ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్ లాల్ నెహ్రూ’ అలాంటి వారిలో ఎన్నదగిన వ్యక్తి. ఎదుటి వ్యక్తులను విమర్శించేటపుడు అవసరం అయిన పక్షంలో ఎంతటి తీవ్రమైన స్ధాయికి చేరవచ్చో ‘మహాత్మ గాంధీ’ పై అంబేద్కర్ ప్రకటించిన ‘కటువు విమర్శ’ లే ప్రబల ఉదాహరణ. అస్పృశ్యత పట్ల గాంధీ వెల్లడించిన వ్యతిరేకత, ఆయన పాటించిన హిందూ మత విలువలకు ఎంత బద్ధ వ్యతిరేకమో అంబేద్కర్ తన నిశిత విమర్శలతో వెల్లడి చేయకపోతే బహుశా భారత దేశ దళితులు ఇప్పటికీ ‘హరిజనులు’ గా కొనసాగుతూ ఉండేవారేమో. అలాంటి నిశిత విమర్శలకు ఉన్నత స్ధానం కల్పించేది ప్రజాస్వామ్య విలువలే. ప్రజాస్వామ్య విలువల్లో ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు అత్యంత ఉన్నత స్ధానం ఉన్నదన్న విషయాన్ని గుర్తిస్తే కార్టూన్ ల పై నిషేధం ఎంతటి ప్రజస్వామ్య వ్యతిరేకమో గుర్తించవచ్చు. ఈ రోజు అంబేద్కర్ ని అడ్డు పెట్టి ఒక కార్టూన్ ని నిషేధించగలిగినవారు రేపు అదే అంబేద్కర్ ని అడ్డు పెట్టుకుని మరో ప్రజాస్వామిక హక్కుని నిషేధించడానికి సదా సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్ధితిని కోరి తెచ్చుకోవడం అభిలషణీయం కాదు.
తననూ వదలొద్దంటూ నెహ్రూ, ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ పిళ్లై ను కోరిన సంగతిని ‘శంకర్’ గారే స్వయంగా ఇలా వెల్లడించారు. ప్రధాని సైతం విమర్శలకి అతీతుడు కానట్లయితే, ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఏ వ్యక్తీ విమర్శకి అతీతుడు కాజాలడు.
-ఈ కార్టూన్ కి లింక్ ఇచ్చిన వేణు గారికి కృతజ్ఞతలు -విశేఖర్-