క్లుప్తంగా… 06.05.2012


జాతీయం

భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు

victim-bhopalభోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వల్ల అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలం కలుషితమైంది. మూడు దశాబ్దాలుగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న 18 ప్రాంతాల జనం క్యాన్సర్ కారక నీరే తాగక తప్పని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. అయితే విష వాయువు లీక్ కీ భూగర్భజలం కలుషితం కావడానికీ సంబంధం లేదు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ లో రెగ్యులర్ గా జరిగిన ఉత్పత్తి కార్యకలాపాల వల్ల కాన్సర్ కారక రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. శుభ్రమైన నీరు అక్కడి ప్రజలకు ఇచ్చే ఏర్పాట్లు చేయాల్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని 2005 లోనే కోర్టు ఆదేశించినా తూతూ మంత్రంగా పని చేసి ఊరుకున్నారు. పైప్ లైన్లు వేసారే గాని నీళ్ళు ఇవ్వలేదు. ఒక స్వచ్ఛంద సంస్ధ వేసిన పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు తాజా తీర్పు ఇచ్చింది. క్యాన్సర్ కి దారి తీసే నీరు జనం తాగుతున్నా, అత్యున్నత స్ధానం ఆదేశాలిచ్చినా దశాబ్దాలు తరబడి ఏమీ చేయనీ ఈ ప్రభుత్వాలని ఏమనాలి?

చివరి 48 గంటల్లో ఇంటింటికీ తిరగడానికి వీల్లేదు -ఎలక్షన్ కమిషన్

డబ్బు, మద్యం ప్రవాహం ఆపడానికి ఎలక్షన్ కమిషన్ కొత్త రూలు ప్రవేశ పెట్టింది. ఎన్నికల ప్రచారం ముగిశాక అబ్యర్ధులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడానికి ఇప్పటివరకూ అనుమతి ఉంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచడానికి పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాయి. ఈ పద్ధతి వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని ఇ.సి భావిస్తోంది. దాన్ని నివారించడానికి ప్రచారం పూర్తయ్యాక కూడా ఓటింగ్ జరగడానికి 48 గంటల ముందు అభ్యర్ధులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చెయ్యడాన్ని నిషేధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో ఎదురయిన చేదు అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం చేశామని ఇ.సి తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న ఉప ఎన్నికలనుండే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

అంతర్జాతీయం

దక్షిణాసియా పై అమెరికా – చైనా చర్చలు!

Clinton in China May 6భారత దేశం భాగంగా ఉన్న ‘దక్షిణాసియా’ వ్యవహారాలపై తాము త్వరలో చర్చలు జరుపుతామని అమెరికా చైనాలు ప్రకటించాయి. ఆదివారంతో హిల్లరీ క్లింటన్ చైనా పర్యటన ముగుస్తుండగా ఈ ప్రకటన వెలువడింది. అమెరికా చైనా ల మధ్య ‘వ్యూహాత్మ ఆర్ధిక చర్చలు’ (Strategic Economic Dialogue -SED) లో భాగంగా జరుగుతున్న నాలుగో విడత సమావేశాల్లో క్లింటన్ పాల్గొంది. దక్షిణాసియా పై ఇరు దేశాలూ ఇప్పటికే మూడు దఫాలు చర్చలు జరిపాయని ‘ది హిందూ’ తెలిపింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతం పైన కూడా ఈ రెండు దేశాలు అనేక విడతలు చర్చలు జరిపాయని పత్రిక తెలిపింది. దక్షిణాసియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ను కూడా భాగస్వామిగా పరిగణించడానికి అమెరికా సుముఖత వ్యక్తం చెయ్యడం పెరుగుతోందనడానికి ఈ చర్చలు బలమైన సూచికలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్, ఉత్తర కొరియా లాంటి సమస్యలపైన అమెరికా బీజింగ్ మద్దతు కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించవచ్చు.

ఎదుగుతున్న శక్తిగా ప్రపంచ వ్యవహారాల్లో చైనా కీలక పాత్ర నిర్వహించాలని క్లింటన్ కొద్ది వారాల క్రితం వ్యాఖ్యానించింది. ఆదివారం చర్చల సందర్భంగా కూడా క్లింటన్ ఈ వ్యాఖ్యలను పునరుల్లేఖించింది. వ్యవస్ధీకృతమైన శక్తి (అమెరికా), ఎదుగుతున్న శక్తి (చైనా) లు కలుసుకున్నపుడు ఏమి జరుగుతుందన్న శతాబ్దాల ప్రశ్నకు కొత్త సమాధానం ఇవ్వడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఇరుగు పొరుగు దేశాలకు (జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్ మొ.) గల సమస్యలలో ఏ పక్షమూ వహించబోమని అమెరికా వాగ్దానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె వాగ్దానాన్ని ‘సానుకూల సంకేతం’ గా చైనా పత్రిక పీపుల్స్ డైలీ అభివర్ణించింది. చైనా ఎదుగుదల ‘ఒక అవకాశంగా చూస్తున్నామనీ, బెదిరింపు (threat) గా కాదనీ’ క్లింటన్ వ్యాఖ్యానించింది. “పాత కళ్ళద్దాల ద్వారా ప్రపంచాన్ని చూడడం ఇరువురికీ ఉపయోగం కాదని మేము నమ్ముతున్నాం. అది సామ్రాజ్యవాద వారసత్వం కావచ్చు, ప్రచ్ఛన్న యుద్ధం కావచ్చు, లేదా అధికార సమతూకానికి చెందిన రాజకీయాలు కావచ్చు. జీరో సమ్ ఆలోచనా విధానం నెగిటివ్ సమ్ ఫలితాలకే దారి తీస్తాయి” అని హిల్లరీ వ్యాఖ్యానించింది.

పుతిన్ ప్రమాణం, మాస్కోలో భారీ నిరసనలు

Putin sworn in May 6ఆదివారం నూతన అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ మాస్కో వేలమంది ప్రదర్శన నిర్వహించారు. 5,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా దాదాపు 50,000 మందికి పైగా ప్రదర్శనలో పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రదర్శకులు ‘పుతిన్ దొంగ’, ‘పుతిన్ నశించాలి’ అంటూ నినాదాలిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొదట శాంతియుతంగా నే ప్రదర్శనలు జరిగినప్పటికీ తర్వాత హింసాత్మకంగా మారాయి. ప్రదర్శకులు, పోలీసులు పరస్పరం బాటిళ్ళు, రాళ్ళు రువ్వుకున్నారు. లాఠీ చార్జీలో 200 కి పైగా గాయపడ్డారు. ప్రదర్శన అనంతరం ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వ టి.విలో మాట్లాడే అవకాశం ఇవ్వడం కొసమెరుపు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s