొనసాగించింది. “మావోయిస్టులకి మేము మద్దతు ఇవ్వలేదు. ఇది తప్పు” అని పేర్కొంది.

ఇంకా అనేక అంశాలు ఉండగా మావోయిస్టుల చుట్టూనే తిరగడం పట్ల తీవ్ర అసహనం ప్రకటించింది. ప్రశ్నలు అడుగుతున్న విద్యార్ధులకు సమాధానం ఇవ్వడం బదులు మీరు మావోయిస్టులా అని అడగడం వల్లనే చర్చ ఆ సమయంలో మావోయిస్టుల చుట్టూ జరుగుతుందన్న నిజాన్ని ఆమె గ్రహించలేదు. “వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్?” అంటూ సాగరికాను ఆగ్రహంగా ప్రశ్నించింది.

“మావోయిస్టు జనం ఉన్నారిక్కడ. వాళ్ళు మావోయిస్టు విద్యార్ధులు. మావోయిస్టు ప్రశ్నలకు, సి.పి.ఎం ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేను” అనడంతో ముఖాముఖీకి హాజరైనవారంతా నిశ్చేష్టులుగా మిగిలారు. “వారు సి.పి.ఎం కేడర్. నేను సమాధానం ఇవ్వను. సాధారణ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మీరు సి.పి.ఎం అని చెప్పడానికి సారీ. మీరు ఎస్.ఎఫ్.ఐ కేడర్లు. మీరంతా మాకు తెలుసు” అని ప్రేక్షకులను ఉద్దేశించి చెబుతూ మమత ఆగ్రహంతో ఊగిపోయింది.

ఈసారి సాగరికా వైపుకి తిరిగిందామె. “మీరు నాకు ముందు చెప్పలేదు” అని ఆగ్రహించింది. మోడరేటర్ నచ్చజేబుతుండగానే కుర్చీ నుండి లేచింది. మరో ప్రశ్నకు వెళదామని సాగరిక చెబుతుండగానే వేదిక నుండి విసురుగా కిందిగి దిగిపోయింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనకు సంవత్సరం ముగిసిన సందర్భాన్ని కూడా మమత భిన్నంగా రికార్డు చేసిందని ఫస్ట్ పోస్ట్ పత్రిక వ్యాఖ్యానించింది. తనను తాను మమత అసహన మూర్తిగా, దురహంకారిగా, అనుమానపు రాజకీయ నాయకురాలిగా  చూపుకుందని అభివర్ణించింది.

తన ప్రశ్నకి పెద్దగా ప్రాముఖ్యం లేదనీ, మమత బెనర్జీయే తన ప్రశ్నకు ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టిందనీ అనంతరం తాన్యా వ్యాఖ్యానించినట్లు ఫస్ట్ పోస్ట్ తెలిపింది. “ఆమెను ఏదయినా అడగడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. చాలామందికి అది రాదు. అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? (మమత) ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడూ చెబుతుంటారు. కాని ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటింగే కాదు. అది భావప్రకటనా స్వేచ్ఛ కూడా.”అని తాన్య వ్యాఖ్యానించింది.

ప్రజాస్వామ్యం అంటే ఓట్లు కాదనీ, ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అనీ చెప్పిన తాన్య అభిప్రాయం వాస్తవానికి మమత ఒక్కరికే వర్తించదు. ఈ దేశంలో ప్రజలని తాగుడుతో, డబ్బులతో అనేక రకాలుగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుని అధికారం వచ్చాక వారిని ఏమాత్రం పట్టించుకోకుండా స్వలాభం చూసుకుంటున్న భారత రాజకీయులందరికీ వర్తిస్తుందన్నది నిర్వివాదాంశం.

7 thoughts on “మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

 1. విశేఖర్ గారు, బెంగాల్ లో ఇంతకు ముందు అధికారంలో వున్న సి.పి.యం. పార్టీ పరిశ్రమల కొసం పేదల భూములు లాక్కుందని విన్నాను. దాన్ని గురించి నాకు పూర్తి సమాచారం తెలియదు. మీరు ఇంతకు ముందేమైనా టపా రాసుంటే దాని లింకు ఇవ్వగలరా, లేకపొతె మీకుతెలిసిన సమాచారం ఇవ్వగలరా.

  భారత దేశ ముఖ్యమత్రులలో ఇంత అసహనానికి గురైయ్యెది ఈమే ననుకుంటా. ఎన్నికలలో మావోయిస్టులకు దగ్గరైన ఈమె ఇప్పుదెందుకు వాళ్ళపైన దండెత్తిందో మరి.

 2. అమెరికాలో పర్యావరణ పరిరక్షణ గురించి వ్రాసిన ఒక రచయితని కమ్యూనిస్ట్ అని విమర్శించినవాళ్ళు గుర్తొస్తున్నారు ఈమెని చూస్తోంటే.

 3. రామ్మోహన్ గారూ, సింగూరు లో టాటా చిన్న కారు ‘నానో’ కోసం రైతుల దగ్గర్నుండి లెఫ్ట్ ప్రభుత్వం భూములు లాక్కుంది. భూములు ఇవ్వనన్నందుకు రైతులపైన తీవ్ర పోలీసు నిర్బంధం ప్రయోగించింది. వారి భూముల్లో సంవత్సరానికి మూడు పంటలు పండే భూములుంటే అవన్నీ బీడు భూములనీ, ఒకే పంట పండేవి కొన్ని ఉన్నాయని ప్రచారం చేసింది. లెఫ్ట్ ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అనేక పార్టీల వాళ్లు ఉన్నారు. వారికి త్రిణమూల్ నాయకత్వం వహించింది. చంద్రబాబు కాలంలో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం వహించినట్లన్నమాట. ఇది ప్రజలకోసం జరుగింది కనుక ఎం.ఎల్ పార్టీలు కూడా అందులో పాల్గొన్నాయి.

  ఆ తర్వాత నందిగ్రాంలో వందల ఎకరాల భూముల్ని మలేషియా బిలియనీర్ సలీం గ్రూపుకి అప్పగించింది. అక్కడ జనం అంతా వాస్తవంగా సి.పి.ఎం కి ఓట్లేసారు. అయినా వారికి ద్రోహం చేయడానికి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇక్కడ పోరాటం చాలా ఉధృతంగా జరిగింది. జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనం పైన లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు దౌర్జన్యాలకి దిగారు. తుపాకులు పట్టి పోలీసుల్లో దూరి కాల్పులు కూడా చేశారు. అత్యంత ఘోరంగా, ఆటవికంగా జనాన్ని వాళ్లు చిత్రహింసలు పెట్టారు. చాలామందిని చంపారు. ముఖ్యంగా సి.పి.ఎం పార్టీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన సంఘాల కార్యకర్తలు తుపాకులు ధరించి ప్రజలపైన దౌర్జన్యాలు చేశారు. పచ్చి గూండాయిజం అమలు జరిపారు.

  లెఫ్ట్ ప్రభుత్వం దమనకాండ పైన జరిగిన పోరాటంలో మళ్ళీ మమత పార్టీయే నాయకత్వం వహించింది. ఎం.ఎల్ పార్టిలకి బలం లేకపోవడం వల్ల ఉద్యమాలకి వారు నాయకత్వం ఇవ్వలేకపోయారు. అయితే గణనీయంగా ప్రజలని సమీకరించినట్లు పత్రికల వార్తల ద్వారా తెలిసింది.

  ఆ తర్వాత లాల్ ఘర్ లో పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అద్భుతమైన ఉద్యమం తలెత్తింది. సంవత్సరం న్నర పైగా ప్రజలే, అచ్చంగా ప్రజలే ఈ పోరాటాన్ని నిర్వహించుకున్నారు. వీరికి మావోయిస్టుల మద్దతు ఉందని చెప్పినా మొదట అది కనపడలేదు. వారి చర్యలు ప్రజల ఉద్యమానికి ఏమీ సహాయపడకపోగా మరింత నిర్భంధానికి ఉద్యమం విచ్ఛిన్నం కావడానికే దారితీసిందని నేను చదివిన కొన్ని వెబ్ సైట్ ల ద్వారా తెలిసింది. మావోయిస్టుల చేతుల్లోకి ఉద్యమం వెళ్లనంతవరకూ ప్రజల పాత్ర అద్వితీయంగా ఉద్యమంలో కొనసాగింది. కాని చివరికి వచ్చేసరికి పేలుళ్లకీ, హత్యలకీ మావోయిస్టుల పాల్పడడంతో పోలీసు నిర్బంధం తీవ్ర స్ధాయిలో ప్రయోగించడానికి లెఫ్ట్ ప్రభుత్వానికి అవకాశం చిక్కింది.

  వీటన్నింటిలో మమత పాత్ర పైపైవరకే పరిమితం. కాని ఉద్యమాల క్రెడిట్ అంతా ఓట్ల రూపంలో ఆమెకే పోయింది. మావోయిస్టులు యధావిధిగా ఒకరికి వ్యతిరెకంగా మరొకరికి ఓట్లు వేయించే పనికి పూనుకున్నారని పత్రికల్లో వార్తలు బట్టి అర్ధం అయింది. టి.డి.పి కి వ్యతిరేకంగా చెన్నారెడ్డికీ, వై.ఎస్.ఆర్ కి ఓట్లు వేయించడం, లెఫ్ట్ కి వ్యతిరేకంగా మమత కి ఓట్లు వేయించడం… ఇవేమి మార్క్సిస్టు-లెనినిస్టు ఎత్తుగడలో నాకు ఎప్పటికీ అర్ధం కావు. ఓ వైపు ఎన్నికల బహిష్కరణ అంటూ మరో పక్క ఒకరికి వ్యతిరేకంగా మరొకరికి లోపాయకారిగా ఓట్లు వేయించే ఎత్తుగడ వారు పాటించడం ప్రజలకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు ఇంతవరకూ. కనీసం ఉద్యమాలకి కూడా. సరే. అదొక సంగతి.

  భారత దేశంలో నూతన ఆర్ధిక విధానాలు అమలు మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం కంటె ముందే బెంగాల్ ప్రభుత్వం ‘నూతన పారిశ్రామిక విధానం’ తయారు చేసి అమలు చేసింది. రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్ధని అలానే ఉంచుకుని భూముల్ని ప్రజలకి పంచకుండానే పారిశ్రామికీకరణ నినాదం ఎత్తుకుని అత్యంత దౌర్జన్యంగా అమలు చేసింది. బూర్జువా పార్టీలకి ఏ మాత్రం తగ్గకుండా ప్రజలపైన నిర్బంధాన్ని ప్రయోగించింది. దాదాపు ఇరవే యేళ్లు ఆ విధానాలు అనుసరించిన ఫలితమే లెఫ్ట్ ఫ్రంట్ ఓటమి.

  ఎన్నికలు అయ్యేవరకూ మావోయిస్టుల మద్దతుని మమత స్వీకరించింది. వాళ్లకి అనేక సర్టిఫికెట్లు ఇచ్చింది. ఎన్నికలు ముగిసాక పూర్తిగా ప్లేటు ఫిరాయించింది. దీన్ని మమత పార్టీవాళ్లు ‘అద్భుతమైన రాజకీయ విన్యాసం’గా అభివర్ణిస్తారని కొన్ని పత్రికలు చెబుతుంటాయి.

 4. విశెఖర్ గారు. అడిగిన వెంటనే చాలా సమాచారం ఇచ్చారు. దీని వల్ల బుర్జువా పార్టీలకు ఏమాత్రం తీసిపోని పార్టీలని అర్ధమైంది. మీరు చెప్పిన దాన్ని బట్టి మావొయిస్టులు కూడా ఈ బుర్జువా కమ్యునిస్టు పార్టీలాగ ఒకరి తర్వాత ఒకరికి మద్దతిస్తూ పొతున్నారు. అవకాశావాదులుగా మారుతున్నారు.

  దీన్నిబట్టి ఒక విషయం అర్ధమైంది. ఇప్పుడున్న కమ్యునిస్టు పార్టీలు మరొ 100 యెళ్ళు వున్నా 1000 యెళ్ళు వున్నా పెట్టుబడిదారీ వర్గానికి వచ్చిన హాని ఏమీ లేదని. వీటికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ఏర్పడవలసిన అవసరం ఎంతైనా వుంది. అడిగిన వెంటనే చాలా సమాచారం తెలిపినారు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.

 5. రామ్మోహన్ గారూ, నిజానికి మావోయిస్టు పార్టీ చిత్త శుద్ధిని శంకించడానికి లేదు. వారి త్యాగాలు వెలకట్టలేనివి. వర్గ శత్రు నిర్మూలన వారి సిద్ధాంతంలో ప్రధాన లోపం అని నాకు అనిపిస్తుంది. మార్క్సిస్టు మహోపాధ్యాయులెవ్వరూ దాన్ని బోధించలేదు. చారుమజుందార్ చెప్పిన ఆ సిద్ధాంతాన్ని వారు ఇప్పటికీ వదలడం లేదు. వర్గశత్రునిర్మూలన కూడదని గుణ పాఠాలు తీసుకున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తుంటాయి గానీ అవేమీ ఆచరణలో లేదు. ఇప్పుడున్న పార్టీలే ఆచరణని సవరించుకుంటాయో, కొత్త పార్టీ వస్తుందో చూడడం తప్ప చేసేదేముంది గనక?

 6. విశెఖర్ గారూ. మీరన్నది నిజమే వారి త్యాగాలను వెలకట్టలేనివి. ప్రాణాలకు తెగిస్తున్నారు. వాళ్ళు ఉద్యమాన్ని విస్తరించె వ్యుహాలలొ విఫలమౌతున్నారనిపిస్తుంది. ప్రజలలొ పట్టు సాధించలేక పొతున్నారు. ఏఉద్యమమైనా ప్రజల సహకారం చాలా అవసరం మరొ మాటలలొ చెప్పాలంటె ప్రజలు లేంది ఉద్యమాలు గాని విప్లవాలు గాని ఉండవు. చారుమంజుదార్ చెప్పినదానికి అంత ప్రముఖ్యత ఇస్తున్నారంటె వాళ్ళకు మార్కిజం మీద తగిన అవగాహన లేదనిపిస్తుంది. అవును పార్టీల గురించి ఎదురుచుడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

 7. రామ్మోహన్ గారూ, మార్క్సిజం అవగాహన లేకపోవడం కారణం కాకపోవచ్చు. వర్గ పోరాటంలో అదొక అతిపోకడ కావచ్చు. లెఫ్ట్ డీవియేషన్ అని సిద్ధాంతం చర్చల్లో కనిపిస్తుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s