రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో సంప్రదించకుండా సుష్మా ఏక పక్షంగా ప్రకటించడం తమకు సమ్మతి కాదని జె.డి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నట్లు పత్రికలు తెలిపాయి. దేశ పరిస్ధితుల దృష్ట్యా అంతా ‘అప్రమత్తత’ పక్షం వహించాలని శరద్ యాదవ్ కోరాడని ‘ది హిందూ’ చెబుతోంది. శరద్ యాదవ్ ఎన్.డి.ఏ కన్వీనర్ కూడా అవడం గమనార్హం. బి.జె.పి, తామూ రెండు వేరు వేరు పార్టీలు కనుక తమతో సంప్రదించకుండ ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించాడు. పంజాబ్ నుండి ప్రకాష్ బాదల్ ని రాష్ట్ర పతి పదవికి ప్రతిపాదిస్తున్నట్లు కూడా సుష్మా స్వరాజ్ ప్రకటించింది. తామెవరినీ ప్రతిపాదించలేదని శరద్ యాదవ్ మరో పక్క ప్రకటించాడు. లెఫ్ట్ పార్టీలు మాత్రం అన్సారీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
బాధితులకి ఇటలీ డబ్బు చెల్లించడం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు
ఇటలీ నౌక భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన జాలర్ల బంధువులకు ఇటలీ ప్రభుత్వం డబ్బు చెల్లించి రాజీ కుదుర్చుకోవడం చట్ట విరుద్ధం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాజీని లోక్ అదాలత్ ద్వారా ఆమోదించకుండా ఉండాల్సిందనీ, కేరళ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించి ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి రూపాయలను ఇటలీ చెల్లించింది. జాలర్లు ప్రయాణించిన పడవ యజమానికి 17 లక్షలు చెల్లించింది. డబ్బు చెల్లించడం ద్వారా బాధిత కుటుంబాల నోరు మూసేసినట్లయిందనీ, భారత న్యాయ వ్యవస్ధకు ఇది అవమానకరమనీ కోర్టు చీవాట్లు పెట్టింది. తమకు తెలియకుండానే ఇటలీ ప్రభుత్వం బాధితులకు డబ్బు చెల్లించిందన్న నౌక యజమాని వాదనను కోర్టు తిరస్కరించీంది. అదెలా సాధ్యమని ప్రశ్నించింది.
పోర్న్ వీడియోల్లో టెర్రర్ పధకాలు
జర్మనీ లో అరెస్టయిన ఆస్ట్రియా టెర్రరిస్టు నుండి స్వాధీనం చేసుకున్న పోర్న్ వీడియోల్లో దాగిన టెర్రర్ పధకాలను కనిపెట్టడంలో క్రిప్టాలజిస్టులు సఫలం అయ్యారని సి.ఎన్.ఎన్ తెలిపింది. గత సంవత్సరం ఆస్ట్రియా దేశస్ధుడు ‘మక్సూద్ లాడిన్’ ను జర్మనీ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి అనేక పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీడియోల్లో దాగిన టెర్రరిస్టు పధకాలను బట్టి ఆల్-ఖైదా ముంబై (2008) తరహా టెర్రరిస్టు దాడులకు పధక రచన చేసినట్లు క్రిప్టాలజిస్టులు కనుగొన్నారని సి.ఎన్.ఎన్ తెలిపింది. ఆల్-ఖైదా సాంకేతిక పరిజ్ఞానానికి జర్మనీ నుండి అమెరికా వరకూ నిశ్చేష్టులయ్యారని ‘ది హిందూ’ తెలిపింది. టెర్రరిస్టు పధకాలతో కూడిన వందల డాక్యుమెంట్లు పోర్న్ వీడియోల్లో దాగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డాక్యుమెంట్లు ‘ప్యూర్ గోల్డ్’ గా అమెరికా గూఢచార వర్గాలు అభివర్ణించారని సి.ఎన్.ఎన్ తెలిపింది.