ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత దేశంలో ఋతుపవనాల రాక పెద్ద వార్తే.
ఈ సంవత్సరం దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు గత నెలలో ఐ.ఎం.డి తెలిపింది. గత నెల (ఏప్రిల్ 26) వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణ వర్షపాతం నమోదుకూ 47 శాతం అవకాశాలు ఉండగా, సాధారణం కంటే తక్కువ నమోదు కావడానికి 24 శాతం అవకాశం ఉందని న్యూఢిల్లీ వాతావరణ కార్యాయాన్ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.
భారత దేశంలో వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న లాంటి ఖరీఫ్ పంటలకు ఋతుపవనాల రాక ప్రాణాధారం లాంటిది. వ్యవసాయ యోగ్యమైన భూమిలో 60 శాతం వర్షాల పైన ఆధారపడే పంటలు పండుతాయి. భారత దేశంలో పంటల దిగుబడి ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ప్రభావాన్ని కలుగ జేస్తాయి. ఇక్కడ పంటల దిగుబడిని బట్టి ఆయా కమోడీటీల ధరలు షేర్ మార్కెట్లలో హెచ్చు తగ్గులకు లోనవుతాయి. పంటల దిగుబడి కి ఋతుపవన వర్షాలే ప్రధానం కనుక ఇక్కడి ఋతుపవనాల రాక పైన దేశ విదేశీ వ్యాపార కంపెనీలు, షేర్ మార్కెట్లు, వ్యాపార పత్రికలు దృష్టి కేంద్రీకరిస్తాయి.
ఉదాహరణకి బ్రిటన్ కి చెందిన ప్రముఖ ఆర్ధిక, వాణిజ్య పత్రికా సంస్ధ రాయిటర్స్ ఇలా అంటోంది. “వ్యవసాయ ఉత్పత్తులకీ, ఆర్ధిక వృద్ధికీ వర్షపాతం కీలకమైనది. దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల జి.డి.పి లో 15 శాతం వ్యవసాయ రంగం నుండే సమకూరుతుంది” అని వ్యాఖ్యానించింది. సగం కంటే ఎక్కువే భూముల్లో వర్షాధారంగా పంటలు పండుటాయనీ, తొలకరి (ఫస్ట్ షవర్) నుండే రైతులు అధిక సంఖ్యలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారనీ కూడా ఆ సంస్ధ తెలిపింది.
‘ఏంజెల్ కమోడిటీస్’ అనే వాణిజ్య సంస్ధకి చెందిన విశ్లేషకురాలు నళినీ రావు ని రాయిటర్స్ ఇలా ఉటంకించింది. “వర్షాలు సకాలంలో రావడం శుభవార్త. నాట్లు సకాలంలో పడతాయి. అది పంటలు బాగా పండడానికి అనుకూలం.” ఆమె ఇంకా ఇలా అంది “ఋతుపవనాల పయనం కీలకం. కొన్ని సార్లు అవి దక్షిణ కోస్తాకి సకాలంలో తాకుతాయి. కానీ ఇతర ప్రాంతాలకి విస్తరించడంలో ఆలస్యం అవుతుంది.” అంటే ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించడం ఒక అవసరం కాగా, అవి స్ధిరంగా నిండుగా ఇతర ప్రాంతాలకి కూడా సకాలంలో విస్తరించడం కూడా అంతే అవసరం.
వరి, గోధుమ, పంచదార, పత్తి పంటల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో రెండవ స్ధానంలో ఉంది. అత్యధిక సంఖ్యలో వినియోగదారులు కూడా ఉన్నారు. కానీ భారత దేశంలో అత్యధిక వినియోగదారులకు ఈ పంటలు అందుబాటులో లేవు. కనీసం రైతులకి కూడా అందుబాటులో లేకపోవడమే ఒక దారుణం. పంటలు రైతుల చేతిలో ఉన్నంతవరకూ నేలని తాకే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అవి రైతుల చేతిని దాటి దళారీల చేతికి వెళ్లడంతోటే నింగి వైపుకి తారాజువ్వల్లా దూసుకెళ్తాయి.
ఈ పరిస్ధితిని అంతం చేస్తామనీ, దళారీ రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలిస్తామనీ, అణిచివేస్తామనీ, రైతు రాజ్యం తెస్తామనీ వాగ్దానం ఇవ్వని నాయకుడుగానీ, ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ, ముఖ్య మంత్రి గానీ, కేంద్ర మంత్రి గానీ లేనే లేడు. ఐనా దశాబ్దాల తరబడి రైతుల కష్టం దళారీల జేబుల్లోకి, ఎమ్మేల్యేలు, మంత్రుల జేబుల్లోకి ప్రవహించడం కొనసాగుతూనే ఉంది. ఋతుపవనాల రాకతో ఆశగా బతికే రైతు ఇంటినిండా పంట చేతికి వచ్చినా అది పలికే ధరను చూసి కంటి నిండా నీటితో ప్రాణాలు తీసుకుంటున్నాడు. కుటుంబాలను దిక్కులేనివారికి చేసి పోతున్నాడు.
రాయిటర్స్ అందించిన ఈ క్రింది గ్రాఫ్ లు భారత దేశంలో వర్షపాతానికీ వ్యవసాయ ఉత్పత్తికీ ఉన్న సంబంధాన్నీ, అంచనా వర్షపాతాన్నీ – వాస్తవ వర్షపాతాన్ని వివరిస్తున్నాయి.
–
–