ఇటలీ నగరంలో పొదుపు విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యార్ధులపైన పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. దక్షిణ ఇటలీ నగరం నేపుల్స్ లో పోలీసులు, ప్రజల ఘర్షణలు తీవ్ర స్ధాయిలో జరిగాయని ప్రెస్ టి.వి తెలిపింది. ప్రభుత్వ పన్నుల విధానాలతో ఆగ్రహం చెందిన కార్మికులు, విద్యార్ధులు పన్నుల కార్యాలాయం ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ప్రదర్శకులను తరిమివేయడానికి ప్రయత్నించడంతో ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దానితో విద్యార్ధులు కార్మికులు పోలీసులపై బాటిళ్ళు, కోడిగుడ్లు విసిరారని పత్రికలు తెలిపాయి.
శుక్రవారం ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరో వైపు ప్రభుత్వ ఆర్ధిక విధానాలను వ్యతిరేకిస్తూ రాజధాని రోమ్ నగరంలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు 24 గంటల సమ్మెకు దిగారు. సమ్మె ఫలితంగా శుక్రవారం మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రభావితమయినట్లు పత్రికలు తెలిపాయి. ఇటలీ ప్రభుత్వం అనుసరిస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను ట్రాన్స్ పోర్ట్ కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. పొదుపు ఆర్ధిక విధానాల పేరుతో ఇటలీ ప్రభుత్వం కార్మిక చట్టాలను అనేకం తిరగరాస్తున్నది. రిటైర్ మెంటు వయసుని రెండు సంవత్సరాలు పెంచి కొత్త నియామకాలను రద్దు చేస్తున్నది.
ఇటలీ ప్రభుత్వ విధానాలు మిలియన్ల మంది పేదలను నిరుద్యోగ ఇటాలియన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని ఆందోళనకారులు వివరిస్తున్నారు. ఇటలీ లోని అనేక లేబర్ యూనియన్లు ప్రధాని మేరియో మోంటి ఆర్ధిక సంసంస్కరణల పధకాలకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్మికుల పెన్షన్లను కూడా తీవ్రంగా తగ్గించివేయడంతో జీవన ప్రమాణాలు తీవ్రంగా క్షీణిస్తున్నాయి. జనవరిలో ప్రభుత్వం ఆమోదించిన ‘పౌదుపు ప్యేకేజీ’ లో బడ్జెట్ కోటలు, పెన్షన్ సంస్కరణలు, 30 బిలియన్ యూరోల (51.7 బిలియన్ డాలర్లు) మేరకు పన్నుల పెంపు కలిసి ఉన్నాయి.
ఈ సంవత్సరం నుండి స్త్రీల రిటైర్ మెంట్ వయసు 60 నుండి 62 కి పెంచారు. పురుషుల గరిష్ట ఉద్యోగ కాలాన్ని (పూర్తి పెన్షన్ కాలం) 40 నుండి 42 సంవత్సరాలకి పెంచారు. 2012 రెండో అర్ధ భాగం నుండి వేట్ పన్నును 23 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఆర్ధిక సంస్కరణలను, పొదుపు విధానాలని అమలు చేయాలని యూరోప్ దేశాలపై ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల విధానాలు అమలు చేయడం ద్వారా బిలియనీర్లయిన పెట్టుబడిదారులకు, మదుపు దారులకి బిలియన్ల కొద్దీ లాభాలు గ్యారంటీ చేయడానికి ఇటలీ పాలకులు హామీ ఇస్తున్నారు.
2011 చివరి రెండు క్వార్టర్లలో నెగిటివ్ జీడీపీ వృద్ధి నమోదు చేయడం ద్వారా ఇటలీ ఆర్ధిక వ్యవస్ధ అధికారికంగా మాంధ్యం (రిసెషన్) లోకి జారిపోయింది. గత సంవత్సరం మూడవ క్వార్టర్ లో -0.2 జీడీపీ వృద్ధి ఇటలీ నమోదు చేయగా నాల్గవ క్వార్టర్ లో -0.7 వృద్ధి నమోదు చేసింది. ఇటలీ తో సహా యూరోపియన్ దేశాలు మాంద్యం పరిస్ధితులను ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ధనికులకు అనుకూల మైన విధానాలు అనుసరించడమే. యుద్ధాల కోసం బిలియన్లు ఖర్చు చేయడమే కాక, ఆర్ధిక సంక్షోభం సాకు చూపి కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్లు పందేరం పెట్టడంతో ప్రభుత్వాల నెత్తిన కొండల కొద్దీ అప్పులు పేరుకుపోయాయి. అప్పులను మేసిన కంపెనీల వద్ద బెయిలౌట్లు వసూలు చేయకుండా ప్రజల వద్ద వసూలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి.
పొదుపు విధానం బెంజమిన్ ఫ్రాంక్లిన్ కాలం నుంచి ఉన్నదే. ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఆ విధానాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తారు.