అంబేడ్కర్ కార్టూన్ పై సిబాల్ ‘సారీ’, ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా


Ambedkar cartoonఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేడ్కర్ కార్టూన్ పై లోక్ సభలో దళిత ఎం.పిలతో పాటు పలువురు ఎం.పి లు ఆందోళన చేయడంతో మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ క్షమాపణ చెప్పాడు. టెక్స్ట్ బుక్ నుండి కార్టూన్ తొలగించాలని తాను ఏప్రిల్ లోనే ఆదేశాలిచ్చానని వెల్లడించాడు.

క్లాస్ XI రాజకీయ శాస్త్రం పాఠ్య పుస్తకంగా ఉన్న ‘ది ఇండియన్ కానిస్టిట్యూషన్ ఎట్ వర్క్’ లో కార్టూన్ ముద్రించబడి ఉంది. రాజ్యాంగ రూపకల్పన నత్త నడకన సాగుతున్నట్లుగా ప్రముఖ కార్టూనిస్టు శంకర్ గీసిన కార్టూన్ ను పాఠ్య పుస్తకంలో ముద్రించారు. కార్టూన్ రచనలో ప్రధాన పాత్ర పోషించిన అంబేడ్కర్ రాజ్యాంగం లేబుల్ ఉన్న నత్త పై కూర్చుని ఉండగా ఆయన వెనుక నెహ్రూ కొరడా పట్టుకుని నిలబడి ఉన్న దృశ్యం కార్టూన్ లో ఉన్నట్లుగా పత్రికలు తెలిపాయి. ఈ కార్టూన్ అంబేడ్కర్, నెహ్రూ లు ఇరువురినీ అవమానిస్తోందని లెఫ్ట్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించగా, అంబేడ్కర్ కి తీవ్ర అవమానమని మాయావతి, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి వారు తీవ్ర స్వరంతో విమర్శించారు. పాఠ్యపుస్తకాన్ని రద్దు చేయాలని లేదంటే పార్లమెంటును నడవనిచ్చేది లేదని మాయావతి హెచ్చరించీంది.

కార్టూన్ పై ఏప్రిల్ మొదటివారంలోనే మాహారాష్ట్ర లోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ముంబైలో ఆందోళన చేసింది. ఆ పార్టీ నాయకుడు రామ్ దాస్ అధవాలే ఏప్రిల్ 3 తేదీన పాఠ్య పుస్తకాన్ని తగల బెట్టి మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటులో శుక్రవారం ఈ గొడవ చోటు చేసుకుంది. తమిళనాడు వి.సి.కె పార్టీకి చెందిన ఎం.పి ‘తిరుమా వలవన్ తోల్’ కార్టూన్ పై గొడవ ప్రారంభించాడు.

ఎయిర్ టెల్ – మాక్సిక్స్ ఒప్పందాన్ని అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం కావాలని ఆలస్యం చేసి తన కుమారుడు లబ్ది పొందాక మాత్రమే ఆమోదించాడన్న ఆరోపణలపై బి.జె.పి సభ్యులు ఓ పక్క గొడవ చేస్తుండగానే తిరుమ తన గొడవను ప్రారంభించాడు. ఈ గొడవకు గురువారం చిదంబరం సమాధానం చెప్పినప్పటికీ ఆయన సమాధానంలో తన కుమారుడి ప్రకటనను చదివి వినిపించడంతో శుక్రవారం కూడా దాన్ని లేవనెత్తాలని బి.జె.పి నిర్ణయించినట్లు గురువారం ఆ పార్టీ ప్రకటించింది. ఆమేరకు చర్చను ప్రారంభించగానే మరో వైపు కార్టూన్ కాపీలను చూపుతూ గట్టిగా గొడవ ప్రారంభించాడు. కాపీలను సభ్యులకు పంచి పెట్టాడు.

చిదంబరం తన కుమారుడి ప్రకటనను సభలో చదివి వినిపించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ గట్టిగా సమర్ధిస్తూ సమాధాన చెబుతుండగా అంబేడ్కర్ కార్టూన్ పై గొడవ తీవ్రం అయింది. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కార్టూన్ పై గొడవకు సమాధానం ఇస్తూ ‘ఆపాలజీ’ చెబుతున్నట్లు ప్రకటించాడు. పాఠ్య పుస్తకాన్ని 2006 లో తయారు చేసినపుడు తాను మంత్రిని కానని సభ బయట చెబుతూ సిబాల్ ఈ అంశాన్ని రాజకీయం చేయరాదని కోరాడు. టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న మొత్తం కార్టూన్ లను సమీక్షించడానికి తాను ఇప్పటికే ఒక కమిటీ నియమించానని తెలిపాడు. ఎన్.సి.ఇ.ఆర్.టి ని తాను ఏప్రిల్ లో వివరణ కోరాననీ, వారి సమాధానం విన్నాక కార్టూన్ తొలగించాలని ఏప్రిల్ 27 న నిర్ణయించానని తెలిపాడు. ఈ పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేయడం ఆపాలని కూడా చెప్పానని తెలిపాడు.

ప్రముఖ కార్టూనిస్టు 1948 లో ఈ కార్టూన్ ని గీసినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ రచనా మూడేళ్ల పాటు కొనసాగడాన్ని ఆయన విమర్శించాడు. శంకర్, అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులను నిర్భయంగా విమర్శిస్తూ కార్టూన్లు గీసే వాడని ప్రతీతి. ప్రధమ భారత ప్రధాని నెహ్రూ ని తీవ్ర స్ధాయిలో విమర్శించడానికి కూడా ఆయన వెనకంజ వేయలేదని అనేకసార్లు విశ్లేషకులు ఆయనను ప్రస్తుతించారు. ఆయన కార్టూన్ గీసిన అరవై యేళ్లకు ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకంలో అది ప్రత్యక్షమయితే, మరో అయిదేళ్లకు దానిపై గొడవ జరగడం ఎవరిని ఉద్ధరించడానికో అర్ధం కానీ విషయం. నెల క్రితమే ముంబైలో ఆందోళన జరిగినా, ఆందోళన జరుగుతుండగానే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా కార్టూన్ సంగతి పార్లమెంటులో ప్రస్తావనకి నోచుకోలేదు. ఇపుడు చిదంబరం అవినీతి పైన చర్చ జరుగుతుండగా పాలక కూటమి లోని ఒక రాజకీయ పార్టీ సభ్యుడు అకస్మాత్తుగా కార్టూన్ సంగతి లేవనెత్తడం అది అంబేడ్కర్ పై గౌరవమా లేక మరొకటా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ దళిత ఎం.పిలు ఏనాడూ భారత దేశంలోని కోట్లాది దళిత ప్రజల స్ధిగతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ దళీత ప్రజల అభ్యున్నతి గురించి అంబేడ్కర్ ఆహారహం శ్రమించి తన పరిమితుల్లోనే అనేక చర్యలు తీసుకున్నాడో ఆ ప్రజల గురించి వీరెన్నడూ నిజాయితీతో పట్టించుకోలేదు. భూములు, పరిశ్రమలు ఇప్పటికీ దేశ భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నా దళితులకు లబ్ది చేకూర్చే భూసంస్కరణల గురించి వీరెన్నడూ పట్టించుకోలేదు. గిరిజనులు తరతరాలుగా నివశిస్తున్న అడవుల నుండి వారిని తరిమివేస్తూ ఖనిజ వనరులకు నిలయమైన వారి భూములని స్వదేశీ, విదేశీ కంపెనీలకు అప్పజెపుతున్నా కిమ్మనని వీరు ఒక కార్టూన్ పైన గొడవకు దిగడం పచ్చి మోసం తప్ప మరొకటి కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s