ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్


Mujahedin-e Khalq Organization (MKO)ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక ఎవరు తయారు చేసిందీ ప్రెస్ టి.వి వెల్లడి చేయలేదు. ఇజ్రాయెల్ విదేశీ మంత్రి ఆవిగ్దోర్ లీబార్ మేన్, అజర్ అధికారుతో ఏప్రిల్ చివర జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక, మిలట్రీ స్ధావరాలు 16 వరకూ ఉన్నాయి. అందులో నాలుగింటిని అజర్ బైజాన్ పునరుద్ధరించి ఇజ్రాయెల్ కి అద్దెకి ఇచ్చింది. ఇరాన్ అణు కర్మాగారాల పై బాంబు దాడి చేయడానికి వీలుగా యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకునే సౌకర్యం కల్పించడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు వార్తలు రావడం, వాటిని అజర్ బైజాన్ తిరస్కరించడం ఈ సందర్భంగా గమనించవచ్చు. ఇక మిగిలిన స్ధావరాలను కూడా పూర్తి స్ధాయిలో పునరుద్ధరించడానికి అజర్ బైజాన్ సన్నాహాలు చేస్తోందని ప్రెస్ టి.వి తెలిపింది.

ఆ విధంగా పునరుద్ధరించిన స్ధావరాలలో ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ఎం.కె.ఒ ఉండడానికి అనుమతి ఇవ్వాలని అజర్ బైజాన్ తో ఇజ్రాయెల్, అమెరికాలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. అజర్ బైజాన్ తో పాటు ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా అనుచర దేశాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులను నిలపాలని ఇజ్రాయెల్ అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలి వరకూ ఇరాక్ లో ఇరాన్ సరిహద్దుకి 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘అష్రాఫ్’ శిబిరంలో ఎం.కె.ఒ తలదాచుకుంది. ఇరాక్ లో ఇరాన్ అనుకూల ప్రభుత్వం ఏర్పడ్డాక ఎం.కె.ఒ ఇరాక్ వదిలి వెళ్లిపోవాలని ఇరాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఇరాన్ పై యుద్ధ సన్నాహాలు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఎం.కె.ఒ ను ఇరాన్ చుట్టూ ఉన్న అజర్ బైజాన్, జోర్డాన్, పాకిస్ధాన్, కటార్, సౌదీ అరేబియాలలో మోహరింపజేయడానికి పధక రచన చేసింది. తన పధకంలో భాగంగానే అజర్ బైజాన్ పై అమెరికాతో కలిసి ఒత్తిడి తెస్తోంది.

ఇక్కడ ఎం.కె.ఒ గురించి కొద్దిగానయినా చెప్పుకోవడం అవసరం. ఈ సంస్ధ ఎమ్.ఇ.కె (ముజాహిదీన్-ఎ ఖల్క్) పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇరాన్ దేశస్ధులతో కూడిన ఎం.ఇ.కె ను 1960 లలో మరియం రజావి, మస్సౌద్ రజావి అనే జంట స్ధాపించింది. సంస్ధకు మరియం ప్రధాన నాయకురాలు కాగా, ఆమె భర్త మిలట్రీ విభాగానికి అధిపతి. ఇప్పుడీయన ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అసలే మాత్రం పొసగని మార్క్సిస్టు, మత సూత్రాల కలయిక ఈ సంస్ధకి మార్గదర్శక సిద్ధాంతమని చెబుతుంటారు.

అమెరికా అనుకూల షా ప్రభుత్వం కి వ్యతిరేకంగా ఇరాన్ లో సభవించిన ‘ఇస్లామిక్ విప్లవం’ లో ఎం.ఇ.కె చురుకుగా పాల్గొంది. టెహ్రాన్ లోని అమెరికా ఎంబసీని 52 మంది అమెరికన్లతో సహా 444 రోజుల పాటు అదుపులో ఉంచుకున్న వారిలో ఎం.ఇ.కె సభ్యులు చురుకైన పాత్ర పోషించారు. షా ప్రభుత్వం కొనసాగినన్నాళ్లూ ఇరాన్ లో ఉన్న అమెరికా గూఢచార, రక్షణ బలగాలను అనేకమందిని ఎం.ఇ.కె చంపేసింది. ఈ హత్యలలో ఎం.ఇ.కె నాయకత్వానికి సంబంధం లేదనీ, సంస్ధలోని మావోయిస్టు గ్రూపు వాటికి బాధ్యురాలని కూడా ఒక వాదన ఉంది. అమెరికాకి పర్యవేక్షణలోకి వచ్చాక తన పాత సామ్రాజ్యవాద వ్యతిరేక చర్యలనుండి తనను తాను వేరు చేసుకోవడానికి ఈ సరికొత్త వాదన ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.

వేలమంది ఎం.ఇ.కె సంస్ధలో పని చేస్తున్నారని వారిలో సగం మంది లేదా మూడో వంతు మంది యుద్ధ వీరులని ప్రతీతి. అమెరికా అనుకూల షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనించిన ఎం.ఇ.కె, ‘ఇస్లామిక్ విప్లవం’ లో పాల్గొన్నప్పటికీ విప్లవానంతరం అధికారం చేజిక్కించుకున్న షియా మత ప్రభుత్వంతో విభేధాలు తలెత్తాయి. సంస్ధ సిద్ధాంతాలే విభేదాలకి కారణమని కొంతమంది చెబుతారు. అయితే షియా మత పాలనా వ్యవస్ధలో సంస్ధకి అధికార భాగస్వామ్యం దక్కపోవడమే విభేదాలకు ముఖ్య కారణమన్న వాదన కూడా ఉంది. 1981 లో సంస్ధను ఇరాన్ నుండి తరిమేశాక సంస్ధ సభ్యులు పారిస్ కి తరలి వెళ్లారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అక్కడి నుండే వారు ఇరాక్ కి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

1986 లో ఇరాక్ కి ఎం.ఇ.కె తమ స్ధావరాన్ని మార్చుకుంది. సద్దాం హుస్సేన్ నుండి పూర్తి మద్దతు పొందిన ఎం.ఇ.కె ఆయనకి వివిధ సందర్భాల్లో చేదోడు వాదోడుగా పని చేసింది. ముఖ్యంగా ఇరాక్ ఇరాన్ యుద్ధంలో సద్దాం తరపున పని చేసింది. 2003 లో ఇరాక్ పై దాడి చేసిన అమెరికా ఎం.ఇ.కె స్ధావరాలపై దాడి చేసి సంస్ధ సభ్యులను నిరాయుధం చేసింది. రెండు వేల ట్యాంకులు, సాయుధ శకటాలు, ఫిరంగులు, వాయు రక్షణ ఆయుధాలు, ఇంకా అనేక ఇతర వాహనాలను ఎం.ఇ.కె నుండి అమెరికా స్వాధీనం చేసుకుందని ‘గ్లోబల్ సెక్యూరిటీ’ వెబ్ సైట్ తెలిపింది. ఎం.ఇ.కె కి అమెరికాలో కూడా ఆఫీసు ఉంది. 2003 లో ఇరాక్ పై దురాక్రమణ దాడి చేశాక మాత్రమే అమెరికా ఈ ఆఫీసుని మూసేసింది. ఇరాక్ యుద్ధంలో సద్దాంకి మద్దతుగా అమెరికాపై పోరాడడానికి బదులు ఎం.ఇ.కె అమెరికాతో సహకరించినట్లు కనిపిస్తోంది. అమెరికా కనుసన్నల్లో ఇప్పటివరకూ ఇరాక్ లోనే కొనసాగిన సంస్ధ సభ్యులు ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ అవసరాల కోసం ఇరాన్ వ్యతిరేక టెర్రరిస్టు చర్యలకు సిద్ధమయినట్లు ప్రెస్ టి.వి ప్రకటన బట్టి అర్ధం అవుతోంది.

2003 నుండి అమెరికా టెర్రరిస్టు సంస్ధల జాబితాలో ఉన్న ఎం.ఇ.కె ను ఆ జాబితానుండి తొలగించడానికి ప్రస్తుతం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. ఇరాన్ పాలకులకి వ్యతిరేకంగా పోరాడుతున్నందున తమను కాపాడుకోవలసిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందని ఎం.ఇ.కె భావిస్తున్నట్లు దాని ప్రకటనలు చెబుతున్నాయి. మూడు దశాబ్దాలుగా విదేశాల్లో ఉంటూ, సామ్రాజ్యవాద దేశాలకు పనిముట్టుగా ఉపయోగపడుతూ, స్వదేశీ పాలకులపై యుద్ధం చేస్తున్న ఎం.ఇ.కె తనను తాను ఇరాన్ ప్రతిపక్షంగా చెప్పుకోవడం విచిత్రం.

టెర్రరిస్టు సంస్ధ అని చెబుతూ 2003 లో ఎం.ఇ.కె కార్యాలయాన్ని మూసేసిన అమెరికా ఇప్పుడు అదే టెర్రరిస్టు సంస్ధని ఇరాన్ కి వ్యతిరేకంగా మోహరించడానికి సిద్ధపడుతోంది. తన ఆధిపత్య ప్రయోజనాలకి ఉపయోగపడితే గొప్పవారు లేదంటే టెర్రరిస్టులన్నమాట. ఆఫ్ఘనిస్ధాన్ ని దురాక్రమించిన రష్యా కి వ్యతిరేకంగా ఆల్-ఖైదా కి మద్దతు నిచ్చి సాకిన అమెరికా తన దురాక్రమణకి సహకరించక పోయేసరికి అదే సంస్ధ టెర్రరిస్టు సంస్ధ అయిపోయింది. సద్దాం తనకు మిత్రుడుగా ఉన్నన్నాళ్లూ ఎం.ఇ.కె కి ఆఫీసు తెరవడానికి కూడా సహకరించింది. అదే సద్దాం తనపై తిరగబడేసరికి ఎం.ఇ.కె ని నిరాయుధం చేయవలసిన అవసరం అమెరికాకి తలెత్తింది. ఇప్పుడు మళ్ళీ తన కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు అడ్డంకిగా ఉన్న ఇరాన్ ప్రభుత్వంపై ఎం.ఇ.కె ని ఉసిగొల్పుతోంది. నిజానికి తన అవసరాల కోసం టెర్రరిస్టులకు జన్మనిస్తూ, వారిపై యుద్ధం పేరుతో స్వతంత్ర దేశాలను దురాక్రమిస్తూ ప్రపంచ వ్యాపితంగా మిలియన్ల మంది అమాయక పౌరుల ధన, మాన, ప్రాణాలను హరించివేస్తున్న అమెరికా రాజ్యమే ప్రపంచంలో అతి పెద్ద టెర్రరిస్టు సంస్ధ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s