అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందే దాడులు చేస్తాం–రష్యా


యూరోప్ లో అమెరికా నెలకొల్పుతున్న మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందుగానే (pre-emptive) దాడులు చేయడానికి వెనకాడబోమని రష్యా మిలట్రీ అధికారులు హెచ్చరించారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న వివాదాస్పద ‘మిసైల్ షీల్డ్’ విషయంలో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో తమ ఖండాతర క్షిపణులు కాపాడుకోవడానికి, రష్యా ప్రయోజనాలు భంగం కలగకుండా ఉండడానికి ‘ప్రీ-ఎంప్ టివ్’ దాడులు తప్ప తమకు మరో మార్గం లేదని వారు అన్నారు. అయితే అమెరికా మిసైల్ షీల్డ్ కి రష్యా టార్గెట్ కాదనీ, రష్యా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ళు అత్యంత వేగవంతమైనందున అమెరికా మిసైల్ షీల్డ్ వల్ల వాటికి ప్రమాదం లేదని నాటో అధికారులు వివరించారు.

శత్రు దేశం ప్రయోగించే మిసైళ్లను మధ్యలోనే అడ్డుకుని తిప్పికొట్టే వ్యవస్ధ ను ‘మిసైల్ డిఫెన్స్ షీల్డ్’ (ఎం.డి.ఎస్) లేదా ‘మిసైల్ డిఫెన్స్ సిస్టమ్’ పేరుతో అమెరికా అభివృద్ధి చేస్తున్నది. అమెరికా పై జరిగే దాడులను అడ్డుకోవడానికి ‘నేషనల్ మిసైల్ డిఫెన్స్’ ఏర్పాడు చేసుకోవడమే కాక యూరప్ ఖండం రక్షణ పేరుతో ‘మిసైల్ డిఫెన్స్ షీల్డ్’ ను అమెరికా నిర్మిస్తోంది. దీని మొదటి దశ పూర్తయిందని బుధవారం అమెరికా ప్రకటించింది.

వివిధ యూరప్ దేశాలలో అమెరికా ఏర్పాటు చేస్తున్న ఎం.డి.ఎస్ ను రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యా రక్షణ వ్యవస్ధను దెబ్బ కొట్టడానికే అమెరికా ఎం.డి.ఎస్ ను అభివృద్ధి చేస్తోందని రష్యా అనేక సార్లు ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా ఆయుధ వ్యవస్ధకు ఆధిపత్యం చేకూరినట్లయితే ప్రపంచంలో ‘ఆయుధ సమతూకం’ దెబ్బ తిని అమెరికా ఆయుధ ఆధిపత్యానికి ఎదురు లేకుండా పోతుందనీ రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని వివిధ శిబిరాల మధ్య ‘ఆయుధ సమతూకం’ ఉండాలన్నది ప్రపంచ స్ధాయిలో ఉన్న ఒక నియమం. ఆ నియమానికి అమెరికా ఎం.డి.ఎస్ గండి కొడుతుందని రష్యా ఆరోపిస్తోంది.

“పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇప్పటివరకూ కనుగొనలేక పోయాం. ఇక ముందుకెళ్ళ లేని పరిస్ధితి (డెడ్ ఎండ్) ని ఎదుర్కొంటున్నాం” అని రష్యా రక్షణ మంత్రి అనతోలి సెర్డియుకోవ్ గురువారం మాస్కోలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అన్నాడు. యూరోప్ లో అమెరికా ఏర్పాటు చేస్తున్న మిసైల్ షీల్డ్ పైన తాము పోలాండ్ కి సమీపంలో కలినిన్ గ్రాండ్ లో ఉంచిన షార్ట్ రేంజ్ ‘ఇస్కాండర్’ మిసైళ్లతో ముందే దాడి చేయక తప్పని పరిస్ధితి ఎదురవుతోందని రష్యా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ నికోలాయ్ మకరోవ్ హెచ్చరించాడు.

“అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పరిస్ధితిని అస్ధిరం చేసే స్వభావం తో కూడి ఉంది. ఎటువంటి బాధ్యత లేకుండా అవతలి పక్షాన్ని ముందే నిరాయుధం చేసే విధంగా దాడులు చేయవచ్చన్న భ్రాంతిని (illusion of inflicting a disarming strike with impunity) కలిగిస్తోంది. పరిస్ధితి చేయి దాటితే అందుబాటులో ఉన్న ఆయుధాలతో ‘ప్రీ-ఎమ్ప్టివ్’ దాడులు చేయడానికి నిర్ణయించక తప్పదు” అని మకరోవ్ హెచ్చరించాడు.

చికాగోలో ఈ నెల నాటో సమావేశాలు జరగనున్నాయి. యూరప్ లో అమెరికా నెలకొల్పుతున్న మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కి ఈ సమావేశాల్లో అంతిమ ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ ఆమోదానికి ముందే రష్యా అభ్యంతరాలను తెలియజేయడానికి అన్నట్లుగా రష్యా మాస్కోలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది. సమావేశానికి నాటోకి చెందిన 28 సభ్య దేశాలు కూడా హాజరయ్యాయి. 50 కి పైగా దేశాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ కార్న్ఫరెన్స్ కి హాజరయ్యారు. ఈ దశాబ్ధాంతానికల్లా  రష్యా రాకెట్లను అమెరికా మిసైల్ డిఫెన్స్ షీల్డ్ పూర్తిగా నిర్మూలించే అవకాశాలు ఉన్నాయని కంప్యూటర్ విశ్లేషణ సహాయంతో రష్యా అధికారులు ప్రతినిధులకు దృశ్య పూర్వకంగా సమావేశంలో వివరించారు.

మిసైల్ డిఫెన్స్ షీల్డ్ పై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తరపున పరిశోధకులు జరిపిన అధ్యయనం వివరాలను రష్యా సమావేశంలో తెలియజేసింది. ఎం.డి.ఎస్ మూడవ, నాలుగవ దశలు పూర్తయేనాటికి రష్యా కి చెందిన ఖండాతర బాలిస్టిక్ మిసైళ్లను ఆటంకం కలిగించే శక్తి సమకూరుతుందని రష్యా మిలట్రీ అధికారి మకరోవ్ తెలిపాడు. అంటే ‘ఆయుధ సమతూకం’ పూర్తిగా దెబ్బతింటుందన్నది మకరోవ్ ఉద్దేశ్యం. అయితే ఈ వివరణను నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అలెక్జాండర్ వెర్ష్ బౌ తిరస్కరించాడు. రష్యా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ళు అత్యాధునికమైనవనీ అభివర్ణించాడు. అమెరికా మిసైల్ షీల్డ్ వాటిని ఆటంకపరచలేనంత వేగవంతమైనవని అన్నాడు.

యూరప్ లో ఉమ్మడిగా మిసైల్ రక్షణ వ్యవస్ధను అభివృద్ధి చేద్దామని గతంలో రష్యా అమెరికాకి ప్రతిపాదించింది. రష్యా ప్రతిపాదనను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అమెరికా ఇంటర్ సెప్టార్ల శక్తిని పరిమితం చేసుకోవాలన్న ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. రష్యా మిసైళ్లను తమ మిసైల్ వ్యవస్ధ టార్గెట్ చేయబోదని చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రష్యా కోరితే దానినీ తిరస్కరించింది. ఈ నేపధ్యంలోనే రష్యా తాజా హెచ్చరిక చేసింది. అమెరికా నోటి మాటగా ఇస్తున్న హామీలను నమ్మడానికి రష్యా సిద్ధంగా లేదు.

ఎవరినీ టార్గెట్ చేయకుండా అమెరికా తన మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను నిర్మిస్తుందంటే ఎవరూ నమ్మలేనిది. మొత్తం భూ మండలాన్నే అనేక సార్లు భస్మీ పటలం చేయగల ఆయుధాలు గుట్టలు పేర్చుకున్న దేశాలు రక్షణ వ్యవస్ధ అంటూ కొత్త పోకడలు పోవడమే ఇక్కడి విచిత్రం. వీటన్నింటికీ తాము దూరంగా ఉన్నామని భారత పాలకులు అనుకున్నా అది సాధ్యమయ్యేది కాదు. పొరుగు దేశంలో దురాక్రమణ యుద్ధానికి మద్దతు ఇస్తూ, దురాక్రమణ యుద్ధాల్లో పాల్గొంటున్న విమానాలకు ఇంధనం నింపుతామని ఉబలాటపడుతూ అన్నిటికీ దూరంగా ఉన్నామని చెప్పడం భ్రమ అయినా కావాలి, మోసం అయినా కావాలి. us-missile-defence-shield-in-eu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s