కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై ప్రశంసలు కురిపించాడు. సోనియా తో పాటు ఆమె పార్టీని కూడా యెడ్యూరప్ప ప్రశంసించాడు. బి.జె.పి లాగా కాకుండా కష్టాల్లో ఉన్న పార్టీ మంత్రులకు కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ నాయకురాలు గానీ తోడు నిలుస్తారనీ, మద్దతునిచ్చి కాపాడుకుంటారని ఆయన పొగడ్తలు కురిపించాడు. కర్ణాటక ముఖ్య మంత్రి సదానంద గౌడ ను ‘మోసగాడి’ గా ఆయన తిట్టిపోసాడు. ఆరు నెలల తర్వాత తన ముఖ్య మంత్రి పదవిని తనకు అప్పగిస్తానని హామీ ఇచ్చి దానిని నెరవేర్చడం లేదని ఆక్రోశించాడు.
అక్రమ మైనింగ్ లో యెడూరప్ప కి భాగస్వామ్యం ఉందనీ, అక్రమ మైనింగ్ ద్వారా ఆయన లబ్ది పొందాడనీ కర్ణాటక లోకాయుక్త నివేదిక ఇవ్వడంతో బి.జె.పి పార్టీ యెడ్యూరప్పని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించింది. ఆయనపై ఆరోపణలు తప్పని రుజువయ్యాక ఆయనకి ముఖ్యమంత్రి పదవి తిరిగి అప్పగిస్తామని అప్పట్లో బి.ఏజ్.పి అధ్యక్షుడు గడ్కారీ హామీ ఇచ్చాడు. యెడ్యూరప్పకు అక్రమ మైనింగ్ తో సంబంధం ఉన్నట్లు సాక్ష్యాలు లేవని జ్యూడిషియల్ కమిషన్ నివేదిక ఇచ్చింది కనుక తన పదవి తనకు ఇవ్వాలని యెడ్యూరప్ప డిమాండ్ చేస్తున్నాడు. అయితే అక్రమ మైనింగ్ లో యెడ్యూరప్ప పాత్రపై విచారణ చేయాలని సుప్రీం కోర్టు శనివారం సి.బి.ఐ ని ఆదేశించడంతో పరిస్ధితి మళ్ళీ మొదటికొచ్చినట్లయింది.
“సోనియా గాంధీని నేను ప్రశంసించాలి. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ వారు ఐక్యతగా ఉంటారు. వారి పార్టీ సభ్యులేవరైనా సమస్యలు ఎదుర్కొంటే వారు మద్దతుగా నిలుస్తారు. వాళ్ళు ఒకరినొకరు సహాయం చేసుకుని సమస్యలు పరిష్కరించుకుంటారు” అని యెడ్యూరప్ప బెంగుళూరులో ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ అన్నాడు. అక్రమ మైనింగ్ లో తన పాత్రపై సుప్రీం కోర్టు సి.బి.ఐ విచారణకు ఆదేశించాక బి.జె.పి పార్టీ తనకు మద్దతుగా నిలవకపోవడంపై ఆయన ఆగ్రహం, ఆక్రోశం వెళ్ళగక్కాడు. “కాంగ్రెస్ లో ఎవరైనా ప్రముఖ నాయకుడు ఆరోపణలు ఎదుర్కొంటే ఆ పార్టీ ఆయనను రక్షించుకోవడానికి నడుం బిగిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రజలకు నచ్చ జెబుతుంది” అని యెడ్యూరప్ప విలేఖరులతో వ్యాఖ్యానించాడు. “కానీ బి.జె.పి లో జనం ఒక వ్యక్తి సమస్యలలో ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తారు. అతనిని పక్కకు నెట్టడానికి ప్రయత్నిస్తారు. బి.జె.పి వాళ్ళు కుర్చీ కూలదోసి మరొకరి పదవి ఆక్రమించడానికి కూడా ప్రయత్నిస్తారు” అని యెడ్యూరప్ప వ్యాఖ్యానించాడు.
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కాంగ్రెస్ గానీ, బి.జె.పి గానీ వివిధ సందర్భాల్లో చేసే వ్యాఖ్యకు అసలు అర్ధం ఏమిటో యెడ్యూరప్ప చక్కగా వివరించాడు. ఆ వ్యాఖ్య తన సహచర మంత్రులను, నాయకులను, అధికారులను కాపాడడానికి ఉద్దేశించినదే తప్ప నిజంగా తన పని తాను చేసుకుపోవడానికి పురమాయించేది కాదని ఆయన అసలు సంగతి బయట పెట్టాడు. యెడ్యూరప్ప కాంగ్రెస్ నీ, సోనియానీ ప్రశంసిస్తున్నట్లు కనిపించినా, ప్రజల వైపు నుండి చూసినపుడు అవి తెగడ్తలే తప్ప పొగడ్తలు కావు. అవినీతికి పాల్పడే సహచరులను కాంగ్రెస్ కాపాడుకుంటుందంటే దానర్ధం ప్రజా ధనాన్ని దోపిడి చేయడంలో కాంగ్రెస్ పెద్దలు ఒకరినొకరు కాపాడుకుంటారనే. కాకపోతే అప్పుడప్పుడూ, తప్పని పరిస్ధితుల్లో, అవినీతిపైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైన పరిస్ధితుల్లో ఎ.రాజా లాంటి వారు బలిపశువులుగా మారతారు.
అనేక అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యెడ్యూరప్ప తిరిగి ముఖ్యమంత్రి పదవి పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చినా అవి సఫలం కాలేదు. కానీ ఆరోపణల నుండి బైటికి వచ్చాకే పదవి దక్కుతుందని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. తమ పార్టీ నాయకుల ధోరణి తనను తీవ్రంగా బాధిస్తోందని యెడ్యూరప్ప చెబుతున్నాడు. తాను ఎప్పటికయినా పరిశుభ్రునిగా బైటికి వస్తానని చెబుతూనే పార్టీపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. సంక్షోభాన్ని తీవ్రం చేయవద్దన్న పార్టీ ఆదేశాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. తన అనుయాయులతో చర్చోపచర్చలు సాగిస్తున్నాడు. పార్టీ శాసన సభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
గత వారం బి.జె.పి మంత్రులు, ఏం.ఎల్.ఎ ల బృందం ఒకటి లెజిస్లేచర్ పార్టీ సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ధోరణితో ఆగ్రహం చెంది తనకు కొంతమంది ఏం.ఎల్.ఎ లు రాజీనామా పత్రాలు ఇచ్చారని యెడ్యూరప్ప పత్రికలకు తెలిపాడు. తనతో ఉన్నారన్న కారణంగా వారిపైన క్రమ శిక్షణ చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి సదానంద గౌడ పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశాడనీ దానితో వారు అసంతృప్తితో ఉన్నారనీ ఆయన చెప్పుకొచ్చాడు. 9 మంది మంత్రులు 15 మంది ఎమ్మేల్యేలు శనివారం తనకు రాజీనామా ఇచ్చారని ఆయన తెలిపాడు. సోమవారం నాటికి మరింత మంది లేఖలు ఇస్తారని తెలిపాడు.
225 మంది సభ్యులున్న శాసన సభలో బి.జె.పీకి 120 మంది సభ్యులున్నారు. వారిలో 9 మంది మంత్రులు, 45 మంది ఏం.ఎల్.ఎ లు తన వైపు ఉన్నారని యెడ్యూరప్ప చెపుతున్నాడు. బి.జె.పి కి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, తానింకా నిర్ణయం తీసుకోలేదని యెడ్యూరప్ప చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.