ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి


googleఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని నాలుగేళ్లపాటు దొంగిలించిన గూగుల్ సంస్ధను అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్.సి.సి) కేవలం $25,000 పెనాల్టీతో వదిలిపెట్టింది. తనకు తెలియకుండా జరిగిందని పదే పదే అబద్ధాలు చెప్పినా గూగుల్ ‘బందిపోటు దోపిడి’ ని లైట్ తీసుకుంది. వేరే అవసరం కోసం రాసిన ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ లో కలిసిందని పచ్చిగా నాటకాలాడినా ‘మరేం ఫర్వాలేదు’ పొమ్మంది. కార్పొరేట్ కంపెనీలు, ఫెడరల్ రెగ్యులేటర్ సంస్ధలు ఒకరినొకరు సహరించుకుంటూ అమెరికా ప్రజలను నిరంతరం దగా చేస్తున్నాయని గూగుల్ ‘డేటా దొంగతనం’ మరోసారి నగ్నంగా వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల నేరాలను కప్పి పుచ్చడానికే రెగ్యులేటరీ యంత్రాంగం కట్టుబడి ఉంది తప్ప వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడానికి కాదని రుజువు చేసింది.

గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టు వ్యవహారం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. వివిధ నగరాల్లోని వీధులనూ, కూడళ్లనూ ఫోటోలు తీసి ఇంటర్నెట్ సర్చ్ ప్రోగ్రాం కి గూగుల్ అందుబాటులో ఉంచింది. కేవలం చిరునామా వరకే తెలియజేయడం కాకుండా ఫలానా చోటు, ఫలానా కూడలి, ఫలానా వీధి ఎలా ఉంటుందో సెర్చ్ ఫలితాల్లోనే చూసుకోవడం ద్వారా నెట్ వినియోగదారులకు మరింత సౌకర్యం కలిగించడానికి ‘స్ట్రీట్ వ్యూ కార్ ప్రాజెక్టు’ ను ఉద్దేశించారు. అందుకోసం 2007 నుండీ గూగుల్ సంస్ధ ‘స్ట్రీట్ వ్యూ’ కార్లను వినియోగించింది. కార్లను నిర్దేశిత ప్రదేశంలో ఉంచి చుట్టు పక్కల ప్రాంతాన్ని ఫోటోలు తీయడం ఈ కార్ల ఉద్దేశ్యం. తీసిన ఫోటోల వరకు కార్లలో ఉండే ప్రోగ్రాంలు నిక్షిప్తం చేసుకోవాలి. అయితే స్ట్రీట్ వ్యూ కార్లను వినియోగించి గూగుల్ సంస్ధ మరో భారీ దొంగతనానికి తెరతీసింది.

వై-ఫై కనెక్షన్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ కనెక్షన్ల ద్వారా ప్రసార మయ్యే డేటాకీ భద్రత ఉండదు. సరిగ్గా ఈ పాయింటునే సొమ్ము చేసుకోవడానికి గూగుల్ పధక రచన చేసుకుంది. స్ట్రీట్ వ్యూ కార్లలో ప్రత్యేక ప్రోగ్రాంని చొప్పించింది. వై-ఫై హాట్ స్పాట్ కనెక్షన్ల ను ఉపయోగించే వినియోగదారుల కంప్యూటర్ల నుండి సమస్త డేటాను సేకరించడం ఈ ప్రోగ్రామ్ పని. వై-ఫై కనెక్షన్ ద్వారా సదరు వినియోగదారుడి కంప్యూటర్ లోకి చొరబడి అందులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడమే కాకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా చుట్టుపక్కల అన్నీ కంప్యూటర్ల లోని వ్యక్తిగత సమాచారాన్నంతా గూగుల్ దొంగిలించింది. దొంగిలించిన సమాచారాన్ని దానికోసమే ఉద్దేశించిన డిస్క్ లలో నిల్వ చేసుకుంది. అంతా పకడ్బందీగా జరిగేలా ప్రోగ్రామ్ రాసుకుని అమెరికా, యూరప్, లతో అనేక ఆసియా దేశాల్లో కూడా సమాచారాన్ని గూగుల్ దొంగిలించి నిలవ చేసుకుంది.

గూగుల్ దొంగిలించిన సమాచారం విస్తృతమైనది. అది దొంగిలించని సామాచారం అంటూ ఏదీ లేదు. పేర్లు, అడ్రస్ లు, టెలిఫోన్ నంబర్లు, యు.ఆర్.ఎల్ లు, పాస్ వర్డ్ లు , ఈ మెయిళ్ళు, టెక్స్ట్ మెసేజ్ లు , మెడికల్ రికార్డులు, వీడియో ఫైళ్ళు, ఆడియో ఫైళ్ళు, ఆఫీసు ఫైళ్ళు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, ఫోన్ నంబర్లు ఒకటేమిటి సమస్త సమాచారాన్ని సేకరించి ప్రత్యేకంగా రూపొందించుకున్న స్టోరేజ్ డిస్క్ లలో నిల్వ చేసుకుంది.

2007 లో ప్రారంభమయిన ఈ డేటా దొంగతనం 2010 వరకూ నిర్విఘ్నంగా కొనసాగింది. మొదట జర్మనీ లో గూగుల్ కార్యకలాపాలపైన అనుమానం వచ్చింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లను సీజ్ చేసి చూస్తే గూగుల్ పట్టపగలు చేస్తున్న దొంగతనం బయటపడింది. జర్మనీ తర్వాత బ్రిటన్, స్పెయిన్, సౌత్ కొరియా, అమెరికా ఇంకా అనేక దేశాలు గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్యకలాపాలు చేస్తున్న అనైతిక కార్యక్రమాన్ని పట్టి వేశాయి. అమెరికా కి చెందిన ఎఫ్.సి.సి గత రెండున్నరేళ్లుగా గూగుల్ పై విచారణ చేస్తున్నానని చెప్పి చివరికి $25,000 డాలర్ల పెనాల్టీతో సరి పెట్టింది.

ఇంటర్నెట్ యుగంలో వ్యక్తిగత సమాచారానికి ఎంత విలువ ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వినియోగదారుల వ్యక్తి సమాచారం కోసం ఇంటర్నెట్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు సవా లక్షా పధకాలు వేస్తూ ఉంటాయి. అనేకానేక సర్వీసులు ఉచితంగా అందిస్తూ వినియోగదారుల సమాచారాన్ని సేకరించి నిలవ చేసుకుంటాయి. అంతటి విలువైన వినియోగదారుల ప్రవేట్ డేటాను గూగుల్ దర్జాగా దొంగిలించినా అమెరికా ఎఫ్.సి.సి కి చీమ కూడా కుట్టినట్లు లేకపోవడం విచిత్రం. వినియోగదారుల రక్షణ కోసం అంటూ రూపొందిస్తున్న ప్రైవసీ చట్టాలూ, నిబంధనలు, నియంత్రణా సంస్ధలు అన్నీ ఒట్టిదేనని గూగుల్ పై విధించిన పెనాల్టీతో తేట తెల్లమయింది. హ్యాకింగ్ దాడులను అరికట్టడానికి బిలియన్ల కొద్దీ డాలర్లను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న అమెరికా ప్రభుత్వం గూగుల్ లాంటి ప్రఖ్యాత కంపెనీ పాల్పడిన నేరాన్ని కఠినంగా శిక్షించడానికి బదులు నామ మాత్ర పెనాల్టీతో సరి పెట్టడం ఇరు పక్షాల మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని రుజువు చేస్తోంది.

బ్రిటన్ పార్లమెంటు గూగుల్ ఘోరాలపై విచారణకు కమిటీనే నియమించింది. ఆ కమిటీ విచారణ జరిపి గూగుల్ అనైతిక దొంగతనాన్ని తూర్పారబట్టింది. ప్రపంచ స్ధాయి సంస్ధగా ఉంటూ ఇంతటి హీనమైన పనికి పూనుకోవడమేమిటని గూగుల్ ని తీవ్రంగా అభిశంసించింది. పదే పదే అబద్ధాలు చెప్పిందనీ, నిస్సిగ్గు పనికి పూనుకుందనీ తిట్టి పోసింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అయితే గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లు ఫోటోలు సేకరించే ముందు ప్రతి ఒక్కరి అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది. స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ నుండి తమను తాము మీనాయించుకునే అవకాశాన్ని జర్మనీ పౌరులకే నేరుగా దాఖలు పరిచింది. యూరప్ లోని ఇతర ప్రభుత్వాలు కూడా గూగుల్ పైన విచారణ చేస్తున్నాయి. ఎన్ని విచారణలు జరిగినా, ఎన్ని సార్లు అభిశంసనకు గురయినా ప్రతి సారీ తనకు తెలియకుండా జరిగిందనే గూగుల్ చెబుతూ వచ్చింది.

అయితే ఎఫ్.సి.సి నివేదిక వెల్లడయ్యాక గూగుల్ పచ్చిగా అబద్ధాలు చేపిందని తేటతెల్లమయింది. ఘోరమైన విషయం ఏమిటంటే తన నివేదికను వెల్లడి చేయడానికి ఎఫ్.సి.సి మొదట సుకుఖత చూపలేదు. నివేదికను వెల్లడి చేసే పనిని గూగుల్ కే కట్ట బెట్టింది. గత రెండేళ్ళుగా ఎఫ్.సి.సి నివేదికను తొక్కి పెట్టిన గూగుల్ ఎఫ్.సి.సి పదే పడే తాఖీదు ఇవ్వడంతో మంగళవారం వెల్లడించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. గూగుల్ ఘోరాన్ని ప్రఖ్యాతి పొందిన పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలెవీ ప్రచురించడానికి ఆసక్తి చూపలేదు. ప్రెస్ టి.వి మాత్రమే ఈ వార్తను ప్రచురించింది.

గూగుల్ కంపెనీ అధికారులందరికీ గూగుల్ స్ట్రీట్ వ్యూ కార్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుసనీ, ఉద్దేశ్య పూర్వకంగానే వారు ఆ ప్రోగ్రాంని చొప్పించారనీ ఎఫ్.సి.సి నివేదిక స్పష్టం చేసింది. ఎవరో గుర్తు తెలియని ప్రోగ్రామర్ వేరే అవసరం కోసం రాసుకున్న ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టులో చొరబడిందని గూగుల్ చెప్పినదంతా పచ్చి అబద్ధమని తెలిపింది. స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టు ఇంజనీర్లు కావాలనే ఆ ప్రోగ్రాని రూపొందించి వినియోగించారని నివేదిక తెలిపింది. కేవలం ఒకరిద్దరు ఇంజనీర్లు కాకుండా ఒక సెక్షన్ కి చెందిన ఇంజనీర్లు దీనికోసం కృషి చేశారని వెల్లడించింది. ప్రోగ్రామ్ అందుకోసమే తయారు చేసిన సంగతి వారందరికీ తెలుసని తెలియజేసింది. వినియోగదారుల వ్యక్తి గత సమాచారంలో టెక్స్ట్ మెసేజ్ లు, ఈ మెయిళ్ళు, బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు నంబర్లు అన్నీ సేకరించబడతాయని వారందరికీ తెలుసని వెల్లడి చేసింది. డేటా, సమాచారం సేకరించడానికే ప్రోగ్రామ్ తయారు చేశారని తెలిపింది.

మే 2007 నుండి మే 2010 వరకూ ప్రపంచ వ్యాపితంగా ఉన్న స్ట్రీట్ వ్యూ కార్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాయని ఎఫ్.సి.సి నివేదిక తెలిపింది. అమెరికా మానవ హక్కుల కార్యకర్తలు గూగుల్ ను బహిరంగంగా విచారించాలని డిమాండ్ చేశారు. గూగుల్ చెప్పిన ‘ఆపాలజీ’ తో సరిపెట్టరాదని కోరారు. ఎఫ్.సి.సి గూగుల్ నేరాన్ని తక్కువ చేసి కూపడానికి ప్రయత్నిస్తున్నదని ‘ఇంటర్నెట్ ప్రైవసీ వాచ్’ సంస్ధ ఆరోపించినా పట్టించుకున్నవాడు లేడు. గూగుల్ నేరాన్ని లైట్ తీసుకున్న ఎఫ్.సి.సి ప్రధాన ముద్దాయి అని ‘ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్’ వ్యాఖ్యానించింది.

ఇంటరేట్ స్వేచ్ఛకు తాను గట్టి మద్దతుదారునని గూగుల్ చెప్పుకుంటుంది. చైనా ప్రభుత్వం ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నదని కనీళ్లు పెట్టుకుంటుంది. అయితే గూగుల్ కోరుకునే స్వేచ్చ ఇదేనన్నమాట. ప్రైవసీ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ ప్రపంచ ప్రజల వ్యక్తి గత సమాచారాన్నంతటినీ నిలవ చేసుకుని వ్యాపారం చేసుకునే స్వేచ్చ గూగుల్ కి కావాలి. ఉచితంగా సంపాదించిన వినియోగదారుల వ్యక్తి గత సమాచారం పెట్టుబడిగా పెట్టి బిలియన్లు సంపాదించుకునే స్వేచ్చ గూగుల్ కి కావాలి.

గూగుల్ సేకరించే సమాచారం కేవలం దాని వ్యాపారానికే అనుకుంటే పొరబాటు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలపై బడి యుద్ధాలు చేసూ, ప్రభుత్వాలు కూలుస్తూ, ప్రభుత్వాధినేతలను హత్యలు చేస్తూ, టెర్రరిస్టు సంస్ధలను పోషిస్తూ అచ్చోసిన ఆంబోతులా తెగబడుతున్న అమెరికా రాజ్య వ్యవస్ధకు కూడా గూగుల్ సేకరించే సమాచారం కావాలి. తన దురాక్రమణ విధానాల కు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎవరు తిరగబడినా వారి సమాచారం అమెరికాకి కావాలి. ఏ మూల తనకు వ్యతిరేకంగా ఆందోళన జరిగినా, ఉద్యమం జరిగినా ఆ సమాచారమ్ తనకు కావాలి. ప్రపంచంలోని ప్రతి దేశంలోని మారుమూల ప్రాంతాల ఆనుపానులు కూడా దానికి అందుబాటులో ఉండాలి. ఆ అవసరాన్ని తీర్చే అనేకానేక సౌకర్యాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రాజెక్టు కూడా ఒకటి.

కనుక వ్యక్తిగత ఫోటోలనీ, కుటుంబ వ్యవహారాలనీ, పండగలనీ పబ్బాలనీ, అమాయకంగా ఇంటర్నెట్ కి ఎక్కిస్తున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వివిధ సోషల్ నెట్ వర్క్ సైట్లకు వ్యక్తిగత సమాచారం అందజేయడాన్ని పరిమితం చేసుకోవాలి. మిత్రుల కోసం ఉపయోగపడుతుందని భావిస్తే అది నేరుగా గూగుల్ సర్వర్లలోనో, ఫేస్ బుక్ స్టోరేజ్ డిస్కులలోనో లేక మరో సోషల్ వెబ్ సైట్ నిర్వాహకుడి కంపెనీ లోనో శాశ్వతంగా నిలవ ఉండిపోతుందనీ, మనం తీసేయాలనుకున్నా సాధ్యపడదనీ గుర్తించాలి.

2 thoughts on “ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి

  1. నెట్ వినియోగదారులకు సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. గూగుల్ దొంగతనంగా సేకరించిన సమాచార విస్తృతి వివరాలు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఈ సంస్థ కోరుకునే ఇంటర్నెట్ స్వేచ్ఛ ఎలాంటిదో అర్థమవుతున్నకొద్దీ విభ్రాంతి కలుగుతోంది. నెటిజన్లకు చివరి పేరాలో మీరు చేసిన సూచన విలువైనది!

  2. వేణు గారు, గూగుల్ ఘోరాల గురించి గత రెండేళ్ళుగా చాలా వెబ్ సైట్లు వివరాలిస్తూ వచ్చాయి. అమెరికా స్టేట్ తో దానికి ఉన్న అపవిత్ర బంధం పైన కూడా వివరాలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ ఇవేవీ భారతీయ వినియోగదారులకి చాలా మందికి తెలియదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s