ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులను మరింతగా తగ్గించాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ప్రకటన సూచిస్తోంది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను భారత దేశం అమలు చేయాలంటే గల్ఫ్ ప్రాంతంలో నివశిస్తున్న భారతీయుల భద్రత కూడా పరిగణించాలని హిల్లరీ క్లింటన్ కి చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన భద్రతా ప్రయోజనలు ఉన్నాయని ఆయన అమెరికా అతిధికి గుర్తు చేశాడు.
“పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో, విశాల పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, సుస్ధీరతలు కొనసాగడంపై భారత దేశానికి కీలక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 60 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకి ఈ ప్రాంతం ముఖ్యమైనదని వారికి చెప్పాను” అని ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు చెప్పాడు.
మూడు దేశాల ఆసియా టూర్ (చైనా, బంగ్లాదేశ్, ఇండియా) లో భాగంగా ఇండియా వచ్చిన హిల్లరీ క్లింటన్ ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే పనిలో నిమగ్నమయింది. ఇండియా ఇంధనం అవసరాలకు ఇరాన్ తమకు కీలకమని క్లింటన్ కి చెప్పినట్లుగా కృష్ణ విలేఖరులకి వివరించాడు. భారత విదేశీ వాణిజ్యంలో ఇరాన్ కీలకమని కూడా కృష్ణ వివరించాడు.
భారత దేశం పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ వాస్తవంలో ఇరాన్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంటోందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ విశ్లేషించింది. ఆ విషయం క్లింటన్ మాట్లా ద్వారా కూడా స్పష్టమయింది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతిని ఇండియా ఇప్పటికే గణనీయంగా తగ్గించ్చిందనీ అయితే ఇంకా తగ్గించుకోవాలని హిల్లరీ సోమవారం పత్రికలకు చెప్పింది కూడా. క్లింటన్ వ్యాఖ్యలని ఖండించే పనికి కూడా భారత ప్రభుత్వం పూనుకోలేదు.
అణ్వాయుధాలు నిర్మించుకునే హక్కు ఇరాన్ కి ఉందని భారత ప్రభుత్వం అనేకసార్లు ప్రకటించింది. అణ్వస్త్ర వ్యాప్తి ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకం చేయలేదు. కానీ సదరు ఒప్పందం పై ఇరాన్ సంతకం చేసింది. ఐ.ఎ.ఇ.ఎ లో ఇరాన్ సభ్య దేశం కూడా. సభ్య దేశంగా శాంతియుత అవసరాలకి అణు పరిజ్ఞానం వినియోగించుకునే హక్కు ఇరాన్ కి ఉన్నప్పటికీ పశ్చిమ రాజ్యాలు ఆదేశాన్ని అడ్డుకుంటున్నాయి.