-
మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్
-
2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు
-
జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే
-
స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం
జాతీయం
మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్ టీం’ అభిప్రాయ పడింది. గుజరాత్ మారణకాండలో హతుడయిన కాంగ్రెస్ ఎం.పి ఎహసాన్ జాఫ్రీ భార్య జకీయా జాఫ్రీ హత్యాకాండలో మోడి పాత్రపై ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ ని సుప్రీం కోర్టు నియమించింది. హత్యాకాండలో మోడి నేరస్ధ పాత్ర ను విచారించడానికి పని చేయవలసిన సిట్, మోడి నిర్దోషిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే తన సర్వ శక్తులూ కేంద్రీకరించిందని ‘ది హిందూ’ ప్రచురిస్తున్న వరుస సంచలనాత్మక కధనాలు వెల్లడి చేస్తున్నాయి. సుప్రీం తీర్పు మేరకు సిట్ నివేదికను జకీయా జాఫ్రీకి అందజేయబడింది. ఈ నివేదికలో అంశాలను ‘ది హిందూ’ పత్రిక వరుసగా ప్రచురిస్తోంది. మోడి కి వ్యతిరేకంగా ఉన్న ఒక్కొక్క సాక్ష్యాన్నీ సిట్ ఎంత అకారణంగా తిరస్కరించిందీ ఈ కధనాలు వెల్లడిస్తున్నాయి. ‘హిందువుల తమ కోపాన్ని తీర్చుకోనివ్వాలని’ మోడి తన అధికారులకి సూచనలు ఇచ్చినా అది నాలుగు గోడల మధ్య జరిగితే నేరం కాదని సిట్ దారుణంగా వెనకేసుకొచ్చిందని ‘ది హిందూ’ కధనం వెల్లడి చేసింది. ఫెబ్రవరి 27, 2002 తేదీన తన ఇంటి వద్ద జరిగిన సమావేశంలో అధికారులకు గోధ్రా రైలు దహనానికి హిందువులను ప్రతీకారం తీర్చుకోనివ్వాలని సూచనలిచ్చాడనీ, ఆ ఆదేశాలే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని చేష్టలుడిగేలా చేసాయనీ, అందువల్ల గుజరాత్ మారణకాండలో మోడి ముఖ్య దోషి అనీ జకీయా జాఫ్రీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలనుండి మోడీని బయట పడేయడానికి సిట్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఎనిమిది మంది అధికారులు ఈ సమావేశానికి హాజరయితే వారు వివిధ కారణాలతో సమావేశం సంగతులు చెప్పలేకపోయారు. ఒకరు గుర్తు లేదంటే, మరొకరు అలా అనలేదనో నాన్చారు. అయితే నివేదిక చివరికి వచ్చేటప్పటికల్లా మోడి అలా చెప్పనేలేదని అందరూ నిర్ద్వంద్వంగా చెప్పినట్లుగా నివేదిక తేల్చింది. తమ సీనియర్ అధికారి సెలవులో ఉన్నందున ఈ సమావేశానికి అప్పటి ఇంటలిజెన్స్ అధికారి సంజీవ్ భట్ హాజరయ్యాడు. ఆయన ఒక్కడే మోడీ వ్యాఖ్యలు నిజమే అని చెప్పగా ఆయన సాక్ష్యం నమ్మదగ్గది కాదనీ, ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్లనే మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని సిట్ తిరస్కరించింది. గోధ్రా దహనం తర్వాత గానీ, ముస్లింలపై మారణ కాండ జరుగుతున్నన్నాళ్లూ గానీ మోడీ, గోధ్రా దహనం లాంటి సంఘటనలు జరగకుండా తీవ్ర చర్యలు తీసుకుంటానని అనేకసార్లు ప్రకటీంచాడే తప్ప ముస్లింలపై దాడులు వద్దనీ, శాంతిని పాటించాలనీ ఎన్నడూ చెప్పలేదు. అయినా గోధ్రా దహనం మరొకటి జరగకుండా తీవ్ర చర్యలు తీసుకుంటానని మోడీ పదే పదే చేసిన ప్రకటనలనే ‘హిందువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అనుమతించమంటూ అధికారులకు మోడీ చెప్పే అవకాశం లేదని’ చెప్పడానికి రుజువుగా సిట్ పేర్కొన్నదని ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ మాత్రం చెప్పడానికి న్యాయ శాస్త్ర గ్రంధాలు కావాలా? బి.జె.పి పార్టీ గానీ, దాని నాయకులు గానీ చేసే ప్రకటనలు చాలవా?
2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు
భారత దేశంలో అయిదేళ్ల లోపు వయసు పిల్లల మరణాలు ఒక్క 2010 లోనే 16.8 లక్షలకు పైగా ఉన్నాయని సర్వే తెలియజేసింది. బ్రిటన్ కి చెందిన ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్’ సర్వే వివరాలు ప్రచురించింది. చనిపోయినవారిలో వీరిలో సగం మందికి పైగా 28 రోజుల వయసు కూడా పూర్తి చేసుకోలేదని సదరు సర్వే వెల్లడి చేసింది. మొత్తం 16.8 లక్షల మరణాల్లో 52 శాతం లేదా 8.75 లక్షల మంది నెల లోపు పిల్లలేనని సర్వే తెలిపింది. వీరి మరణాలకి కారణాలు వైద్యం చేయగల జబ్బులే కావడం గమనార్హం. న్యూమోనియా వల్ల 28.6 శాతం, పుట్టుక ముందు జబ్బుల వల్ల 18.1 శాతం, డయేరియా వల్ల 12.6 శాతం పిల్లలు చనిపోయారని సర్వే వెల్లడి చేసింది.
అంతర్జాతీయం
జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే
మే 18-19 తేదీల్లో జరగనున్న జి8 (గ్రూప్ ఆఫ్ 8) దేశాల సమావేశాలకి పుటిన్ వెళ్ళనని ప్రకటించాడు. కేబినెట్ కూర్పుతో బిజీగా ఉన్నందున రాలేనని పుటిన్ చెప్పినప్పటికీ అదేమీ నమ్మదగ్గదిగా లేదు. కేబినెట్ కూర్పు బాధ్యత ప్రధాని మెడ్వెడేవ్ దే. అదిప్పటికే పూర్తయిందని మెడ్వెడ్వేవ్ ప్రకటించాడు కూడా. రష్యా ఆందోళనల పై అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశీ మంత్రి హిల్లరీ చేసిన తుంటరి ప్రకటనలే పుటిన్ రాకపోవడానికి కారణమని విశ్లేషకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు. మాస్కోలో జరిగిన శాంతియుత ప్రదర్శనలపై పోలీసుల ప్రవర్తన ఆందోళనకరమని వారు ప్రకటించారు. పుటిన్ ఎన్నిక కూడా ‘స్వేచ్ఛగా నిజాయితీగా జరగలేదని’ హిల్లరీ వ్యాఖ్యానించింది. ‘ఆకుపై’ ఉద్యమాలపై అమెరికా పోలీసులు ఓ వైపు నిర్భంధం ప్రయోగిస్తూ అరెస్టులు సాగిస్తుండగానే మరో వైపు ఇతర దేశాల్లో ప్రదర్శనలను అనుమతించాలని అమెరికా ద్వంద్వ విధానం పాటిస్తుంది. చికాగోలో జరిగే నాటో సమావేశాలకు అతిధిగా పాల్గొనబోనని పుటిన్ ఇప్పటికే ప్రకటించాడు. ధనిక పెత్తందారీ దేశాలయిన 7 దేశాలతో జి7 కూటమి ఏర్పడింది. దక్షిణార్ధ గోళంలో కేంద్రీకృతమై ఉన్న (చైనా మినహా) ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాలు తమ ఆర్ధిక ప్రయోజనాల పరిరక్షణ కోసం జి77 గ్రూపుని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ ఫైనాన్స్ పెత్తనం జి77 గ్రూపు చేతికి వెళ్ళే ప్రమాదం కనిపించడంతో పెత్తందారీ దేశాలు జి7 ని ఏర్పాటు చేశాయి. రష్యాలో గోర్భచేవ్ పాలన అనంతరం ఆ దేశాన్ని జి7 తో కలుపుకుని జి8 ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జి7 మాత్రం ఇంకా కొనసాగుతోంది.
స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వలింగ వివాహాలని తాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లూ ఈ అంశంపై ఏ అభిప్రాయమూ ప్రకటించకుండా దాగుడుమూతలు ఆడిన ఒబామా ఎన్నికలు సమీపిస్తుండడంతో అభిప్రాయం ప్రకటించక తప్పలేదు. అమెరికాలో స్వలింగ సంపర్కులు అణచివేతకు గురవుతున్నవారని విశ్లేషకుల అభిప్రాయం. స్వలింగ సంపర్కాన్ని సమాజం నుండి తొలగించే పద్ధతులను అనుసరించడానికి బదులు అమెరికా రాజకీయ పార్టీలు అనుకూలూరు, వ్యతిరేకులుగా చీలిపోయి అదొక రాజకీయ సమస్యగా చేసేశారు. సమస్య వెనుక సామాజిక, వ్యక్తిగత కారణాలను పరిశీలించి నివారణకు కృషి చేయడానికి వారు పూనుకోలేదు. దానితో స్వలింగ సంపర్కుల సమస్యలు ఒక ఉద్యమంగా రాజకీయ యవనికపై ప్రత్యక్షమైంది. అమెరికాలో ‘స్వేచ్ఛ’ పేరుతో పలు రకాల విచ్చలవిడి సంబంధాలను అనుమతించి ప్రకృతి సిద్ధమైన లైంగిక సంబంధాలను అపహాస్యం చేస్తున్నారు.
నేరం అనేది ఒక వ్యక్తిగా చేసినా, ఒక నాయకునిగా చేసినా అందులో తేడా ఏమీ రాదు కదా. కనుక మోడీ నాలుగు గోడల మధ్య చేసినా, బహిరంగంగా చేసినా అది నేరమే అవుతుంది.