(మావో ధాట్) మావో ఆలోచనా విధానం అంటే? -2


1972-Chairman-Mao-Inspectes Guangdong countrysideఅర్ధ భూస్వామ్య వ్యవస్ధలో మేజార్టీ ప్రజలకు భూమి పధాన ఉత్పత్తి సాధనంగా, శ్రమ సాధనంగా కొనసాగుతుంది. కానీ భూస్వామ్య వర్గాలదే పూర్తి ఆధిపత్యం కాదు. వారిలో కొందరు పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందుతారు. కొంతమంది గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్నాల్లో పెట్టుబడిదారీ వర్గంలోకి ప్రవేశించారు. భారత దేశంలో ఇలాంటి అనేకమందిని మనం చూడగలం.

[భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ‘కుల వ్యవస్ధ’ ప్రధాన పట్టుగొమ్మ. కులం పునాదులు బలహీనపడుతున్నాయని చెబుతున్నప్పటికీ అగ్ర కుల భూస్వామ్య వర్గ రాజకీయాధిపతుల చుట్టూ కులాల ప్రాతిపదికన సమీకృతం కావడం కొనసాగుతోంది. కులాల ప్రతిపదికన నిమ్న కులాలను అణచివేయడం కొనసాగుతోంది. అగ్ర కుల పేదలను కులం ప్రాతిపదికన తమ చెప్పుచేతల్లో పెట్టుకుని వారిని అణచివేస్తూనే నిమ్న కులాలకు చెందిన విశాల ప్రజా రాశుల శ్రమను దోపిడీ చెయ్యగలుగుతున్నారు. అయితే ఈ దోపిడీని భూస్వామ్య వర్గం ఒక్కటే తినడం లేదు. సామ్రాజ్యవాదులు, వారికి లొంగి ఉన్న పెట్టుబడిదారులు శ్రమ దోపిడిని భోంచేస్తున్నాయి. ప్రధాన భాగం సామ్రాజ్యవాద వర్గాలకి వెళుతుండగా, జూనియర్ భాగాన్ని భారత పెట్టుబడిదారులు, భూస్వాములు పంచుకుంటున్నారు. ]

మూ.ప్ర దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు బద్దలయాక వలస పాలకులకు ప్రత్యక్ష దోపిడిని కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది. అశేష శ్రామిక ప్రజలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా ఉద్యమించడంతో వలస పాలకులు కొత్త ఎత్తుగడ వేశారు. ప్రత్యక్షంగా వలస దేశాల్లో ఉంటూ దోపిడికి పాల్పడడం కాకుండా ఆయా దేశాల్లో తమ ప్రతినిధులను నియమించుకోవడం వారి కొత్త ఎత్తుగడ. మూ.ప్ర దేశాల భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలు అప్పటికే విదేశీ వలస పాలకుల కనుసన్నల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. తమ అదుపులో ఉన్న దేశీయ పాలకవర్గాలకే ఆయా దేశాల్లో అధికార పగ్గాలను వలస పాలకులు కట్టబెట్టారు. ఆ విధంగా ‘అధికార మార్పిడి’ కి వారు పూనుకున్నారు. అలాంటి ‘అధికార మార్పిడి’ కే ‘స్వాతంత్ర్యం’ గా దేశీయ పాలకవర్గాలు ఇప్పటికీ చెప్పుకుంటున్నాయి.

దేశాలు స్వతంత్రాన్ని కోరుతున్నాయి. జాతులు విముక్తిని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. -మావో సేటుంగ్

‘పెట్టుబడిదారీ వ్యవస్ధ అత్యున్నత దశే సామ్రాజ్యవాదం’ అంటూ సామ్రాజ్యవాద దశ గురించి లెనిన్ చేసిన సూత్రీకరణ ఎంతటి సుప్రసిద్ధమో అందరికీ తెలిసినదే. అలాంటి సామ్రాజ్యవాద దశ ప్రవేశించాక ‘ఫైనాన్స్ పెట్టుబడి’ మూ.ప్ర దేశాలను కొల్లగొట్టడానికి శక్తివంతమైన సాధనంగా ముందుకు వచ్చింది. ఫైనాన్స్ పెట్టుబడిని మూ.ప్ర దేశాలకు ఎగుమతి చేసి అక్కడి ఆధిపత్య వర్గాలను లొంగదీసుకుని సామ్రాజ్యవాద దోపిడిని యధేచ్ఛగా కొనసాగించడం ఈ దశలో ముఖ్య లక్షణం. ఈ లక్షణం ఇప్పటికీ కొనసాగుతోంది. భారత దేశం అందుకు మినహాయింపు కాదు.

సామ్రాజ్యవాద దశలో దేశీయ పెట్టుబడిదారులు, భూస్వాములు స్వతంత్రులు కారు. వారి ఆర్ధిక ప్రయోజనాలన్నీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాలతో కట్టివేయబడి ఉంటాయి. సామ్రాజ్యవాద కంపెనీలు పెట్టుబడులతో, టెక్నాలజీతో మూ.ప్ర దేశాల వనరులను, శ్రమ శక్తిని కొల్లగొడుతుండగా వారి దోపిడిలో భాగం తీసుకుంటూ దేశ బూర్జువాలు, భూస్వాములు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, తిరుగుబాట్లను అణచివేస్తూ ఉంటాయి.

ఈ దశలో మూ.ప్ర దేశాల్లో విప్లవాలకి ఎవరు నాయకత్వం వహిస్తారు? మామూలుగానైతే భూస్వామ్య వర్గాలను కూలదోసి సమాజాన్ని ప్రజాస్వామిక యుగం వైపుగా విప్లవీకరించవలసిన బాధ్యత పెట్టుబడిదారీ వర్గంపైనే ఉంటుంది. కాని మూ.ప్ర దేశాల పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రులు కాకపోవడం వల్ల వారికి జాతీయ ఆకాంక్షలు లేకపోవడం వల్ల, వలస సామ్రాజ్యవాదులకు లొంగి ఉండడం వల్ల ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి, అర్హత లేవు. ప్రజాస్వామిక విప్లవాలు భూస్వామ్య వ్యవస్ధలను కూల్చి పెట్టుబడిదారీ సమాజ ఏర్పాటుకి అవకాశం కల్పిస్తాయి. అయితే అలాంటి ప్రజాస్వామిక విప్లవాలకి నాయకత్వం వహించే శక్తి పెట్టుబడిదారీ వర్గానికి లేకపోవడం వల్ల తదుపరి విప్లవకర వర్గమైన కార్మికవర్గమే ఆ బాధ్యతను నెత్తిన వేసుకోవలసి ఉంటుంది.

భూస్వామ్య వర్గాలపైన పెట్టుబడిదారీ వర్గం నాయకత్వంలొ చెలరేగే తిరుగుబాటు ప్రజాస్వామిక విప్లవం. అదే ప్రజాస్వామిక విప్లవానికి కార్మిక వర్గం నాయకత్వం వహించడమే ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’. పెట్టుబడిదారీ వర్గం తన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించలేని పరిస్ధితుల్లో ఉన్నందున ఆ బాధ్యతని కార్మిక వర్గం నెత్తిన వేసుకోవడమే నూతన దశ. అయితే కార్మిక వర్గం నాయకత్వం వహించి తిరుగుబాటు విజయవంతం చేశాక అధికారాన్ని పెట్టుబడిదారీ వర్గానికి అప్పగిస్తుందా? చస్తే ఇవ్వదు. సమాజాన్ని విప్లవకరంగా నూతన ప్రజాస్వామిక విప్లవ దశకి తీసుకెళ్లి ‘సోషలిస్టు నిర్మాణాన్ని’ ప్రారంభిస్తుంది.

పెట్టుబడిదారీ వర్గం విదేశీ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లిపోయి, దళారీ పెట్టుబడిదారీ వర్గంగా మారిపోయాక, వారు భూస్వామ్య వర్గం నుండి అధికారం చేపట్టి సమాజాన్ని విప్లవకరంగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని నిర్వర్తించరు. ఆ కర్తవ్యాన్ని ఇక కార్మికవర్గమే చేపట్టాలి. కార్మిక వర్గం సమాజంలో ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాక ఇక పెట్టుబడిదారీ వర్గాన్ని దేశంలో ఉండనివ్వదు. దాన్ని సమూలంగా పెరికివేస్తుంది. ఉంటే దేశంలో ఉంటూ శ్రమలో భాగం పంచుకోవాలి, లేదా బిచాణా ఎత్తివేసి తమ మాస్టర్ (సామ్రాజ్యవాద దేశాలు) వద్దకు పారిపోవాలి.

పెట్టుబడిదారీ వర్గం నిర్వర్తించాల్సిన ‘ప్రజాస్వామిక విప్లవం’ స్ధానంలో కార్మికవర్గం నాయకత్వంలో ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ సాధించడమే మావో ధాట్ లో ప్రధాన అంశం. ఈ సూత్రీకరణ వెనుక మార్క్స్, లెనిన్, స్టాలిన్ లు సాగించిన మహత్తర విప్లవాత్మక కృషి పునాదిగా ఉంది. మార్క్సిజం-లెనినిజం కూ, దానికి మహోపాధ్యాయుడు స్టాలిన్ జోడించిన ఆచరణాత్మక అభివృద్ధి లకు మావో ధాట్ గొప్ప కొనసాగింపు. దక్షిణార్ధ గోళంలో వ్యాపించి ఉన్న అనేక మూ.ప్ర దేశాలలో కార్మికవర్గం నాయకత్వంలో విప్లవాలు సాధించడానికి ‘మావో ధాట్’ కరదీపిక.

ఇదొక్కటే మావో ధాట్ కాదు. మూడో ప్రపంచ దేశాల్లో ఉండే అనేకానేక వైరుధ్యాలను విపులీకరించి వైరుధ్య సూత్రాన్ని విస్తృత స్ధాయిలో అభివృద్ధి చేయడంలో, శత్రువులను మిత్రులను గుర్తించడంలో, ఎత్తుగడలను వ్యూహాలను వేరు పరిచి సమ్మిళతం చేయడంలో, వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో, అశేష రైతాంగాన్ని కార్మికవర్గం నాయకత్వంలోని ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’లో అత్యంత ముఖ్యమైన నమ్మకమైన భాగస్వామిగా చేయడంలో, మావో సాగించిన సైద్ధాంతిక కృషి అనితర సాధ్యం. అలాంటి మావో కృషిని స్వీకరించలేని గుడ్డి పార్టీలు ఈరోజు వామ పక్షాలుగా చెలామణి అవుతున్నాయి.

మావో కృషికి ఇంతవరకూ జోడింపు లేదు. కొత్త పరిస్ధితులు లేవు గనక జోడింపు లేదు. కాని ‘సోషలిస్టు నిర్మాణం’ లో భాగంగా, సాంస్కృతిక విప్లవం ద్వారా చైనా బూర్జువా, భూస్వామ్య వర్గాలని నిర్దాక్షిణ్యంగా అణచివేసినందున ఆయనపై అనేక దుర్మార్గ ప్రచారాలు సాగాయి. చైనాకి చెందిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలే ఈ ప్రచారానికి దోహదం చేశాయి. చైనాలాంటి వెనకబడిన సామాజిక వ్యవస్ధల్లో అభివృద్ధి నిరోధక శక్తులు బలంగా ఉన్నందున వారిని ఎదుర్కొని విజయం సాధించడానికి మావో నాయకత్వంలోని విప్లవ వర్గాలకి అనేక ప్రతికూల పరిస్ధితులు ఎదురయ్యాయి. చైనా కమ్యూనిస్టు పార్టీలోకే పెట్టుబడిదారీ శక్తులు జొరబడి సోషలిస్టు నిర్మాణానికి ఆటంకం కలిగించాయి. అడ్డుకున్నాయి. కేంద్ర కమిటీని సైతం తమ వశంలోకి తెచ్చుకున్నాయి.

సాంస్కృతిక విప్లవ దశలో మేధో-శ్రామిక వైరుధ్యాలనీ, పట్టణ-గ్రామీణ వైరుధ్యాలనీ, స్త్రీ-పురుష వైరుధ్యాలనీ, రైతు-కూలీ వైరుధ్యాలనీ పరిష్కరించడానికి చేసిన కృషిని ప్రారంభంలోనే ఆయా వైరుధ్యాలలోని ఆధిపత్య పక్షాలు తీవ్రంగా ఆటంక పరిచాయి. డాక్టర్లని రోడ్లను ఊడ్వాలి రమ్మంటె వారికి కోపం. ఆడవాళ్లని సమానంగా చూడాలంటె పురుష పుంగవులకి కోపం. పట్టణాల్లో పేరుకుపోయిన జనాన్ని గ్రామాలకి తరలించి ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యుల చేయాలంటే అదొక తీవ్ర సమస్య. మధ్య తరగతి అభిజాత్యాన్ని వదులుకొమ్మంటే అదొక నేరం. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులని ఆర్గనైజ్ చేసి మావో ‘మాస్ లైన్’ కి ప్రతిగా నిలబెట్టడంలో చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రతికూల శక్తులు సఫలం అయ్యాయి. ఫలితమే పార్టీలో డెంగ్ ముఠా ఆధిపత్యం.

32 thoughts on “(మావో ధాట్) మావో ఆలోచనా విధానం అంటే? -2

 1. మావో ఆలోచనా విధానం గురించి చక్కని సమాచారంతో సరళంగా రాశారు. నాకు అరకొరగా తెలిసిన కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి!

  దీనికి మూడో భాగం కూడా రాయటానికి అవకాశం, ఆస్కారం ఉందనిపిస్తోంది. ముఖ్యంగా మార్క్సిజానికి మావో చేసిన చేర్పుల ప్రత్యేకతల గురించి ఇంకా వివరంగా రాస్తే బాగుండేదనిపిస్తోంది. ఈ ఆర్టికల్ మధ్యలో కొటేషన్ ఇవ్వటం చాలా బాగుంది. మావో ప్రసిద్ధ కొటేషన్లు కూడా ఈ సందర్భంగా మీరు ఇవ్వొచ్చు.

  మావో కృషిని మనదేశ వామపక్షాలు సైద్ధాంతిక స్థాయిలోనైనా స్వీకరించలేదా? ఆచరణలో మాత్రమే పట్టించుకోవటం లేదా?

 2. వేణు గారు,

  నిజమే. మూడో భాగం రాయవచ్చు. ముఖ్యంగా ఇతర అంశాలలో మావో ఇచ్చిన స్పష్టత మూడో ప్రపంచ దేశాలకు చాలా ముఖ్యమైనవి.

  సి.పి.ఐ పార్టీ మావోని అసలు స్వీకరించదు. ఆ పార్టీ దృష్టిలో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ వీరే మహోపాధ్యాయులు. ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని వారు చూడలేదన్నమాట.

  సి.పిఎం పార్టీ మావో కృషిని చైనా వరకే అంగీకరిస్తుంది. మూడో ప్రపంచ దేశాలకు మావో ధాట్ ని మార్గదర్శకంగా అంగీకరించదు. అన్ని దేశాల్లో జరిగిన విప్లవపోరాటాలనుండి మన దేశ విప్లవం కోసం పాఠాలు స్వీకరించాలని జనరల్ గా చెబుతుంది తప్ప వ్యవసాయక దేశాల విషయంలో మావో చేసిన సూత్రీకరణలను, ముఖ్యంగా ‘నూతన ప్రజాస్వామిక విప్లవ’ సిద్ధాంతాన్ని ఆ పార్టీ స్వీకరించదు.
  ‘జనతా ప్రజాస్వామిక విప్లవం’ అంటుంది గానీ దానికోసం ఆచరణ కార్యక్రమం ఏమిటో తెలియదు. దాని ఆచరణ మొత్తం ఎన్నికల చుట్టునే ఉంటూంది. ‘సాయుధ పోరాటం’ అని నామమాత్రంగా చెప్పినా పుస్తకాల వరకే. ఎప్పుడో ఎవరో తెస్తారన్నట్లుగా ఉంటుంది ఆ వివరణ. దాని కోసం ఇప్పుడు పార్టీగా ఏమి చేయాలన్నది ఉండదు.

  ఏతా వాతా తేలేదేమంటే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి మావో చేసిన కంట్రిబ్యూషన్ ని రెండు వామ పక్షాలూ గుర్తించవు.

 3. రామ్మోహన్ గారూ, మీ ప్రాంతం అంటే మీరు ఉత్తరాంధ్ర వారా? ఆ ప్రాంతంలో రంగనాయకమ్మ గారు మార్క్సిజం ప్రజలకు వివరించడానికి కృషి చేశారనా మీరంటున్నది? ఆవిడ ఆ ప్రాంతం వారా?

  వీరోచిత శ్రీకాకుళం సాయుధ పోరాటం ఉత్తరాంధ్ర పుణ్యమే కదా. ఇప్పుడయితే తెలియదు గానీ, మార్క్స్ పేరు వినడమేం ఖర్మ, డెబ్భైల్లోనే శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు మార్క్స్ బోధనలని ఆచరణలోకే తెచ్చేసారు.

 4. రామమోహన్ గారిది ఉత్తరాంధ్ర ప్రాంతం కాదనుకుంటాను. ఆయన ప్రొఫైల్ ఏదో వెబ్‌సైట్‌లో చూసినట్టు గుర్తుంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి 2006 వరకు రంగనాయకమ్మ గారి గురించి ఏమీ తెలియదు. 2006లో విజయవాడకి చెందిన మాధురీ పబ్లికేషన్స్ వారు బుక్ ఎగ్జిబిషన్ పెట్టిన తరువాత ఆవిడ వ్రాసిన కాపిటల్ పరిచయం కాపీలు శ్రీకాకుళం పట్టణంలో బాగా అమ్ముడుపోయాయి.

  FYI, శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్ల కార్యక్రమాలు చాలా తక్కువ. ఈ జిల్లాకి చెందిన సుబ్బారావు పాణిగ్రాహి అనే నక్సలైట్ నాయకుడు ఖరగ్‌పుర్‌లో మార్క్సిజం గురించి తెలుసుకుని, తరువాత తన స్వగ్రామమైన బొడ్డపాడు గ్రామానికి వచ్చి, అక్కడి ప్రజలకి వర్గ చైతన్యం గురించి చెప్పాడు. ఒక్క బొడ్డపాడు గ్రామంలోనే 185 మందికి నక్సలైట్లతో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హనుమంతు అప్పయ్య దొర అనే లాయర్ (ఒకప్పటి రాష్ట్ర డిజిపి హెచ్.జె.దొర సోదరుడు) కోర్ట్‌లో వాదించి ఆ 185 మందిని విడిపించాడు. ఈ జిల్లాలో చౌదరి తేజేశ్వరరావు అనే ఇంకో నక్సలైట్ నాయకుడు ఉండేవాడు. అతనికి చారిత్రక భౌతికవాదం ఏమాత్రం అర్థం కాలేదు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత పాలక వర్గంవాళ్ళకి క్షమాపణ అడగాలనుకుని, అతని అనుచరులతో కలిసి పత్రికల వాళ్ళ ముందు “సాయుధ పోరాటం ప్రారంభించడం తప్పైపోయింది” అంటూ ప్రచారం చేశాడు. అతను కారాగారం నుంచి విడుదల అయిన తరువాత CPIలో చేరిపోయాడు. 1972 వరకు నాలుగైదు వందల మంది కార్యకర్తలు ఈ జిల్లాలోనే ఎంకౌంటర్‌లలో చనిపోయారు. అందు వల్ల చౌదరి తేజేశ్వర రావు ముఠా చేసిన వాదన నిజమేనేమో అని ప్రజలకి అనిపించింది. 1978లో CPI(ML) లిబరేషన్ అనే పార్టీ సాయుధ పోరాటాన్ని ఆపేసి పార్లమెంటరీ రాజకీయాలలోకి వచ్చింది. అయితే సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనుకున్న కార్యకర్తలు CPI(ML) పీపుల్స్ వార్‌లో చేరిపోయారు. 1978 నుంచి 1991 వరకు ఈ జిల్లాలో నక్సలైట్ల కార్యక్రమాలు దాదాపుగా లేకుండా కొనసాగాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన గంటి రమేశ్ అనే యువకుడు విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకునే రోజులలో మార్క్సిజం-లెనినిజం చదివాడు. CPI(ML) పీపుల్స్ వార్ అతన్ని శ్రీకాకుళం డివిజన్ కమిటీ కార్యదర్శిగా నియమించింది. దాంతో జిల్లాలో నక్సలైట్ల కార్యక్రమాలు మళ్ళీ పెరిగాయి. కానీ గంటి రమేశ్ చనిపోయిన తరువాత జిల్లాలో నక్సలైట్ల కార్యక్రమాలు మళ్ళీ తగ్గిపోయాయి. ఈ మధ్య జిల్లాలో కొత్తగా నక్సలైట్ల కార్యక్రమాలు ఏమీ రికార్డ్ అవ్వలేదు. పాతపట్నం సమీపంలో ఒక అడవిలో నక్సలైట్ల స్థావరం దొరికింది. అందులో కొన్ని ఆయుధాలు, తెలుగు & ఒడియా భాషలలో వ్రాసిన విప్లవ సాహిత్యం మాత్రం దొరికాయి. అయితే జిల్లాలో ఎంత మంది నక్సలైట్లు మిగిలారు అనేది తెలియదు.

 5. విశెఖర్ గారు. మాది కడప జిల్లా, రాజంపేట మడలం దానికి పది మైళ్ళ దూరంలొ ఒక చిన్న పల్లెటూరు. అక్కడ తెలుగు దేశం , కాంగ్రెస్ పేర్లు తప్ప మిగతా పార్టీల గురించి అంతగా తెలియదు. కమ్యునిజం గురించి ఆంద్ర, తెలంఘాణ వాళ్ళకు తెలిసినంతగా ఈ ప్రాంతం వారికి తెలియదు. నాకు మార్కిజం తెలియడం రంగనాయకమ్మ గారి పుస్తకాల వల్లె. రంగనాయకమ్మ గారిది తాడేపల్లి గుడెం అని ఆవిడ చెప్పారు.
  ఒక నేషనల్ పార్టి అయి వుండి కొన్ని ప్రాంతాలలొ ఆ పాటీ గురించి తెలియదంటె అది యవరి లొపం.

 6. రామ్మోహన్ గారూ, అలాగా!

  రంగనాయకమ్మగారిది తెనాలి అని ఎక్కడో చదివాను. అందుకే అడిగాను. నేను వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉండగా మొదటిసారి ఆమె పుస్తకాలు చదివాను. నీడతో యుద్ధం, జానకి విముక్తి లాంటివి మొదట చదివాను. ఓల్గా అనువాదం చేసిన ‘మూడు తరాలు’ కి ఆమె విమర్శ రాసారు. ‘జల్లెడకి ఎన్ని చిల్లులో అన్ని చిల్లులు’ అని. నన్ను అమితంగా ఆకర్షించింది. స్త్రీ, పురుష సంబంధాలకు సంబంధించి అనేక సమస్యలను ఆ పుస్తకంలో చక్కగా వివరించారు.

  విద్యార్ధి సంఘంలో పని చేస్తూ చాలా జిల్లాలు తిరిగాను. గిరిజన గ్రామాలూ తిరిగాను. పైన ప్రవీణ్ చెప్పిన బొడ్డపాడు కూడా వెళ్లాను. శ్రీకాకుళం, వైజాగ్, ఉభయగోదావరి, ఖమ్మం, ప్రకాశం, నెల్లూరు లాంటి జిల్లాలు తిరిగాను. కానీ రాయలసీమ ఎప్పుడూ రాలేదు. ఈ తిరుగుడు వల్ల ఇంజనీరింగ్ డిగ్రీ వదిలేయాల్సి వచ్చింది. కాని ఆరొగ్యం పాడైపోయింది. చదువు వదిలేయడానికి అది కూడా ఓ కారణం. ఇంజనీరింగ్ పూర్తి చేయకపోవడం వల్ల నా మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి తీరని శోకం మిగిల్చాను. కానీ ఇవేవీ నన్ను ఇప్పటికీ అంతగా కృంగదీయవు. ఇన్నింటికంటె మిన్న అయిన ‘మార్క్సిజం-లెనిజం’ తెలుసుకున్న తెలివిడి నా అనేక దుఃఖాల్ని మింగేసింది.

  కుల పరంగా, ఆర్ధిక పరంగా ఎదుర్కొన్న ప్రతికూల పరిస్ధితులు నన్ను మార్క్సిజం వైపుకి అనివార్యంగా నెట్టాయి. నా గమ్యం అదే అన్నట్లుగా ఆ వైపుకి నా ఆలోచనలు వెళ్లాయి. ఈ ఆలోచనలకి రంగనాయకమ్మ పుస్తకాలు నాకు చాలా సహాయం చేశాయి. రష్యా, చైనా రచయితల పుస్తకాలకు ఈమె రచనలు నాకు మార్క్సిజం చెప్పడంలో తోడ్పడ్డాయి. కేపిటల్ పరిచయం చదవకపొతే నాకు ‘పొలిటికల్ ఎకానమీ’ గురించే తెలిసేదే కాదు.

  మీకు ఏ దశలో మార్క్సిజంతో పరిచయం ఏర్పడింది?

 7. ప్రవీణ్! >> శ్రీకాకుళం జిల్లా ప్రజలకి 2006 వరకు రంగనాయకమ్మ గారి గురించి ఏమీ తెలియదు.>>

  ఆంధ్రప్రభలో ‘కృష్ణవేణి’ సీరియల్ రచయిత్రిగా 1950లోనే ఆమె రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పాఠకులకూ తెలుసు కదా? ఆమె మార్క్సిజం పరిచయంలోకి వచ్చినప్పట్నుంచి చూసుకున్నా ‘రామాయణ విషవృక్షం’ (1974) నాటికే ఆమె పేరు పాఠకులకు బాగా తెలుసు!

  ‘సాయుధ పోరాటం ప్రారంభించడం తప్పైపోయింద’ని శ్రీకాకుళం ప్రాంతంలో ప్రచారం జరిగివుండొచ్చు గానీ ఆ ‘… ముఠా చేసిన వాదన నిజమేనేమో అని ప్రజలకి అనిపించింది’ అంటూ ప్రజల స్పందనను కూడా ఏకపక్షంగా మీరెలా చెప్పగలరు? అది కూడా వీరోచితంగా సాయుధపోరాటం చేసిన శ్రీకాకుళం ప్రజల గురించి!

 8. విశేఖర్ గారూ! చిన్న సవరణ. >> ఓల్గా అనువాదం చేసిన ‘మూడు తరాలు’ కి ఆమె విమర్శ రాసారు. ‘జల్లెడకి ఎన్ని చిల్లులో అన్ని చిల్లులు’ అని.>> మూడు తరాలపై రాసిన విమర్శ ‘అసమానత్వంలో నించి అసమానత్వంలోకే’ అనే పుస్తకంగా వచ్చింది. ఇక ‘జల్లెడకు…’ పుస్తకం ‘చైనాలో ఏం జరుగుతోంది’ పుస్తకంపై బాలగోపాల్ చేసిన సమీక్షపై విమర్శ!

 9. అవునవును. అది రాస్తున్నప్పుడే ఎక్కడో హెచ్చరిక గంట కొట్టినట్లు అనిపించింది గానీ పట్టించుకోలేదు.

 10. 2006కి ముందు శ్రీకాకుళం పట్టణంలో ప్రింటెడ్ పబ్లికేషన్స్ దొరికేవి కాదు. విశాలాంధ్ర బుక్‌హౌస్‌వారు శ్రీకాకుళం పట్టణంలో 2009లో బ్రాంచ్ పెట్టారు. అంతకు ముందు వైజాగ్, భుబనేశ్వర్‌లలో పుస్తకాలు కొనేవాణ్ణి. రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నవలలు వ్రాస్తుంటారు అనే విషయం మాత్రమే తెలుసు. అవి కూడా పత్రికలలో వచ్చిన నవలల వల్ల.

 11. విశేఖర్ గారు. మీరు చాలా కష్టాలు అనుభవించినట్టు వుంది. ఆర్దిక కస్టాలు మనిషిని ఎంతగా కృంగ దీస్తాయో నాకు కుడా స్వానుభవమే.

  నాకు కాపిటల్ గురించి 2003 లొ తెలిసింది. అదికుడా యాదృచ్ఛికంగా. ప్రజాశక్తి వారు పుస్తకాల ప్రదర్శన పెట్టి నపుడు. నాకు కథలు, నవలలు చదివే అలవాటు వుంది. అక్కడ చూస్తున్నప్పుడు కాపిటల్ పరిచయం కంటపడింది. ఆ పుస్తకాల వెనకాల కొటేషన్స్ చూసి కొన్నాను. అంతవరకు మార్క్స్ గురించి ఎప్పుడూ వినికూడా లేదు. నా చదువు కుడా అంతంత మాత్రమే. తర్వాత రంగనాయకమ్మ గారి పుస్తకాలు ఏఒక్కటీ ఒదిలిపెట్టకుండా చదివాను. రంగనాయకమ్మ గారు మూడు తరాల గురించి రాసింది ‘అసమాంత్వంలోనుంచి అసమానత్వంలోకి’.

 12. రామ్మోహన్ గారూ, కష్టాలదేముంది లెండి. అవింకా కోట్లమందిని పీడిస్తూనే ఉన్నాయి.

  మార్క్సిజంతో మీకు కలిగిన పరిచయం చిన్న అద్భుతంగా నాకు తోస్తోంది. కేవలం అట్ట మీది కొటేషన్స్ చదివి కేపిటల్ పరిచయం కొని చదవడం అంటే మాటలు కాదు. మీ భావాలు కూడా అంతరాంతరాల్లో మార్క్సిస్టు సామాజిక దృక్పధం కోసం పరితపిస్తూండేదని దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అందుకే మీరు ఆ కొటేషన్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఆ తపనే మిమ్మల్ని రంగనాయకమ్మ గారి పుస్తకాలని మిగిలినవి కూడా కొనిపించింది.

  సాధారణంగా ప్రజా సంఘాల ద్వారా, ఉద్యమాల ద్వారా తప్ప మార్క్సిజంతో పరిచయం ఏర్పడడం తక్కువ. వారి వారి సామాజిక పరిస్ధితులు ఆ విధంగా మార్క్సిజం వైపుకి తీసుకెళ్తాయి. కాని మీ పరిచయం విభిన్నంగా ఉంది. ఇలాంటివి అరుదనే చెప్పవచ్చు.

  మీ చదువు అంతంత మాత్రం అనడం నాకు నచ్చలేదు. చదవడానికేమి! ఎంతమందో చదువుతున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, సివిల్స్, సి.ఎ లు ఒకటా? వీరెవరి వల్లా తోటి వాడికి ప్రయోజనం సున్న. పైగా ఇక్కడ సొమ్ముతో చదివి విదేశాలకి చెక్కేసి దేశీయులని అసహ్యించుకునే బాపతుకేమీ కొదవలేదు. వీరదందరిమీద సమాజాన్ని చదివినవాడే మిన్న. ఉత్తుత్తి చదువు కాకుండా సమాజంలో ప్రజల కష్టాలకి కారణాలు తెలుసుకుని అవి తొలగిపోవడానికి ఏం చేయాలన్నది ఆలోచింపజేసే చదువు గొప్పది. అలాంటి చదువు మీరు చదివారు.

 13. విశేఖర్ గారూ,
  ప్రధాన కథనానికి ఇది సందర్భోచితంగా ఉంటుందో లేదో తెలీదు కాని రంగనాయకమ్మగారి జానకి విముక్తి నవల ఆధారంగా “స్త్రీపురుష సంబంధాలు, స్త్రీ సమస్యలు” అనే అంశంపై 1986-87 మధ్యలో ఎస్ వి యూనివర్శిటీలో ఎంఫిల్ పరిశోధన చేశాను. నా పరిశోధనా కృషిలో భాగంగా 1986లో ఆమెను హైదరాబాద్లో కలిశాను. దాదాపు 70 పైగా ప్రశ్నలకు ఆమెనుంచి సమాధానాలు కూడా తెప్పించుకున్నాను.

  ఎంఫిల్ థీసెస్ సమర్పణ చివరిదశలో ఉండగా జీవితం అనుకోని మలుపులు తిరిగి ఇంటికి, వ్యక్తిగత జీవితానికి 13 ఏళ్ల పాటు దూరమైపోయాను. నేను తయారు చేసిన రీసెర్చ్ పాఠం మొత్తంగా మా గైడ్, ప్రొఫెసర్ పి.సి.నరసింహారెడ్డి గారి వద్దే ఉండిపోయింది. నా ప్రశ్నలకు రంగనాయకమ్మ గారు కంటి ఆపరేషన్ సమయంలోనూ ఓపికగా సమాధానాలు రాతపూర్వకంగా పంపుతూ అదనపు కాపీ లేనందున తప్పక తిరిగి పంపమని చెప్పారు.

  కానీ అనుకోని పరిణామాలతో జీవితమే మూలమలువు తిరగడంతో ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. యూనివర్శిటీలో హెచ్ బ్లాక్‌లో ఉన్న నా రూమ్‌లోని చిన్నపాటి లైబ్రరీతో పాటు ఆమెతో నా ఇంటర్వూ పాఠాన్ని కూడా నా సహ మిత్రులు తీసుకుపోయారు. పుస్తకాలు, అపురూప విషయాలను కోల్పోవడం అనే చరిత్ర అలా మొదలై ఈ పాతికేళ్లలో కొన్ని వందల పుస్తకాలు సేకరించుకోవడం, అనివార్యంగా పోగొట్టుకోవటం ఒక రొటీన్‌లా అయిపోయింది.

  జానకి విముక్తి నవల ప్రాతిపదికన స్త్రీపురుష సంబంధాలపై ఆమె తెలిపిన ఎన్నో అంశాలు ఆ 150 పుటల రాత ప్రతిలో ఉండి వెలుగు చూడకుండా పోయాయి. ఉన్నట్లుండి వెళ్లిపోవడం ద్వారా అన్నీ కోల్పోయాను కాబట్టి ఆమె కిచ్చినమాట నిలబెట్టుకోలేకపోయాను. అలా ఒక అరుదైన రాత ప్రతి నా ద్వారా చరిత్రకు అందకుండా పోయింది. పరిశోధనలో భాగంగా ఆమెతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మొత్తంగానే పోయాయి.

  పరిశోధన నుంచి అప్పటి నా ‘పెను గల్లంతు’ విషయం ఆమెకు తెలిసినప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో ఆమె ఇంటర్వ్యూను కోల్పోయానో ఆమె అర్థం చేసుకోగలిగనప్పటికీ, ఎక్కడో అపరాధ భావన. అందుకే గత పదేళ్లుగా వ్యక్తిగత జీవితం గడుపుతున్నప్పటికీ, ఆమె రచనలు చదువుతున్నప్పటికీ ఎందుకో ఆమెకు వివరంగా తెలుపడానికి, ఉత్తరాలు పంపడానికి సాహసించలేకపోయాను. ఎక్కడో అపరాధభావన.

  ఆమె రాసిన రామాయణ విషవృక్షం నవల నా జీవితంలో తొలి 20 సంవత్సరాలు నేను కొనసాగించిన పరమ ఆస్తిక భావనలను పటా పంచలు చేశాయి. కాని నేను నిజాయితీగా ఆస్తికత్వం గురించి నమ్మిన భావాలకు పూర్తి విరుద్ధంగా ఆమె ఆ నవలలో తొలి పేజీలలో రాసిన సుదీర్ఘ ముందుమాటలో మానవ పరిణామ చరిత్రను కూలంకషంగా చదివిన తర్వాత రెండేళ్లు మానసిక ఘర్షణ పడ్డాను. ఏది నిజం. ఏది అనిజం. అనంతరం యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల్లో చేరిన తరువాతే, సృజన, అరుణతార, ప్రజాసాహితి తదితర ప్రత్యామ్నాయ పత్రికలు, అధ్యయనం తర్వాత నా పాత జీవితం, భావాలనుంచి బయటకి వచ్చాను. ఆస్తికత్వం, నాస్తికత్వం ప్రస్తుత సమాజపు మౌలిక సమస్య కాదన్న స్పృహ ఆ రెండింటినీ బ్యాలెన్సెడ్‌గా అధ్యయనం చేయడం వరకు నన్ను తీసుకొచ్చింది.

  చిన్నప్పుడు ఊర్లో ఆర్ ఎస్ ఎస్ వారు వచ్చి సంఘం పెట్టి శ్లోకాలు నేర్పించి వ్యాయామాలు చేయించినప్పటినుండీ 20 ఏళ్లపాటు ఆ భావాలను అమ్మద్వారా వచ్చిన భక్తిని నిజంగానే నమ్మాను. రంగనాయకమ్మ గారి పుస్తకం చదవక పోయి ఉంటే, ఆ తర్వాత ప్రగతిశీల సాహిత్యం అందుబాటులోకి రాకపోయి ఉంటే నా జీవితం ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదేమో… కాని ఇన్నేళ్ల తర్వాత ఆమెతో ఏ రకంగానూ పరిచయంలేని స్థితి… కొన్ని ఘటనలు తప్పవు.. భరించవలసిందే..

  కమ్యూనిస్టు పార్టీలకు సాధ్యం కాని బృహత్తర కృషిని, మార్క్స్ కేపిటల్ ను తెలుగులోకి పరిచయం చేయడాన్ని ఆమె ఒంటి చేత్తో చేసి నిరూపించారు. ఈ విషయంలో కుటుంబం మొత్తంగా, చాలా మంది మిత్రులు ఆమె వెంట నిలిచారనుకోండి.

  ఒక ‘పెట్టుబడి’ పరిచయం, ఒక ‘చైనాలో ఏం జరుగుతోంది?’, ఒక ‘సాంస్కృతిక విప్లవం పరిశ్రమల నిర్వహణ,’ ఒక అర్థశాస్త్ర పరిచయం వ్యాసాలు, ఒక ‘జానకి విముక్తి’ ఇవి చాలవా ఆమె కృషిని తెలుగు సమాజం తరాలపాటు గుర్తు పెట్టుకోవడానికి…!

  రామ్మోహన్ గారూ,
  మీరు మా రాయచోటికి చాలా దగ్గర, మా సుండుపల్లె మండలానికి మరీ దగ్గర ఉండి కూడా మీ ఉనికి ఇంతవరకూ తెలియకుండా పోయింది. మరోవైపు మీరూ, విశేఖర్ గారూ ఒకరేననే ప్రచారం, కనీస తర్కానికి కూడా పొంతన లేని అపార్థాలు.. ఎంటో ఇది..?

  అట్ట మీది కొటేషన్స్ చదివి కేపిటల్ పరిచయం కొని చదవడం… ఎంతమంది జీవితాలను, ప్రేరణలను మీ ఉదంతం ప్రతిబింబిస్తోందో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.

 14. నాకు మాత్రం ఏ ప్రజా సంఘంతో గానీ విద్యార్థి సంఘంతో గానీ సంబంధం లేదు. నాకు మార్క్సిజం-లెనినిజం పరిచయం చేసినది ఒక కెనడియన్ NRI. ఒకప్పుడు నాకు మార్క్సిజం-లెనినిజం గురించి ఏమీ తెలియదు. నేను అన్నా హజారేలాగ దేశానికి అవినీతి ఒక్కటే పెద్ద సమస్య అనీ, అవినీతి పోతే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందనీ అనుకునేవాణ్ణి. ఇంగ్లిష్ డిస్కషన్స్ బోర్డ్‌లలో కూడా దాని గురించే వ్రాసేవాణ్ణి. అప్పట్లో నాకు ఒక కెనడియన్ NRI మహిళ & ఒక ఆస్ట్రేలియా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు పరిచయమయ్యారు. వాళ్ళిద్దరితో పరిచయం పెరిగిన తరువాత నా అభిప్రాయాలు మారాయి. అవినీతి కంటే సామ్రాజ్యవాదం చాలా పెద్ద సమస్య అని అర్థమైంది. నేను సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యాసాలు వ్రాయడం అప్పుడు మొదలుపెట్టాను. అయితే మార్క్సిజం-లెనినిజం లోతుగా చదవడం నేను 2006లో మొదలుపెట్టాను. అప్పట్లో It’s Right To Rebel అనే డిస్కషన్స్ బోర్డ్ ఉండేది. ఆ వెబ్‌సైట్‌లో కూడా నేను కామెంట్లు వ్రాసేవాణ్ణి. కానీ సైద్ధాంతిక విబేధాలు (వాళ్ళు నన్ను ట్రాట్స్కీయైట్ ఫోర్త్ ఇంటర్నేషనలిస్ట్ అని అనుమానించడం వంటివి) వల్ల వాళ్ళు నా ఐడిని బ్లాక్ చేసి నేను కామెంట్లు పోస్ట్ చెయ్యకుండా చేశారు. 2007 నుంచి నేను నా వ్యాసాలు నా సొంత బ్లాగ్‌లోనే వ్రాసుకుంటున్నాను. 2008లో నేను తెలుగు బ్లాగులలోకి వచ్చాను.

  సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం దొరికి అమెరికాకో, కెనడాకో వెళ్ళిపోయిన తరువాత నాకు గ్లోబలైజేషన్ వల్లే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం దొరికింది అని అంటూ గ్లోబలైజేషన్‌ని సమర్థిస్తారు. ఇండియాలో ఉన్నా సరే ఎలెక్ట్రానిక్ ఇంజినీర్‌కి LOTలో ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది, స్క్రీన్‌లో ఎన్ని డయోడ్స్ ఉంటాయి లాంటి విషయాలు తెలుస్తాయి. అతనికి మార్క్సిజం-లెనినిజంలో ఏముందో తెలియకపోవచ్చు. ఎవరైనా తమ ప్రొఫెషనల్ విద్య గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. సమాజం గురించి ఆలోచించేవాళ్ళు తక్కువ. ఈ పరిస్థితిలో కెనడాలో స్థిరపడిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాకు మార్క్సిజం-లెనినిజం పరిచయం చెయ్యడం గొప్పే.

 15. రాజశేఖర్ గారు, నేను నాస్తికునిగా మారడానికి కారణం రామాయణ విషవృక్షం పుస్తకం కాదు. భావవాదంలో ఆలోచనకీ, ఆచరణకీ మధ్య సహజసిద్ధమైన వైరుధ్యం ఉంటుంది. మతం మనిషిలో నీతిని పెంచుతుందని బోధించేవాళ్ళే నీతిమాలిన పనులు చేస్తారు. దొరికిపోయిన తరువాత వాళ్ళని అడిగితే మతం వేరు, నీతి వేరు అని సమాధానం చెపుతారు. చిన్నప్పటి నుంచి నాకు నమ్మనిదాన్ని నమ్ముతున్నట్టు నటించే అలవాటు లేదు. అందుకే నేను చిన్నప్పుడు కూడా నాస్తికుణ్ణనే చెప్పుకునేవాణ్ణి.

 16. రాజు గారూ, మీ అనుభవం సందర్భోచితమే. అనుమానం లేదు. మీ ధీసిస్ తీసుకెళ్లిన వ్యక్తయినా పరిశోధన ప్రచురించి ఉంటే బాగుండేదేమో. బహుశా ఆ వ్యక్తి ఇప్పుడెక్కడున్నారో మీకు తెలిసుండదు.

  మీరు వెళ్తే గనక గాంధీ, రంగనాయకమ్మ గార్లు మిమ్మల్ని తప్పనిసరిగా గుర్తుపడతారు. వారికి పరిచయం ఐన వాళ్లని ఎవరినీ మర్చిపోరని చెబుతారు. అలాంటిది ఇంత ఘనమైన పరిచయాన్ని మరవడం జరగదు.

  ఇంతకీ రామ్మోహన్, నేనూ ఒకరేనన్నమాట. వీళ్ళకి మారుపేర్లతో సంచరించడం అలవాటై అందర్నీ అలాగే చూస్తున్నట్లున్నారు.

 17. ప్రవీణ్ గారూ,
  భావవాదం అంటే ఏమిటి భౌతిక వాదం అంటే ఏమిటి అనే ప్రాధమిక విషయాలు కూడా తెలియని వాళ్లకి, అసలు ఆ పదాలే జీవితంలో ఎన్నడూ విననివారికి రామాయణ విషవృక్షంలోని ఆ సుదీర్ఘ ముందుమాట మహత్తర భావనను కలిగిస్తుంది. రామాయణ రాముడిని విషవృక్షంలో మరీ అంటకాగినట్లుంది, రాముడిని మరీ క్యారికేచర్‌లాగా వ్యంగ్యీకరించి రాముడిని, రామాయణాన్ని నమ్మేవారిని కర కర కోసినట్లుంటుంది కాని విషవృక్షంలోని ఆ ముందుమాట మాత్రం ఏ కమ్యూనిస్టు ఫిలాసఫీ రచనలో కంటే సుబోధకంగా మానవ పరిణామాన్ని వివరించిందనడంలో సందేహమే లేదు.

  రామాయణ విషవృక్షం ప్రింట్ రూపంలో అందుబాటులో లేనప్పటికీ ఆ ముందుమాటను మాత్రం తప్పనిసరిగా విడిగా పుస్తక రూపంలో ప్రచురించవలసిందిగా రంగనాయకమ్మగారిని అప్పట్లోనే కలిసినప్పుడు కోరాను. ఆమె, గాంధీ గారు ఈ సలహా మంచిదేనని, తప్పకుండా ఆలోచిస్తామని చెప్పారు కాని తర్వాత అది సాధ్యపడినట్లు లేదు. వంద రెండు వందలు పెట్టి విషవృక్షం కొనలేనివారికి కూడా ఈ ముందుమాట అందుబాటులో ఉండాలి.

  కాని నాకు ఒక విషయంలో తీవ్ర అభ్యంతరం ఉంది. మత విశ్వాసాల మీద లేదా అతీత శక్తిమీద ఈరోజుకీ నూటికి 99 మందికి నమ్మకం ఉంటున్నప్పుడు ఆ విశ్వాసాలను విమర్శిస్తున్నప్డుడు లేదా వ్యతిరేకిస్తున్నప్పడు చాలా బ్యాలెన్సెడ్‌గా ఉండాలనేది నా అనుభవం నేర్పిన పాఠం. లక్షసార్లు నాస్తిక ప్రకటనలు గుప్పించినా మత పునాదికి ఏమీ కాదు. మతానుయాయులను, మత పెద్దలను కూడా ఐక్య సంఘటనలో భాగంగా కలుపుకున్న, సమాదరించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకు ఉంది.

  మతాన్ని రాజ్యవ్యవహారాలనుంచి దూరంగా పెట్టిన సందర్భాల్లో కూడా మతాన్ని నమ్మేవాళ్లను దూరంగా పెట్టకూడదని, అలా పెడితే కమ్యూనిస్టు పార్టీకి ఎవరూ మిగలరని నా అభిప్రాయం. రాజ్యం సాధించిన తర్వాత కూడా చేయవలసిన కార్యాలను పక్కన బెట్టి, చేయకూడని కార్యాలను వరుసగా చేస్తూ పోతే ప్రజలు మతాన్ని ఎన్నిటికీ వదలకపోగా లక్షలాది ఇళ్లలో సైలెంటుగా మతం మళ్లీ రాజుకునే ప్రమాదముందని కూడా మనం సోవియట్ అనుభవాలనుంచి చూశాం.

  మత భావనను ఏ మాత్రం విశ్వసించని కార్యకర్తలు కూడా కేమోప్లెజ్ కోసం, రహస్య మనుగడ కోసం, మత చిహ్నాలను పాక్షికంగా అయినా సరే స్వీకరించవలసిన, పాటించవలసిన స్థితి మన దేశంలోనూ ఆచరణ రూపంలో కొనసాగుతోంది. “రహస్య సమావేశం కోసం ఏ తిరుపతికో, తిరుత్తణికో, కంచికో వెళ్లిన కార్యకర్తలు, నేతలు ఆ ప్రాంతాలకు జనం ఎందుకు వస్తారో తెలిసి కూడా, కేమొప్లెజ్ కోసం బొట్టు పెట్టుకుని, సాంప్రదాయికంగా కనబడకపోతే, జనంలో భాగంగా తాము ఉండకపోతే సులభంగా శతృదృష్టిలో పడతాం. విప్లవ కార్యాచరణ అంటే నేను విప్లవకారుడిని, విప్లవకారిణిని అని మోర విడిచి బయట తిరగడం కాదు” అంటూ నాయకులు చెపుతుంటారు.

  ప్రవీణ్ గారూ, మనం నిజాలనే చెప్పాలి. నిజమే. కాని అలా చెప్పే క్రమంలో అవతలివారిని రెచ్చగొట్టకూడదు. మా ప్రాంతంలో కొత్తగా విప్లవ పార్టీలోకి వచ్చిన ఒక పేద యువకుడు విప్లవమంటే దైవదూషణ, విగ్రహ వ్యతిరేకత అని పొరపడి పట్టణం నుంచి ఊరి కొచ్చాక వీరావేశంతో, ఊర్లో జనం కొలిచే అమ్మదేవతను విగ్రహాన్ని పట్టుకుని పాదరక్షలతో అందరూ చూస్తుండగా కొట్టేశాడు. ఇంకేముంది తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ చుట్టుపక్కల ఊర్లలో పార్టీకాని కార్యకర్తలు కాని అడుగుపెట్టలేకపోయారు.

  బృందాకారత్ రాజకీయాలను మనం విమర్శించవచ్చు కాని దేశవ్యాప్తంగా ఆమె పర్యటిస్తున్నప్పుడు మతాన్ని ఆచారాలను నమ్మే 99 శాతం మంది మహిళలను ఆమె కలుస్తున్నప్పుడు, బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా వారి విశ్వాసాన్ని పొందే అవకాశం ఉన్నప్పుడు ఆమె పోలేరమ్మ బొట్టును పెట్టుకుంటే తప్పేమీ లేదు కదా.. ఇది సిపిఎం వారికే కాదు విప్లవపార్టీ కార్యకర్తలకు కూడా వర్తిస్తుంది.

  బొట్టు పెట్టుకోకపోవడం ద్వారా ప్రజలు నిన్ను నమ్మలేని, విశ్వసించలేని పరిస్థితులు ఏర్పడితే నువ్వు నీ విశ్వాసానికి విలువ ఇచ్చి వేరుపడిపోతావా లేక ముందు వారి విశ్వాసానికి విలువ ఇచ్చి క్రమంగా వారిని మార్చడానికి ప్రయత్నిస్తారా? దండకారణ్యంలో ముప్పై ఏళ్లుగా పోరాడుతున్న విప్లవోద్యమం అక్కడి స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షతను, దురాచారాలను కొన్నింటిని మార్చగలిగినా, వాళ్లు తీవ్రంగా భావించే, గౌరవించే కొన్ని విశ్వాసాల విషయంలో ఈనాటికీ మార్పు తేలేకపోతోందని ఆ ఉద్యమాచరణే చాటుతోంది. తమ కాళ్లమీద తాము నిలబడి జీవించే రోజులు ప్రజలకు లభించనంతవరకు, మానవ శ్రమశక్తే అన్ని సమస్యలను పరిష్కరించే కాలం రానంతవరకు మనం విశ్వాసాల విషయంలో జనాలను ఎన్నటికీ మార్చలేము. పైగా ఏ పార్టీ కూడా జనం విశ్వాసాలను మార్చే ఎజెండాతో ఏ దేశంలోనూ పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఆచరణతో అంతో ఇంతో సంబంధం ఉన్న ఎవరికయినా ఇది సులభంగా అర్థమవుతుంది.

  అయ్యో..! ఒకచోట మొదలై మరోచోటికి పోయినట్లుంది చర్చ.

 18. విశేఖర్ గారూ,
  ధన్యవాదాలు. జానకి విముక్తి నవలపై నా ధీసెస్ మా గైడ్ దగ్గరే ఉండిపోయింది. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన, ఇప్పుడయినా దాన్ని నేనుపూర్తి చేస్తానా అని నా మిత్రులచేత అడిగించారు. కాని నాకే, పాతికేళ్ల గతాన్ని మళ్లీ పునరావృతం చేయడం ఎందుకనిపించి ఊరకుండిపోయాను. రంగనాయకమ్మగారితో నా ఇంటర్వ్యూ పాఠాన్ని అప్పటి నా సహ విద్యార్థి శ్రీనివాసమూర్తి తీసుకుపోయాడని తెలిసింది. ఎస్వీ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న ఇతడిది కర్నూలు జిల్లా. నా పుస్తకాలలో చాలా వరకు ఇతడే తీసుకెళ్లాడని తెలిసింది. తర్వాత తను ఉద్యమ స్పూర్థికి దూరమయ్యాడు. అంతే. తర్వాత అతడి వివరాలు తెలీవు. కాబట్టి అది కూడా చరిత్ర గతంలోకే వెళ్లిపోయింది.

  మీరన్నది కరెక్టే. రంగనాయకమ్మ, గాంధీగార్లకు భేషజాలు లేవు. కాని నేను చేయలేక పోయిన పనికి సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ వాళ్లకెందుకు గుర్తు చేయాలనే ద్వైదీభావం కూడా నామీద పనిచేస్తోందనిపించింది. అందుకే సైలెంటుగా ఉండిపోయాను. అంతే.. మరేం లేదు.

  ఇక రామ్మోహన్ గారికి మీకూ అభేదం ఉన్న విషయంపై చాలానే నడుస్తోంది. అయితే కొన్ని సందర్భాలలో చాలా అచ్చుతప్పులతో, కొన్నిసందర్బాలలో అచ్చు తప్పు అనేదే లేకుండా టైప్ చేసే తన శైలి నన్ను కూడా కాస్త గందరగోళంలోకి నెట్టింది. ఇలా ఎలా జరుగుతుందని ఆయనే సమాధానం చెప్పాలి మరి.

 19. “డాక్టర్లని రోడ్లను ఊడ్వాలి రమ్మంటె వారికి కోపం. ఆడవాళ్లని సమానంగా చూడాలంటె పురుష పుంగవులకి కోపం. పట్టణాల్లో పేరుకుపోయిన జనాన్ని గ్రామాలకి తరలించి ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగస్వామ్యుల చేయాలంటే అదొక తీవ్ర సమస్య. మధ్య తరగతి అభిజాత్యాన్ని వదులుకొమ్మంటే అదొక నేరం. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులని ఆర్గనైజ్ చేసి మావో ‘మాస్ లైన్’ కి ప్రతిగా నిలబెట్టడంలో చైనా కమ్యూనిస్టు పార్టీలోని ప్రతికూల శక్తులు సఫలం అయ్యాయి.”

  విశేఖర్ గారూ,
  నా ఉద్దేశంలో ఇవి చిన్న చిన్న అసంతృప్తులు కాదండీ, వెయ్యేళ్లు, రెండువేల ఏళ్లపాటు మనుషుల మెదళ్లను పట్టి లాగుతున్న భావాలను సాంస్కృతిక విప్లవం పేరిట అడ్డంగా నరికేయడం చిన్న చిన్న విషయాలు కాదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో మర్చిపోయిన జాతిలో భాగమైన డాక్టర్‌ను నీ దొడ్డి నువ్వే శుభ్రం చేసుకో అంటే వింటాడా? ఆడవాళ్లని సమానంగా చూడాలంటే ఏ పురుషాధిపత్యపు ప్రాణి అయినా సహిస్తుందా? మధ్యతరగతి అభిజాత్యాన్ని వదులుకోవడమంటే మాటలతో పనికాదు కదా.. ఇవి చిన్న చిన్న అసంతృప్తులు కాదండీ. కమ్యూనిస్టు పార్టీ మూలాన్నే పెకిలించివేసిన మహా అసంతృప్తులివి. ఈ మార్పు కిందినుంచి పైకి అమలవుతూ రావడం కాకుండా పార్టీ పంధా పేరుతో పైనుంచి కిందికి అమలవుతూ రావడంతో “స్వేచ్ఛాయుత ప్రజల స్వచ్చంద కార్యాచరణ” అనే మార్క్స్ భావన ఇక్కడ ఆచరణ సాధ్యం కాలేదు. అక్కడే విప్లవ పంధా ఓడిపోయింది.

 20. విశేఖర్ గారు, మీరు మార్క్సిజం గురించి భయపడేలా చెపుతున్నారని అవతలివాళ్ళు అన్నట్టు వ్రాసారు కదా. మీరు భయపడేలా చెపుతున్నారని వాళ్ళు ఎలా తీర్మానించారు? నేను గూగుల్ ప్లస్‌లో మార్క్సిజం గురించి సులభమైన భాషలో వ్రాసినప్పుడు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినది ఒకరిద్దరే. ఈ లింక్‌లు చదవండి:
  https://plus.google.com/111113261980146074416/posts/BRtTcwvDWVm

  https://plus.google.com/111113261980146074416/posts/6En54vpbQDT

  ఈ వ్యాసాలు కాకుండా సినిమా వ్యాసాలు వ్రాసుంటే పది మంది మెచ్చుకునేవాళ్ళు.

 21. రాజు గారూ, కొన్ని సందర్భాల్లో తప్పులు ఎక్కువ అనిపించినపుడు నేనే సవరిస్తున్నాను. ఆ సంగతి కొన్ని సార్లు కిందనే రాసి చెప్పాను కూడా కదా.

 22. రాజశేఖర్ గారు, ఒకప్పుడు నాకు కూడా భౌతికవాదం, భావవాదం అనే పదాలు తెలియవు. Sense organs ద్వారా అనుభవానికి అందేది నిజం, వాటి ద్వారా అనుభవానికి అందనిది అబద్దం అని మాత్రమే నాకు తెలుసు. అందుకే చిన్నప్పుడు కూడా నేను నాస్తికుణ్ణని చెప్పుకునేవాణ్ణి. “భావవాదంలో ఆలోచనకీ, ఆచరణకీ మధ్య సహజసిద్ధమైన వైరుధ్యం ఉంటుంది” అనే వాక్యం ఒక మార్క్సిస్ట్ వ్రాసిన పుస్తకంలో నేను చదివాను. నాస్తికునిగా మారడం గొప్ప కాదు. నాస్తికునిగా మారడం ఎవరికైనా సులభమే కానీ గతితార్కిక భౌతికవాదిగా మారడమే కష్టం.

 23. రాజశేఖరరాజు గారూ! బృందాకారత్ ‘పోలేరమ్మ బొట్టు’ అంటూ రాసింది రామమోహన్ గారు. (సాక్షికి ప్రకటనలు … పోస్టులో) కొండలరావు గారి లాగే మీరు కూడా అది రాసింది ప్రవీణ్ గారని పొరబడినట్టున్నారు.

  >> దేశవ్యాప్తంగా ఆమె పర్యటిస్తున్నప్పుడు మతాన్ని ఆచారాలను నమ్మే 99 శాతం మంది మహిళలను ఆమె కలుస్తున్నప్పుడు, బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా వారి విశ్వాసాన్ని పొందే అవకాశం ఉన్నప్పుడు ఆమె పోలేరమ్మ బొట్టును పెట్టుకుంటే తప్పేమీ లేదు కదా.. >>

  ఈ విషయంలో నాకు అభ్యంతరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు దగ్గరవ్వటానికి బొట్టు పెట్టుకోవటమూ, సగటు ఆస్తిక మహిళ ఎవరూ పెట్టుకోనటువంటి పెద్ద బొట్టు పెట్టుకోవటమూ వేరు కదా?

  కమ్యూనిస్టు పార్టీ నాయకులు తాము నాస్తికులమని బహిరంగంగానే చెప్పుకుంటుంటారు. మత తంతులు పాటించటం కానీ, పూజా పునస్కారాల కార్యక్రమాలకు హాజరుకావటం కానీ చేయరు. అలాంటిది బృందాకారత్ కి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు. కమ్యూనిస్టు కాబట్టి బొట్టు పెట్టుకోనంత మాత్రాన ప్రజలు ఆమెను చూసి షాకయ్యే పరిస్థితి లేదు. (అలా భారీ బొట్టుతో చూస్తేనే మొదటిసారి ఎవరైనా షాకవుతారు) అలా పెద్ద బొట్టు పెట్టుకోవటానికి ప్రత్యేకంగా ఆమె ఆశించిన ఫలితం ఏమిటో్ నాకు బోధపడలేదు.

  బొట్టు తోనే ఎందుకు ఆగాలి! మత తంతుల్లో పాల్గొంటే మహిళల విశ్వాసం మరింత పొందే అవకాశం ఉంటుంది కదా?

  రహస్యంగా పనిచేసే విప్లవ కార్యకర్తల సంగతి వేరు. వారికున్న పరిమితుల్లో వారు ప్రజల నమ్మకాన్ని పొందటం కోసం తాత్కాలికంగా మత విశ్వాసాలను పాటించటం అర్థం చేసుకోవచ్చు.

  హేతువాద, నాస్తిక, అభ్యుదయ భావాలు మన తెలుగు సమాజంలో వ్యాప్తిలో ఉన్నకాలం గతించిపోయినట్టనిపిస్తోంది. పత్రికల్లో, టీవీల్లో, ఇంటర్నెట్లో కూడా ఇలాంటి భావజాలానికి స్పేస్ దాదాపు లేదు. వాస్తు, నాడీ జ్యోతిషాలూ, మూఢనమ్మకాల ధోరణులూ భయంకరంగా విస్తరిస్తున్నాయి. కొత్తతరం వాటి ప్రభావంతోనే పెరుగుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ భావజాలం తెలిసే అవకాశం ఉండటం లేదు. మూఢత్వాలపై విమర్శ, శాస్త్రీయ దృక్పథం గురించి విరివిగా చర్చించటం, మీరన్నట్టుగానే బ్యాలన్స్ డ్ గానే రాస్తూనే శషభిషలు లేకుండా మనలాంటివాళ్ళం మనం నమ్మే భావాలను సూటిగా వెల్లడించటం ఒకప్పటికంటే చాలా అవసరమనిపిస్తోంది!

 24. కొత్త వ్యాఖ్యలు చదవటం ఈ బ్లాగు wordpress అమరికలో చాలా కష్టంగా ఉంటోంది. ముఖ్యంగా పదుల కొద్దీ వ్యాఖ్యలు వచ్చినపుడు! ప్రతి వ్యాఖ్యకూ జవాబును అక్కడికక్కడే రాసే అమరికను ఉపయోగించుకోవటం వల్ల చదివేవాళ్ళకు ఆ కొత్త వ్యాఖ్య ఎక్కడుందో వెంటనే కనిపెట్టటం కష్టమైపోతోంది.

  దీనికి పరిష్కారం – చివరి వ్యాఖ్య తర్వాతే ఏ కొత్త వ్యాఖ్య అయినా రాయటం. ఇలా చేస్తే చదివేవాళ్ళు వ్యాఖ్యలను చివర్లో చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం ఉద్దేశించిన వ్యాఖ్యాత పేరును సంబోధించి ఆ వ్యాఖ్య రాయాల్సివుంటుంది. ఇప్పుడు రాజు గారిని ఉద్దేశించి రాసిన తాజా వ్యాఖ్యలో నేను ఈ పద్ధతినే పాటించాను!

 25. వేణు గారూ, ఈ టెంప్లేట్ లో పది వ్యాఖ్యల వరకీ అక్కడికక్కడే జవాబు రాసే పద్ధతిని ఎంచుకోవచ్చు. అలా చేస్తే వ్యాఖ్యల వెడల్పు తగ్గి పేజి పొడవు పెరుగుతోంది. అందువల్ల ఐదు వరకు అక్కడికక్కడే జవాబిచ్చే పద్ధతి ఎంచుకున్నాను. మీరు చెప్పినట్లు పేరుతో సంబోధిస్తే చివర రాసినా తేడా రాదు. ఇప్పటి నుండి అలా అక్కడికక్కడే జవాబు రాసే పద్ధతిని డీ సెలెక్ట్ చేస్తాను. అలా కొన్ని రోజులు చూస్తాను. సమస్యలు రాకపోతే కొనసాగిస్తాను.

 26. రాజశెఖర రాజు గారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజలతో మమేకం అయ్యేటప్పుడు ఉపరితలం అంశాలు (కులం, మతం, జాతి లాంటివి) వాటికి ప్రాదాన్యం ఇవ్వరు. పునాది సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. అలాగే చెయ్యలి కుడా. మీరు చూశారో లేదో ఈ విషయాన్ని రంగనాయకమ్మ గారు అనేక సార్లు చెప్పారు. అయితే నాయకులనేవారు ఆదర్శంగా వుండాలి వ్యక్తిగతంగా.

  అవును, కొన్నిసార్లు చాలా తప్పులు దొర్లుతున్నాయి. మళ్ళీ వాటిని పరిశీలించకుండా అలాగే పంపుతున్నాను. ఇకనుంచి సాధ్యమైన వరకు అలాంటివి దొర్లకుండా చుస్తాను. మీరు నాకు చాలా దగ్గరలో వున్నారు. రాయచోటి, సుండుపల్లి నేను గతంలో వెళ్ళేను.

 27. రాజశేఖర్ గారు, ప్రజల వ్యక్తిగత విశ్వాసాలని గౌరచించాలనుకుంటే కేవలం మహిళా కార్యకర్తల చేత బొట్లూ, మంగళ సూత్రాలూ ధరింపచెయ్యక్కరలేదు. మగ కార్యకర్తల చేత కూడా నుదుటి మీద పంగనామాలూ, చెవుల్లో పువ్వులూ పెట్టించాలి. మగవాడు పువ్వులూ, పంగనామాలూ పెట్టుకుంటే అతన్ని పాత కాలపు మనిషిలాగ చూస్తారు కానీ ఆడది బొట్లూ, మంగళ సూత్రాలూ పెట్టుకుంటే ఆమెని పాత కాలపు మనిషిలాగ చూడరు. పైగా సుమంగళి అనీ, పతివ్రత అనీ అంటారు. ఇది పచ్చి పురుషాధిక్య భావజాలం తప్ప ఇంకొకటి కాదు.

 28. రాజశేఖర్ గారు, మార్క్సిజం-లెనినిజంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినది చారిత్రక భౌతికవాదమే కానీ నాస్తికత్వం కాదు. మార్క్సిస్ట్‌గా మారకముందు కూడా నేను నాస్తికుణ్ణే. కేవలం దేవుడు, దెయ్యం, చేతబడి లాంటి వ్యక్తిగత విశ్వాసాలు మార్చుకోవడానికి ఎవరూ మార్క్సిజంని ఆశ్రయించరు. సామాజిక అభిప్రాయాలు మార్చుకోవడానికి మాత్రం మార్క్సిజం అవసరమే. పెట్టుబడిదారీ వర్గంవాళ్ళు ప్రైవేట్ ఆస్తి అనేది మొదటి నుంచి ఉందనీ, అదే కొనసాగాలనీ అంటారు. కానీ చరిత్ర పరిణామంలో ప్రైవేట్ ఆస్తి అనేది మొదటి నుంచి లేదు. ఆ విషయం చదివిన తరువాత నాకు ప్రైవేట్ ఆస్తి మీద ఉన్న భ్రమలు అన్నీ పోయాయి.

 29. రాజశేఖర్ గారు, “రామాయణ విషవృక్షం” పుస్తకం చదివితే “నీతి” నిజ జీవితంలో కాకుండా స్కూల్ పుస్తకాలు & చిన్న పిల్లల కథలలో మాత్రమే ఎందుకు కనిపిస్తోందో అర్థమవుతుంది. “రామాయణ విషవృక్షం” పుస్తకం చదవడానికి ముందు కూడా నేను నాస్తికుణ్ణే. ఆ పుస్తకం చదివిన తరువాత దేవుడు, దెయ్యాలు అనేవి ఉన్నాయా, లేవా అనే విషయంలో నా అభిప్రాయం మారలేదు కానీ నీతి విషయంలో మాత్రం నా అభిప్రాయాలు మారాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s