2008 ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా కోలుకోనే లేదు. సంక్షోభం పేరు చెప్పి ఓ పక్క కార్మికులు, ఉద్యోగుల వేతనాల్లో విపరీతమైన కోతలు విధిస్తుంటే మరో పక్క కంపెనీనీలు మాత్రం ఎప్పటిలాగా లాభాలు పోగేసుకుంటూనే ఉన్నాయి. బ్రిటన్ లోని టాప్ వెయ్యి మంది ధనికులు రికార్డు స్ధాయిలో 414 బిలియన్ పౌండ్లు కూడ బెట్టారని ‘ది డెయిలీ మోర్నింగ్ స్టార్’ పత్రిక నివేదించింది. ధనికుల సంపాదన పెరగడంతో పాటు, ధనికుల సంఖ్య కూడా పెరిగిందని పత్రిక తెలియజేసింది.
ఆదివారం 2012 ధనికుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పేర్కొన్న ధనికుల సంపదలు బ్రిటన్ లోని ఆదాయ అంతరాల తీవ్ర స్ధాయిని తెలియజేస్తున్నాయి. 2008 లో 75 మంది బిలీనియనీర్లు ఉంటే ఈ సంవత్సరం వారి సంఖ్య 77 కి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే వీరి ఆస్తుల విలువ 4.7 శాతం పెరిగిందని పత్రిక తెలిపింది. 2008 నాటి ఆర్ధిక సంక్షోభం ముందు టాప్ వెయ్యి మంది ధనికుల ఆదాయం 412.85 బిలియన్ పౌండ్లు. 2010 వరకు అదే రికార్టు కాగా, 2011 ఆదాయం దాన్ని మించిపోయింది.
ధనికుల ఆదాయం పెరుగుతుండగానే బ్రిటన్ లో నిరుద్యోగం పెరిగిపోయింది. పొదుపు చేయాలంటూ కార్మికులు, ఉద్యోగుల వేతనాలు కత్తిరించేశారు. దివాళా తీసిన ప్రవేటు కంపెనీలు ప్రభుత్వ పరం చేసి లాభాలు తెస్తున్న ప్రభుత్వ కంపెనీలను ప్రవేటీకరించారు. ఉద్యోగుల సదుపాయాలలో కోత పెట్టారు. పెన్షన్లలోనూ కోత విధించారు. ఈ విధానాలతో ప్రజల ఆదాయాలలో గణనీయ మొత్తాన్ని ప్రవేటు కంపెనీల లాభాలుగా తరలించారు. ఫలితమే ధనికుల లాభాల్లో పెరుగుదల. ఈ విధానాల వల్ల ప్రజల ఆదాయాలు క్షీణించి, కోనుగోలు శక్తి పడిపోయింది. దానితో ఉత్పత్తి కూడా క్షీణించి ఆర్ధిక వ్యవస్ధ రెండోసారి మాంద్యంలోకి జారుకుంది. ప్రభుత్వాల వినాశకర ఆర్ధిక విధానాల వల్లనే బ్రిటన్ లో డబుల్ డీప్ రిసెషన్ సంభవించిందని ప్రతిపక్షాలు సైతం ఆరోపించాయి.
“ధనికులు మరింత ధనికులుగా మారగా నిరుద్యోగం రికార్డు స్ధాయికి పెరిగింది. ప్రభుత్వ పొదుపు విధానాల వల్ల డబుల్ డిప్ రిసెషన్ సంభవించింది. కోతలతో ఆబ్సెసివ్ గా మరిని ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించాలి. బిలియనీర్లు చెల్లించే పన్నుల విషయంలో పారదర్శకత ఉండాలి. పన్నుల ఎగవేతని నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి” అని ‘యు.కె. ఆన్ కట్’ అనే సంస్ధను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలియజేసింది.
పాలక కన్సర్వేటివ్ పార్టీకి నిధులు సమకూర్చే లక్ష్మీ మిట్టల్ వ్యక్తిగత సంపద (12.7 బిలియన్ పౌండ్లు) ధనికుల సంపాదనల్లో అగ్ర స్ధానం పొందింది. బ్రిటన్ ప్రభుత్వం ధనికులకి నాన్-డొమిసైల్ స్టేటస్ కల్పించి తద్వారా పన్నులు ఎగవేసే అవకాశం కలుగ జేసింది. ఈ అవకాశాలని పూర్తిగా వినియోగించుకుంటున్నవారిలో లక్ష్మీ మిట్టల్ అగ్రగణ్యుడు. పన్నులు ఎగవేసే అవకాశాలు ధనికులకు కల్పిస్తూ ప్రజల నామ మాత్రపు ఆదాయాల్లో విపరీతమైన కోతలు విధిస్తున్నారు.