ఈ ఫోటోలో అమ్మాయి పేరు నిషా రాణి దత్తా. విలువిద్యలో జాతీయ స్ధాయి ప్రతిభ కనబరిచిన 21 యేళ్ళ యువతి. కటిక పేదరికంలో పుట్టినా స్వయం కృషితో విలువిద్య క్రీడలో జాతీయ స్ధాయికి చేరింది. అయినప్పటికీ ఈ జార్ఘండ్ ఆడకూతురికి కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. ఈ దేశ మూలవాసులయిన గిరిజన తెగల్లో పుట్టిన పాపానికి వృద్ధ తల్లిదండ్రులని, ఇద్దరు చెల్లెళ్లను పోషించుకోవడానికి తాను భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న వెండి విల్లుని అమ్ముకోవలసిన దుర్గతిని ఎదుర్కుంటోంది.
“వ్యవసాయం కోసం విత్తనాలు కొనడం మా నాన్నకి కష్టంగా ఉంది. కడుపు నిండా తిండి తినే భాగ్యానికి మేము ఎన్నడూ నోచుకోలేదు. కానిస్టేబుల్ పోస్టు కోసం జార్ఖండ్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకునాను. కానీ నేను సెలెక్ట్ కాలేదు. నా క్వాలిఫికేషన్ ఎక్కువైపోయిందట. నేనింకా అనేక ఉద్యోగాలకి అప్లై చేశాను. రైల్వేలు, బ్యాంకులు, రాష్ట్ర పోలీసు ఇలా అన్నింటికీ. క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిన అన్నీ చోట్లా దరఖాస్తు చేశాను. కానీ విఫలం అయ్యాను” అని నిషా రాణి దత్తా చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. నిషా తల్లిదండ్రులిద్దరూ డెబ్భయ్యో వడిలో ఉన్నారు. అందువల్ల ఈమే తన కుటుంబాన్ని పోషించుకోవాలి.
నిషా రాణి లాంటి క్రీడాకారిణులను సెలక్ట్ చెయ్యనట్లయితే ఇక ప్రభుత్వాలు ఘనంగా ‘స్పోర్ట్స్ కోటా’ లని ఎందుకు పెట్టినట్లు? ఇదే ప్రశ్న ఈమె అడుగుతోంది. అయితే సమాధానం చెప్పేది ఎవరు? “నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇవ్వమని అడిగాను. పాటియాలలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ లో విలువిద్యలో శిక్షణ పొందదానికి సహాయం చెయ్యమని అడిగాను. తద్వారా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆశ. కానీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో ఏ ఉద్యోగమూ ఇవ్వలేకపోయాడు” అని నిషా తెలిపింది.
“దేశం కోసం కొన్ని పోటీల్లో పాల్గొంటే ఎవరూ గుర్తించలేదు. చాలా నిరాశ కలిగింది. దాంతో గతిలేని పరిస్ధితుల్లో నా విల్లు అమ్ముకోవడానికి నిర్ణయించుకున్నాను” అని నిషా దత్తా తెలిపింది. జంషెడ్ పూర్ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో నిషా దత్తా జన్మించింది. దరిద్రం వల్ల రెండేళ్ల క్రితం విలువిద్య క్రీడని వదిలిపెట్టాల్సి వచ్చింది. 2008 లో జార్ఘండ్ లో జరిగిన ‘సౌత్ ఏసియన్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిషా సిల్వర్ మెడల్ సంపాదించింది. 2006 బ్యాంకాక్ గ్రాండ్ ప్రిక్స్ లో బ్రాంజ్ మెడల్ పొందింది. 2007 లో తైవాన్ లో జరిగిన ఆసియన్ గ్రాండ్ ప్రిక్స్ లో ‘బెస్ట్ ప్లేయర్ అవార్డ్’ సంపాదించింది.
గత సంవత్సరం ఋతుపవనాల సందర్భంగా వచ్చిన వరదల్లో నిషా దత్తా కుటుంబం నివసించే ఇల్లు కూలిపోయింది. నిలువ నీడ లేని పరిస్ధితి. కూలిపోయిన ఇల్లు ఏదో విధంగా బాగు చేసుకుంటేనే కొద్దిగానైనా నీడ దక్కుతుంది. కానీ చేతిలో డబ్బు లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో వెండి తో చేసిన తన విల్లు అమ్ముకోవాలని నిషా నిర్ణయించుకుంది. ఈమె వద్ద ఉన్న విల్లు ప్రపంచ స్ధాయి విలువిద్య క్రీడాకారులు ఉపయోగించే పాటిది.
స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కొనసాగించడానికి నిషా బ్యాంకు లోను కోసం కూడా ప్రయత్నం చేసింది. అయితే బ్యాంకు అప్పుకి సరిపడా పొలం ఈమె తల్లిదండ్రులకి లేదు. గ్యారంటీ ఇచ్చేవారు అసలే లేరు. వందల కోట్లు అప్పులు ఎగవేసే ధనికులకీ, కంపెనీలకే మరిన్ని వేల కోట్లు అప్పులు ఇచ్చే బ్యాంకులకి నిషా దత్తా బతుకు పోరాటం అర్ధం అయ్యే సమస్యే లేదు. ది హిందూ పత్రిక చొరవ చూపి నిషా దత్తా అవసరం కోసం రు.20,000 సమకూర్చి ఆమెకి ఇచ్చింది.
జనాభా దామాషా ప్రకారమే కేటాయించిన రిజర్వేషన్ల వల్ల ప్రతిభ మంట కలుస్తోందని గగ్గోలు పెట్టే కుహనా మేధావులు ఓ గిరిజన యువతి ప్రతిభ ఎందుకు కొడిగట్టిందో సమాధానం చెప్పగలరా? ప్రతిభ మంట గలుస్తోంది దేశ వనరుల్ని కొల్లగొడుతున్న బందిపోట్ల వల్లనే అని ఎప్పటికయినా గుర్తించగలరా?
డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన సానియా మీర్జా అడగకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకి లక్షలకి లక్షలు అపాత్ర దానం చేసింది.
ప్రపంచకప్ గెలిచిన మన క్రికెటర్లకి కోట్లు విలువైన భూములు, డబ్బులు ఇచ్చారు. మరి ఈ నిషా రాణికి కనీసం ఒక జాబ్ కూడా ఇవ్వలేదా ఈ ప్రభుత్వం
కాకినాడలో ఒక బాడీ బిల్డర్‌కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం దొరక్కపోతే అతను తన పొట్ట నింపుకోవడానికి ఒక హత్య చేశాడు. బెయిల్లో ఉన్న సమయంలో అతను లాయర్ అడిగిన ఇరవై వేలు రూపాయలు ఇవ్వడానికి ఇంకో హత్య చేసి శవం మీద నగలు, ఆమె ఇంటిలో ఉన్న డబ్బులు దోచుకున్నాడు. ఇదీ పేద క్రీడాకారుల పరిస్థితి.