క్లుప్తంగా… 07.05.2012


జాతీయం

మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ

Raju Ramchandran2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం పాటు విచారణ జరిపి, 20,000 పేజీలు నింపిన సిట్, మోడి ని విచారించడానికి సాక్ష్యాలు లేవని కోర్టుకి తెలిపింది. సిట్ నిర్ణయంతో అమికస్ క్యూరీ విభేదించాడు. మతం ఆధారంగా వివిధ గ్రూపుల ప్రజల మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టినందుకు, వ్యక్తులను గాయపరిచేందుకు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించి చట్టాన్ని అగౌరవపరిచినందుకు ఐ.పి.సి లోని వివిధ సెక్షన్ల ప్రకారం మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తెలిపాడు. ముస్లింలపై జరిగిన హింసాకాండలో అధికార వ్యవస్ధ కుమ్మక్కయిందని ఆయన తేల్చాడు. ముస్లింలపై మారణకాండకు పాల్పడిన హిందూ మూకలకు సహరించాలని మోడి పోలీసు, పాలన అధికారులను కోరిన సమావేశానికి తాను హాజరయ్యానని ‘సల్మాన్ భట్’ అనే పోలీసు ఉన్నతాధికారి చెప్పినప్పటికీ సిట్ దానిని పరిగణించలేదు. కుంటి సాకులు చూపుతూ కనీసం భట్ ని విచారించడానికి కూడా సిట్ తిరస్కరించింది. భట్ ని నమ్మలేమని సిట్ కొట్టి పారేయగా, ఆయన సాక్ష్యం విశ్వసనీయత కోర్టు విచారణలో తేలాలి తప్ప ప్రాధమిక దశలోనే కొట్టిపారేయడానికి వీల్లేదని అమికస్ క్యూరీ నివేదించాడు. ఇంకా మరికొన్ని కీలక సాక్ష్యాలను కూడా సిట్ పరిగణించలేదు. గోధ్రా రైలు దహనానికి హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నారని మోడి ఇచ్చిన బహిరంగ ప్రకటనే చట్ట ప్రకారం నేరమని అమికస్ క్యూరీ పేర్కొన్నాడు. ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పోలీస్ కంట్రోల్ రూంలో మోడి నియమించాడని వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డాడు. సెక్షన్ 153ఎ(1) (ఎ) & (బి), 153బి(1)(సి), 166, 505(2) ల కింద మోడి నిందితుడని పేర్కొన్నాడు. అమికస్ క్యూరీ నివేదికను కాంగ్రెస్ సమర్ధించగా, బి.జె.పి వ్యతిరేకించింది.

అంతర్జాతీయం

ప్రదర్శనలకు వ్యతిరేకంగా సలహా ఇచ్చిన మలేషియా ఫత్వా కౌన్సిల్

Malaysian Fatwaధనిక వర్గాల పెత్తనానికి మత వ్యవస్ధలు ఎలా సహకరిస్తాయో మలేషియా మత పెద్దలు ప్రజలకు రుచి చూపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం తద్వారా దేశంలో అస్ధిర పరిస్ధితి సృష్టించడం ‘హరాం’ గా మలేషియా ఫత్వా కౌన్సిల్ అభివర్ణించింది. వేలమమంది మలేషియా ప్రజలు ఎన్నికల సంస్కరణల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 28 న ప్రదర్శనలు నిర్వహించడాన్ని ‘నేషనల్ ఫత్వా కమిటీ’ తప్పు పట్టింది. ఇస్లాం సూత్రాల ప్రకారం ప్రదర్శనల ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించడం నేరమని ప్రకటించింది. గతంలో ‘యోగా’ చేయరాదని ఫత్వా జారీ చేసిన ఫత్వా కమిటీ ఇప్పుడు నేరుగా ప్రజల ప్రజాస్వామిక హక్కులపైనే దాడికి పూనుకుంది. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలకు ఏ నేరమూ అంటగట్టని మత వ్యవస్ధలు ధనికవర్గాల దోపిడి కొనసాగించడానికి వీలుగా ప్రజలకు వ్యతిరేకంగా మత సూత్రాలని వినియోగించడానికి వెనకాడవని మలేషియా మత పెద్దలు మరోసారి రుజువు చేశారు.

మానవ మాంసపు పొడి ‘కాప్సూల్స్’ ని స్వాధీనం చేసుకున్న దక్షిణ కొరియా

చైనాలో సాగుతున్న ఘోరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం వెల్లడి చేసింది. మానవ మాంసపు పొడితో నిండిన అనేక వేల డ్రగ్ కాప్సూల్స్China_capsules ని దేశంలోకి స్మగుల్ చేస్తుండగా పట్టుకుంది. ఈశాన్య చైనాలో వీటిని తయారు చేశారని తెలిపింది. చనిపోయిన పసివారిని ముక్కలు ముక్కలు చేసి స్టౌ పై వేడి చేశాక పౌడర్ చేసి వాటితో కాప్సూల్స్ తయారు చేశారని తెలిపింది. వినడానికే భయానకంగా ఉన్న ఈ ఘటన చైనా ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన పిండాలను, కొత్తగా పుట్టిన పసివారిని ఈ విధంగా పొడిగా మార్చి డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై గత సంవత్సరం విచారణకు ఆదేశించిందని ఎన్.డి.టి.వి తెలిపింది. ఈ పొడి కొన్ని జబ్బులను నయం చేస్తుందని నమ్మకం ఉందని కొరియా కస్టమ్స్ అధికారులు తెలిపారు. చైనా తో రాయబార సమస్యలు వస్తాయన్న భయంతో వారు వివరాలు చెప్పలేదు. ఈశాన్య చైనాలో నివసించే కొరియా జాతి ప్రజలు ప్రస్తుతం కొరియాలో నివసిస్తున్నారని వారి కోసమే ఇవి స్మగుల్ అయ్యాయనీ కస్టమ్స్ శాఖ తెలిపింది. 17,450 కాప్సూల్స్ పట్టుబడగా ఎవరినీ అరెస్టు చేయలేదనీ స్వాధీనం చేసుకున్న కాప్సూల్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండడమే దానికి కారణమనీ తెలుస్తోంది.

2 thoughts on “క్లుప్తంగా… 07.05.2012

  1. మన దేశంలోని కోర్ట్‌లకి తలకాయ ఉందా, లేదా అనేది సందేహం. ఒక కోర్ట్ సాక్ష్యాలు ఉన్నాయి అని అన్న కేసుకే ఇంకో కోర్ట్ సాక్ష్యాలు లేవు అని జడ్జ్‌మెంట్ ఇవ్వగలదు. మోడీ విషయం చూస్తే అలాగే అనిపిస్తుంది.

  2. రణవీర్ సేన విషయంలోనూ అదే జరిగింది. కింది కోర్టు శిక్ష వేస్తే, హై కోర్టు రద్దు చేసింది, సాక్ష్యాలు లేవని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s