జాతీయం
జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్
నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. స్వదేశీ వ్యాపారుల తో పాటు విదేశాల నుండి కూడా నగల వ్యాపారం పై పెంచిన పన్ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడిలు వచ్చాయి. ఎటుతిరిగీ ప్రజలపై భారం మోపే నిర్ణయాల విషయంలోనే వారి తరపున లాబీయింగ్ జరిపేవారెవరూ ఉండరు.
రైతుల ధాన్యం కొనడానికి గోడౌన్లు లేవు, గోతాములూ లేవు
రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సరిపడా గోడౌన్లు ప్రభుత్వం వద్ద లేవని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో అంగీకరించాడు. వరి, గోధుమలు గౌడౌన్లు లేక కుళ్లిపోతున్నాయని ప్రతిపక్షాలు లేవనెత్తిన చర్చకు ప్రబణ్ సమాధానం ఇచ్చాడు. గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40 శాతం ధాన్యాన్ని సేకరించేవనీ, మిగిలింది ప్రవేటు మార్కెట్ సేకరించేదనీ ఆయన తెలిపాడు. అయితే ప్రభుత్వ సేకరణ ధర పెరిగాక అధిక మొత్తంలో ప్రభుత్వమే సేకరించాల్సి వస్తోందని అందువల్లనే గోడౌన్లు చాలడం లేదనీ ఆయన తెలిపాడు. అయితే సేకరణ ధర పెరిగింది రెండు సంవత్సరాల క్రితమే కాగా, గౌడౌంల సమస్య చాలా సంవత్సరాలుగా ఉంటోంది. నిల్వ సౌకర్యం లేక ఆరుబయట నిలవ చేయడం వల్ల ఎండా వానలకి ధాన్యం పాడై పోతోందనీ అలాంటి అదనపు ధాన్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలనీ సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. పేదలకి ధాన్యం ఇవ్వాలనగానే ఆయన కోర్టులు ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదని గంభీర ప్రకటనలు జారీ చేశాడు. పేదల సంగతి ఆయన చూడడు, కోర్టులు చూసినా ఒప్పుకోడు. గోడౌన్లు లేని సమస్యని ధాన్యం ఎగుమతుల ద్వారా పూడ్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక గోతాముల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. గోతాములు తయారు చేసే ఫ్యాక్టరీలు తమ ఇష్టానుసారం లాభాల కోసం ఉత్పత్తిని తగ్గించడం, పెంచడం చేస్తుంటాయి. లాభాల కోసం అవి కార్మికులను పస్తులు పెట్టడమే కాక, దేశ గోతాము అవసరాలని కూడా పస్తు పెడుతున్నాయన్న మాట!
అబ్బే, ఎఫ్.డి.ఐ, తీస్తా ల సంగతి హిల్లరీ ఎత్తనే లేదు –మమత
సూపర్ బజార్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు, బంగ్లాదేశ్, ఇండియాల మధ్య తీస్తా నదీ జలాల పంపకం అంశాలను మమత తో తప్పనిసరిగా చర్చిస్తాననీ, తాను వచ్చిందే అందుకనీ హిల్లరీ సమావేశానికి ముందు చెప్పింది. అయితే ఈ రెండు అంశాలు తమ చర్చల్లో రాలేదనీ, హిల్లరీ వాటి సంగతే ఎత్తలేదనీ మమత పత్రికలకు చెప్పింది. సరుకుల రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి అమెరికా ఇండియాపై ఒత్తిడి తెస్తోంది. రిటైల్ బిల్లుని గత యేడు ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మమత పార్టీ కూడా ఈ బిల్లుని గట్టిగా వ్యతిరేకించింది. ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటిస్తోంది. సమావేశానికి ముందు ఈ అంశంలో అమెరికా కోరికను మమత తో చర్చిస్తానని హిల్లరీ చెప్పినా అదేమీ జరగలేదని మమత చెప్పడంలో మతలబు ఏమి ఉంటుంది? చెప్పేదొకటి, చేసేదొకటా?
అంతర్జాతీయం
జవహరి పాక్ లో ఉన్నాడని చెప్పేందుకు సాక్ష్యాలున్నాయా? –పాక్
ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం ఆల్-ఖైదా పగ్గాలు చేజిక్కించుకున్న ‘ఐమన్ ఆల్-జవహరి’ పాకిస్ధాన్ లోనే ఉన్నాడని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భరాతా దేశ పర్యటనలో ప్రకటించింది. ఆమె ప్రకటనను పాకిస్ధాన్ విదేశీ మంత్రి హైనా రబ్బానీ ఖర్ తిరస్కరించింది. అందుకు సాక్షాలుంటే ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో ఎవరి వద్దనైనా సాక్ష్యాలుంటే తమకివ్వాలని ఖర్ కోరింది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్, యెమెన్, సోమాలియా లపై అమెరికా మానవ రహిత విమానాలతో దాడులు చేయడం ఆపితే తాము కిడ్నాప్ చేసిన అమెరికా జాతీయుడు వీన్ స్టీన్ ని విడుదల చేస్తామని ఇటీవల ఆల్-జవహరి ప్రకటించాడు.
సిరియా లో ఎన్నికలు
సోమవారం సిరియాలో మొదటిసారి బహుళ పార్టీ ఎన్నికలు జరిగాయి. సిరియన్లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నట్లు పత్రికలు తెలిపాయి. బహుళ పార్టీ ఎన్నికలు సిరియాలో 50 యేళ్ళ తర్వాత ముదటిసారి జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రతిపక్ష పార్టీలు పాల్గొనలేదు. 250 సీట్లు గల పార్లమెంటు ఎన్నికల్లో 7 పార్టీలు పోటీ చేస్తున్నాయని తెలుస్తోంది. కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసిన మూడు నెలలకు ఎన్నికలు జరిగాయి. టెర్రరిస్టులు హింసకు పాల్పడుతున్న నగరాల్లో పోలింగ్ సమయాల్లో వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయని ప్రతిపక్ష వీడియోలు చూపుతుండగా, ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తున్న దృశ్యాలను ప్రభుత్వ వీడియోలు చూపాయి. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల మద్దతుతో సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్ లాంటి దేశాలు ప్రవేశ పెట్టిన కిరాయి మూకలు గత సంవత్సర కాలంగా ‘తిరుగుబాటు’ పేరుతో హింసకు పాల్పడుతున్నాయి.