పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం


oathఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం కానుంది. ప్రధాని ఇందిరా గాంధీతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లాంటి విదేశీ వ్యవహారాలపై అవగాహన కల్పించడానికి ఉపయోగపడే 200 కి పైగా కార్టూన్లు ‘సమీక్ష’ కు గురవుతున్నాయని ఎన్.డి.టి.వి తెలిపింది.

ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య గ్రంధాల్లో ప్రధానంగా రాజకీయ శాస్త్రం లోనే కార్టూన్లు కనిపిస్తాయి. 1 నుండి 12  తరగతుల వరకూ పాఠ్య గ్రంధాలను ఎన్.సి.ఇ.ఆర్.టి రూపొందిస్తుంది. విద్యార్ధులలో విజ్ఞానదాయకమైన వినోదాన్ని కార్టూన్లు రేకెత్తిస్తాయని కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం. టెక్స్ట్ బుక్ అభివృద్ధి కమిటీ మొదట కార్టూన్లను పరీశీలిస్తుందనీ అనంతరం ఒక పర్యవేక్షక కమిటీ వాటిని ఆమోదిస్తుందనీ ఎన్.డి.టి.వి తెలిపింది.

అయితే అంబేడ్కర్, నెహ్రూ లపై లెజండరీ కార్టూనిస్టు శంకర్ పిళ్లై గీసిన కార్టూన్ పై వివాదం రేగాక ఈ కార్టూన్లు అన్నింటినీ సమీక్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అధిక భాగం కార్టూన్లు పాఠ్య పుస్తకాలనుండి మాయం కానున్నాయని పత్రికలు చెబుతున్నాయి. కార్టూన్లే కాక కొన్ని పాఠ్య పుస్తకాలనే పూర్తిగా రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పత్రికలు తెలిపాయి.

అంబేడ్కర్, నెహ్రూ లపై గీసిన కార్టూన్ ‘అఫెన్సివ్’ గా ఉండని అనేకమంది పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడడమే ఆందోళనకరం. స్కూల్ పాఠ్య పుస్తకాల్లోకి కార్టూన్లు రావడమే అభ్యంతరకరమని కొంతరు ఎం.పి లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామిక సూత్రాల పట్ల కనీస అవగాహన కనపరచకుండా కొద్ది మంది లేవనెత్తిన వివాదానికి పార్టీలకు అతీతంగా తలలూపుతూ ‘భావ ప్రకటన’ను నిషేధించడానికి పూనుకుంటున్నారు. కార్టూన్లు అందించే వినోదాత్మక విజ్ఞానాన్ని విద్యార్ధులకి దూరం చేయడానికి పూనుకున్నారు.

“11, 12 తరగతుల ‘రాజకీయ శాస్త్రం’ పాఠ్య పుస్తకాల్లోకి ‘అఫెన్సివ్ కార్టూన్లు’ ఎలా వచ్చాయనే అంశాన్ని విచారించడానికి నిర్ణయించాం. ఈ కార్టూన్లు పుస్తకాల్లోకి రావడంలో ఎన్.సి.ఏ.ఆర్.టి అధికారుల పాత్రపైనా విచారిస్తాం. బాధ్యులెవరో నిర్ధారిస్తాం. దీని వెనుక క్రిమినల్ ఉద్దేశ్యాలని విచారిస్తాం” అని కపిల్ సిబాల్ పత్రికలకు తెలిపాడు. “ఇదే కార్టూన్ వార్తా పత్రికల్లో వస్తే అభ్యంతరం లేదు. రాజకీయ వర్గంపై దాడి చేసేలా ఉన్న ఈ కార్టూన్ గానీ, ఇతర కార్టూన్లు గానీ పాఠ్య పుస్తకాల్లో ఉంటే, విద్యార్ధుల మెదళ్ళను ప్రభావితం చేస్తాయి గనక అవి ఆమోదనీయం కాదు” అని కపిల్ సిబాల్ అన్నాడు. “భావ ప్రకటనా స్వేచ్ఛ సందర్భానికి తగినట్లు ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.

అదీ సంగతి. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ఎన్ని వేషాలు వేసినా ఆ సంగతి విద్యార్ధులకి చేర కూడదన్నమాట. చేరితే విద్యార్ధులు రాజకీయ నాయకుల వ్యవహారాల్ని అర్ధం చేసుకుని వారిని కూల్చివేసే పనిలో పడతారన్నది వాళ్ళ భయం.

రాజకీయ నాయకులని విమర్శించడం ఓ ఫ్యాషనై పోయింది అంటూ వివిధ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. లెఫ్ట్ పార్టీల నాయకులు కూడా వీరికి తొడయ్యారు. “రాజకీయ నాయకులంతా దొంగలని సాధారణ అభిప్రాయం ఏర్పడింది” అని సి.పి.ఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా వ్యాఖ్యానిస్తే, “రాజకీయ నాయకులపైన అయిష్టత తీవ్రంగా ఉంది” అని అకాలీ దాల్ ఎం.పి హర్ సిమ్రాట్ కౌర్ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకులపై దాడి చేయడం ఫ్యాషనయింది. ఎవరండీ ఈ మేధావులు?” అని కాంగ్రెస్ ఎం.పి సంజయ్ నిరుపమ్ విరుచుకుపడ్డాడని ఐ.బి.ఎన్. లైవ్ తెలిపింది.

నిజానికి ఎం.పిలు చెబుతున్నది నిజమే. రాజకీయ నాయకుల అవినీతి తెలిసాక ఎవరు వారికి అనుకూలంగా ఉండగలరు? ప్రజా ధనాన్ని, దేశ వనరులను ప్రజలకు వినియోగపెట్టడం మాని కంపెనీలకి అప్పజెప్పే విధానాలు రుద్దుతున్న వీరు ‘భావ ప్రకటన స్వేచ్చ’ పైన తీర్పులిచ్చేందుకు అర్హులే కారు. అంబేడ్కర్, నెహ్రూ లను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామిక భావాలపై దాడికి దిగుతున్న వీరి పద్ధతే కార్టూన్లు ఎంత సవ్యమో తెలియజేస్తున్నాయి. స్వేచ్ఛను ప్రభోధించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వీరికి మద్దతు వచ్చే సమస్యే లేదు.

3 thoughts on “పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

  1. వ్యంగ్యం, హాస్యం లేనిదే కార్టూన్ ఎలా అవుతుంది? అలాంటి కార్టూన్ల విషయంలో మన ప్రజా ప్రతినిధులు స్పందిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఎప్పటి కార్టూన్లకో ఇన్నేళ్ళ తర్వాత ఎందుకింత ఉలిక్కిపడుతూ ఉక్రోషపడాలి! రానురానూ వీళ్ళలో హాస్య స్ఫూర్తి తరిగిపోతూ అసహనం, అసహిష్ణుత (intolerance) పెరిగిపోతున్నాయి.

    >> అంబేడ్కర్, నెహ్రూ లను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామిక భావాలపై దాడికి దిగుతున్న వీరి పద్ధతే కార్టూన్లు ఎంత సవ్యమో తెలియజేస్తున్నాయి. >> బాగా చెప్పారు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s