జాతీయం
బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి 2006 వరకు పంజాబ్ కి వారు ఇలాంటి అవకాశం ఇచ్చారు. ఏం బెంగాల్ మాత్రం రాష్ట్రం కాదా? బెంగాల్ బాధ్యత అందరికీ లేదా?” అని మమత ప్రశ్నించింది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం దొరికిన దగ్గరల్లా అప్పులు చేశారని వారికి కేంద్రం ఎలా అనుమతించిందని మమత ప్రశ్నించింది. ఎన్నికల ముందు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరింది.
మీడియా లక్ష్మణ రేఖ పాటించాలి -సుప్రీం కోర్టు
మీడియా లక్ష్మణ రేఖను పాటించాలని సుప్రీం కోర్టు కోరింది. వివిధ హై ప్రొఫైల్ కేసుల్లో కోర్టుల్లో జరిగినవన్నీ పత్రికలు రిపోర్టు చేయడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం చెబుతోంది. కొన్ని పరిమితులు పాటించవలసిన అవసరం మీడియాకు ఉందని కోరుతోంది. కోర్టుల్లో ఇచ్చే ప్రకటనలకు మీడియా సొంత అర్ధాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. కోర్టులకు సంబంధించి మీడియా పాటించవలసిన మార్గ దర్శక సూత్రాలను రూపొందించడానికి సుప్రీం ప్రయత్నిస్తోంది. అయితే, మీడియా స్వేచ్చకీ ఆటంకాలు విధించడం తగదని మీడియా ప్రతినిధులు వాదిస్తున్నారు. బార్ అసోసియేషన్ కూడా మీడియా వాదనకు మద్దతు తెలిపింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి అశోక్ అరోరా మీడియా తరపున బుధవారం వాదనలు వినిపించాడు. సాక్షుల సాక్ష్యాలను పత్రికలు ప్రచురించడం నేరం కాదని ఆయన వాదించాడు. అనేక హై ప్రొఫైల్ కేసుల్లో పత్రికలు అమోఘమైన పాత్ర నిర్వహించాయని ఆయన పేర్కొన్నాడు.
అంతర్జాతీయం
‘ఆకుపై వాల్ స్ట్రీట్’ మే డే నిరసనలపై పోలీసు నిర్భంధం
న్యూయార్క్ బ్రాడ్ వే వీధుల్లో వేలమంది అమెరికన్లు మే డే ప్రదర్శన లో పాల్గొన్నారు. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ పేరున వాల్ స్ట్రీట్ కంపెనీల ధన దాహానికీ, దోపిడికీ వ్యతిరేకంగా గత సెప్టెంబర్ లో ప్రారభమయిన ఉద్యమాన్ని గుర్తుకి తెస్తూ ‘మే డే’ ను ‘కమింగ్ ఔట్ డే” గా జరుపుతున్నట్లు ఉద్యమకారులు ప్రకటించారు. న్యూయార్క్ తో పాటు ఓక్లాండ్, శాన్ ఫ్రాన్ సిస్కో, సీటేల్, వాషింగ్టన్ నగరాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. గత సంవత్సరం జరిగిన ప్రదర్శనల్లో అమెరికా పోలీసులు పెద్ద ఎత్తున నిర్భంధం ప్రయోగించడం పై న్యూయార్క్ పోలీసులపైన ఉద్యమకారులు కోర్టులో దావా వేయడానికి నిశ్చయించారు. నిరాయుధ ప్రదర్శనకారులపై పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ లాంటివి ప్రయోగించి పోలీసులు అనేకమందిని గాయపరిచారు.
చైనా తన కరెన్సీ విలువ పెంచాలి –అమెరికా
చైనా తన కరెన్సీ ‘యువాన్’ విలువ మరింత పెంచాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ ‘తిమోతి గీధనర్’ కోరాడు. వాణిజ్య, పారిశ్రామిక విధానాలపై ఉన్నత స్ధాయి చర్చలు జరపడానికి గీధనర్ బీజింగ్ వచ్చాడు. చైనా, పశ్చిమ దేశాల మధ్య ‘యువాన్ విలువ’ వివాదం గత రెండేళ్లకు పైగా నలుగుతోంది. యువాన్ విలువ అసలు కంటే తక్కువగా ఉండడం వల్ల చైనా ఎగుమతులు చౌకగా లభ్యమవుతున్నాయనీ, అమెరికా, యూరప్ లతో చైనాకి పెద్ద మొత్తంలో వాణిజ్య మిగులు నమోదు కావడానికి కారణం అదేననీ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే చైనా మాత్రం పశ్చిమ దేశాల సమస్యలకు ఆ దేశాల విధానాలే కారణం తప్ప తాము కాదని చెబుతూ ఆరోపణలను తిరస్కరిస్తోంది. ముందు ఇంట్లో సమస్యలు పరిష్కరించుకుంటే చాలని చెబుతూ వచ్చింది. చైనా కరెన్సీ విలువ తగ్గింపు వలన తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని అంగీకరిస్తూనే అమెరికా, యూరప్ లు యువాన్ విలువ తగ్గించాలన్న వాదనను మాత్రం వదలడం లేదు.