క్లుప్తంగా… 13.05.2012


జాతీయం

డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు

avian-influenzaప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య దేశాలకు ఉంది. అమెరికాలో విస్తరించిన ‘ఏవియన్ ఇన్ఫ్లుయెంజా’ జబ్బు భారత దేశంలో ప్రవేశించకుండా ఉండడానికి భారత ప్రభుత్వం కొన్ని అమెరికా ఉత్పత్తులను నిషేధించింది. ఈ రకం జబ్బు అమెరికా కి మాత్రమే ప్రత్యేకమయిన ప్రాణాంతక జబ్బు. ముఖ్యంగా కోళ్ళ ద్వారా, సంబంధిత ఉత్పత్తుల ద్వారా ఇదివ్యాప్తి చెందుతుంది. ఇండియా నిబంధనలు తొలగించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం అయ్యాయి. దానితో అమెరికా ఇండియాపై ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఫిర్యాదులలో ప్రజల ఆరోగ్య ప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అంతర్జాతీయం

ఆఫ్ఘన్ నాటో సమావేశానికి పాకిస్ధాన్ కి ఆహ్వానం లేదు?

afghan_nato‘ఆఫ్ఘనిస్ధాన్’ యుద్ధం విషయంలో చికాగోలో జరగనున్న ‘నాటో’ సమావేశాలకు పాకిస్ధాన్ ని ఇంకా ఆహ్వానించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాటో సమావేశానికి ఆహ్వానం అందలేదని పాక్ విదేశీ మంత్రి హైనా రబ్బానీ ఖర్ పత్రికలకు తెలిపింది. నాటో సెక్రటరీ జనరల్ ఆండర్స్ రాస్ ముస్సేన్ బ్రసేల్స్ లో మాట్లాడుతూ ఈ సమావేశాలకి అనేక నాటోయేతర దేశాలని ఆహ్వానించామనీ దానిక్కారణం ఆ దేశాలు అమేరికా కోసం ‘సరఫరా రూట్లు’ ఇవ్వడమేననీ తెలిపాడు. ఇది పరోక్షంగా పాకిస్ధాన్ కి ఆహ్వానం లేదని చెప్పడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫ్-పాక్ సరిహద్దులో పాక్ సైనికులపై దాడి చేసి 24 మందిని అమెరికా సైన్యం చంపేశాక ఆఫ్-పాక్ సరిహద్దుని పాకిస్ధాన్ మూసేసింది. తద్వారా ఆఫ్ఘన్ లోని అమెరికా సైన్యానికి పాక్ భూభాగం ద్వారా అందే ఆహార, ఆయుధ సరఫరాని అడ్డుకుంది. ప్రజాగ్రహానికి జడిసి ఈ సరిహద్దుని తిరిగి తెరవడానికి పాక్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దానితో పాక్ కి అందించే సాయాన్ని అమెరికా పాక్షికంగా నిలిపివేసింది. విదేశీ మంత్రి హిల్లరీ ‘ఉగ్రవాద యుద్ధం’ లో పాక్ సహకరిస్తోందని సర్టిఫై చేస్తే తప్ప సహాయం చేసేది లేదని మెలిక పెట్టింది. వాస్తవానికి ఇది సహాయం కాదు. పాక్ నుండి తరలించుకెళ్లిన సంపదలలో కొద్ది భాగాన్ని భిక్షంగా వేసే మొత్తమే. ఆఫ్ఘనిస్ధాన్ పై జరిగే ప్రతి సమావేశంలోనూ పాక్ ని పిలవడం ఆనవాయితీ. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో పాక్ ని భాగస్వామిగా అమెరికా స్వీకరించినందున ఇది జరుగుతోంది. నాటో సమావేశాల్లో ఆఫ్ఘన్ యుద్ధంపై జరిగే చర్చల్లో పాక్ కి ఆహ్వానం లేకపోతే అలాంటి సమావేశాల్లో పాక్ లేకపోవడం ఇదే మొదటిసారవుతుంది.

భూములపై పేదల హక్కులు కాపాడ్డానికి ఐక్యరాజ్య సమితి మార్గదర్శక సూత్రాలు

అనేక దేశాల్లో కంపెనీల ప్రయోజనాల కోసం పేదల భూములను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కోవడం పెరగడంతో పేదల హక్కులను కాపాడడానికి మార్గదర్శక సూత్రాలను రూపొందించినట్లు సమితి ప్రకటించింది. మూడేళ్ళ నుండి ఎన్.జి.ఓ సంస్ధలు ఈ సూత్రాల కోసం పట్టుపట్టడం వల్ల ఇది సాధ్యంయిందని ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఈ సూత్రాలేవీ విధిగా పాటించవలసినవి కాదు. స్వచ్ఛందంగా అనుసరించవలసినవే. కాకపోతే ప్రభుత్వాలు పేదల భూమి హక్కులను గుర్తించడం లేదనీ, కంపెనీల కోసం ప్రజల భూముల్ని అక్రమంగా లాక్కుంటున్నాయనీ అంతర్జాతీయ సంస్ధ గుర్తించినట్లయింది. ఈ సూత్రాల ద్వారా ఆహార భద్రత పెరగే ఆస్కారం ఉంటుందని సమితి ఆశాభావం వ్యక్తపరిచింది. వీటి ప్రకారం ప్రవేటు కంపెనీలు భూ ఆక్రమణలో పారదర్శకంగా వ్యవహరించాలి. స్ధానిక ప్రజలతో సంప్రదింపులు జరపాలి. స్ధానిక సాంప్రదాయక చట్టాలకు విలువ ఇవ్వాలి. దేశీయ జాతుల ప్రజల భూమి హక్కులను గుర్తించి కాపాడాలి. బకాసరుడు విచక్షణా రహితంగా జనాన్ని చంపితినడాన్ని ఎదిరించలేక తామే ఒక్కొక్కరూ భోజనం కింద వస్తామని ప్రజలు వేడుకున్నట్లే ఉన్నాయి ఈ సూత్రాలు. ఈ సూత్రాలు అంతిమంగా పశ్చిమ దేశాలకు నచ్చని మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉపయోగపడతాయని అనుభవం చెబుతున్న సత్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s