గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు ఉన్నారు.
వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బాద్ఘిస్ రాష్ట్రంలో సోమవారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో ఐదుగురు మరణించారనీ, మరో 15 మంది గాయపడ్డారనీ ప్రెస్ టి.వి తెలిపింది. అయితే వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రకారం బాద్ఘిస్ రాష్ట్రంలో 14 మంది పౌరులు చనిపోయారు. బాద్ఘిస్ రాష్ట్రంలోని బాలా ముర్ఘాబ్ జిల్లాలో ఈ దాడులు జరిగినట్లు పోస్ట్ తెలిపింది. మరణాలను బాద్ఘిస్ రాష్ట్ర గవర్నర్ దిల్బార్ జాన్ ఆర్మన్ ధృవీకరించాడని ఆ పత్రిక తెలిపింది. అయితే ఎంతమంది చనిపోయిందీ గవర్నర్ చెప్పలేదని తెలిపింది.
దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్ లోని హెల్మండ్ రాష్ట్రంలో ఆదివారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో మరొ ఆరుగురు పౌరులు చనిపోయారు. చనిపోయిన వారంతా తల్లీ పిల్లలే. ఒక మహిళ ఆమె ఐదుగురు పిల్లలూ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. హెల్మండ్ రాష్ట్రంలోని సంగిన్ ఏరియాలో ఈ దాడి జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
ఈ ప్రాంతంలో నాటో బలగాలపై మిలిటెంట్లు దాడులు చేయగా నాటో బలగాలు పౌరులపై దాడి చేసి చంపేశాయి. హెల్మండ్ గవర్నర్ నాటో బలగాలు తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డాయని వ్యాఖ్యానించాడని పోస్ట్ తెలిపింది. మరో రెండు రోజుల్లో ఆపాలజీ చెప్పగలమని నాటో ప్రతినిధి స్టీవర్ట్ అప్టన్ వ్యాఖ్యానించినట్లు పోస్ట్ తెలిపింది. పౌరులు చనిపోయినప్పుడల్లా తమకు చాలా బాధ కలుగుతుందని ఆయన అన్నాడు.
వీడి ఇంటిపైన బాంబులేసి ‘బాధగా ఉంది’ అని చెప్పే అవకాశం వస్తే ఎంత బాగుడ్నో. అది కూడా ముందు దాడి చేసి పదేళ్ళు ఆగి సారి చెప్తామని చెబితే ఇంకా బాగుంటుంది.
ఈశాన్య ఆఫ్ఘనిస్ధాన్ లోని కపిశా రాష్ట్రంలో శనివారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు పౌరులు చనిపోయారని ప్రెస్ టి.వి తెలిపింది. మరో చోట పక్తికా రాష్ట్రంలో ఆఫ్ఘన్ భద్రతా బలగాలు మిలిటెంట్లతో తీవ్ర పోరాటం చేస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. మిలిటెంట్లు మూకుమ్మడిగా ప్రభుత్వ బలగాలపై దాడి చేశారని వారితో ఆఫ్ఘన్ బలగాలు వీరోచితంగా పోరాడుతున్నారనీ వాషింగ్టన్ పోస్ట్ సర్టిఫికేట్ పడేసింది.
ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో గత కొద్ది నెలల్లోనే వందల మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు. ఒక్క 2012 లోనే 140 మంది అమెరికా సైనికులు మిలిటెంట్ల దాడుల్లో చనిపోయారు. దేశంలో ఇంతటి వినాశనం సృష్టిస్తూ ఆఫ్ఘన్ పౌరుల జీవితాల్లో నిప్పులు పోస్తున్న అమెరికా సైనికులు 2014 తర్వాత కూడా మరో పదేళ్ళు దేశంలో ఉండడానికి ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ అంగీకరించాడు. తద్వారా తన దేశ ప్రజలను నిలువునా మోసగించాడు. నిజానికి ‘మోసం’ అన్నది చాలా చిన్న పదం.