జాతీయం
మణిపూర్ విద్యార్ధి డ్రగ్స్ వల్ల చనిపోలేదు –ఫోరెన్సిక్ నివేదిక
బెంగుళూరు లో చదువుతున్న మణిపూర్ విద్యార్ధి రిచర్డ్ లోయితం డ్రగ్స్ వల్ల చనిపోలేదని ఫోరెన్సిక్ ఫలితాలు నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఆర్కిటెక్చర్ విద్యార్ధి అతని సీనియర్ విద్యార్ధులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్ధుల దాడిలో చనిపోయినప్పటికీ బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మణిపూర్ విద్యార్ధులపైన వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాపితంగా మణిపూర్ విద్యార్ధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రిచర్డ్ మరణంపై వివక్ష లేకుండా విచారణ జరపాలని మణిపూర్ ముఖ్యమంత్రి కేంద్ర హోమ్ మంత్రికి లేఖ కూడా రాశాడు. కర్ణాటక ప్రభుత్వం సరిగా విచారణ జరపనట్లయితే తాము జోక్యం చేసుకుంటామని చిదంబరం ఆయనకి బదులు ఇచ్చాడు. రిచర్డ్ చనిపోవడానికి రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ కి గరయ్యాడని ఆ గాయాల వల్ల మాత్రమే అతను చనిపోయాడని బెంగుళూరు పోలీసులు వాదించారు. విద్యార్ధి డ్రగ్స్ వాడాడని కూడా పోలీసులు, కాలేజీ యాజమాన్యం వాదించారు. అయితే రిచర్డ్ మరణానికి కారణం ఏమయిందీ తమకు అర్ధం కాలేదని ఫోరెన్సిక్ పరీక్షలు జరిపిన నిపుణులు అన్నారు. ఫోరెన్సిక్ నివేదికను మైక్రో బయాలజీ ప్రొఫెసర్ కూడా అయిన రిచర్డ్ తల్లి కొట్టి పారేసింది. నివేదిక ‘అన్ ప్రొఫెషనల్’ గా ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
ఇండియాకి ప్రత్యేక ‘గిన్నీస్’ అధికారి
గిన్నీస్ రికార్డుల కోసం భారత దేశం నుండి వస్తున్న దరఖాస్తుల ఒత్తిడి తట్టుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు గిన్నీస్ సంస్ధ ప్రకటించింది. 2011 లో గిన్నీస్ దరఖాస్తులు అందించిన దేశాల్లో సంఖ్య రీత్యా అమెరికా, ఇంగ్లండు ల తర్వాత భారత దేశం మూడవ స్ధానంలో ఉందని ఇండియా గిన్నీస్ ప్రతినిధి నిఖిల్ శుక్లా తెలిపినట్లు ఎన్.డి.టి.వి తెలియజేసింది. గత అయిదేళ్లలో దరక్షాస్తుల సంఖ్య 400 శాతం పెరిగితే, వాస్తవ రికార్డుల సంఖ్య 250 శాతం పెరిగిందని ఆయన తెలిపాడు. ప్రత్యేక అధికారి ఇక భారత దేశం కోసమే పని చేస్తాడని తెలిపాడు. భారత దేశం కోసం ప్రత్యేక వెబ్ సైట్ తెరిచినట్లు కూడా ఆయన తెలిపాడు. ఈ సైట్ లో ఉచితంగా దరఖాస్తులు పొందవచ్చు.
అంతర్జాతీయం
గ్యాంగ్ రేప్ లో స్ట్రాస్ కాన్
ఐ.ఎం.ఎఫ్ మాజీ మేజేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నట్లుగా ఫ్రాన్సు ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నారు. వాషింగ్టన్ డి.సి. లో జరిగిన ఓ సెక్స్ పార్టీలో పాల్గొన్న స్ట్రాస్ కాన్ మరో ఇద్దరు వ్యాపారులు, ఒక పోలీసు చీఫ్ తో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారని ఒక సాక్షి వాంగ్మూలం ద్వారా అర్ధమవుతోందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. వీరిపైన ఇప్పటికే అమ్మాయిలను వ్యభిచారంలో దింపి వ్యాపారం చేస్తున్న కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ జరుగుతున్న సందర్భంగా వ్యాంగ్ రేప్ సంగతి బైటపడిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
చెన్ ని అమెరికా అనుమతించడానికి చైనా సుముఖత
చైనా అసమ్మతివాది గా పశ్చిమ పత్రికలు కీర్తించే చెన్ గువాంగ్ చెన్ అమెరికాకు వెళ్లేందుకు అనుమతించడానికి చైనా సుముఖత వ్యక్తం చేసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం గృహ నిర్బంధం నుండి తప్పించుకున్న చెన్ అమెరికా ఎంబసీలో తలదాచుకున్నాడు. ఆరు రోజులు అమెరికా ఎంబసీలో ఉన్న చెన్, క్లింటన్ రాయబారం వల్ల బుధవారం బైటికి వచ్చాడు. కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం హెచ్చరించడం వల్లనే తాను బైటికి వచ్చానని చెన్ ప్రకటించగా అమెరికా అదేమీ లేదని తెలిపింది. చెన్ కుటుంబ సభ్యులతో సహా అమెరికా వస్తాడని నూలంద్ తెలిపింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు చైనా ప్రభుత్వం అంతకుముందు అమెరికా నుండి ‘ఆపాలజీ’ కోరింది.