సోమవారం భవిష్యత్తు నిర్ణయించుకుంటానని చెప్పిన యెడ్యూరప్ప బి.జె.పి కి రాజీనామా చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఎం.ఎల్.ఎ ల ఒత్తిడితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పత్రికలకు చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సదానంద గౌడ పై ఆయన విమర్శలు కొనసాగించాడు. మరో వైపు బి.జె.పి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని కొట్టి పారేయలేమని జనతా దళ్ (సెక్యులర్) నాయకుడు సిద్ధ రామయ్య అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది.
“శాసన సభ్యుల ఒత్తిడికి తలొగ్గుతూ, సీనియర్ పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేసినందున పార్టీ నుండి వదిలి వెళ్ళే నిర్ణయాన్ని వాయిదా వేయడానికి నిర్ణయించాను” అని పత్రికల సమావేశంలో యెడ్యూరప్ప తెలిపాడు. 40 మంది ఎమ్మేల్యేలు ఇప్పటికే తనకు రాజీనామా లేఖలు ఇచ్చారనీ, మరో పది మంది సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపాడు. 121 మంది బి.జె.పి ఎమ్మెల్యేల్లో 70 మంది తనకు మద్దతుగా ఉన్నారని కూడా ఆయన చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది.
అక్రమ మైనింగ్ లో యెడ్యూరప్ప పాత్రపై సి.బి.ఐ విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటి నుండీ యెడ్యూరప్ప పార్టీపైనా, ప్రభుత్వం పైన తిరుగుబాటు ప్రారంభించాడు. ముఖ్యమంత్రి పీఠం తనకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే పార్టీ నుండీ, ప్రభుత్వం నుండీ వెళ్లిపోతానని ఆదివారం హెచ్చరిక జారీ చేశాడు. అయితే యెడ్యూరప్పకి ముఖ్య మంత్రిత్వం అప్పగించేది లేదని అధిష్టానం తేల్చి చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. యెడ్యూరప్పకి మద్దతుగా తొమ్మిది మంది ఎం.పి లు సైతం బి.జె.పి అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికీ యెడ్యూరప్పకి పదవి దక్కలేదు.
ముఖ్య మంత్రి సదానంద గౌడని తప్పించి తాను చెప్పిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా ఎన్.డి.టి.వి విశ్లేషిస్తోంది. వాస్తవానికి సదానంద గౌడ కూడా యెడ్యూరప్ప ఎన్నుకున్న వ్యక్తే. అయితే యెడ్యూరప్ప అవినీతి ఆరోపణల విషయంలో సదానంద గౌడ అంతగా సహకరించకపోవడం వల్లనే ఆయనను గద్దె దిగాలని కోరుతున్నట్లుగా పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
తదుపరి పార్లమెంటు ఎన్నికల్లో ‘అవినీతి వ్యతిరేకత’ ప్రధాన ప్రధాన అంశంగా ఉండగలదన్న అంచనాతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప కి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎన్నికల అవకాశాలు దెబ్బ తింటాయని బి.జె.పి భావిస్తోంది. అందువల్లనే యెడ్యూరప్పకి పదవి ఇవ్వకుండా ఆయన సూచించిన వ్యక్తికి పదవి ఇవ్వడానికి బి.జె.పి అధిష్టానం నిర్ణయించిందని తెలుస్తోంది.